Home News రోహింగియాల కదలికలను కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన

రోహింగియాల కదలికలను కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన

0
SHARE
Representative Image

రోహింగియా అక్రమ ప్రవేశకులు తమ ‘శిబిరాల’ పరిధి నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరం వ్రాయడం సముచితమైన పరిణామం. బర్మాలో తమపై దాడులు జరుగుతున్నాయన్న సాకుతో వేల సంఖ్యలో మన దేశంలోకి వచ్చిపడిన ‘రోహింగియా’లు మన అంతర్గత భద్రతను దెబ్బతీస్తుండడం కేంద్ర ప్రభుత్వం ఇలా ‘ఉత్తరం’ వ్రాయడానికి దారితీసిన విపరిణామం. మన దేశంలో ‘శరణార్థుల’ వలె నటిస్తున్న రోహింగియాలలో అందరూ సజ్జనులు కాదన్నది గత కొన్ని ఏళ్లుగా నిర్ధారణ జరిగిన వాస్తవం. ‘రోహింగియా’లలో అనేకమందిని పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థ ‘ఐఎస్‌ఐ’- ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్- జిహాదీ బీభత్సకారులుగా తీర్చిదిద్దింది. ‘తాలిబన్’ ‘లష్కర్ ఏ తయ్యబా’ ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’-ఐఎస్‌ఐఎస్- వంటి జిహాదీ బీభత్స సంస్థలు మన దేశంలో ‘రోహింగియా’లను మచ్చిక చేసుకున్నట్టు గత రెండు మూడేళ్లుగా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ జిహాదీ ముఠాల పేర్లు వేఱువేఱు అయినప్పటికీ ఇవన్నీ ఏకోన్ముఖ లక్ష్యంతో పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. ఈ లక్ష్యం మన దేశాన్ని బద్దలుకొట్టడం. ఈ ముఠాలను పాకిస్తాన్ ‘ఐఎస్‌ఐ’ అనుసంధానం చేసింది, చేస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ విభాగం ‘ఐఎస్‌ఐ’. పాకిస్తానీ జిహాదీ బీభత్సకారులను ‘ఐఎస్‌ఐ’ మన దేశంలోకి దశాబ్దులపాటు ఉసిగొలిపింది. ఇది మొదటిదశ. బంగ్లా దేశీయ జిహాదీలను ఉసికొల్పింది. ఇది రెండవదశ. మన దేశంలోనే జిహాదీ బీభత్సకారులను రూపొందించింది, రూపొందిస్తోంది. ఇది మూడవదశ! తాలిబన్, ‘ఐఎస్‌ఐఎస్’ వంటి ముఠాలలోకి మన దేశంలోని జిహాదీలను చేర్పిస్తోంది, ఇది నాలుగవ దశ! శరణార్థుల ముసుగులో చొరబడి తిష్ఠవేసి ఉన్న బర్మా రోహింగియాలను మన దేశానికి వ్యతిరేకంగా తీర్చిదిద్దుతుండడం ‘ఐఎస్‌ఐ’ సాగిస్తున్న ప్రస్తుత దుస్తంత్రం. ఈ ప్రమాదాన్ని పసికట్టిన కేంద్ర ప్రభుత్వం ఏడాదికి పైగా ‘రోహింగియా’లపై కనే్నసి ఉంచింది. ఈ నిఘా చర్యల్లో భాగం దేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు వ్రాసిన ఉత్తరం. రోహింగియాలు అక్రమంగా భారతీయ పౌరసత్వం పొందడానికి యత్నిస్తుండడం కేంద్ర ప్రభుత్వ చర్యకు తక్షణ నేపథ్యం..

