Home Telugu Articles ‘చాప కింద నెత్తురు’.. ఇస్లామిక్ ఉగ్రవాదం

‘చాప కింద నెత్తురు’.. ఇస్లామిక్ ఉగ్రవాదం

0
SHARE

భారతావని ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా ఇస్లామిక్‌ ఉగ్రవాదం చాప కింద నీరులా, కాదు నెత్తురులా సాగుతోంది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వామపక్ష ఉగ్రవాదం పాకుతోంది. 2018 డిసెంబర్‌ చివరివారంలో జరిగిన వరస సంఘటనలు ఈ వాస్తవాన్ని మరొకసారి రుజువు చేశాయి. ఇప్పుడు వీటి కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఈ దేశం మొత్తాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న ఈ రెండు ప్రధాన ఉగ్రవాద ధోరణుల గురి కూడా బీజేపీ నాయకత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమే. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వ పదవీ కాలం పూర్తవుతున్న కొద్దీ, ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అటు ముస్లిం మత ఛాందస ఉగ్రవాదులు, ఇటు వామపక్ష ఉగ్రవాదులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారని అనుమానించవలసిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భీమా కొరేగావ్‌ అరెస్టులు, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హైదరాబాద్‌లలో జరిగిన ఇంకొన్ని అరెస్టులు ఒక ప్రత్యేక వాతావరణం గురించి వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు దొరికిన సమాచారం మళ్లీ అదే అంశాన్ని మరొకమారు దేశ ప్రజల దృష్టికి తెచ్చింది. ఈ దేశ రాజకీయ ప్రముఖులను హతమార్చడం, జాతీయ దర్యాప్తు బృందం, ఢిల్లీ పోలీసు యంత్రాంగాల కేంద్ర కార్యాలయాలను బాంబులతో పేల్చివేయడం ఆ ఉగ్రవాదుల ధ్యేయమని తేలింది. అలాగే ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాన్ని ఆత్మాహుతి దాడుల ద్వారా పేల్చివేయడం కూడా వారి అజెండాతోనే ఉంది.

భారతదేశంలో రక్తపాతం సృష్టించి, అల్లకల్లోలం చేయడానికి ఐఎస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌) ప్రేరేపిత బృందం చేసిన మరో రాక్షసపుటాలోచన బయటపడింది. డిసెంబర్‌ 26, అర్థరాత్రి వేళ దేశ రాజధానిలోని జఫారాబాద్‌ అనే చోట ఉన్న నాలుగు అంతస్తుల భవనం మీద దాడి చేసి ఈ కుట్రలో భాగస్వాములైన కొందరిని భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఈ భవనం జఫారాబాద్‌ పోలీసు స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉండడం విశేషం. తరువాత ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా జాతీయ భద్రతా బృందం (ఎన్‌ఐఏ) ఆధ్వర్యంలో ఇలాంటి దాడులు జరిగాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఒక వీడియోలో బాంబులు తయారు చేసే విధానం గురించి ఒక పాఠం ఉంది. చెప్పినవాడు సాక్షాత్తు ముఫ్తీ హఫీజ్‌ సుహేల్‌. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబూ మాలిక్‌ పెషావరి ఇతడికి ‘దిశా నిర్దేశం’ చేస్తున్నాడని కూడా తేలింది. పేలుడు పదార్థాలు సేకరించమనీ, బాంబులు తయారుచేయమనే పెషావరీ సలహా ఇచ్చిన సంగతి కూడా అందులో బయటపడింది. ఇప్పటికి దొరికిన ఆధారాలు ఇవి.

కానీ చిన్న చిన్న బాంబులు దొరికినంతమాత్రానే ఆ పదిమంది మీద ఐఎస్‌ ఉగ్రవాదులని ముద్ర వేయడం ఎంతవరకు సబబు అంటూ వీరి తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి వెంటనే ముందుకు వచ్చారు జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. ఆ సోదాలలో దొరికిందని చెబుతున్న దేశవాళీ రాకెట్‌ లాంచర్‌ కూడా నిజమైనది కాదనీ, ట్రాక్టర్‌ విడిభాగమనీ కొందరు మేధావులు అప్పుడే ఎన్‌ఐఏ చర్య మీద ఎదురుదాడికి దిగుతున్నారు. మెహబూబా మరొకమాట కూడా సెలవిచ్చారు. ఇదంతా ఎన్నికల ముందే జరగడం చూస్తుంటే ఎన్‌డీఏ పాలకుల మీద ఆమెకు అనుమానాలు వస్తున్నాయట. నిజమే మరి, ఇంకొక మాటలో చెప్పాలంటే ఉగ్రవాద ముఠాలు కూడా దేశ అంతర్గత భద్రతను భగ్నం చేయాలన్న తమ కుట్రను అమలులో పెట్టడానికి ఎన్నికల ముందు సమయాన్నే ఎంచుకున్న మాటా వాస్తవమే!

