Home News కమ్యూనిస్టు విప్లవాలు ఎందుకు విఫలమయ్యాయో ఒక శాస్త్ర్ర్రీయ వివరణ

కమ్యూనిస్టు విప్లవాలు ఎందుకు విఫలమయ్యాయో ఒక శాస్త్ర్ర్రీయ వివరణ

0
SHARE

“మరో ప్రపంచం” పై సామాన్యులకు ముఖ్యంగా యువతకు కొంత స్పష్టత ఇస్తే బాగుంటుంది అనిపించింది. రాజకీయ, సామాజిక వ్యవస్థలు ఎలా రూపాంతరం చెందుతాయో చూపెట్టడానికి మార్క్స్‌ గతితార్కిక భౌతికవాదం లేదా చారిత్రక భౌతికవాదాన్ని ప్రతిపాదించి, పుట్టుక వంశం ఆధారంగా నడుస్తున్న రాచరిక, కులీన రాజ్యవ్యవస్థ నుండి సామర్థ్యం, పెట్టుబడి ఆధారమైన క్యాపిటలిస్ట్‌ (పెట్టుబడిదారి) వ్యవస్థ ఉద్భవించిందనీ, దీని ఆధారంగానే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయనీ, దానిలో ఉన్న శ్రమదోపిడీ, సంపద కేంద్రీకరణ వంటి వైరుధ్యాల వలన పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరగబడి శ్రామికులే ఉత్పత్తి సాధనాలను, తద్వారా రాజ్యపాలనను చేజిక్కించుకుంటారనీ సూత్రీకరించారు. దోపిడీకి గురైన వారే యజమానులు, పాలకులు అవుతారు కాబట్టి ఇక దోపిడీ ఉండదనీ, దోపిడీలేనప్పుడు యుద్ధాలు కూడా ఉండవు, ఇవి లేనప్పుడు ఇక ప్రభుత్వం అవసరం ఉండదు. కాబట్టి ప్రభుత్వం క్రమేపీ లేకుండా పోతుంది(whither away) అని, ప్రభుత్వాల అజమాయిషీలులేని ‘అనార్కీ’ ఏర్పడుతుందని సూత్రీకరించారు.

మార్క్స్‌ అసలు తన గతితార్కిక భౌతిక వాదాన్ని (dielectic materialism) హెగెల్‌ డయలెక్టిక్స్‌ నుండి తీసుకొని దాన్ని అప్పటి వరకు జరిగిన చరిత్రకు ఆపాదించి (apply) భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు హెగెల్‌ గతి తార్కికవాదం ‘ఎంటో చూద్దాం. రాజ్యం కాని, సమాజంకాని, కుటుంబంకాని, సంస్థలు కాని సవ్యంగా నడవడానికి సానుకూలమైన పద్ధతులతో వ్యవస్థ నిర్మిస్తాము. అయినప్పటికీ ప్రతి వ్యవస్థలో అంతర్గత వైరుద్ధ్యాలు దాని నిర్మాణంలోనే ఉంటాయి. మొదట దాని నిర్మాణంలోని బలాలపై నడిచిన వ్యవస్థను క్రమంగా అందులోని వైరుద్ధ్యాలే పెరిగి పెద్దవై కూలదోస్తాయి. ఇప్పుడు ఇంకో కొత్త వ్యవస్థ పాతదానికంటే మెరుగైన వ్యవస్థ ఏర్పడుతుంది. కాని దానిలో కూడా అంతర్గత వైరుధ్యాలు ఉంటాయి. అవి మళ్ళీ క్రమేణా పెరిగి, ఉన్న వ్యవస్థలోని లోపాలను, వైరుధ్యాలను తొలగించి అంతకంటే ఉత్తమమైన వ్యవస్థను దాని స్థానంలోకి తెస్తుంది.

అయితే ‘మెరుగైన వ్యవస్థ’ అన్న పదం చూసి మోసపోకండి. అది అంతకు ముందు వ్యవస్థలోని వైరుధ్యాలు, లోపాలకు సంబంధించినంత వరకు మాత్రమే. ఆ వైరుధ్యాలకు జవాబు లేదా పరిష్కారం కొత్త వ్యవస్థలో ఉండి ఉత్తమంగా అనిపిస్తుందే కాని ప్రామాణికంగా కాదు. ముందు దానికంటే ఎక్కువ వైరుధ్యాలు, లోపాలు కూడా ఉండవచ్చు. ఇది నిరంతరం, నిర్విరామం, విశ్వజనీనం.

