Home Ayodhya “అయోధ్య: నాకు తెలిసిన నిజం, నేను చెప్పిన నిజం” – కెకె మహ్మద్ (భారత ఆర్కియాలజీ...

“అయోధ్య: నాకు తెలిసిన నిజం, నేను చెప్పిన నిజం” – కెకె మహ్మద్ (భారత ఆర్కియాలజీ మాజీ అధికారి)

0
SHARE
దేవాలయాన్ని ధ్వంసం చేసి వివాదాస్పద కట్టడాన్ని నిర్మించారన్న కీలకమైన ప్రాతిపదికపైనే రామజన్మభూమి ఉద్యమం ఆధారపడి ఉంది. ఉద్యమానికి ముందే ఇందుకు సంబంధించి పురావస్తు పరిశోధన కూడా చేపట్టారు. వివాదాస్పద కట్టడం కింద ఒక పెద్ద ఆలయం ఉందన్న నిజాన్ని ప్రొఫెసర్ లాల్, డాక్టర్ కె కె మహమ్మద్ తో కూడిన ఒక బృందం సేకరించిన పురావస్తు ఆధారాల ద్వారా ధృవీకరించారు. డాక్టర్ మహమ్మద్ తాను మలయాళంలో రచించిన ‘నిజన్ ఎన్న భారతీయన్’ అనే పుస్తకంలో చరిత్రను పునఃసమీక్షించే విధంగా చేపట్టిన ఆ మొత్తం శాస్త్రీయ ప్రక్రియ గురించి వివరించారు. ఆ పుస్తకంలో కొన్ని కీలక భాగాలను అయోధ్య అంశంపైన చర్చ, సమీక్ష జరిగేటప్పుడు ఉపయుక్తంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో ఇక్కడ పొందుపరుస్తున్నాం.

కే కే మొహమ్మద్:

“ఈ ఘట్టాలను వివరించకుండా నా జీవితగాథ పూర్తి కాదు. ఎవరో ఒకరి మతపరమైన విశ్వాసాలను అవమానపరచి, వేరే ఇంకెవరో విశ్వాసాలను ప్రోత్సహించడం నా ఉద్దేశ్యం కాదు. నా ఈ వివరణని ఆవిధంగా ఇంకెవరూ ఉపయోగించకూడదు కూడా.

అయోధ్య వ్యవహారం బాగా ప్రచారంలోకి వచ్చింది 1990లో. కానీ అంతకంటే ముందుగా, 1978లోనే పురావస్తు శాస్త్ర విద్యార్థిగా అయోధ్యలో సర్వే చేసే అవకాశం నాకు లభించింది.

ఢిల్లీ స్కూల్ అఫ్ ఆర్కియాలజీ విద్యార్థిగా నేను ప్రొఫెసర్ బి.బి. లాల్ నేతృత్వంలో అయోధ్యలో విస్తృతంగా సర్వే చేస్తున్న బృందంలో సభ్యుడిగా ఉన్నాను. అంతకు ముందు అక్కడ ఉన్న ఒక దేవాలయం మూల స్తంభాలకు ఉన్న ఇటుక పునాదులను మేము గుర్తించాం. ఆ రోజుల్లో ఇటువంటి విషయాలను ఎవరూ వివాదాస్పదం అనుకునేవారు కాదు. పురావస్తు నిపుణులుగా మేము వాస్తవాలను, చారిత్రాత్మక దృక్పథంతో అవగాహనతో పరిశీలించేవాళ్ళం.