భారీ కుట్ర భగ్నం

డిసెంబర్‌ 26న అర్థరాత్రి దేశ రాజధాని ఢిల్లీ, పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లలో మొత్తం 17 చోట్ల ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు జరిపి పదిమందిని అరెస్టు చేసింది. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వారంతా ఇస్లామిక్‌ స్టేట్‌ సిద్ధాంతంతో ప్రేరణ పొందిన ఉగ్రవాద బృందం హర్కత్‌ ఉల్‌ హర్బ్‌ ఎ ఇస్లామ్‌ సభ్యులని ఎన్‌ఐఏ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా దేశ రాజధానిలో ఆత్మాహుతి దాడుల ద్వారా వరస పేలుళ్లు సాగించా లని, ప్రముఖ రాజకీయ నేతలను హతమార్చాలని, ఎన్‌ఐఏ, ఢిల్లీ పోలీసు యంత్రాంగం ప్రధాన కార్యాలయం, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలను బాంబు లతో పేల్చివేయడమే వీరి లక్ష్యమని ప్రాథమిక దర్యాప్తు దరిమిలా దొరికిన ఆధారాలను బట్టి ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. ఈ కుట్రల సూత్రధారికీ, పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదికి మధ్య సంబంధం ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. పాక్‌కు చెందిన ఆ ఉగ్రవాది ఎక్కడ నుంచి, ఏ సమయాలలో వీరితో సంభాషించిందీ గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌, ఆమ్రోహ, లక్నోలలో 17 చోట్ల ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆమ్రోహ నుంచి ఐదుగురిని అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురిని ఢిల్లీలోని సీలంపూర్‌, జఫారాబాద్‌ల దగ్గర అరెస్టు చేశారు. ఇంకొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని ఆ సమయంలో అధికారులు చెప్పారు.

‘హర్కత్‌ ఉల్‌ హర్బ్‌ ఎ ఇస్లామ్‌’, సామాన్య పరిభాషలో ఈ పదాలకు ఉన్న అర్థం- ఇస్లాం ప్రయోజనం కోసం యుద్ధం. ఇది అత్యంత ప్రమాదకర యువకుల బృందం. ఐఎస్‌ కార్యకలా పాలు, ఇతర ఇస్లామిక్‌ మత ఛాందస సంస్థల సమాచారం ఇంటర్‌నెట్‌ ద్వారా సేకరించి, దాని నుంచి ఉత్తేజం పొందిన యువకులే వీరంతా. అంతా 25-30 ఏళ్ల యువకులే. అరెస్టయిన వారి దగ్గర నుంచి ఒక దేశవాళీ రాకెట్‌ లాంచర్‌తో పాటు 12 పిస్తోళ్లు, 112 అలారం గడియారాలు, 100 మొబైల్‌ ఫోన్లు ఇంకా, 25 కిలోల పేలుడు పదార్థాలు, ఏడులక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంస్థ సభ్యులు తమ ధ్యేయాన్ని అమలు చేయడానికి దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సేకరించిన పదార్థాలతో బాంబులను కట్టడం ఒక్కటే మిగిలి ఉంది. ఫిదాయీన్‌ దాడుల తరహాలో ఐయీడీ(ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోసివ్‌ డివైస్‌)ని రిమోట్‌ కంట్రోల్‌తో పేల్చడం ద్వారా విధ్వంసం సృష్టించాలని వీరు పథకం వేశారు.పైప్‌ బాంబులు కూడా ఉపయోగించాలని అనుకున్నారు. ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అలోక్‌ మిట్టల్‌ వెల్లడించిన అంశాలు ఒళు జలదరించే రీతిలో ఉన్నాయి. అరెస్టయిన వారిలో ఒక మత బోధకుడు, ఒక రిక్షా కార్మికుడు, ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థి, చిన్న దుకాణం యజమాని కూడా ఉన్నారు. ఈ కుట్రకు మొత్తం సూత్రధారి మహమ్మద్‌ సుహేల్‌. 29 ఏళ్ల ఈ ముఫ్తీ లేదా మహమ్మదీయ న్యాయ శాస్త్ర నిపుణుడు ఆమ్రోహకు (పశ్చిమ ఉత్తరప్రదేశ్‌) చెందినవాడు. ఇతడిని జఫారాబాద్‌లోనే అరెస్టు చేశారు. ఇతడు ఆమ్రోహ మసీదులో మౌల్వీగా కూడా పనిచేస్తాడని తొలి వార్తలలో వెల్లడికావడం గుర్తించాలి. ఈశాన్య ఢిల్లీలో జఫారాబాద్‌లో చాట్‌ భాండార్‌ నడిపే అబ్దుల్‌ మాలిక్‌ కూడా ఇందులో ఉన్నాడు. అనాస్‌ యూనస్‌ ఎంతో సిగ్గరిలా కనిపించేవాడు. కానీ మాలిక్‌ ఎదురుపడితే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. ఇతడే నొయిడాలో ఉన్న అమిటీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. వయసు 24 సంవత్సరాలు. పేలుళ్లకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్‌ పరికరాలు, అలారం గడియారాలు, బ్యాటరీలు వంటివి ఇతడే సమకూర్చిపెట్టేవాడు.

