Home Telugu Articles రక్తరంజితమైన భైరవుని పల్లె (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-12)

రక్తరంజితమైన భైరవుని పల్లె (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-12)

0
SHARE

రజాకార్లు తెలంగాణలో అనేక గ్రామాలపై పడి దోపిడీలు, మానభంగాలు, హత్యలు కొనసాగిస్తున్న ఆ భయంకర వాతావరణంలో అక్కడక్కడ ప్రజలు ధైర్యాన్ని కూడగట్టుకొని ఎదురుతిరిగారు. ఆ సమయంలోనే నిజాం ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టడానికి “శాంతి సంఘాలు” అనే వాటిని ఏర్పరిచి హిందువుల కళ్ళు కప్ప ప్రయత్నించింది. జనగామలో ఇలాంటి శాంతిసంఘంలోనే పరిశ్రమల శాఖ సూపర్‌వైజర్ శ్రీ ఎం.ఎన్.రెడ్డి, వ్యవసాయ శాఖ సూపర్‌వైజర్ శ్రీ శఠగోపాచార్యులు ఇద్దరు సభ్యులు ఈ సంఘాలలో హిందువులు కూడా ఉన్నారని నమ్మించడానికి ఈ తతంగం జరుగుతుండేది.

అయితే హిందూ సభ్యులు నోరెత్తి రజాకార్లకు వ్యతిరేకంగా ఫిర్యాదుచేస్తే ప్రాణాలతో మిగలడం కష్టం. ఒకసారి శ్రీ శఠగోపాచార్యులు శాంతి సంఘ సమావేశంలో మితిమీరిపోతున్న రజాకార్ల చర్యలను ఖండించారు. మరుసటిరోజు ఆయనను జనగామ దారిలోకి తీసుకెళ్ళి కాల్చి చంపారు. శ్రీ ఎం.ఎన్. రెడ్డి నమ్రతతో ఈ ఆగడం గురించి ఫిర్యాదు చేశారు. కాని ఆయనను కూడా తుపాకీతో కాల్చేస్తామని అధికారులు బెదిరించారు. ఆ రోజుల్లో తిప్పర్తి ప్రాంతంలో ముస్లిం అధికారులు సివిల్ మిలిటరీ అనే భేదభావం లేకుండా ఆయుధాల అభ్యాసం చేస్తుండేవారు. హిందువులకు కాల్పులలో తర్ఫీదు ఇచ్చి హిందువులనే హత్య చేయించేవారు.

సజీవ దహనం

గ్రామాల్లో “శాంతి సంఘాలు” స్థాపించి ప్రజలకు రక్షణ కల్పిస్తామని నిజాం ప్రచారం చేస్తుండేవాడు. కాని ఆ శాంతిస్థాపన ఎంత భయానకంగా జరుగుతుండేదో శ్రీ ఎం.ఎన్.రెడ్డి ఒక సంఘటన ద్వారా వివరించి చెప్పారు. ఒకరోజు ఆయన కొడకండ్ల రంగాపూర్ మార్గం గుండా వెళుతున్నాడు. ఒకచోట చింతచెట్టుకు అయిదు శవాలు వేలాడుతున్న దృశ్యం కనపడింది. ఆయన వెంటనే దగ్గర్లో ఉన్న గ్రామవాసులను అడిగి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. శవాలు వేలాడుతున్న ప్రాంతం ఇననూర్ పోలీస్ స్టేషన్ సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ అయిదు శవాలు బ్రాహ్మణులవి. అంతకు క్రిందటి రోజే శ్రాద్ధ భోజనం చేసి ఏడుగురు బ్రాహ్మణులు తిరిగి వస్తున్నారు.

త్రోవలో శాంతిని సంరక్షిస్తున్న రజాకార్ల ముఠా ఒకటి ఎదరురైంది. ఆ ఏడుగుర్ని పట్టుకున్నారు. ఇద్దరు బ్రాహ్మణులు మాత్రం తప్పించుకొని పారిపోయారు. మిగిలిన ఐదుగురు ప్రభుత్వ ఏజెంట్లని రజాకార్లు నిర్ధారణ చేసికొన్నారు. ఆ ఐదుగుర్నీ వరుసగా చింతచెట్టు కొమ్మకు వేలాడదీశారు. వారి చేతులకి కట్టిన లావలి తాడు కాలకుండా క్రింద మంటలు పెట్టారు. ఆ మంటల్లో కాలి బ్రాహ్మణులు ప్రాణాలు వదిలారు. మిగతా హిందువులకు గుణపాఠంలా ఉండాలని ఆ శవాలను అలాగే వేలాడదీసి రజాకార్లు వెళ్ళిపోయారు. ఆ బ్రాహ్మణులలో ముగ్గురి నడుములకు ఉన్న వెండి మొలత్రాళ్ళు కాలి వంకర్లు పోయాయి. వాళ్ళకు సంభావనగా లభించిన వెండిరూపాయలు బూడిదలో దొరికాయి. ధోవతులు కాలి శవాలు నల్లగా మసిబారి భయంకరంగా కనపడుతున్న ఆ అమానుషమైన దృశ్యం చూసి ప్రజలు వణికిపోయారు.

రాక్షస రాజ్యం

రజాకార్ల ఈ పైశాచిక కృత్యాలు 1857లో నీల్ చేసిన దురంతాలను మించిపోయాయి. బ్రిటీష్ సైనికాధికారి నీల్ భారతీయుల్ని చెట్లకు వేలాడదీసి ఉరితీసేవాడు. ఫిరంగులకు కట్టి పేల్చేవాడు. కాని ఇలా మంటల్లో కాల్చి భయంకరంగా చంపిన సంఘటనలు లేవు. ఈ రాక్షస కృత్యాలు రజాకార్ల ప్రత్యేకతను నిరూపించాయి. చివరికి రాక్షసులు కూడా ఇలాంటి పనులను ఉహించి చేసేవాళ్ళు కాదేమో! రజాకార్లు, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి రాత్రిపూట గ్రామాలపైబడి దోచుకునేవాళ్ళు.

ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉండేవికావు. ఆడవాళ్ళ ముక్కుపోగులు, చెవుల కమ్మలు లాగి వాళ్ళ ముక్కులు, చెవులు తెగినా లెక్కచేయక దోచుకునేవాళ్ళు. ఆ రక్తసిక్తమైన భూషణాలను మూటలు గట్టి ఎం.ఎన్.రెడ్డి కార్యాలయంలోని టేబుళ్ళ కింద పడవేసేవారు. ఉదయమే అందరూ పంచుకునేవారు. ఈ దోపిడీపట్ల అభ్యంతరం చెప్పినా ప్రయోజనం ఉండేది కాదు. అందువల్ల ఎం.ఎన్.రెడ్డి లాంటి ఉద్యోగులు కుమిలిపోతుండేవారు. హిందువులు ఈ దుష్కృత్యాలను ఖండించినా ప్రభుత్వం తిరుగుబాటు అనే పేరుతో, శాంతిస్థాపన అనే నెపంతో క్రూరంగా హిందువులనే అణచివేస్తుండేది.

(విజయక్రాంతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here