బాబ్రీ మసీదు గోడల్లో ఆలయ స్థంబాలు ఉన్నాయి. ఈ స్తంభాలను బ్లాక్ బసాల్ట్ అనే రాయితో నిర్మించారు. ఈ స్తంభాల కింది భాగంలో 11-12 శతాబ్దాల్లో అమల్లో ఉన్న సంప్రదాయాల ప్రకారం పూర్ణ కలశాలు చెక్కి ఉన్నాయి. ఆలయ కళాచిహ్నాల్లో పూర్ణ కలశం అంటే సౌభాగ్యానికి సంకేతమైన ఎనిమిది మంగళ చిహ్నాల్లో ఒకటి. 1992లో మసీదును కూల్చేసిన నాటి వరకు, ఒకటో రెండో కాదు, అటువంటి స్తంభాలు 14 అక్కడ ఉన్నాయి.  మసీదు పోలీస్ రక్షణలో ఉంది, ఎవరినీ లోపలకి అనుమతించక పోయినప్పటికీ, మేము పరిశోధనా బృందంలో సభ్యులు కనుక మమ్మల్ని ఎవరూ ఆపలేదు. అందువల్ల నేను ఆ స్తంభాలను దగ్గర నుంచి చూడగలిగాను. ప్రొఫెసర్ లాల్ నేతృత్వంలోని బృందంలో భారత పురావస్తు సర్వే (ఆర్కియాలజీ సర్వే అఫ్ ఇండియా) అధికారులు, స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ విద్యార్థులం మేము 12 మంది ఉన్నాం. అయోధ్యలో వివిధ రకాల శోధనలు జరుపుతూ మేము రెండు నెలలు గడిపాము. బాబర్ సైనికాధిపతి అయిన మీర్..  తాను ధ్వంసం చేసినదో, లేదా వేరే ఎవరో అప్పటికే కూల్చివేసిందో – ఒక ఆలయం అవశేషాలను ఉపయోగించి మసీదు నిర్మించాడు

మసీదు వెనకాల, పక్కన తవ్వకాలు జరుపుతున్నప్పుడు మేము నల్ల బసాల్ట్ రాతి స్తంభాలను నిలబెట్టిన ఇటుక గద్దెలను కనుగొన్నాం. ఈ వాస్తవాలు ఆధారంగా నేను 1990లో బాబ్రీ మసీదు కింద ఒక ఆలయం ఉండేదని ప్రకటన చేశాను. అయితే, అప్పటికే వాతావరణం ఉద్రిక్తంగా మారింది. హిందూ, ముస్లిం నేతలు పరస్పర విరోధ వైఖరికి చేరుకున్నారు. రెండువైపులా ఉన్న మితవాదులు ఏదో ఒక రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, విశ్వ హిందూ పరిషత్ అప్పటికే రామ జన్మభూమి ఉద్యమాన్ని తన అజెండాగా చేసుకుంది. ముస్లింలలో మితవాదులు అయోధ్యను హిందువులకు విడిచిపెట్టి, వివాదాన్ని పరిష్కరించవచ్చునని ఆలోచించడం మొదలు పెట్టారు. కొంత మంది ముస్లిం నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నా, గట్టిగా ఆ మాట అనే ధైర్యం ఎవరూ చేయలేదు. అయోధ్యను హిందువులకు విడిచిపెట్టేస్తే వీహెచ్ పీ ఆట కట్టించినట్లు అవుతుందని కూడా కొంతమంది ముస్లిం నేతలు అనుకున్న విషయం నాకు తెలుసు. అటువంటి అభిప్రాయాలకు ఒక గళం వచ్చి ఉండినట్లైతే, పరిస్థితి అప్పుడే చక్కబడేది. కానీ కొంతమంది వామపక్ష చరిత్రకారులు, తీవ్రధోరణి కల ముస్లింలతో ఏకమై, మొత్తం విషయాన్ని వక్రీకరించారు.