ఈ వైరుధ్యాలేమిటో ఉదాహరణ చూద్దాం. రాచరికం కంటే మెరుగైనదని ప్రజాస్వామ్యాన్ని తెచ్చాం. మనకు మనమే పరిపాలించుకోవటం కంటే మంచి వ్యవస్థ ఇంకేముంటుంది. కాని ఇందులో ఉండే ఒక వైరుధ్యం ఇంతమంది అభిప్రాయాలతో ఏ పనీ జరగదు కాబట్టి ప్రతినిధులను పెట్టుకున్నాము. అయితే వాళ్ళు అవినీతితో తక్కువ శాతం ఓట్లతో కూడా గెలుస్తున్నారని, proportionate representation (ఎంత శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు) అప్పుడు ఒక శాతం ఓటు వచ్చినా కొన్ని సీట్లు వస్తాయి కాబట్టి అనేక పార్టీలు ఏర్పడి, సీట్లు సంపాదించి, నెలకొక ప్రభుత్వం కూలుతుంది. మనం అనుకున్న సమస్యకు పరిష్కారం వస్తుంది కాని అందులో వేరే సమస్యలు, కొన్నిసార్లు ఇంకా పెద్దసమస్యలు వస్తాయి. దీనినే మనం ఉమ్మడి కుటుంబాలకు, వివాహ వ్యవస్థకు, ఇంకా దేనికైనా అనువదించుకొని చూడవచ్చు.

ఏ వ్యవస్థలోనైనా వైరుధ్యాలు తప్పవు, మార్పుతప్పదు. వైరుధ్యాలను సవరించుకోవటానికి, తగిన మార్పులు చేసుకొనే వీలు ఉన్న వ్యవస్థలు ఎక్కువ కాలం ఉంటాయి. అవి కూడా వైరుధ్యాలను సవరించుకోలేని స్థితికి అంటే ఉన్న వ్యవస్థలో వాటికి పరిష్కారాలు లేని స్థితికి ఎప్పుడో ఒకప్పుడు చేరుకుంటాయి. అప్పుడు వ్యవస్థ కూలదోయబడుతుంది. వైరుధ్యాలను సవరించుకొనే వీలులేని రిజిడ్‌ వ్యవస్థలు చాలా త్వరగా కూలిపోతాయి. (రష్యా, చైనాల్లోని – కొందరు అను కుంటున్న సామ్యవాద వ్యవస్థలు వంటివి). అంతే కాని మన ప్రవక్త పవిత్రగ్రంథం రాశాడనీ, ఈ విశ్వజనీన నిరంతర సృష్టిచలనం ఆగదు. పర్‌ఫెక్షన్‌ అనేది, శాశ్వతత్వమనేది కేవలం మిధ్య, దాన్ని నమ్మటమంటే మానవ మేథస్సును, మనుషులలోని వైవిధ్యాన్ని, సృజనాత్మకతను, మనిషి సైకాలజీని, ఏమాత్రం అర్థం చేసుకోలేదని అనుకోవాలి.

హెగెల్‌ గతితార్కిక వాదాన్ని (డైలెక్టిక్స్‌ను) మార్క్స్‌ చరిత్రలో జరిగిన కేవలం రెండు స్టెప్స్‌కు అప్లై చేశాడు. భవిష్యత్‌లో మరో రెండు స్టెప్స్‌కు ప్రతిపాదించాడు. రాచరికం నుండి క్యాపిటలిజం. క్యాపిటలిజం నుండి సోషలిజం దాని నుండి అనార్కిజం.

మార్పు మాత్రమే శాశ్వతం. ఈ మార్పు ఎంత సహజంగా వచ్చిందో, ఆ మార్పు ద్వారా వచ్చిన వ్యవస్థను నిలబెట్టడానికి ఎంత తక్కువ శక్తి (force) అవసరం అవుతుందో, అంత ఎక్కువ కాలం ఆ వ్యవస్థ నిలబడే అవకాశం ఉంది. బల ప్రయోగంతో మార్పువచ్చి, అది నిలబెట్టడానికి అధిక శక్తిని ఉపయోగించవలసి వస్తే ఆ వ్యవస్థ తక్కువ కాలంలోనే కూలిపోతుంది. (రష్యా, చైనా వంటి దేశాలలో వచ్చిన కమ్యూనిస్టు విప్లవాల లాగా). ఇవి నిజమైన కమ్యూనిస్టు విప్లవాలు కావు. మార్క్స్‌ సిద్ధాంతం ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా ముదిరిపోయాక చిన్న పెట్టుబడిదారులను, పెద్ద పెట్టుబడిదారులు మింగి చివరికి అతి కొద్దిమంది (handful) పెట్టుబడిదారులు, మిగతా ప్రపంచం (సమాజం) అంతా శ్రామికులే మిగిలి రెండు వర్గాలే ఏర్పడిన స్థితిలో రెండవ వర్గం వారు మొదటి వారిని తప్పించి (శాంతియుతంగానే) ఉత్పత్తి సాధనాలను చేజిక్కించుకొని తద్వారా రాజ్యాధికారాన్ని కూడా పొందుతారు.