ముఫ్తీ మహమ్మద్‌ సుహేల్‌ లేదా హజరత్‌… ఇతడు ఆమ్రోహలోని హకీం మెహతాబ్‌ ఉద్దీన్‌ హష్మీ రోడ్‌లో ఉన్న మదర్సాలో కూడా పని చేశాడని అంటారు. ఇతడికే అబూ బాసిర్‌ అల్‌ ఖుర్సానీ అనే మారు పేరు కూడా ఉంది. ఇతడి ఇంటర్‌నెట్‌ వినియోగానికి సంబంధించిన చరిత్రలో బాంబుల తయారీ విధానం గురించిన పాఠాలు కూడా దొరికాయి. ఆన్‌లైన్‌ ద్వారా యువకులను ఆకర్షించి, ఐఎస్‌ సానుభూతి పరులను ఏకం చేయడమే ఇతడి పని. ఈ పనిలో ఇతడు చాలా వరకు విజయం సాధించాడనే అనిపిస్తుంది. చాలామందికి ఇతడు ‘గైడ్‌ అండ్‌ ఫిలాసఫర్‌’ అయిపోయాడు. ఇతడు ఐఎస్‌ నిర్వాహక బృందంలో ఒకనిగా కూడా తన గురించి చెప్పుకునేవాడు. అయితే హైదరాబాద్‌ కేంద్రంగా ఐఎస్‌ నియామకాలు చేపట్టే అబ్దుల్‌ బాసిత్‌ సంస్థకు, సుహేల్‌ బృందానికి ఇప్పటివరకు లభించిన వివరాలను బట్టి సంబంధం ఉన్నట్టు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. అలాగే పాక్‌ నుంచి వీరితో మాట్లాడేవారు కూడా వేర్వేరు సంస్థలకు చెందిన వేర్వేరు వ్యక్తులేనని కూడా దర్యాప్తులో తేలింది. అబ్దుల్‌ బాసిత్‌ కుట్రలను మొన్న ఆగస్టులోనే ఎన్‌ఐఏ భగ్నం చేయగలిగింది. కానీ ఇప్పటికీ ఈ రెండు శిబిరాలకు మధ్య సంబంధాలు లేవంటే నమ్మడం సాధ్యం కాదు. బాసిత్‌ సంస్థకు, కశ్మీర్‌ కేంద్రంగా పనిచేసే ఐఎస్‌ అనుబంధ ఉగ్రవాదులకు సంబంధం ఉంది. ఇదే ఐఎస్‌జేకే. బాసిత్‌ ద్వారా సాయం పొందాలని ఐఎస్‌జేకేకు చెందిన ఒక ఉగ్రవాది ప్రయత్నించిన సంగతి బయటపడింది.అలాగే ఐఎస్‌జేకేకు చెందిన ఇద్దరు సభ్యులను ఢిల్లీ పోలీసులు ఆమ్రోహలోనే అరెస్టు చేయడం కూడా జరిగింది. ఆమ్రోహ అంటే సుహేల్‌ స్వస్థలమే.