ఎస్ గోపాల్, రొమిలా థాపర్, బిపన్ చంద్ర నేతృత్వంలో కొంతమంది చరిత్రకారులు రామాయణం చారిత్రాత్మకతను ప్రశ్నించడం ప్రారంభించారు. పంతొమ్మిదవ శతాబ్దానికి ముందు ఆలయం ధ్వంసం అయిందనడానికి దాఖలాలు లేవని వారు వాదించారు. చివరకి వాళ్ళు అయోధ్య బౌద్ధ, జైన కేంద్రమని కూడా అనేశారు. ప్రొఫెసర్ ఆర్ ఎస్ శర్మ, అఖ్తర్ అలీ, డీ ఎన్ ఝా, సూరజ్ భాన్, ఇర్ఫాన్ హబీబ్ వంటి వారి చేరికతో ఈ వర్గం భారీగా తయారైంది. వారిలో సూరజ్ భాన్ ఒక్కరే పురావస్తు నిపుణుడు. ఆర్ ఎస్ శర్మ బృందంలోని చరిత్రకారులు బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీలో నిపుణులుగా అన్ని అధికారిక సమావేశాల్లో పాల్గొనేవారు.

బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ సమావేశాలు ఎక్కువగా భారత చరిత్ర పరిశోధనా సమితి (ICHR) చైర్మన్ అయిన డాక్టర్ ఇర్ఫాన్ హబీబ్ అధ్యక్షతన జరిగేవి. బాబ్రీ కమిటీ సమావేశాలను ICHRలో నిర్వహించడం పైన ICHR సభ్యకార్యదర్శి ఎంజీఎస్ నారాయణన్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఆయన అభ్యంతరాన్ని ఇర్ఫాన్ హాబీన్ కొట్టివేశారు. ఈ వామపక్ష చరిత్రకారుల బృందానికి న్యూస్ పేపర్లలో, పత్రికల్లో అత్యధికమైన ప్రాబల్యం ఉండేది. వారు అయోధ్యకి సంబంధించిన వాస్తవాలను ప్రశ్నిస్తూ రాసిన వ్యాసాలు సాధారణ జనాల మనసుల్లో అయోమయాన్ని సృష్టించాయి. సమస్యను రాజీ ద్వారా పరిష్కరించేందుకు సిద్ధపడ్డ మితవాదులు కూడా మారిపోయారంటే, అది కేవలం ఈ చరిత్రకారులు, వారి మాటలను చిలక పలుకుల్లా వల్లే వేసిన పత్రికలే కారణం. ఈ వాతావరణం బాబ్రీ మసీదు కమిటీకి ఒక చట్టబద్ధత, తద్వారా ఒక దూకుడు వైఖరి తెచ్చిపెట్టడం ఎంతో దురదృష్టకరం. తమ వాదనను విడిచి, హిందువులకు సానుకూలంగా స్పందించాలని ఏదో ఒక సమయంలో ఆలోచించిన సాధారణ ముస్లింలు కూడా, క్రమంగా తమ వైఖరిని మార్చుకున్నారు. తత్ఫలితంగా, మసీదుని విడిచిపెట్టడానికి లేదని మితవాదులు కూడా పట్టుబట్టారు. కమ్యూనిస్ట్ చరిత్రకారుల జోక్యం వారి బుర్రలను పూర్తిగా ప్రభావితం చేసింది. ఈ రెండు వర్గాలు కలిసి చేసిన నిర్వాకంతో అయోధ్య సమస్యకు రాజీ మార్గం తలుపులు ఎప్పటికీ మూసుకునిపోయాయి.

ఆ రాజీ కనుక అమల్లోకి వచ్చినట్లైతే, మన దేశంలో హిందూ – ముస్లిం సంబంధాల్లో ప్రధానమైన ఒక మలుపు వచ్చి ఉండేది. ఇతర అనేక వివాదాస్పదమైన అంశాలకు, సమస్యలకు కూడా సహజమైన పరిష్కారాలు లభించే ఉండేవి.

మన ఈ అవకాశాన్ని చేజార్చిన కమ్యూనిస్ట్ మూఢత్వం మన దేశానికే ప్రమాదకరమైనదని రుజువు చేసింది.

