Home News బీమా-కోరేగావ్ హింస వెనుక కుట్ర ఉంది – ముంబై హై కోర్ట్

బీమా-కోరేగావ్ హింస వెనుక కుట్ర ఉంది – ముంబై హై కోర్ట్

0
SHARE
తనపై ఆరోపణలు కొట్టివేయాలన్న ప్రొ. ఆనంద్ తెల్తుంబ్డే పిటిషన్ తిరస్కరించిన కోర్ట్

ఎల్గార్ పరిషద్ – బీమా కోరేగావ్ సంఘటనల వెనుక లోతైన కుట్ర ఉందని, దీని దుష్పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని ముంబై హైకోర్ట్ ఒక తీర్పులో పేర్కొంది. తనపై పోలీసులు మోపిన అభియోగాలను కొట్టివేసి, మొత్తం కోరేగావ్ కేసును తిరస్కరించాలంటు ప్రొ. ఆనంద్ తెల్తుంబ్డే దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. బీమా కోరేగావ్ కేసు దర్యాప్తు చేసిన పూనా పోలీసులు పలువురు న్యాయవాదులు, ఉద్యమకారులకు నిషేధిత సి పి ఐ (మావోయిస్ట్)పార్టీతో సంబంధాలు ఉన్నాయని కోర్ట్ కు తెలియజేశారు.

జస్టిస్ బిపి ధర్మాధికారి, జస్టిస్ ఎస్వీ కొత్వాల్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను పరిశీలించింది. పిటిషన్ ను కొట్టివేసిన బెంచ్ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించడానికి మూడు వారాల గడువును మాత్రం ఇచ్చింది. తనపై పోలీసులు మోపిన అభియోగాలు పూర్తిగా నిరాధారమైనవని వాటిని కొట్టివేయాలని ప్రొ. ఆనంద్ కోర్ట్ ను కోరారు. ప్రొ.ఆనంద్ పిటిషన్ ను పరిశీలించిన బెంచ్ ఆయనకు వ్యతిరేకంగా తగినంత ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

కోరేగావ్ కేసులో పోలీసులు జరిపిన దర్యాప్తు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కోర్ట్ తెల్తుంబ్దేకు వ్యతిరేకంగా పోలీసుల దగ్గర తగినన్ని సాక్ష్యాధారాలు, సమాచారం ఉందని, కనుక అతనిపై చేసిన ఆరోపణలు ఆధార రహితం కాదని కోర్ట్ పేర్కొంది. కేవలం ఒక నిషేధిత సంస్థలో సభ్యుడైనంత మాత్రాన నేరం చేసినట్లు కాదని గతంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ తెల్తుంబ్డే తరఫు న్యాయవాదులు మిహిర్ దేశాయి, విజయ్ హీరేమఠ్ చేసిన వాదనను హైకోర్ట్ బెంచ్ తిరస్కరించింది.

“ప్రస్తుత కేసులో పిటిషనర్ (తెల్తుంబ్డే)కు వ్యతిరేకంగా పోలీసులు నమోదు చేసిన అభియోగాలు అతను నిషేధిత సంస్థ సభ్యుడన్న విషయాన్ని దాటి వెళుతున్నాయి. అతని కార్యకలాపాల గురించి పోలీసులు తగినంత సమాచారం సేకరించారు’’ అని బెంచ్ స్పష్టం చేసింది.

తెల్తుంబ్డే పిటిషన్ ను వ్యతిరేకిస్తూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ కామత్ పాయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు పరస్పరం వ్రాసుకున్న ఐదు ఉత్తరాలను కోర్ట్ ముందు ఉంచారు. వాటిలో తెల్తుంబ్డే ను క్రియాశీల సభ్యుడిగా పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణను తిరస్కరిస్తూ తెల్తుంబ్డే తరఫు న్యాయవాదులు ఆ ఉత్తరాలలో ఆనంద్ అని, కామ్రేడ్ ఆనంద్ అంటూ పేర్కొన్నది పిటిషనరైన ప్రొ. ఆనంద్ అనడానికి ఆధారాలు లేవని వాదించారు.

అయితే తమకు మాత్రమే పోలీసులు అందించిన సమాచారాన్ని పరిశీలిస్తే వారి దగ్గర ఆనంద్, కామ్రేడ్ ఆనంద్ అంటే తెల్తుంబ్డే అని నిరూపించడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని కోర్ట్ పేర్కొంది.

గత సంవత్సరం డిసెంబర్ 31న ఎల్గార్ పరిషద్ సభలో అనేకమంది చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలవల్లనే మర్నాడు బీమా కోరేగావ్ వద్ద హింస చెలరేగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఎల్గార్ పరిషద్ కు మావోయిస్ట్ లు నిధులతోపాటు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తున్నారని పోలీసులు ఆరోపించారు.

Source: VSK Bharat