Home Telugu Articles 1963 ఢిల్లీ గణతంత్ర ఉత్సవాల్లో ఆరెస్సెస్ కవాతు విశేషాలు

1963 ఢిల్లీ గణతంత్ర ఉత్సవాల్లో ఆరెస్సెస్ కవాతు విశేషాలు

0
SHARE
1. R Day 1963: A 3,500-strong contingent of Swayamsevaks in Ganvesh take part in the parade in Delhi. 2. Shri Vijay Kumar. 3. Shri KL Pathela
జనవరి 26 1963.. న్యూఢిల్లీ.. భారత గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి త్రివిధ దళాలు పాల్గొనే గణతంత్ర కవాతులో ఆ సంవత్సరం దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు చెందిన స్వయంసేవకులు కూడా పాల్గొనడం ఒక చారిత్రాత్మక ఘట్టం. దీని తాలూకు విశేషాలు అప్పటి కవాతులో పాలుపంచుకున్న ఆరెస్సెస్ జ్యేష్ఠ స్వయంసేవకుల జ్ఞాపకాల మది నుండి..
శ్రీ విజయ్ కుమార్.. ఆరెస్సెస్ జ్యేష్ట కార్యకర్త. 1963 నాటికి ఆరెస్సెస్ మండల కార్యవాహగా బాధ్యత కలిగివున్నారు. ఆనాటి కవాతు తాలూకు పంచుకున్న ఆయన, అందులో పాల్గొనడం ఒక మహత్తర అవకాశంగా అభివర్ణించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే:
“1963 గణతంత్ర ఉత్సవాల సందర్భంగా జరిపే కవాతులో పాల్గొనాల్సిందిగా అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు నుండి ఆహ్వానం అందింది. కేవలం 24 గంటల ముందుగానే ఆహ్వానం అందినప్పటికీ మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము. మన్నియ సోహం సింగ్ ఆ సమయంలో మా సంభాగ్ ప్రచారక్ గా ఉండేవారు. ఆ సమయంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ పాటు జమ్మూ కాశ్మీర్లను కలిపి సంభాగ్ గా వ్యవహరించేవాళ్ళం.
నెహ్రూ పంపిన ఆహ్వాన పత్రాన్ని అందజేసేందుకు ప్రభుత్వ అధికారి రాగానే, తమ స్వయంసేవకులు పూర్తి గణవేశ్ (యూనిఫామ్) ధరించి దండ, ఘోష్ వాయిద్యాలతో కవాతులో పాల్గొంటామని ఆయనకు సోహం సింగ్ మాట ఇచ్చారు.
అప్పటికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉండటంతో మన్నియ సోహం జీ ఎంతో కష్టపడి ఈ వార్తను స్వయంసేవకులకు చేరవేసి వారందరినీ కవాతుకు సిద్ధంచేశారు.
కవాతులో పాల్గొనే స్వయంసేవకుల కోసం వాహనాలు ఇతర ఏర్పాట్ల కోసం ప్రయత్నాలతోనే ఆ రాత్రంతా గడిచిపోయింది. ఆ కాలంలో టెలిఫోన్లు కలిగినవారు బహు అరుదు. దీంతో స్వయంగా అందరినీ కలిసి కవాతుకు సిద్ధం చేయడం జరిగింది. అలా ఈ విషయం ఒకరి ద్వారా మరొకరికి అత్యంత వేగంగా చేరవేశారు. మొత్తానికి గణతంత్ర దినోత్సవం ఉదయం కల్లా, అనుకున్న సమయానికి ముందే స్వయంసేవకులు వాహనాల్లో ఢిల్లీ పెరేడ్ మైదానం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు స్వయంసేవకులతో కిక్కిరిసిపోయాయి.
ఉదయం 8 గంటల ప్రాంతం.. 3000 మంది గణవేశ్ ధరించిన స్వయంసేవకులు ఢిల్లీలోని పెరేడ్ మైదానానికి చేరుకున్నారు. నావికా దళం, వాయు దళం, పదాతి దళం వారి కవాతు అయిపోగానే స్వయంసేవకుల కవాతు అని ముందుగా సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో స్వయంసేవకులు అందరం దేశభక్తి గీతాలాపనలతో ఆనందించాం. త్రివిధ దళాలకు చెందిన జవాన్లు కూడా మాతో పాటు గొంతుకలపడం ఇంకా ఉత్సాహాన్నిచ్చింది.
సరిగ్గా ఉదయం 9 గంటలకు త్రివిద దళాల కవాతు ప్రారంభమైంది. వివిధ రెజిమెంట్లు అందులో పాల్గొన్నాయి. మా వంతు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట సమయం అయింది. అయినప్పటికీ ఎవరం కూడా ఏ కోశానా ఉత్సాహం కోల్పోలేదు. అంతేకాదు ఉదయం అల్పాహారం గురించి కూడా మేమెవ్వరం ఆలోచించలేదు. చివరికి వివిధ రకాల ఘోష్ వాయిద్యాలతో స్వయంసేవకులందరం ఆ చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకున్నాం.