నా వాంగ్మూలం 1990 డిసెంబర్ 15నాడు వెలువడింది. కానీ అప్పటికే చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వైపుల నుంచి తీవ్రమైన వాదనలు ప్రారంభించారు. నేను మసీదు కింద ఆలయం అవశేషాలు చూశానని నా ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నాను.

అయోధ్యలో కూల్చివేత సమయంలో బయటకి వచ్చిన అత్యంత ముఖ్యమైన కళాకృతి ‘విష్ణు హరి శిల’ అనే ఒక శిలా శాసనం. ఆ శాసనం మీద 11-12 శతాబ్దాల నాటి నాగరి లిపిలో సంస్కృత భాషలో ఈ  ఆలయం బలి చక్రవర్తిని, దశకంఠ రావణుడిని హతమార్చిన విష్ణుమూర్తికి (శ్రీరాముడు విష్ణు అవతారం) ఆలవాలమని ఉంది.

1992లో, డాక్టర్ Y D శర్మ, డాక్టర్ K M శ్రీవాస్తవ ఆ స్థలాన్ని పరిశీలించినప్పుడు వారికి మహావిష్ణు అవతారాలు, శివుడు, పార్వతి మొదలైన దేవతల మట్టి విగ్రహాలు చిన్నవి లభ్యమయ్యాయి. ఇవి కుశన కాలం – అంటే క్రీస్తు శకం 100 నుంచి 300 మధ్య సంవత్సరాలకు చెందినవి. 2003లో అలహాబాద్ హైకోర్ట్ ఆదేశాల మేరకు మళ్ళీ తవ్వకాలు జరిపినప్పుడు, ఆలయ స్తంభాలకు ఒకప్పుడు ఆధారంగా ఉన్న యాభైకి పైగా ఇటుక పునాదులను కనుగొన్నారు.  ఆలయం పైన ఉండే అమలకం, అభిషేక జాలం ప్రవహించే మకర ప్రణాళి కూడా తవ్వి తీశారు. బాబ్రీ మసీదు ఎదుట ప్రాంగణాన్ని చదును చేసినప్పుడు, 263 ఆలయ సంబంధ అవశేషాలు, కళాకృతులు లభ్యమయ్యాయని ఉత్తర్ ప్రదేశ్ పురావస్తు సంచాలకులు డాక్టర్ రాగేష్ తివారి ఒక నివేదిక కూడా సమర్పించారు.

తవ్వకాల సందర్భంగా వెలుగు చూసిన ఆధారాలు, బయటపడ్డ చారిత్రాత్మక కళాకృతులని సమగ్రంగా విశ్లేషించిన తర్వాత భారత పురావస్తు సర్వే శాఖ, బాబ్రీ మసీదు కింద దేవాలయం ఉండేదని నిర్ధారణకు వచ్చింది. అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం కూడా ఇదే నిర్ధారణకు వచ్చింది. తవ్వకాలు నిష్పక్షపాతంగా జరిగాయని చెప్పేందుకు 131 మంది తవ్వకం సిబ్బందిలో 52 మంది ముస్లింలను చేర్చారు. అంతే కాదు. తవ్వకాలను, బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ప్రతినిధులు, పురావస్తు చరిత్రకారులు – సూరజ్ భాన్, మండల్, సుప్రియ వర్మ, జయ మీనన్ సమక్షంలో జరిపారు.

