Home Telugu Articles పౌరసత్వ సవరణ చట్టం (CAA): అపోహలు – దుష్ప్రచారం – వాస్తవాలు

పౌరసత్వ సవరణ చట్టం (CAA): అపోహలు – దుష్ప్రచారం – వాస్తవాలు

0
SHARE

పౌరసత్వ సవరణ చట్టం (CAA) గురించి ఇప్పుడు సర్వత్ర చర్చ జరుగుతోంది. దేశంలోని కొన్ని చోట్ల ఈ చట్టానికి వ్యతిరేకంగా, మద్దతుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లింలకు వ్యతిరేకమని కొందరు అంటూంటే అవన్నీ కేవలం అపోహలని చాలామంది సమాధానమిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు? ఏమిటి?

దేశవిభజనే మూలం
1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిందికానీ దేశం ముక్కలైంది కూడా. విభజనను ఎట్టి పరిస్థితిలోను ఒప్పుకునేదిలేదన్న కాంగ్రెస్ నాయకులంతా చివరికి ముస్లిం లీగ్ మొండి పట్టుదలకు తలవంచారు. దానితో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ లు ఏర్పడ్డాయి. రాత్రికిరాత్రి లక్షలాది మంది హిందువులకు భారత్ పరాయి దేశమైపోయింది. తాముంటున్న దేశంలో వారు మైనారిటీలుగా మారారు. అనేకమంది భారత్ కు తరలి వచ్చేశారు. కానీ కొంతమంది అక్కడే ఉండిపోయారు. అలాంటి వారందరికి రక్షణ కల్పించడమేకాక సుఖశాంతులతో కూడిన జీవనాన్ని కలిగించడం తమ బాధ్యత అంటూ గాంధీజీ, నెహ్రూ వంటి నాయకులు గట్టిగానే చెప్పారు.

  • 15 ఆగస్ట్, 1947న ఇచ్చిన తన ఉపన్యాసంలో జవహర్ లాల్ నెహ్రూ “రాజకీయ సరిహద్దుల మూలంగా మన నుండి వేరుపడిపోయిన మన సోదరసోదరీమణులు ఈ సంతోష సమయాన్ని మనతో పంచుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పటికీ మనవాళ్లే. వారి బాగోగులు ఎప్పటికీ మనవే…’’ అని అన్నారు.
  • 15 నవంబర్, 1950లో పార్లమెంట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనే “విభజన సమయంలో ఇక్కడికి వచ్చిన వారందరికి పౌరసత్వం ఇవ్వాల్సిందే. అందుకు చట్టపరమైన అడ్డంకులు ఏవైనా ఉంటే చట్టాన్ని సవరించవలసిందే.’’ అని గట్టిగా నొక్కివక్కాణించారు.
  • 26 సెప్టెంబర్, 1947న మహాత్మా గాంధీ కూడా ఇలా అన్నారు“పాకిస్థాన్ లో నివశిస్తున్న హిందువులు, సిక్కులకు అక్కడ సుఖంగా, శాంతిగా జీవించడానికి తగిన పరిస్థితులు లేవనిపిస్తే వారు వెంటనే నిరభ్యంతరంగా భారత్ కు రావచ్చును. అలాంటివారిని భారత్ తప్పక ఆహ్వానించాలి..’’

తూర్పు బెంగాల్ శరణార్ధులను ఉద్దేశించి మాట్లాడిన అప్పటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ “దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అనేక త్యాగాలు చేసిన మన తోటివాళ్లు కేవలం భౌగోళికమైన సరిహద్దులు మారీనందువల్ల హఠాత్తుగా విదేశస్థులు అయిపోరు. ఈ విషయాన్ని మనం మరచిపోరాదు’’ అని చెప్పారు.

25 నవంబర్, 1947న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తీర్మానంలో ఇలా పేర్కొన్నారు – “తమ మాన ప్రాణాలు, గౌరవాన్ని కాపాడుకునేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులందరికి భద్రత కల్పించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. వీరేకాదు ఇకముందు వచ్చేవారికి కూడా ఆశ్రయం కల్పించాలి.’’