ప్రభుత్వం సంఘాన్ని కవాతుకు ఆహ్వానించడానికి కారణాలు?:
ఇదే విషయాన్నీ గురించి వివరిస్తూ శ్రీ విజయ్ కుమార్ ఇచ్చిన సమాధానం ఇదీ..
“1962 సంవత్సరంలో చైనాతో జరిగిన యుద్ధంలో ఆరెస్సెస్ స్వయంసేవకులు భారత సైన్యానికి సహాయ సహకారాలు అందించడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ సమయంలో ప్రభుత్వేతర సంఘాలను కూడా కవాతులో పాల్గొనేందుకు ఆహ్వానించాలని నెహ్రూ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో పాటు భారత సేవక్ సమాజ్ సంస్థకు కూడా ఆహ్వానం పంపించారు. ఐతే భారత సేవక్ సమాజ్ వారి సంఖ్య తక్కువ కావడం వల్ల వారు కవాతులో పాల్గొనలేకపోయారు. ఆరెస్సెస్ సంఖ్య అధికం కారణంగానే అతి తక్కువ సమయంలో ఆహ్వానం అందినప్పటికీ నిర్ణీత సమయం కన్నా ముందే సిద్ధంగా చేరుకోగలిగాము. మొదట ప్రభుత్వం నుండి ఆహ్వానం అందిన వెంటనే “మేము మా గణవేశ్ ధరించి కవాతులో పాల్గొంటాం” అని స్పష్టం చేయడంతో ప్రభుత్వం కూడా ఒప్పుకుంది.
నోయిడాలో నివసిస్తున్న జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ యజమాని శ్రీ కృష్ణానంద్ సాగర్ గారు కూడా కవాతు సమయంలో అక్కడ ఉన్న విషయాన్నీ విజయ్ కుమార్ నెమరువేసుకున్నారు. ఆ సమయంలో ప్రచారక్ గా ఉన్న కృష్ణానంద్ సాగర్, స్వయంసేవకుల కవాతు కోసం ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షించినటు తెలిపారు.
‘ఆరెస్సెస్ ని నాశనం చేస్తా” అంటూ పార్లమెంట్ సాక్షిగా వ్యాఖలు చేసిన వ్యక్తి అదే ఆరెస్సెస్ ని గణతంత్ర కవాతులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించడం మా కార్యదక్షతపై ఆయనకున్న గౌరవానికి నిదర్శనం అని విజయ్ కుమార్ నెహ్రూ గురించి అభిప్రాయపడ్డారు.
1963 గణతంత్ర కవాతులో పాల్గొన్న మరొక జ్యేష్ఠ కార్యకర్త శ్రీ కెఎల్ పాతేలా కూడా ఆనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఢిల్లీ జనకపురి శాఖలో తమకు కవాతు ఆహ్వానం వార్త తెలిసిన వెంటనే చాలా ఆనందం వేసిందని తెలిపారు. కవాతులో పాల్గొనడం ఒకఎత్తైతే.. ఆరెస్సెస్ సంస్థని ద్వేషించే నెహ్రూ నుండి ఆహ్వానం అందడం అనేది సంఘ దేశభక్తికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. సలామీ మంచ్ గుండా ఇండియా గేటు వైపుగా తమ బృంద కవాతు చేసుకుంటూ వెళ్తుండగా ప్రజలు చప్పట్లు చరుస్తూ ఆహ్వానించిన తీరు అద్భుతమంటూ ఆనాటి జ్ఞాపకాన్ని వివరించారు.
1962 చైనా యుద్ధం సమయంలో స్వయంసేవకులు యుద్ధప్రాంతంలోని బంకర్ల వద్ద కూడా సైనికులకు సహాయం అందించారు. ఒకరోజు ఒక స్వయంసేవక్ సైనికుల కోసం ఖీర్ తయారుచేసిన తీసుకెళ్లగా అప్పటికే ఆ బంకర్ వద్ద కాల్పులు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎంతో ధైర్యంగా అక్కడికి చేరి, వారికోసం సిద్ధంచేసిన ఖీర్ పదార్ధాన్ని వారికి వడ్డించారని పాతేలా వివరించారు.
యుద్ధ సమయంలో దేశంలోని అన్ని చోట్లా ప్రజలు సైనికులకు తమ పూర్తి సహాయ సహకారాలు అందించారు. కొందరు స్వయంసేవకులు ఢిల్లీలో రూ. 697 చందాలు వసూలు చేసి వాటితో సైనికుల కోసం పండ్లు, తినుబండారాలు కొన్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో సైనికులు ప్రయాణం చేస్తున్న భోగీలకు చేరి వారికీ ఈ పండ్లు అందజేశారు. ఇదే సమయంలో సైనికులతో నిండి పంజాబ్ వైపు వెళ్తున్న రైల్లో సైనికులు “మీరు ఇప్పటికే మాకు ఎన్నో తినుబండారాలు అందజేశారు. ఇక ఇవి కూడా తీసుకుంటే మావద్ద చోటు సరిపోదు. వీటిని బయట ఎవరైనా పేదవారికి పంచిపెట్టండి” అంటూ సైనికులు కృతజ్ఞతాపూర్వకంగా చేసిన విజ్ఞప్తిని పాతేలా జ్ఞాపకం చేసుకున్నారు.