ఆ తవ్వకాలు ఇంతకంటే నిష్ఫక్షంగా జరపడం సాధ్యమా?
హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వామపక్ష చరిత్రకారులు తమ పిల్లిమొగ్గలు కొనసాగించారు. అంతకు ముందు కూడా వారు ఎటువంటి సంకోచం, మొహమాటం లేకుండా తమ వైఖరిని పదేపదే మార్చారు. వారి వైఖరిలో నిలకడ లేకపోవడానికి ప్రధాన కారణం BMAC ప్రతినిధులుగా తవ్వకాల్లో పాల్గొన్నవారు కేవలం చరిత్రకారులు. వారిలో ముగ్గురు, నలుగురికి కొంత పురావస్తు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నప్పటికీ, క్షేత్ర పురావస్తు శాస్త్రం పట్ల వారికి ఇసుమంతైనా జ్ఞానం లేదు. అందువల్ల వారు డాక్టర్ బీఆర్ మణి వంటి విశిష్ట పురావస్తు శాస్త్రజ్ఞుల ఎదుట మరుగుజ్జులుగా మిగిలిపోయారు. బాబ్రీ కమిటీ ప్రతినిధులుగా పాల్గొన్న జే.ఎన్.యు, అలీగఢ్ విశ్వవిద్యాలయాల పురావస్తు నిపుణులకు కూడా క్షేత్ర స్థాయిలో పురావస్తు శాస్త్ర పరిజ్ఞానం లేదని,  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు పట్టించుకోలేదు.  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిజానికి, నిష్పక్షపాతానికి కట్టుబడి ఉంది.

బాబ్రీ కమిటీలో ప్రముఖ నాయకుల్లో ఒకరైన సయ్యద్ షాహాబుద్దీన్ అప్పటి కేంద్రమంత్రి అనంత కుమార్ కి ఒక లేఖ రాస్తూ, ఆలయ విస్తరణకు బీజేపీ శాసన సభ్యుడు జవహర్ ప్రసాద్ చేసిన ప్రయత్నాన్ని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ, ధైర్యంగా అడ్డుకున్నందుకు  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ప్రశంసించారు. ఈ లేఖను  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ నాకు పంపించారు. దానికి స్పందనగా నేను సయ్యద్ షాహాబుద్దీన్ కి సవివరంగా ఒక లేఖ రాశాను. అందులో నేను అయోధ్య అంశాన్ని కూడా ప్రస్తావించాను. ప్రొఫెసర్ బీ బీ లాల్ నేతృత్వంలో నేను కూడా అయోధ్య తవ్వకాల్లో పాల్గొన్నానని, బాబ్రీ మసీదు కింద నేను ఆలయం శిధిలాలు చూశానని చెప్పాను. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని, ఆయన ముస్లింలలో ఒక సానుకూల దృక్పధాన్ని, అభిప్రాయాన్ని ఏర్పరచాలని, అయోధ్య సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరాను. ముస్లిం నేతలతో తదుపరి సమావేశంలో ఈ విషయం చర్చిస్తానని ఆయన నాకు హామీ ఇచ్చారు., అయితే ఆ సమావేశం తర్వాత ఆయన, మసీదును హిందువులకు ఇచ్చేనందుకు ఎవరూ అంగీకరించలేదని తెలియచేశారు.

ఆ తర్వాత కూడా నేను ఆయనతో సుదీర్ఘంగా చర్చించాను. కానీ ఆయన బాబ్రీ మసీదును హిందువుల అధీనంలోకి ఇచ్చేందుకు అంగీకరించలేదు.

వెనక్కి ప్రయాణిస్తున్నప్పుడు నేను బాగా లోతుగా ఆలోచించాను. భారత్ ముస్లింలు అధిక సంఖ్యాకులైన లౌకిక దేశం అయితే (ముస్లింల మెజారిటీ ఉంటే, అది ఎట్టి పరిస్థితుల్లో లౌకిక దేశం కాదులే), ఒక ముస్లిం నేత జాతీయ కట్టడం కూడా అయినా ఒక ఆలయ ప్రాంగణంలో ఒక మసీదును అక్రమంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తే, ఒక హిందూ అధికారి దాన్ని వ్యతిరేకిస్తే, ఎంత మంది ముస్లింలు ఆ అధికారిని సమర్ధించి ఉండేవారు? అదీ భారతీయ లౌకికవాదంలో గొప్పదనం.
 