రోహింగియాలు బర్మా-మ్యాన్‌మార్-లోని రోహాంగ్ – అరకాన్ – ప్రాం తంలో శతాబ్దుల తరబడి జీవిస్తున్నారు. బర్మాలో బౌద్ధమతం వారు అధిక సంఖ్యలో ఉండగా ఈ ‘అరకాన్’ ప్రాంతంలో మాత్రం ‘రోహింగియా’ ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ‘అరకాన్’ ప్రాంతంలోకి శతాబ్దుల తరబడి వివిధ దేశాల ఇస్లాం వర్తకులు, ఇతరులు వచ్చి స్థిరపడ్డారు. నోళ్లు తిరగని ఆ విదేశాల వారు ‘అరకాన్’ను ‘రఖాన్’ అని ‘రఖైన్’ అని ‘రోహాంగ్’ అని ఉచ్చరించారు. ఇలా ‘రోహాంగ్’ ప్రాంతం ఇస్లాం మతస్థులు ‘రోహింగియా’లుగా ఏర్పడ్డారు. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉండి ఇతర మతస్థులు, అల్ప సంఖ్యలో ఉన్న ప్రతిచోటా ‘జిహాదీ’లు పుట్టుకొని వచ్చి అల్పసంఖ్య మతాల వారిని హత్య చేయడం అంతర్జాతీయ చారిత్రక వాస్తవం. అందువల్ల ‘అరకాన్’ ప్రాంతంలోని జిహాదీలు బౌద్ధమతం వారిపైన, వేదమతాల వారిపైన దశాబ్దులుగా దాడులు జరిపారు. ‘అరకాన్’ ప్రాంతం నుంచి ఇతర మతాల వారిని నిర్మూలించి, ‘అరకాన్’ను బర్మా నుంచి విడగొట్టి ప్రత్యేక స్వతంత్ర దేశంగా, ఇస్లాం మత రాజ్యంగా ఏర్పాటు చేయాలన్నది ‘జిహాదీ’లు 1948 నుంచి కంటున్న కల. దేశ విద్రోహకరమైన ఈ కుట్రను కొనసాగించడంలో భాగంగా రోహింగియా జిహాదీలు ‘అరకాన్’లోని అల్పసంఖ్య మతస్థులైన బౌద్ధులపై, వేదమతాల వారిపై హత్యాకాండ కొనసాగించారు. కొత్తకొత్త ‘జిహాదీ’ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ ‘జిహాదీ’లు అల్పసంఖ్య మతస్థులున్న గ్రామాల్లోకి చొరబడి సామూహిక హత్యాకాండ సాగించారు. గత ఏడాది ఒకే రోజున ఒక గ్రామంలో నూట ఐదుగురు హిందువులను రోహింగియా జిహాదీలు పైశాచికంగా హత్యచేసినట్టు ఇటీవల ధ్రువపడడం పరాకాష్ఠ..

