Home Telugu Articles ప్రపంచాన్ని ప్రభావం చేసే రెండు నిర్ణయాలు

ప్రపంచాన్ని ప్రభావం చేసే రెండు నిర్ణయాలు

0
SHARE

గత 48గంటలలో భారత దేశాన్ని, ప్రపంచాన్ని రెండు సంఘటనలు సంచలనం కలిగించి ప్రపంచంలో ఒక విస్తృత చర్చకు తెర లేపాయి. మొదటిది మొన్న రాత్రి భారత ప్రధానమంత్రి దేశంలో చలామణి అవుతున్న రూ.1000, 500 నోట్లను అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు వాటి స్థానంలో నూతనంగా ముద్రించిన వాటిని ప్రవేశ పెడుతున్నామని ప్రకటించడం. రెండవది అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యాపారవేత్త డోనాల్డ్‌ ట్రంప్‌ దక్కించుకోవడం.

ఈ రెండు సంఘటనలు కేవలం తమ తమ దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచాన్ని దీర్ఘ కాలికంగా రాజకీయ, ఆర్థిక, దేశ భద్రత అనే కీలక అంశాలపై ప్రభావితం చేస్తాయి. ఈ విషయాలను సంక్షిప్తంగా పరిశీలిద్దాం.

భారత ప్రకటన :

భారత ప్రధాని నరేంద్రమోది జాతిని ఉద్దేశిస్తూ ఇచ్చిన ప్రసంగంలో నల్ల ధనాన్ని అరికట్టడానికై అవినీతి, ఆర్థిక హావాల మార్గాలను, తీవ్రవాద కార్యకలపాలకు ఆర్థిక వనరులు సమకూర్చడం. నకిలీ నోట్ల ద్వార జరుగుతున్న నష్టాన్ని అడ్డుకునే ప్రయాత్నం అంటూ ఇప్పటివరకు చలామణిలో ఉన్న రూ.1000,500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాటి స్థానంలో కొత్తగా తగు భద్రతలతో కూడిన కరేన్సిని ప్రవేశ పెడుతున్నట్లు పాత నోట్లను బ్యాంకులలో లేదా పొస్ట ఆఫీసులలో మర్చుకోవాలని సూచించారు. మిగితా ఆర్థిక లావాదేవిలపై ఎటువంటి ప్రభావం ఉండదని కూడా అన్నారు. నిజంగా ఈ నిర్ణయం వలన అనుకున్న లక్షాలు సాధిస్తామా?

దేశంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలు ప్రొత్సహించాడానికి సామాన్య ప్రజల కొరకు ”జన్‌ ధన్‌ యోజన” పథకాన్ని ప్రవేశపెట్టింది. గత కొంతకాలంగా ప్రభుత్వం వివిధ పద్ధతులలో నల్ల ధనాన్ని వెలికితీసే ప్రయత్నాలు కూడా చేసింది. అందులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ను ఏర్పాటు చేయడం మరియు స్వచ్ఛందంగా 45% పన్ను చెల్లించి నల్ల ధనాన్ని చలామణిలోకి తీసుకుని వచ్చే అవకాశాన్ని ఇవ్వడం. ఇప్పుడు ఏకంగా రూ.1000,500నోట్లను డిసెంబర్‌ 30లోపు మార్చుకోమని చెప్పడం. ఈ నిర్ణయం వలన సామాన్య ప్రజలకు వచ్చే కొన్ని రోజులవరకు ఇబ్బంది కలగవచ్చును. కాని ఎలాంటి పత్రాలు జవాబుదారి తనం లేకుండా ధనాన్ని దాచిపెట్టిన వారి వెన్ను విరిసే అస్త్రం.

ఈ ప్రకటన ద్వారా దేశ సరిహద్దుల గుండా ముఖ్యంగా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ మార్గాల్లో భారత్‌లోకి వస్తున్న నకిలీ కరెన్సీ ఎందుకు పనికిరాని పేపర్‌లాగా మారిపోతుంది. వీటిని బ్యాంకులలో జమ చేయలేరు, అట్లా అని ప్రజలలో చలామణి చేయలేరు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకమ్రాలకు ఉపయోగించకోలేరు. హావాలా మార్గంలో జరుగుతున్న ధన మార్పిడి కూడా ఒక్కసారిగా నిలిచిపోతుంది. అక్రమంగా సంపాదించుకొని దాచుకున్న ధనాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటిని అధికారికంగా తమవి అని ప్రకటించుకొని ఆదాయ పన్ను చట్టం పరిధిలోకి వచ్చేటట్టు నెట్టబడడం శుభసూచకం. అట్లనే ప్రముఖంగా అవినీతి రాజకీయ నాయకులకు, పన్ను కట్టకుండా ఉన్న వ్యాపారస్తులకు వివిధ మార్గాల్లో భారీ ధనాన్ని కూడబెట్టిన వారికి మాత్రం కోలుకొలేని దెబ్బ. ఈ నిర్ణయం వలన ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగం, అంసంఘటిత వ్యాపారం మరియు కొంత వరకు సినిమా రంగం మందగిస్తాయి. ఇటీవల అమెరికాలోని గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రేటెడ్‌కు సంబంధించిన ఒక థింక్‌ ట్యాంక్‌ పార్టీ ప్రకారం 344 బిలియన్‌ డాలర్లు 2002-2011 మధ్య ఉండి ఉండవచ్చు అని అంచనా వేసింది.

డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక :

అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడం ప్రస్తుత కాలంలో కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన నిర్ణయం కాదు. ప్రపంచంలో వేగంగా మారుతున్న రాజకీయ, దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరు జరుగుతున్న దశలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఒక వ్యాపార వేత్త గత రెండు దశాబ్ధలుగా ప్రముఖంగా రాజకీయ వ్యవహారాలలో పరోక్షంగా ప్రత్యక్షంగా సంబంధం ఉండి అమెరికా ప్రభుత్వంలో కొంతకాలం విదేశీ వ్యవహారాలు నిర్వహించిన అనుభవం ఉన్న తొలి మహిళా అభ్యర్థి హిల్లరి క్లింటన్‌పై నెగ్గడం కూడా సంచలనమే. ముఖ్యంగా అన్ని మీడియా సాధనాలల్లో క్లింటన్‌ గెలుపు ఖాయం అని విస్తృత ప్రచారం చేసినప్పటికీ ప్రజలు తీర్పు భిన్నంగా ఉండడం గమనించదగినది.

అధ్యక్ష ఎన్నిక ప్రచారంలో డోనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడిన, వ్యవహరించిన తీరు అందరిని గందరగోళ పరిచింది. ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినవారు పెట్టుబడి దారుడు, వ్యాపారవేత్త, పన్ను ఎగవేతదారుడు, స్త్రీ లోలుడు, ఒక మతం-జాతి పట్ల వివక్ష ఉన్నవాడు, ప్రజల భద్రత పేరుతో ప్రపంచానికి తీవ్ర నష్టం చేయగలడని ఆరోపించిన వారిని అమెరికా ప్రజలు పక్కకు పెట్టారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ట్రంప్‌ మాత్రమే సరి అయిన ప్రాతినిథ్యం వహిస్తాడు అనే నమ్మకం ఈ గెలుపు ద్వారా తెలిసింది.

డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరి క్లింటన్‌ తన పూర్వ అధికార హోదాలో కొంతమంది వ్యక్తులు, విదేశీ సంస్థలతో ప్రభుత్వం కల్పించిన భద్రతను పక్కకు పెట్టి, ప్రైవేటుగా సంభాషించినట్టు, ఉత్తర ప్రత్యత్తరాలు సాగించినట్లు బహిర్గతం కావడం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను సమర్ధించినట్లు ట్రంప్‌ చేసిన ఆరోపణలు ఈ ఎన్నికలలో కీలక పాత్ర పోషించాయి.

ఉగ్రవాదంపై పోరు చేస్తానని, విదేశాలకు తరలి వెళ్లిన ఉద్యోగాలు తిరిగి సాధిస్తానని, అక్రమ వలసలు నిరోదించడం, అంతర్జాతీయంగా మసక బరుతున్న అమెరికా ప్రతిష్టను తిరిగి ప్రపంచంలో నెలకొల్పుతానని వాగ్దానాల ద్వార తన వాదనను ప్రజలు సమర్ధించేటట్లు చేశాడు.

భారతదేశం, అమెరికాలు ప్రపంచంలో కీలకంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలు, ప్రస్తుతం వాటికి నేతృత్వం వహించే నాయకులూ నరేంద్రమోది, డోనాల్డ్‌ ట్రంప్‌ తమ తమ దేశ ప్రజల భాగోగులు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలను తీసుకోవాడానికి వెనుకాడరు అని ఇప్పటి వరకు ఉన్న వారి రాజకీయ గమనం స్పష్టం చేస్తున్నది.

తీవ్రవాదం, ఆర్థిక వృద్ధి, పర్యావరణం, క్షీణిస్తున్న మానవ హక్కులు, ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న అతి పెద్ద సవాళ్లు. వీటిని ఈ రెండు దేశాల అధినేతలు తమ అధికారంలో ఉన్న పలుకుబడితో ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది కాలంతో పాటు తెలుస్తుంది.