హైదరాబాద్‌ నుండే..

2018 డిసెంబర్‌ చివరివారంలోనే హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న మరొక కుట్ర గురించి కూడా లోకానికి తెలిసింది. అది కూడా జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం కదలికలను తెలుసుకునేందుకు జరుగుతున్న కుట్ర. పాక్‌ నిఘా విభాగం ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) ఏజెంట్లు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని జమ్మూకశ్మీర్‌ సైనిక నిఘా విభాగం హైదరాబాద్‌ నిఘా వర్గాలకు సమాచారం అందించింది. ఐఎస్‌ఐ ఏజెంట్లు భారత సైనికాధి కారులమని చెప్పుకుంటూ, మన సైన్యం గురించి వాకబు చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ఫోన్‌ల ద్వారా సమాచారం అడుగుతున్నారు. ఇదంతా హైదరాబాద్‌ కేంద్రంగా ఓ ఇంటర్‌నెట్‌ ఎక్స్చేంజ్‌ సాయంతో జరుగుతున్నదని తేలింది. ఎంతో కీలకమైన, సున్నితమైన సమాచారం గురించి పదే పదే కోరుతూ ఉండడంతో అనుమానం వచ్చింది. భారత సైనికాధికారులు అప్రమత్తమయ్యారు. ఫోన్ల ద్వారా సమాచారం బయటకు పోరాదని కూడా ఆదేశాలు వెళ్లాయి. ఇంకా ఈ తరహా ఫోన్లు ఎక్కడ నుంచి ఎవరు చేస్తున్నారన్న అంశం గురించి కూడా కూపీ లాగారు. దీనితో ఇంటర్‌నెట్‌ ఎక్స్చేంజ్‌ వ్యవహారం బయటపడింది. డిసెంబర్‌ 27 ప్రాంతంలో సైనికాధికారులు ఈ సంగతిని హైదరా బాద్‌ పోలీసు విభాగానికి, ఎన్‌ఐఏ దృష్టికి తీసుకు వెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేసి హైదరాబాద్‌లోని నల్లకుంట టీఆర్‌టీ కాలనీలో ఉంటున్న దినేశ్‌ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్టు కనుగొన్నారు. వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ ద్వారా అతడు మాట్లాడు తున్నాడని తేలింది. ఇతడినే ఐఎస్‌ఐ సంప్రతించి తన కార్యం నిర్వహించుకోవాలని చూసింది.

అనాస్‌ యూనస్‌, సాకిబ్‌ ఇఫ్తెకార్‌, మహమ్మద్‌ ఇర్షాద్‌లతో కలసి సుహేల్‌ ఢిల్లీలోని ఎన్‌ఐఏ కేంద్ర కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేయాలని పథకం వేశారు. ఎన్‌ఐఏ మీద వీరికి ఇంతటి విరోధానికి కారణం ఊహించడం కష్టం కాదు. ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో భారతదేశంలోనే ఇంతవరకు ఈ సంస్థ వందమందిని అరెస్టు చేసింది. పైగా అందులో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. ఆ తరువాత ఎన్‌ఐఏ ఓ కన్ను వేసిన ప్రాంతం హైదరాబాద్‌.

వరుస అరెస్టుల కలకలం

డిసెంబర్‌ ఆఖరివారంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన అర్బన్‌ నక్సల్స్‌ అరెస్టులు కూడా చాలా ప్రశ్నలకు తావిచ్చాయి.

ఇస్లాం మత ఛాందసుల విధ్వంసక కుట్రలకు తోడు, వామపక్ష ఉగ్రవాదం కూడా అడవుల నుంచి జనావాసాల మధ్యకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పట్టణాలు, నగరాలలో ఉద్యమం నిర్మించడానికి మావోయిస్టులు ప్రయత్నాలు ప్రారంభించారు. నిజానికి ఇలాంటి ఆలోచన మావోయిస్టులలో పదేళ్ల నాడే ఆరంభమయింది. నిరుడు జనవరిలో జరిగిన భీమా కొరేగావ్‌ ఉదంతం, తరువాత జరిగిన అరెస్టులు, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ముగ్గురు అక్కాచెలెళ్ల అరెస్టులు, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఉద్యోగి అరెస్టు దీనిని తిరుగులేకుండా నిరూపిస్తున్నాయి. ఈ తరహా ఉద్యమాన్నే అర్బన్‌ మావోయిజం అని ఇప్పుడు పిలుస్తున్నారు. అర్బన్‌ మావోయిజం తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర భారతంలోకి చొచ్చుకు పోతూ ఉంటే, ఇస్లామిక్‌ ఉగ్రవాదం ఉత్తరాది నుంచి హైదరాబాద్‌ లక్ష్యంగా దక్షిణ భారతావనికి షికార్లు కొడుతూనే ఉంది. ఇందుకు ఇక్కడి పాలకుల వైఖరే కారణం. ఒకరు ఉగ్రవాదులను నేరుగా సమర్థించే వారికి అర్థ సింహాసనం ఇస్తారు. మరొకరు మావోయిస్టులు, మతోన్మాదులు జమిలిగా ఎదగడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తూనే ఉన్నారు.

