Home News బఘువార్ – మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఆదర్శ గ్రామం

బఘువార్ – మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఆదర్శ గ్రామం

0
SHARE

నిజమైన భారత్ గ్రామాలలో కనిపిస్తుందనేది ఎంత వాస్తవమో నిజమైన ఆదర్శ గ్రామాన్ని గుర్తించడమనేది కష్టం అనేది కూడా అంతే నిజం. మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగపూర్ జిల్లాలోని ఉన్న బఘువార్ గ్రామాన్ని సందర్శిస్తే, అలాంటి ఆదర్శ గ్రామానికి ఉండే లక్షణాల్లో ఏ ఒక్కటీ తక్కువ కాని ఒక గ్రామం మనం గుర్తించవచ్చు. బఘువార్లో మనకు స్పిక్ – స్పాన్ రోడ్లు, భూగర్భ నీటి పారుదల వ్యవస్థ, ప్రతి ఇంట్లో టాయిలెట్, అటలకు ఇండోర్ స్టేడియం, చివరికి వంట గ్యాస్ కోసం “బయోగ్యాస్ ప్లాంట్లు” కూడా నిర్మించుకున్నారు. గ్రామస్తులలో చక్కని సామరస్యం ఉంది. గ్రామంలోని ప్రతి ఒక్క వివాదం వారి సమూహలలోనే పరిష్కరించుకోవటమే కాక, గడచిన అనేక సంవత్సరాలుగా ఎవరూ కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన అవసరం రాలేదు. ఈ గ్రామంలో పాఠశాల, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులలో కొరత ఏర్పడినప్పుడు స్వయంగా  గ్రామస్థులు తమ సొంత డబ్బు చందాగా వేసుకోవడంతో పాటు తమ శ్రమ ద్వారా ఈ నిర్మాణాలను పూర్తి చేసారు.

బఘువార్ అభివృద్ధి ఒక్కరాత్రిలో కార్యరూపం దాల్చలేదు. గత 50 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం శాఖలు, ఆరెస్సెస్ స్వయంసేవకుల నిరంతర కృషి, ప్రయత్నాల ఫలితంగా ఇది సాధ్యపడింది. 50 సంవత్సరాల క్రితం ఠాకూర్ సురేంద్ర సింగ్, ఠాకూర్ సంగ్రామ్ సింగ్, హరిశంకర్ లాల్ తో పాటు, గ్రామానికి చెందిన ఇతర యువకులు తమ గ్రామాన్ని ఆదర్శంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. అప్పటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం సహ సర్ కార్యవాహ శ్రీ భావూరావు దేవరస్ నుండి ప్రేరణ పొందిన వీరు గత 50 సంవత్సరాలుగా నిలకడగా తమ లక్ష్యం కోసం కృషి చేశారు. బఘువార్ గ్రామంలో క్రమం తప్పకుండా నిర్వహించే ప్రభాత్ ఫెరి, ప్రతి ఇంటి గోడలపై వ్రాసి వున్న ప్రేరణాత్మక వాక్యాలు, వర్షపునీటిని సంరక్షించే సదుపాయం వంటివి వారి కృషి ఫలితంగా మనం చూడవచ్చు. ఇవన్నీ బాఘువార్ గ్రామాన్ని మిగతా వారందరి కంటే ఉన్నతంగా నిలిపాయి. గ్రామ సంక్షేమం పట్ల అచంచలమైన ఈ అంకితభావం కారణంగా, ఠాకూర్ సురేంద్ర సింగ్ గత 25 సంవత్సరాలుగా ఈ గ్రామానికి సర్పంచ్ పదవికి పోటీ లేకుండా ఎన్నికవుతున్నారు.

1950 నుండి బాఘువార్ గ్రామ అభివృద్ధి కమిటీ ఊరి సమగ్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోంది. బాఘువార్ కు చేరుకునే మూడు కిలోమీటర్ల పొడవైన రహదారిని గ్రామంలోని యువత స్వయంగా నిర్మించారు. వ్యవసాయ నిపుణులు, ఆరెస్సెస్ స్వయంసేవక్, బాఘువార్ నివాసి శ్రీ ఎం. పి.నరోలియా మాట్లాడుతూ తన గ్రామం  అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఏ మాత్రం ఆధారపడలేదని తెలియజేశారు. గ్రామస్తులు పాఠశాల భవనం పూర్తి చేయడానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు అదనంగా మరో 1.5 లక్షలు తామే సమకూర్చుకున్నామని వివరించారు. అంతే కాకుండా భ్రామరి నది మీదుగా స్టాప్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మరో 2.5 లక్షలు సహాయం కూడా తామే అందించారన్నారు. స్టాప్ డ్యామ్ నిర్మాణం కారణంగా వ్యవసాయ పనులకు సంబంధించి వ్యవసాయానికి గల నీటి కొరత సమస్యను పరిష్కరించింది. 

వీధులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భనీటి పారుదల వ్యవస్థ, చెట్లను నాటడం,వర్షపు నీటి సంరక్షణ అనేవి ప్రతి బఘువార్ నివాసికి ఒక అలవాటుగా మారింది.

సంపూర్ణ అక్షరాస్యత, ప్రతి ఇంటి గోడలపై రాసి ఉంచిన ప్రేరణాత్మక వాక్యాలు మనసుపై గాఢమైన ముద్రను వేస్తాయి. గ్రామంలో నలభై శాతం ఇళ్లలో గోబర్-గ్యాస్ వంట కోసం ఇంధనంగా ఉపయోగించబడుతోంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి, విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు నిష్పత్తిని అధికంగా ఉంచడానికి, గ్రామ కమిటీ సభ్యులు వినూత్న ఆలోచనలను ఉపయోగిస్తున్నారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, శిశు మందిర్ మాజీ ప్రిన్సిపాల్, మాజీ వ్యవసాయ డైరెక్టర్ శ్రీ నారాయణ్ ప్రసాద్ నరోలియా ఈ పాఠశాలలో బోదించడానికి తన సమయాన్ని కేటాయించారు. ఇదే పాఠశాల పూర్వవిద్యార్థి శ్రీ అవధేష్ శర్మ భారత సైన్యంలో లెఫ్టినెంట్ అయ్యారు. కొంతమంది మునుపటి విద్యార్థులు వైద్యులు కాగా, ముగ్గురు పూర్వ విద్యార్థులు డాక్టరేట్ పట్టాను పొందారు. నర్సింగ్‌పూర్ కలెక్టర్‌గా ఉన్న శ్రీ మనీష్ సింగ్ ను ఈ గ్రామం ఎంతగానో ఆకట్టుకున్నది. అతను సివిల్స్ చదువుతున్న వారిని పరీక్షలకు ముందు ఈ గ్రామాన్ని సందర్శించాలని ప్రేరేపించాడు. అప్పటి నుండి చాలా మంది విద్యార్థులు చాలా గ్రామాలకు రోల్ మోడల్ అయిన బఘువార్ ను సందర్శిస్తున్నారు.

మూలం: సేవాగాథ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here