బర్మాను విడగొట్టి ‘అరకాన్’ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న విద్రోహ వాంఛకు ప్రేరణ 1947లో భారత విభజన జరగడం, ఇస్లాం మత ప్రాతిపదికపై పాకిస్తాన్ ఏర్పడడం.. ‘అరకాన్’ తూర్పు పాకిస్తాన్- బంగ్లాదేశ్-ను, మన ఈశాన్య ప్రాంతాన్ని ఆనుకొని ఉంది. 1935లో బ్రిటన్ దురాక్రమణదారులు అఖండ భారత్ నుంచి బర్మాను విడగొట్టారు. 1948లో బర్మా నుంచి బ్రిటన్ నిష్క్రమించింది. 1947లో ఇస్లాం మతస్తులు అధికంగా ఉన్న భారత ప్రాంతాలు ‘పాకిస్తాన్’గా ఇస్లాం మతరాజ్యాంగా ఏర్పడినాయి కనుక ఇస్లాం మతస్థులు అధికంగా ఉన్న ‘అరకాన్’ కూడా బర్మా నుండి విడిపోయి ప్రత్యేక ముస్లిం దేశంగా ఏర్పాడాలన్నది ‘రోహింగియా’ జిహాదీల లక్ష్యం. వీరి పన్నాగం ఫలించినట్టయితే ఏమై ఉండేది? ‘అరకాన్’ ప్రాంతం నుంచి హిందువుల నిర్మూలన జరిగి ఉండేది. అలాంటి స్థితి మన జమ్మూ కాశ్మీర్‌లోని లోయ ప్రాంతంలో ఏర్పడిన దుస్థితికి పునరావృత్తి అయి ఉండేది. జమ్మూ కాశ్మీర్‌లోని లోయ ప్రాంతంలో జిహాదీలు 1947- 1991 సంవత్సరాల మధ్య హిందువులను నిర్మూలించారు. 1947లో ‘లోయ’ ప్రాంతం జనాభాలో ఇరవై మూడు శాతం ఉండిన హిందువులు 1991 నాటికి సున్నా శాతం ఆయ్యారు. ఇలా జిహాదీల మతోన్మాద దుస్తంత్రం ఫలించకుండా ‘అరకాన్’లో బర్మా ప్రభుత్వం నిరోధించింది. జిహాదీలను కఠినంగా అణచివేసింది. ఈ అణచివేత చర్యలకు బీభత్సకారులు మాత్రమేకాక కొంతమంది సామాన్య రోహింగియా ముస్లింలు కూడా గురై ఉండవచ్చు. జిహాదీలు తమ బీభత్సకాండను విడనాడి ఉండినట్టయితే ‘అరకాన్’ ప్రాంతంలో ప్రశాంతత ఏర్పడి ఉండేది. కానీ అది జరగలేదు. ప్రభుత్వ దళాలు తమపై దాడులు చేస్తాయని సామాన్య రోహింగియాలు భయపడ్డారు. సామాన్య రోహింగియాల ఈ భయానికి కారణం బర్మా ప్రభుత్వం కాదు. దేశ విద్రోహులైన జిహాదీ రోహింగియాలు! ‘జిహాదీ’ల ఎత్తుగడలు బెడిసికొట్టాయి.

కానీ ఈ పరిణామాల కారణంగా ‘రోహింగియా’లు పెద్ద ఎత్తున శరణార్థుల వేషం వేసుకొని మన దేశంలోకి చొరబడవలసిన పనిలేదు. కానీ ‘గోరంత’ను ‘కొండంత’గా చిత్రీకరించడం విస్తృత జిహాదీ వ్యూహంలో భాగం! ఈ వ్యూహకర్త పాకిస్తాన్ ప్రభుత్వం వారి ‘ఐఎస్‌ఐ’! నిజంగా ప్రాణభయంతో పరిగెత్తి వచ్చిన శరణార్థులైతే ‘రోహింగియా’లు మళ్లీ స్వదేశానికి తిరిగి వెళ్లడానికి తహతహలాడాలి! ‘జిహాదీ బీభత్సకారులు కాని’ సామాన్య రోహింగియా ప్రజలు తిరిగి తమ దేశానికి వచ్చి స్థిరపడడం తమకు అభ్యంతరకరం కాదని, వారికి రక్షణ కల్పిస్తామని బర్మా ప్రభుత్వం పదేపదే ప్రకటించింది. కాని రోహింగియాలు తిరిగి వెళ్ళడం లేదు. ‘ఆధార్’ కార్డులను సంపాదించుకొని మన దేశంలోనే ఉండి పోవాలని యత్నిస్తున్నారట. అందువల్లనే రోహింగియాల కదలికలను కట్టడి చేయాలని కేంద్రం భావించడం సముచిత పరిణామం. దేశంలో నలబయివేలకు పైగా రోహింగియాలు అక్రమంగా తిష్ఠ వేశారు. హైదరాబాద్‌లోనే 3,059 మంది ఉన్నారట.. వీరిలో జిహాదీ బీభత్సకారులు ఎందరో? జమ్మూలో 7,096 మంది తిష్ఠవేసి ఉన్నారట.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)