1969 ప్రాంతంలో దేశంలో నక్సలైట్‌ ఉద్యమం ఆరంభమైంది. ఒక పుష్కర కాలానికే దాదాపు వందముక్కలైంది ఉద్యమం. అంటే వంద వరకు సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నక్సల్‌ ఉద్యమానికి 2004 సంవత్సరం ప్రత్యేకమైనది. దాదాపు నలభయ్‌ నక్సల్‌ సంస్థలు ఆ సంవత్సరమే విలీనమై మావోయిస్టు పార్టీకి రూపం ఇచ్చాయి. ఈ సమయంలోనే కొన్ని లక్ష్యాలను కూడా వారు నిర్దేశించుకున్నారు. వాటినే ‘ది స్ట్రాటజీస్‌ అండ్‌ పెర్‌స్పెక్టివ్‌ ఆఫ్‌ ఇండియన్‌ రివల్యూషన్‌ 2004’ అన్న పత్రంలో నమోదు చేశారు. ఇందులో అర్బన్‌ పెర్‌స్పెక్టివ్‌ పత్రమే మావోయిస్టులు అంటే వామపక్ష ఉగ్రవాదం పట్టణాలకీ, నగరాలకీ తరలవలసిన అవసరాన్ని చెప్పింది. అక్కడ ఉండే అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేయాలని అది నిర్దేశించింది. కార్యకర్తలు ఇక్కడి నుంచే రావాలి. నాయకత్వం కూడా ఇక్కడే తయారు కావాలి. కారణం- అడవులను కేంద్రంగా చేసుకుని ఉద్యమం నడపడం సాధ్యం కాదని అధినాయకత్వం భావించడమే. చిత్రమేమిటంటే సెక్యులర్‌ శక్తులను ఏకం చేసే పనిని కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీ భుజాన వేసుకుంది. అంతేకాదు, పీడనకు గురి అవుతున్న మైనారిటీలను హిందూ ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఏకం చేయడం కూడా తన కర్తవ్యంగా నిర్దేశించుకుంది. నిజానికి ఈ సూత్రం రెడ్‌ కారిడార్‌ నాటి ఇస్లాం ఉగ్రవాద, నక్సల్‌ ఉగ్రవాద బంధాన్ని మరొకసారి బలోపేతం చేసుకోవడానికేనన్నది సుస్పష్టం. ఈ దేశం మీద సాయుధ సమరం చేయడానికి సంబంధించిన సూచనలు కూడా ఈ పత్రంలో కనిపిస్తాయి. భద్రతాబలగాల మోహరింపు నకు అవకాశం లేని గ్రామీణ ప్రాంతాలలో మిలటరీ టాస్క్‌ను ఆరంభించమని కూడా ఆ పత్రం ఆదేశించింది. ఆ విధంగా పట్టణాలు, నగరాల మీద పట్టు సాధించాలట. అంటే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. కార్మికులు, మహిళలు, మధ్య తరగతి, దళితులను ఏకం చేయడం కూడా ఈ పత్రం లక్ష్యం. ఇదంతా ఎలా జరుగుతోంది. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేశ వ్యతిరేక కార్య కలాపాలలో పాల్గొనడం వేర్వేరని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన వివరణలను ఇలాంటి వారంతా ఈ రీతిలో ఉపయోగించుకుంటున్నారు. భీమా కొరేగావ్‌ నినాదాలన్నీ ఈ నేపథ్యంలో జరిగినవే. అలాగే విశ్వవిద్యాలయాలలో వినిపిస్తున్న భారత వ్యతిరేక నినాదాలు కూడా అలాంటి ‘స్వేచ్ఛ’ ఇచ్చిన ధోరణికి చెందినవే. పైగా పట్టణాలు, నగరాలలో తమను సమర్థించేవారిని విశ్వవిద్యాలయాలలోనే మావో యిస్టు మేధావులు కనుగొంటున్నారు. ఆ విద్యా ప్రాంగణాల నుంచే తయారుచేసుకుంటు న్నారు. విశ్వవిద్యాలయాలలో లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ, తరగతుల సంగతేమో కానీ, కొన్ని చానళ్ల వారి దుష్ప్రచార కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరవుతూ విద్యార్థులను పెడతోవ పట్టిస్తున్నారు. ఇందుకు సంబంధించే జనారణ్యంలో మావోయిస్టుల పాగా అంటూ కొన్ని పత్రికలలో వార్తా కథనాలు వెలువడ్డాయి. 2018 డిసెంబర్‌లో వెలువడిన అలాంటి రెండు ప్రముఖ వార్తలను గమనంలోకి తీసుకోవాలి.