ఒకసారి నేను జర్మనీకి చెందిన అంతర్జాతీయ పురావస్తు ఎక్స్ కవేషన్ బృందంతో కలిసి ఒమాన్ కి వెళ్లాను. అల్ బలిద్ అనే ఒక భూగర్భ నగరాన్ని తవ్వి వెలికి తీయడం ఆ బృందం లక్ష్యం. అక్కడ కొంతమంది కేరళీయులు నాకు తారసపడ్డారు. వారు కేరళలో కన్నూరు-తలచేరి ప్రాంతానికి చెందిన వారు. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐన స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియాకి వారు సానుభూతిపరులు. వారు నన్ను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. వారిలో కొంతమందికి అయోధ్య గురించి నా అభిప్రాయం తెలుసు. అయితే నేను కొన్ని షరతులు విధించాను. నేను వస్తాను, మాట్లాడతాను, నా అభిప్రాయాలను మీరు ప్రశ్నించవచ్చు. కానీ నేను జర్మన్ల ఆహ్వానం మీద వచ్చాను కనుక, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. క్రమశిక్షణ ఉండాలి, వ్యతిరేక అభిప్రాయాలను సహించాలి. వారు ఒప్పుకున్న తర్వాతే నేను రామ జన్మభూమి గురించి మాట్లాడాను. నేను ముందు ఇస్లాంలో సహనంతో కూడుకున్న కాలంతో నా ప్రసంగాన్ని ప్రారంభించాను. నేను ఖురాన్ సూక్తులు చెప్పడం వారిని ఆశ్చర్యపరచింది. అయోధ్యలో తవ్వకాలు, అక్కడ దొరికిన కళాకృతులు, అవశేషాల గురించి నేను సవివరంగా చెప్పాను. వారు ఎంతో శ్రద్ధగా నా మాటలు విన్నారు. నేను నా ప్రసంగాన్ని ఇలా ముగించాను:

“మక్కా, మదీనా ముస్లింలకు ఎంత ముఖ్యమో, హిందువులకి అయోధ్య అంత ముఖ్యం. మక్కా, మదీనా వేరే మతంవారి అధీనంలో ఉండడం ముస్లింలు సహించలేరు. హిందువులు అధిక సంఖ్యాకులు అయినా దేశంలో ఉండి కూడా తమ ఆలయాలు ముస్లింల అధీనంలో ఉండడం అనే అవమానాన్ని తట్టుకోలేని, నిస్సహాయుడైన హిందువులు చేసే ఆర్తనాదాలను ముస్లింలు వినాలి. అయోధ్యలో ఆ స్థలంలో రాముడు జన్మించాడని విశ్వసిస్తుండగా, మహ్మద్ ప్రవక్తకు, ఆ స్థలానికి ఏ సంబంధమూ లేదు. సహాబీలు, ఖులాఫర్ రసీదీన్లకు ఎటువంటి సంబంధం లేదు; తబీయున్ కానీ ఔలియా కానీ సలాఫుస్ సలీ తో కానీ ఎటువంటి పొంతన లేదు. ఇది కేవలం మొఘల్ చక్రవర్తి బాబర్ కి మాత్రమే సంబంధించింది. అటువంటి మసీదుకు ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వాలి?”

