Home News నోట్ల రద్దు తో వెలుగు చుసిన 5800 డొల్ల కంపెనీల బ్లాకు మనీ వ్యవహారం, 13...

నోట్ల రద్దు తో వెలుగు చుసిన 5800 డొల్ల కంపెనీల బ్లాకు మనీ వ్యవహారం, 13 బ్యాంకుల నివేదిక

0
SHARE
  • ఒక్క కంపెనీకి.. 2 వేల ఖాతాలు
  • నోట్ల రద్దు తర్వాత భారీ మొత్తంలో
  • జమ, ఉపసంహరణ ఆశ్చర్యపరుస్తున్న గణాంకాలు
  • డొల్ల కంపెనీల లీలలెన్నో..
  • ప్రభుత్వ పరిశీలనలో వెల్లడి

ఒక్క కంపెనీకి వేర్వేరు బ్యాంకుల్లో 2 వేలకుపైగా ఖాతాలు.. మరికొన్నింటికి వందల సంఖ్యలో ఖాతాలు.. ఇవన్నీ నోట్ల రద్దుకు ముందు డొల్ల కంపెనీల లీలలు. తాజాగా ప్రభుత్వ పరిశీలనలో వెల్లడవుతున్న నిజాలు. నల్లధనంపై పోరాటాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డొల్ల కంపెనీలపై మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా 5,800 డొల్ల కంపెనీల ఖాతాల సమాచారాన్ని తనిఖీ చేయగా, నోట్ల రద్దు తర్వాత వాటి శూన్య ఖాతాల్లో సుమారు రూ.4,574 కోట్లు జమవడమే కాకుండా, ఆ తర్వాత రూ.4,552 కోట్లు ఉపసంహరించుకున్నట్లు తేలిందని ప్రభుత్వం తెలిపింది. రద్దుచేసిన 2,09,032 అనుమానాస్పద కంపెనీల్లోని 5,800 డొల్ల కంపెనీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల కార్యకలాపాలు, నోట్ల రద్దు తర్వాతి లావాదేవీలకు సంబంధించిన తొలి విడత సమాచారాన్ని 13 బ్యాంకులు సమర్పించినట్లు ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. నల్లధనం, డొల్ల కంపెనీలపై పోరాటంలో ఇది భారీ విజయమని సర్కారు అభివర్ణించింది. ఈ ఏడాది ప్రారంభంలో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ 2 లక్షలకుపైగా కంపెనీల్ని రద్దు చేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం వివరాలిలా ఉన్నాయి..

* కొన్ని కంపెనీలకు వాటి పేరిట వందకుపైగా ఖాతాలున్నాయి. అత్యధికంగా ఓ కంపెనీకి 2,134 ఖాతాలున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత 900, 300 ఖాతాలతో కొన్ని కంపెనీలున్నాయి. నోట్లరద్దుకు ముందు, నోట్ల రద్దు సమయంలో నిర్వహించిన లావాదేవీలకు సంబంధించిన గణాంకాలు ఆశ్చర్యకరంగా ఉన్నట్లు గుర్తించారు.

* రుణఖాతాల్ని వేరుచేసిన తర్వాత.. 2016, నవంబర్‌ 8న ఈ కంపెనీల నిల్వలు రూ.22.05 కోట్లు మాత్రమే ఉండగా, నోట్ల రద్దు ప్రకటన వెలువడ్డాక 2016, నవంబర్‌ 9 నుంచి సదరు కంపెనీల్ని రద్దు చేసేనాటి వరకు ఆ కంపెనీలన్నీ రూ.4,573.87 కోట్లను వాటి ఖాతాల్లో జమ చేసి, తర్వాత రూ.4,552 కోట్లు ఉపసంహరించుకున్నాయి.

* 2016, నవంబర్‌ 8 నాటికి కంపెనీలకు అతితక్కువ నిల్వలతో బహుళ ఖాతాలు ఉండగా, వాటిలోకి రూ.కోట్లలో జమ, ఉపసంహరణ జరిగింది. ఆ తర్వాత సదరు ఖాతాల్ని నిద్రాణ స్థితిలో వదిలేయడం జరిగింది.

* నోట్ల రద్దు తర్వాత చేపట్టిన సదరు మోసపూరిత చర్యలు సదరు కంపెనీల్ని రద్దు చేసేంతవరకు కొనసాగాయి. కొన్ని కేసుల్లో కొన్ని కంపెనీలు మరింత దూరంవెళ్లి వాటిని రద్దు చేసిన తర్వాత కూడా డబ్బుల జమ, ఉపసంహరణ జరిపినట్లు వెల్లడైంది.

* ఉదాహరణకు.. 2016, నవంబర్‌ 8న 429 కంపెనీల్లో శూన్యనిల్వలుండగా, వాటిలో ఒక బ్యాంకులో రూ.11 కోట్లకుపైగా డబ్బుల్ని జమ చేసి, ఉపసంహరించుకున్నట్లు తేలింది. కంపెనీని జప్తు చేసేనాటికి కేవలం రూ.42 వేల నిల్వతో వదిలేశారు.

* అదేవిధంగా మరో బ్యాంకు విషయంలో.. 3 వేలకుపైగా కంపెనీలు, బహుళ ఖాతాలతో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. 2016, నవంబర్‌ 8న రూ.13 కోట్ల నిల్వలున్న ఈ కంపెనీలు సుమారు రూ.3,800 కోట్ల జమ, ఉపసంహరణ చేసి, చివరికి వాటి ఖాతాల్ని జప్తు చేసే నాటికి రూ.200 కోట్ల నకారాత్మక నిల్వలతో వదిలేశాయి.

* ఈ సమాచారం రద్దు చేసిన మొత్తం అనుమానిత కంపెనీల్లో కేవలం 2.5 శాతానికి సంబంధించినదేననీ, ఇవన్నీ అవినీతి, నల్లధనం తదితర నల్లవ్యవహారాలకు సంబంధించిన పైపై అంశాలేననీ, మరింత లోతుగా దృష్టిసారించాల్సి ఉందనీ, నిర్దిష్ట కాల వ్యవధిలో విచారణ పూర్తిచేయాలని దర్యాప్తు సంస్థలకు తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది.

(ఈనాడు సౌజన్యం తో)