ఆత్మకూరి భవాని, అన్నపూర్ణ, అనూష అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లను డిసెంబర్‌ 23, 2018న పోలీసులు విశాఖ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిని హైదరాబాద్‌లో విశాఖ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముగ్గురిని మావోయిస్టులుగా పోలీసులు చెబుతున్నారు. గతంలో డిటోనేటర్లు బయటపడిన కేసులో పట్టుబడిన ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఆ ముగ్గురు అక్కాచెలెళ్లను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోనే కాప్రా సర్కిల్‌లోని వెంక టేశ్వర నగర్‌లో వారు తల్లిదండ్రులతో ఉండేవారు. ఇందులో అనూష, అన్నపూర్ణ చైతన్య మహిళా సంఘంలో పనిచేశారు. తరువాత సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరారు. భవానీ అమరవీరుల బంధుమిత్రుల కమిటీలో పనిచేశారు. తల్లి తండ్రి సామాజికోద్య మాలలోనే పనిచేస్తున్నారు. ఈమె భర్త ఎస్‌ కృష్ణ. తన భార్య, చనిపోయిన మావోయిస్టులను వారి బంధవులకు, కుటుంబ సభ్యులకు అందచేయడంలో సహకరిస్తుందని, ఉద్యమంతో సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. అయితే అనూష 2017లో తన పేరును యాంగ్జేగా మార్చుకుని మావోయిస్టు శిక్షణ తీసుకుంది. కొద్దికాలం క్రితం తిక్కరపాడు అనేచోట మాటు వేసి పోలీసు వాహనం మీద కాల్పులు జరిపిన సంఘటనలో ఆమె పాత్ర ఉంది. ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దులలో జరిగిన మందుపాతర పేలుళ్లతో కూడా ఆమెకు సంబంధం ఉందని ఆరోపణ.

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల అరెస్టులు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్‌జీఆర్‌ఐ (జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ)లో సాంకేతిక విభాగంలో సీనియర్‌ ఉద్యోగి నక్కా వెంకటరావును కూడా ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందన్‌గావ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి నుంచి కూడా డిటోనేటర్లు, మావోయిస్టు సాహిత్యం, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వెంకటరావు 1980లలో ఆర్‌ఎస్‌యులో కీలకంగా పనిచేశారు. ఈయన జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ పట్టణ ప్రాంతాలలో మావోయిస్టు నెట్‌వర్క్‌ నిర్మాణానికి పనిచేస్తున్నట్టు గుర్తించారు. నాయకత్వానికి లేఖలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసే పనిలో కూడా వెంకటరావు పాలు పంచుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

వాటిపైనే నిఘా..

మావోయిస్టు అనుబంధ సంఘాల పనితీరు మీద ఇప్పుడు నిఘా విభాగాలు ఎక్కువ దృష్టి పెట్టక తప్పడం లేదు. నిరుద్యోగులను మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షించే పని ఆ సంస్థ అనుబంధ సంఘాల ద్వారానే జరుగుతున్నదని నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. అసలు 2004 కంటే ముందే హైదరాబాద్‌ నగరంలో మావోయిస్టులు (నక్సల్స్‌) తిష్ట వేసిన సంగతి ఎప్పుడో బయటపడింది. 2000 సంవత్సరంలో అమీర్‌పేట వంటి విపరీతమైన రద్దీ ఉండే చోటనే ముగ్గురు మావోయిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. 2005లో నగరంలోనే బీఎన్‌ రెడ్డి నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దంపతులు చనిపోయారు. ఆ సంవత్సరమే హిమాయత్‌ నగర్‌, మీర్‌పేటలలో పోలీసులు పెద్ద ఎత్తున మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అటు ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి, వామపక్ష ఉగ్రవాదానికి అడ్డా హైదరాబాద్‌ నగరమేనని నమ్మక తప్పదు.

