Home News అంతరాలే అసలు సమస్య , దేశమంతా ఒక్కటే

అంతరాలే అసలు సమస్య , దేశమంతా ఒక్కటే

0
SHARE

అయిదు దశాబ్దాల అనంతరం దక్షిణ భారతం నుంచి మళ్ళీ వేర్పాటువాద గళాలు వినబడుతున్నాయి. భారత్‌ యూనియన్‌ పరిధిలో ఉంటూనే అయిదు దక్షిణాది రాష్ట్రాలతో కలిపి ప్రత్యేక ‘ద్రవిడనాడు’ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత నాయకులు కొందరు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి పూర్తిగా వేరుపడాలని మరికొందరు డిమాండ్‌ చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా మారిన సినీనటుడు కమలహాసన్‌ ముందుగా దీనిపై చర్చకు తెర లేపారు. ద్రవిడ అస్తిత్వాన్ని గుర్తించి, ఈ ప్రాంతం పట్ల చూపుతున్న విచక్షణపై గళాన్ని గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందన్నది ఆయన అభిప్రాయం. ద్రవిడ మున్నెట్ర కజగం (డీఎమ్‌కే) నాయకుడు ఎమ్‌కే స్టాలిన్‌ సైతం ఇందుకు తన స్వరాన్ని జత కలిపారు. ద్రవిడనాడు ఏర్పాటుపై దక్షిణాది రాష్ట్రాలు కలిసివస్తే తాను స్వాగతిస్తానని ఆయన చెబుతున్నారు.    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు నాయకులూ ఇదే తరహాలో మాట్లాడారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉత్తర-దక్షిణ భారత్‌ విభజన గురించి హెచ్చరించారు. ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ సదరన్‌ ఇండియా’ ఆలోచనకు ఆయన మద్దతు పలికారు. దిల్లీతో బేరసారాలు జరిపేందుకు ఇది ఉపయోగపడుతుందన్నది ఆయన అభిప్రాయం. సినీనటుడు, తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు మురళీమోహన్‌ సైతం తాము విచక్షణకు గురవుతున్నామని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయని అన్నారు.

పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు తగ్గడమే ఈ పరిస్థితికి కారణంగా కనబడుతోంది. కేంద్రం నుంచి జాతీయ వనరులు, నిధుల పంపిణీలో తమ న్యాయబద్ధమైన వాటాను పొందే హక్కు దక్షిణాది రాష్ట్రాలకు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇది చర్చల ద్వారా, సామరస్యంగా పరిష్కరించుకోవలసిన అంశం. అంతేతప్ప ఏకంగా దేశం నుంచే విడిపోతామనడం సరైనది కాదు. వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ సమగ్రత, సమైక్యత కోసం గత 70 ఏళ్లుగా కృషి జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి డిమాండ్లు తలెత్తడం ఆశ్చర్యం కలిగిస్తాయి. స్వాతంత్య్రం అనంతరం తమిళనాడుకు చెందిన నాయకుడు సీఎన్‌ అన్నాదురై నుంచి తొలుత వేర్పాటువాదం వినిపించింది. అప్పట్లో పండిత నెహ్రూ ప్రధానిగా ఉండేవారు. 1962 మే ఒకటిన అన్నాదురై రాజ్యసభలో మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘మనకు ఒక రాజ్యాంగం ఉంది. దాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ‘జాతి’ అన్న పదానికి కొత్తగా భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంద’న్నారు అన్నాదురై! దీంతో ఆయన ప్రసంగం వింటున్న సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

అన్నాదురై తన వాదనను మరింత సోదాహరణంగా వివరించారు. ‘నాది ద్రవిడ నేపథ్యం. ద్రవిడులది విభిన్నమైన అస్తిత్వం. నేను ద్రవిడుణ్ని అయినందుకు గర్విస్తాను. మాకు స్వయం నిర్ణయాధికారం కావాలి’ అని గట్టిగా కోరారు. భౌగోళికంగా దక్షిణాది ప్రత్యేకమైనదంటూ తమ డిమాండును సభ సానుభూతితో పరిశీలించాలని కోరారు. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో నాటి ప్రధానమంత్రి నెహ్రూ పంజాబ్‌ రాష్ట్రంలోని కపుర్తలలో చేసిన ప్రసంగాన్ని అన్నాదురై ఉదహరించారు. ‘అన్ని ప్రాంతాలను కలిపి ఉంచేందుకు కాంగ్రెస్‌ శాయశక్తులా పాటుపడుతుంది. దేశంలోని ఏ ప్రాంతమైనా విడిపోవాలనుకుంటే కాంగ్రెస్‌ కాదనదు’ అన్న నెహ్రూ వ్యాఖ్యలను గుర్తుచేశారు. రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాన్ని కాంగ్రెస్‌ గుర్తించినప్పుడు ఆ అధికారాన్ని దక్షిణాదికి ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.