Please Like & Follow VSK Telangana on Facebook – Click this link

నెహ్రూ – లియకత్ అలీ ఒప్పందం
తమ దేశాల్లోని మైనారిటీ వర్గానికి రక్షణ కల్పించాలని భారత్, పాకిస్థాన్ ల మధ్య ఒప్పందం జరిగింది. భారత ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాకత్ అలీలు 1950 ఏప్రిల్ లో ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. దాని ప్రకారం :

  • శరణార్ధులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు
  • ఎత్తుకుపోయిన స్త్రీలను, దోచుకున్న సొత్తును తిరిగి ఇచ్చివేయాలి
  • బలవంతపు మతమార్పిడులకు గుర్తింపు ఇవ్వరాదు
  • మైనారిటీల హక్కులను కాపాడాలి

ఇలా ఒప్పందం కుదిరినా పాకిస్థాన్ మాత్రం దానికి విరుద్ధంగానే వ్యవహరించింది. తమ దగ్గర ఉన్న దళితులను భారత్ కు వెళ్లకుండా అడ్డుకుంది. “వాళ్ళు వెళ్లిపోతే కరాచీలో వీధులు, మూత్రశాలలు ఎవరు శుభ్రం చేస్తారు?’’ అని ప్రధాని లియాకత్ అలీ భారత హై కమిషనర్ ను ప్రశ్నించాడు.

సమాచార భారతి యూట్యూబ్ ఛానెల్ subscribe చేసుకునేందుకు క్లిక్ చేయండి 

మైనారిటీలపై మారణకాండ
ఇస్లామిక్ ఛాందసవాదం పెరగడం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఇస్లామిక్ రిపబ్లిక్ లుగా ప్రకటించడంతో ఆ రెండు దేశాల్లో మైనారిటీలపై దాడులు, అణచివేత పెరిగిపోయాయి. బలవంతపు మతమార్పిడులు, మైనర్ బాలికల అపహరణ, ప్రార్ధనామందిరాల విధ్వంసం, మత దూషణకు పాల్పడ్డారంటూ దాడి చేసి చంపివేయడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. ముస్లిమేతరుల జీవితాలు దుర్భరంగా మారాయి. వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 1947లో పాకిస్థాన్ ఏర్పడేనాటికి అక్కడ హిందువుల సంఖ్య మొత్తం జనాభాలో 15శాతం. కానీ 1998 వచ్చేనాటికి ఈ సంఖ్య 1.6 శాతానికి పడిపోయింది. 1951లో బంగ్లాదేశ్ లో ముస్లిమేతరుల జనాభా 22శాతం. అది 2011నాటికి 9.5శాతానికి తరిగిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇదే పరిస్తితి. 1970నాటికి అక్కడ ముస్లిమేతరుల సంఖ్య 7.7లక్షలుంటే 2017నాటికి కేవలం 7వేల మంది మాత్రమే మిగిలారు. విపరీతమైన అణచివేతకు గురైన హిందువులు పెద్ద సంఖ్యలో భారత్ కు తరలివచ్చారు. అలా పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్ధుల్లో ఎక్కువ శాతం దళితులే.

ఆశ్రయం ఇవ్వాలన్నవారే మాట మార్చారు
ఇలా శరణార్ధులుగా వచ్చిన, వస్తున్న ముస్లిమేతరులకు, ముఖ్యంగా హిందువులకు ఆశ్రయం కల్పించడం భారత్ కనీస బాధ్యత అయింది. కాంగ్రెస్ కు చెందిన నేతలు ఈ విషయాన్ని అనేకసార్లు అంగీకరించారు కూడా. 18 డిసెంబర్, 2003లో రాజ్యసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ ఈ శరణార్ధులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వాన్ని ఇవ్వాలంటూ అప్పటి ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరారు.

ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్ధించి దేశ విభజనకు కారణమైన కమ్యూనిస్టులు కూడా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ముస్లిమేతరుల అణచివేతను చూసి చలించిపోయారు. మే 22, 2012న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఒక లేఖ వ్రాస్తూ సి పి ఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ మతపరమైన అణచివేతకు గురై బంగ్లాదేశ్ నుంచి తరలివచ్చిన లక్షలాదిమంది శరణార్ధులకు ఆశ్రయం కల్పించాలని, పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు చెందిన నామశూద్రులు, పొంద్రఖత్రియ, మాఝి మొదలైన వారికి వెంటనే రక్షణ కల్పించాలని కోరారు.

ఇలా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో వివక్షకు గురవుతున్న ముస్లిమేతరులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వం ఇవ్వాలని కోరిన ఈ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలే ప్రస్తుతం అందుకు వీలుకల్పించే విధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని తెస్తే గగ్గోలు పెట్టడం విచిత్రం. అది రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లిం వ్యతిరేకమని, మానవహక్కులకు వ్యతిరేకమంటూ నానా రాద్ధాంతం చేస్తున్నాయి. వీటి వైఖరి మూలంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో అల్లర్లు, హింస చెలరేగాయి కూడా. ఇంతకీ చట్టంలో ఏముంది?

1). పౌరసత్వ సవరణ చట్టం (CAA)
31 డిసెంబర్, 2014కు ముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని హిందూ, సిఖ్, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవ వర్గాలకి చెందిన వారెవరైనా భారత్ లో ప్రవేశించి ఉంటే వారిని ఈ చట్టం ప్రకారం అక్రమ చొరబాటుదారులుగా పరిగణించరు.

2) 1955 పౌరసత్వ చట్టాన్ని ఎందుకు సవరించారు?
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ల రాజ్యాంగం ప్రకారం ఇస్లాం ఆ దేశాల అధికారిక మతం. అందువల్లనే ఆ దేశాల్లో హిందువులు, సిఖ్, బౌద్ధ, జైన్, పార్శీ, క్రైస్తవ మతస్తులపై మతం పేరుతో అత్యాచారాలు సాగుతున్నాయి. మైనారిటీ వర్గానికి చెందినవారికి తమ మత సాంప్రదాయాలను అనుసరించే, ఆచరించే ప్రాధమిక హక్కు కూడా లేకుండా పోయింది. దానితో చాలామంది ఆ దేశాల నుంచి పారిపోయి భారత్ కు వచ్చేశారు. వారిలో చాలామంది దగ్గర సరైన గుర్తింపు పత్రాలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా వాటి కాలవ్యవధి ఎప్పుడో పూర్తైపోయింది. ఇలాంటివారికి సరైన గుర్తింపు ఇవ్వడం కోసం 1955 చట్టానికి సవరణ చేయవలసి వచ్చింది.

3) విదేశస్థులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి ప్రత్యేకమైన చట్టం ఇప్పటికే ఉండగా ఈ మూడు దేశాల శరణార్ధుల కోసం ప్రత్యేక సవరణ ఎందుకు?
31 డిసెంబర్, 2014 ముందువరకు ఇక్కడకు వచ్చిన శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ ప్రత్యేక సవరణ అవసరమైంది. ఈ సవరణల మూలంగా కేంద్ర ప్రభుత్వం వీరికి గుర్తింపు పత్రాలు అందించే వీలు కలుగుతుంది. చాలామంది శరణార్ధులు ఎంతోకాలం క్రితమే ఇక్కడికి వచ్చారు కాబట్టి వారికి పరిచ్ఛేదం 5 ప్రకారం వెంటనే పౌరసత్వం ఇవ్వడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది.