సరిగ్గా సంవత్సరం క్రితం యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) ముంబైలోని కల్యాణ్‌ రైల్వే స్టేషన్‌లో ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసింది. వీరంతా నల్లగొండ జిల్లాకు చెందినవారు. ముంబైలోనే కామ్‌రాజ్‌నగర్‌, విక్రోలి, రాంబాయి అంబేడ్కర్‌ నగర్‌లలో నివాసం ఉంటూ తెలంగాణ వలస కార్మికులను మావోయిస్టు ఉద్యమం వైపు అడుగులు వేసేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి అర్బన్‌ మావోయిజం వ్యూహంలో భాగంగా ఏర్పడిన గోల్డెన్‌ కారిడార్‌ కమిటీ తరఫున వీరు పని చేస్తున్నారని తేలింది. ఇంత జరుగుతున్నా ప్రజా సంఘాల పేరుతో, హక్కుల సంఘాల పేరుతో, మేధావుల పేరుతో ఈ విద్రోహక చర్యల ముఠాలకు మద్దతు అందుతూనే ఉంది. అలాగే ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి కూడా ఆ శక్తులే మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఆ మద్దతుకే హక్కుల రక్షణ అన్న పేరు సుప్రసిద్ధం. భారతీయ సాంస్కృతిక వైవిధ్య పరిరక్షణ అన్న పేరు కూడా ఉంది.

మావోయిస్టులకు, ఇస్లామిక్‌ మతోన్మాద శక్తులకు మధ్య బంధం లేదని చెప్పడానికి అవకాశం లేదు. నేపాల్‌ నుంచి నల్లమల్ల వరకు నిర్మించ తలపెట్టిన రెడ్‌ కారిడార్‌ వ్యవహారంలో ఆ రెండు ఉగ్రవాద ముఠాలు బంధం కలుపుకున్న సంగతి దేశానికి తెలియనిది కాదు. మావోయిస్టులు తమ లక్ష్య సాధనలో కొన్నిసార్లు ఇతర వామపక్ష ఉగ్రవాద సంస్థల సభ్యులను హతమార్చడం సర్వసాధారణం. అలాగే కొన్నిచోట్ల, కొన్ని సందర్భాలలో క్రైస్తవ మిషనరీలలో పనిచేసే వారికి కూడా అదే గతి పట్టించాయి. కానీ భారత్‌తో పాటు, ప్రపంచాన్ని ఇస్లాం మతం నీడలోకి తీసుకురావాలని చెబుతున్న ఇస్లామిక్‌ ఉగ్రవాదులను మాత్రం మావోయిస్టులు అక్కున చేర్చుకుంటున్నారని అనిపిస్తుంది.

మళ్లీ ముఫ్తీ మెహబూబా ప్రకటన దగ్గరకి వద్దాం. ఎన్నికలకు ఆరు మాసాల ముందు ఈ రగడ ఎందుకు? అన్నారామె. దీని ద్వారా ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తున్నదని ఆమె అభియోగం. అయితే సరే, బీజేపీయేతర పార్టీలు కూడా ఒక విషయం గమనించడం అవసరం. అందుకు సంబంధించిన స్పృహ బీజేపీయేతర పార్టీలకు భారత సార్వభౌమాధి కారం పట్ల ఉన్న నిబద్ధతకు, లౌకిక వాదం పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనంగా నిలబడుతుంది. ముస్లిం మత ఛాందస ఉగ్రవాదులను పరోక్షంగా, ప్రత్యక్షంగా సమర్థించే పార్టీలను బీజేపీయేతర కూటమిలో చోటు లేకుండా చూడాలి. మావోయిస్టులను అంటకాగేవారి మద్ధతును తీసుకోకుండా ఉండాలి. అప్పుడు బీజేపీతో తలపడాలి. అలా చేయగలవా?

Source: Jagriti Weekly