20వ శతాబ్ధంలో వచ్చిన విప్లవాలు ఏవీ మార్క్స్‌ ఊహించినవి కావు. ఆ దేశాలలో క్యాపిటలిస్టు వ్యవస్థ అప్పటికి ఇంకా ఏర్పడలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా ముదిరి, కుళ్ళి అందులోని అంతర్గత వైరుధ్యాలు, లోపాలు, వికృతులు బయటికి వచ్చాక వాటికి పరిష్కారాలతో కొత్త వ్యవస్థ ఆవిర్భవించాలి. పూర్తి వైరుధ్యాలు రాకముందే వచ్చిన బలవంతపు మార్పు పూర్తి పరిష్కారాలు లేకుండానే వచ్చింది. కాబట్టి అప్పటికింకా సానుకూల దశలో (లాభాల)నే ఉన్న క్యాపిటలిజం, దాన్ని మింగివేయగలిగింది.

ఐతే మార్కిస్టు అభిమానులు ఒక స్వాంతన ఏమిటంటే గత శతాబ్ధంలోని వైఫల్యాలు ఎలా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో సామ్యవాద సమాజం రాకూడదని రూలేదీ లేదు. భవిష్యత్తులో ఏర్పడబోయే వ్యవస్థలలోని వైరుధ్యాలు ఎటువంటివి, వాటికి పరిష్కారాలు సామ్యవాదంలో ఉంటాయా అన్నదాన్ని బట్టి ఉంటుంది. అంటే సామ్యవాదమే పరిష్కారం కాగల వైరుధ్యాలు వ్యవస్థలో ఏర్పడితే అప్పుడు సామ్యవాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాని అది శాశ్వతం అనుకోవటం వెర్రితనం.

కులీన రాచరిక వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాలు నడిచింది. దాని తరువాతి క్యాపిటలిజానికి రెండు వందల ఏళ్ళే. దానిలో మార్క్స్‌ ఊహించిన వర్గాలు, వర్గపోరాటాలు కాకుండా ఒక సంక్లిష్ట వ్యవస్థ ఏర్పడి ఉంది ప్రస్తుతానికి. వ్యవస్థ మారి పోవాలంటే వర్గ పోరాటం రావాలి. శక్తుల పునరేకీకరణ జరగాలి. (polarisation). ఉదాహరణకు ఇప్పటికే కొంత కాలంగా ఉద్యోగ కల్పనలేని అభివృద్ధిని చూస్తున్నాము. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆటోమేషన్‌, కృత్రిమ మేధస్సు వంటి మార్పుల వలన పరిశ్రమలలో, ఆఫీసులు, సేవలు, కంప్యూటర్‌ రంగంలో కూడా ఉద్యోగుల అవసరం బాగా తగ్గిపోవచ్చు. దాంతో గ్లోబల్‌ కార్పోరేట్లకు విపరీతమైన లాభాలు వచ్చి ప్రపంచమంతా నిరుద్యోగులు ఏర్పడవచ్చు. దాని చివరి మెట్టులో శ్రామిక విప్లవం బదులు, నిరుద్యోగ విప్లవం వచ్చి ఆటోమేషన్‌లు లేని వ్యవస్థ కాని, మరేదైనా వ్యవస్థ నిర్మించబడవచ్చు. అయితే ఈ మార్పులు పర్యవసానాల్ని తట్టుకొనే శక్తి క్యాపిటలిస్టు వ్యవస్థకు ఉన్నా ఉండవచ్చు. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో లక్షలాది మంది ఉద్యోగాలు పోతాయని అనుకొన్నాము. కాని లక్షలాదిమంది కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఐతే ఈ మజిలీ కాకపోతే ఇంకో మజిలీలో క్యాపిటలిస్టు వ్యవస్థ కూడా కూలిపోవడం తథ్యం.

సో ఆల్‌ద బెస్ట్‌ టు మార్కిస్ట్స్‌. మన మరోప్రపంచం ఏదో ఒకనాటికి రానూవచ్చు. అది కొంతకాలం ఉండనూవచ్చు. కాని ఏ వ్యవస్థ శాశ్వతమని కాని, అన్ని సమస్యలకు చివరి పరిష్కారమని కాని ఎప్పుడూ అనుకోవద్దు. అది పూర్తిగా అశాస్త్రీయం.

-లక్కినేని ప్రసాద్‌ (ప్రముఖ విద్యావేత్త)

(9985027575)

lakkineniprasad@gmail.com