Home News మీరు ముజాహిదీన్‌లా.. పాక్ తొత్తులా?

మీరు ముజాహిదీన్‌లా.. పాక్ తొత్తులా?

0
SHARE

కాశ్మీర్‌లో ఉగ్రవాదమే పనిగా పెట్టుకున్న స్థానిక మిలిటెంట్లపై ఇటు సైన్యం, అటు స్థానిక పోలీసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘మీరు ముజాహిద్దీన్‌లా? లేక పాకిస్తాన్ తరఫున రాష్ట్రంలో కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా చేస్తున్నారా?’ అంటూ వీరిపై నిప్పులు చెరిగారు. మిమ్మల్ని మీరు ముజాహిదీన్‌లుగా అభివర్ణించుకుంటున్నారని, కాని మీ ఘాతుకాలు చూస్తే పాక్ తరఫున పని చేస్తున్నట్టుగా స్పష్టమవుతోందని మిలిటెంట్లను ఉద్దేశించి లెఫ్ట్‌నెంట్ జనరల్ జెఎస్ సంధు అన్నారు.

ఆరుగురు మిలిటెంట్లు హతమైన బందిపోర ఎన్‌కౌంటర్‌పై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, మిలిటెంట్ల నైతికతను ప్రశ్నించారు. కాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితుల స్థాపనకు తోడ్పడాలని, అంతేగానీ పాక్ ప్రోద్భలంతో కల్లోలం సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. పాకిస్తాన్ కమాండర్ల ఉంచి వచ్చిన సంకేతాలను భారత నిఘా వర్గాలు పసిగట్టాయని, అందుకే ఇక్కడ ఓ ఇంట్లో నక్కిన ఆరుగురు టెర్రరిస్టుల ఆచూకీని కనిపెట్టి వారిని అంతం చేయగలిగామని అన్నారు.

తమకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా సిఆర్‌పిఎఫ్, ఆర్మీ, రాష్ట్ర పోలీసులు ఉమ్మడిగా దాడి జరిపి ఈ మిలిటెంట్లను అంతం చేశారని తెలిపారు. ఈ ఆపరేషన్ దిగ్విజయంగా నిర్వహించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానన్నారు.

ఇప్పటి వరకూ ఈ ఏడాదిలో 190 మిలిటెంట్లను అంతం చేశామని, వీరిలో 80మంది స్థానిక టెర్రిరిస్టులు కాగా, 110 మంది విదేశీ తీవ్రవాదులని ఆయన వెల్లడించారు. ఈ విదేశీ తీవ్రవాదుల్లో 66మందిని భారత సరిహద్దులు దాటుతుండగానే భద్రతా దళాలు అంతం చేయగలిగాయన్నారు.

శ్రీనగర్‌లో జరిగిన జకోరా ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ ఇందులో ఐసిస్ ప్రమేయం ఉందని భావించడం లేదని, రాష్ట్రంలో ఐసిస్ ఆనవాళ్లే లేవని స్పష్టం చేశారు. కాశ్మీర్ లోయ ప్రాంతాన్ని ఉగ్రవాద రహితంగా మార్చడానికి, తుపాకుల మోత లేకుండా చేయడానికి ఉమ్మడిగా శ్రమిస్తున్నామని పేర్కొన్న ఆయన, త్వరలోనే కల్లోల కాశ్మీర్ శాంతి మండలంగా మారబోతోందన్న ధీమాను వ్యక్తం చేశారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)