ఆ తర్వాత నేను నా చిన్ననాటి సంఘటన గురించి చెప్పాను. “జెరూసలేంలో బైతుల్ ముకద్దస్ యూదుల ఆధీనంలోకి వెళ్ళినప్పుడు, మేము కేరళలోని కోడువల్లిలో జుమా మసీదులో చేరి, బైతుల్ ముకద్దస్ ను వెనక్కి ఇవ్వాలని అల్లాతో మొరపెట్టుకున్నాం. బైతుల్ ముకద్దా పోయినప్పుడు మనం ఎటువంటి బాధని అనుభవించామో, సామాన్య హిందువులు కూడా అదే బాధ అనుభవిస్తారు. నేను విద్యాధికులు, ప్రగతిశీలురైన హిందువుల గురించి మాట్లాడడం లేదు. ఉత్తర భారత దేశంలో ఎముకలు కొరికే చలిలో, ఒంటి మీద చొక్కా,  కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, శ్రీరాముడిని ఒక్క సారి చూడాలన్న తపనతో దూరదూరాలు నడిచే ఆ హిందువు గురించి మాట్లాడుతున్నాను. అతని మత విశ్వాసాలను, అతని వేదనని మనం కొంచెం అయినా గుర్తించి, గౌరవించలేమా?”

ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. నేను నా ప్రసంగం కొనసాగించాను: స్వాతంత్య్రం అనంతరం, ముస్లింల కోసం ఒక కొత్త దేశాన్నే ఏర్పాటు చేశారు. భారత్ తనని తానూ అప్పుడు హిందూ దేశంగా ప్రకటించుకుని ఉండవచ్చు. కానీ, గాంధీజీ, నేహరూ, పటేల్, ఆజాద్ మొదలైన వారందరూ మహనీయులు కనుక, వారు అలా చేయలేదు. ముస్లిం అల్పసంఖ్యాక వర్గాల వారికి తమ స్వంత దేశం ఇచ్చాక కూడా, భారత్ ను లౌకిక దేశంగా ప్రకటించారు. ఇటువంటి విశాల హృదయం, ఉదారత మీకు ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. ఈ ఉదార చర్యకు గానూ, ధోవతి ధరించే ఒక వృద్ధుడు లౌకికవాద పీఠం పైన తన ప్రాణాన్ని బలిపెట్టవలసి వచ్చింది.

ప్రేక్షకులు ఇంకొంచెం ఆలోచించేలా వీలు కల్పించేందుకు నేను కొంచెం సేపు నా ఉపన్యాసాన్ని ఆపి, తర్వాత కొనసాగించాను: “ఒక వేళ ముస్లింలు అధిక సంఖ్యాకులైతే భారత్ లౌకిక దేశంగా ఉండేదా?” జవాబు రాకపోవడంతో, నేనే మళ్ళీ మాట్లాడాను: “లేదు. ఒక వేళ ముస్లింలు అధిక సంఖ్యాకులైతే భారత్ లౌకిక దేశంగా ఉండేది కాదు. మైనారిటీ హిందువులకి వేరే దేశం ఇచ్చాక భారత్ తనని తానూ లౌకికమని ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించేది కాదు. ఇది కేవలం హిందూమతంలో అంతర్లీనంగా ఉన్న ఔదార్యం. హిందూమతంలో ఉన్న సహనం. ఆ మనసుని, ఆ ఆలోచనని మనం అర్థం చేసుకోవాలి. ఆ మనస్తత్వాన్ని మనం గౌరవించాలి; భారతదేశంలో హిందువులు కాక ఇంకేదైనా మతస్తులు ఉంటె, ముస్లింల గతి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించడం మంచిది. ప్రతి ఒక్కరు చారిత్రాత్మక వాస్తవాలను అర్థం చేసుకుని, రాజీకి సిద్ధం కావాలి. అప్పుడే మనం నిజమైన లౌకికవాద జాతిగా ఉంటాం. ఈ ధోరణికి నేను రివర్స్ థింకింగ్, అంటే వెనక్కి ఆలోచించడం అని పేరు పెట్టాను. మీరు హిందువైతే, మిమ్మల్ని మీరు ముస్లింగా ఊహించుకుని ఈ సమస్యను చూడండి. మీరు ముస్లిం అయితే హిందువుగా ఆలోచింది, సమస్యను పరిష్కరించండి. మనమందరం వివిధ మతాలకు చెందిన వాళ్ళం కావడం యాదృచ్చికం.”