అన్నాదురై వ్యాఖ్యలపట్ల నాటి జనసంఘ్‌ సభ్యుడు అటల్‌ బిహారీ వాజపేయీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నా ప్రసంగం మరుసటి రోజు ఆయన సభలో మాట్లాడుతూ వేర్పాటువాద డిమాండును గట్టిగా తిప్పికొట్టారు. ‘సభలో నిన్న ప్రమాద ఘంటిక వినబడింది. అది దేశ విభజనకు సంబంధించినది. ఇలాంటి డిమాండ్లు దేశానికి మంచివి కావు. మద్రాస్‌ రాష్ట్రానికి న్యాయం జరగడం లేదన్న ఉద్దేశంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. సాధారణంగా దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా ఇలాంటి ఫిర్యాదులు వినిపిస్తుంటాయి. ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సైతం ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఒక ప్రాంతం మరో ప్రాంతంపై ఫిర్యాదు చేస్తుంటుంది. వీటిల్లో ఒకింత వాస్తవం లేకపోలేదు. కానీ ఇవి జాతి మనగడకు ముప్పు కలిగించరాదు. దేశ విభజనకు దారి తీయరాదు. ముస్లింలీగ్‌ సైతం ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చింది. భారత్‌లోని హిందువులు, ముస్లిములు ఒకే జాతివారు కాదని వాదించింది. కానీ దానికి వ్యతిరేకంగా మనం పోరాడాం. ద్విజాతి సిద్ధాంతాన్ని మనం అంగీకరించజాలం’ అని వాజపేయీ కుండ బద్దలుకొట్టారు. సభలోని అన్ని వర్గాల సభ్యులు ఆయన ప్రసంగాన్ని సమర్థించారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు సభ్యులు సైతం వాజ్‌పేయీ వాదనతో ఏకీభవించడం విశేషం.

ఈ చర్చ జరిగిన ఏడాది తరవాత అనూహ్యంగా పరిస్థితులు మారాయి. ఈశాన్య ప్రాంతంపై చైనా ఆకస్మిక దాడితో ప్రజల్లో జాతీయ భావనలు బలంగా వ్యాప్తి చెందాయి. అందరికీ జాతీయ సమైక్యత ప్రథమ ప్రాధాన్యంగా మారింది. దీంతో డీఎమ్‌కే సైతం తన డిమాండును ఉపసంహరించుకుంది. జాతీయ జనజీవన స్రవంతిలో మమేకమైంది. ఎన్నికలకు వెళ్లి 1967లో మద్రాస్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఎగువసభలో ఈ చర్చ జరిగిన 56 సంవత్సరాల అనంతరం మళ్ళీ అసంతృప్త గళాలు విచ్చుకుంటున్నాయి. వేర్పాటువాద వ్యాఖ్యలు వినబడుతున్నాయి. అయినప్పటికీ భారత సమైక్యత, సమగ్రత చర్చనీయాంశలు కానేకావు. జాతిని సమైక్యంగా ఉంచడానికి ఈ డెబ్భై ఏళ్లలో మూడు తరాల ప్రజలు త్యాగాలు చేశారు. భిన్నత్వంలో ఏకత్వంతో విలసిల్లుతున్న సమున్నత భారత ప్రస్థానాన్ని అస్థిరపరచరాదు. 1962లో పెద్దలసభలో వాజ్‌పేయీ చెప్పిన ప్రతి మాటా ప్రస్తుత పరిస్థితులకు వర్తిస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలి. దేశ సమైక్యత, సమగ్రతలను సవాలు చేసే ఆలోచనలను మొగ్గలోనే తుంచేయాలి!

ఏ సూర్య ప్రకాష్ , ప్రసార భారతి చైర్మన్

(ఈనాడు సౌజన్యం తో)