4) భారత పౌరసత్వం లభించాలంటే ఈ శరణార్ధులు ఇక్కడకు వచ్చి ఎంతకాలం పూర్తైఉండాలి?
పేర్కొన్న మూడు దేశాలకు చెందిన ఈ మైనారిటీ వర్గాలకు చెందినవారు కనీసం ఐదు సంవత్సరాలు(ఇది ఇంతకు ముందు 11 సంవత్సరాలుగా ఉండేది) భారత్ లో ఉంటున్నట్లు చూపగలిగితే దేశీయకరణ ప్రక్రియ ప్రకారం వారికి ఈ దేశ పౌరసత్వం లభిస్తుంది.

5) ప్రభుత్వం తెస్తున్న చట్ట సవరణలు ముస్లిం వ్యతిరేకమైనవా?
కాదు. ఇవి కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలోని మైనారిటీ వర్గానికి చెందినవారికి సంబంధించినవి మాత్రమే. ఈ సవరణలకు ప్రస్తుతం భారత్ లో ఉంటున్న ముస్లిం లుగానీ, మరే పౌరులకుగాని ఎలాంటి సంబంధం లేదు. మూడు దేశాలలో ఇస్లాం అధికారిక మతం కాబట్టి ఆయా దేశాలకు సంబంధించిన ముస్లింలను ఈ జాబితాలో చేర్చలేదు. ఎందుకంటే ఇస్లామిక్ దేశంలో ముస్లింలపై అణచివేత, అత్యాచారాలు జరిగే అవకాశం లేదు.

6) పౌరసత్వ సవరణ బిల్లు, 2019 భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందా?
ఈ విషయంలో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఇలా చెప్పారు -“ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. అలాగే కొందరు చెపుతున్నట్లుగా అధికరణం 14,15 లను అతిక్రమించడం లేదు. దేశీయకరణ లేదా పౌరసత్వ గుర్తింపు ఇవ్వడంలో మూడు దేశాలలో అణచివేతకు గురైన మైనారిటీ వర్గానికి చెందినవారికి కలిగిస్తున్న ప్రత్యేక సదుపాయం, హోదా మాత్రమే. దీనికి ఇతర వర్గానికి చెందినవారి దేశీయకరణ లేదా పౌరసత్వ మంజూరు ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సవరణలు అధికరణం 14ను ఏమాత్రం ఉల్లంఘించడం లేదు.’’

పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం దేశాలుగా గుర్తింపు పొందిన మూడు దేశాలలోని మతపరమైన అణచివేతకు గురైన మైనారిటీ వర్గానికి చెందినవారికి మాత్రమే ఉద్దేశించినది. ఆయా దేశాల్లో అధికసంఖ్యాకులు(ముస్లింలు) మతపరమైన అణచివేతకు గురయ్యే అవకాశం లేదుకాబట్టి వారిని ఇందులో చేర్చలేదు. అలాగే ఈ చట్టం రాజకీయ, ఆర్ధిక శరణార్ధులకు సంబంధించినది కూడా కాదు. అందువల్ల కూడా ముస్లింలకు ఇందులో స్థానం కల్పించలేదు.

ఆరోపణలు అర్ధరహితం
కాబట్టి పై విషయాలను పరిశీలిస్తే పౌరసత్వ సవరణ చట్టం కేవలం కొందరికి కొత్తగా పౌరసత్వాన్ని కల్పించడానికి ఉద్దేశించినదేగాని ఎవరి పౌరసత్వాన్ని రద్దుచేయడం కోసం కాదని అర్ధమవుతుంది. అలాగే ఈ చట్టానికి, జాతీయ పౌర పట్టిక (NRC)కు సంబంధం లేదని కూడా తెలుస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం అసోమ్ లో మాత్రమే జాతీయ పౌర పట్టిక ప్రక్రియను పూర్తిచేసింది. మిగిలిన దేశానికి సంబంధించి విధివిధానాలు ఇంకా రూపొందించలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే CAA , NRCల గురించి విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, చేస్తున్న ఆందోళన అర్ధరహితమైనవని స్పష్టమవుతుంది.

మరిన్ని వార్తల కోసం సమాచార భారతి ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here