ప్రేక్షకుల నుంచి అప్పుడొక ప్రశ్న వినిపించింది: “మరి మనం ఈ మూడు ప్రదేశాలను అప్పగిస్తే, విశ్వహిందూ పరిషద్ మూడు వేల స్ధలాలు అడిగితే? వారి జాబితా చాలా పెద్దది కదా?”

“మనం రాజీ మార్గంలో ఉన్నాం. చర్చల ద్వారా సాధించే శాంతి గురించి మనం కలగంటున్నాం. నిర్హేతుకమైన డిమాండ్లకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడనవసరం లేదు, ఆ పని స్వయంగా హిందువులే చేస్తారు. అదే హిందూ మతంలో గొప్పదనం”అని నేను జవాబు ఇచ్చాను.

హిందువులకి అనుకూలంగా బాబ్రీ మసీదుని విడిచిపెడితే సమస్య పరిష్కారం కాగలదన్న నా అభిప్రాయంతో ఆయనతో సమావేశం అంగీకరించినట్లు నాకు అనిపించింది. అయితే బాహాటంగా ఆ మాట ఎవరూ అనలేదు. కొన్నిసార్లు ముఖకవళికలు, కదలికల నుంచే మనకి జవాబులు లభిస్తాయి. ప్రేక్షకుల్లో అధిక శాతం యువకులే. కార్యక్రమం అనంతరం నిర్వాహకులు నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకుని వెళ్లారు. “ఈ వాస్తవాలని మీరు సయ్యద్ షాహాబుద్దీన్ వంటి అగ్రనేతలకు ఎందుకు చెప్పలేదు?’ అని వారు నన్ను అడిగారు.

“నాకు అప్పుడు ఆయన పరిచయం లేరు. షేర్ షా సురి మక్బరా సంఘటన తర్వాతే నాకు ఆయన పరిచయం అయ్యారు. ఆ తర్వాతా ఆయనకీ సవివరంగా రాశాను,” అని చెప్పాను.

భారత్ లో ఎన్నో మతాలు ఉన్నాయి. యూరప్ లో మతతత్వం గణనీయంగా తగ్గింది. పాశ్చాత్య దేశాల్లో మతాలు కేవలం వారసత్వం, సంస్కృతి కారణంగానే ఈనాడు సజీవంగా ఉన్నాయి. మన దేశంలో మతం మన జీవితంలో ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి మతానికి దానిదైన పురావస్తు శిల్పం, భవన నిర్మాణం పరిజ్ఞానం ఉన్నాయి. అన్ని సంస్కృతుల ఇచ్చిపుచ్చుకోవడాల సమ్మేళనమే భారత్. ఈ పరివర్తనలన్నింటికీ హిందూ సంస్కృతి మూలం. బౌద్ధ, జైన మతాలు హిందూమతానికి శాఖలు. ఇరాన్, ఇరాక్, టర్కీ దేశాలు మినార్లు, గుమ్మటాలకి జన్మస్థలాలు. కానీ కుతుబ్ మినార్ తో పోల్చదగ్గ కట్టడం ఏదైనా వారి వద్ద ఉందా? తాజ్ మహల్ కి ఛాయామాత్ర ప్రతిరూపాన్ని వారు ఎందుకు నిర్మించలేకపోయారు? భారత్ ఆ పని చేయగలిగింది. ఎందుకంటే ఇస్లామిక్ నిర్మాణ పటిమకు భారత హస్త కళా నైపుణ్యం తోడైంది కనుక. మనం ఒక మిశ్రమ సంస్కృతిలో పెరుగుతున్నాం. ప్రతి మొహమ్మద్ లో ఒక బ్రహ్మదత్, ప్రతి బ్రహ్మదత్ లో ఒక మొహమ్మద్ ఉండాలి. అటువంటి సమ్మిళిత, సాంస్కృతిక భారత్ ని మనం నిర్మించాలి.

– KK Mohammad
Source: Organiser