Home News చైనా.. మళ్లీ జగడం

చైనా.. మళ్లీ జగడం

0
SHARE
  • భారత్‌కు బ్రహ్మపుత్ర ప్రవాహ సమాచారం ఇవ్వని పొరుగుదేశం
  • అరుణాచల్‌ సరిహద్దుకు దగ్గరగా.. నేపాల్‌కు హైవే నిర్మాణం
  • భారత్‌కు ఆందోళన కలిగించే పరిణామాలివి!

పొరుగుదేశం చైనా అనునిత్యం భారత్‌కు ఏదో ఒక కొత్త తలనొప్పి సృష్టిస్తూనే ఉంది. డోక్లాం సరిహద్దు వివాదం సమసిపోయిందనుకుంటున్న తరుణంలో- తాజాగా బ్రహ్మపుత్ర నదీజలాల వివాదాన్ని, టిబెట్‌ సరిహద్దులో రహదారి నిర్మాణ వివాదాన్ని రాజేసింది. వరదలొచ్చే అవకాశాలున్న జూన్‌-అక్టోబరు నెలల్లో బ్రహ్మపుత్ర నది ప్రవాహ సమాచారాన్ని తెలియజేయకుండా భారత్‌ను అంధకారంలో ఉంచింది. తద్వారా బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంత ప్రజల్ని భయాందోళనల్లోకి నెట్టేసింది. అలాగే టిబెట్‌ నుంచి నేపాల్‌ సరిహద్దుకు దారితీసే వ్యూహాత్మక హైవేను చైనా తాజాగా ప్రారంభించింది. భారత ప్రయోజనాలతో ముడివడి ఉన్న ఈ రెండు అంశాలూ ఇప్పుడు మన దేశానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. చైనా మాత్రం తానెక్కడా అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘించలేదని బుకాయిస్తోంది.

భారత్‌ను అనుకుని ఉన్న టిబెట్‌లో లాసా తర్వాత రెండో అతిపెద్ద నగరం షిగాజే. ఈ నగర విమానాశ్రయం నుంచి షిగాజే నగర నడి మధ్య వరకూ 40.4 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిని చైనా తాజాగా ప్రారంభించింది. షాంఘై నుంచి నేపాల్‌ సరిహద్దుల్లోని ఝాంగ్ము వరకూ విస్తరించిన ‘జి318’ హైవేతో ఈ కొత్త హైవే అనుసంధానం అవుతోంది. జి318 రహదారికి సంబంధించిన మరో కొన.. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు చేరువలోని టిబెట్‌ పట్టణం నింగ్చీ వరకూ విస్తరించి ఉంది. అంటే చైనా హైవే భారత సరిహద్దు దాకా వచ్చిందన్నమాట! ఈ హైవేను పౌర, రక్షణ అవసరాలకు వినియోగించవచ్చు. ఆర్థిక, రక్షణ అవసరాల కోసం చైనా దక్షిణాసియాలోకి సునాయసంగా ప్రవేశించడానికి ఈ రహదారి వీలు కలిగిస్తుంది. ఈ రహదారి వెడల్పు 25 మీటర్లు. సాయుధ శకటాల తరలింపునకు ఇది అనువుగా ఉంది. అవసరమైతే యుద్ధవిమానాల కోసం రన్‌వేగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రహదారి గుండా అరుణాచల్‌ ప్రదేశ్‌కు అతి సమీపంలో చైనా సైనిక శకటాలు సంచరించడం భద్రతా కారణాల దృష్టితో చూస్తే భారత్‌కు ఆందోళన కలిగించే పరిణామం. అరుణాచల్‌ విషయంలో ఇప్పటికే భారత్‌-చైనా మధ్య వివాదం రగులుతోంది. తాజాగా హైవే నిర్మాణం ద్వారా సరిహద్దులో మౌలిక సదుపాయాల్ని చైనా బలోపేతం చేసుకుంది.

ఇది ఎవరి పని?

నేపాల్‌లో కె.పి.శర్మ ఓలి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ దేశ సరిహద్దుతో రైల్వే లైనును అనుసంధానం చేయడానికి చైనా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. కె.పి.శర్మ ఓలి చైనాకు అనుకూలుడు. నేపాల్‌లో మధేసీల ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో.. భారత వస్తువులు నేపాల్‌లో ప్రవేశంపై దిగ్బంధం కొనసాగుతున్న సమయంలో.. చైనా వస్తువుల రవాణాకు మార్గం సుగమం చేయడం, భారత్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం శర్మఓలి చైనాతో ఒప్పదం చేసుకున్నారు. నేపాల్‌ సరిహద్దుతో రైల్వేలైను అనుసంధానం ఈ ఒప్పందంలో కీలకమైనది. ఆ రైల్వే ప్రాజెక్టుకు సన్నాహకంగా తాజాగా హైవేను ప్రారంభించినట్లు చైనా అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ వెల్లడించింది. భారత్‌ అంగీకరిస్తే భవిష్యత్తులో ఈ రహదారిని భారత్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌ల వరకూ విస్తరించవచ్చునని, ఇదో వాణిజ్య కారిడార్‌లాగా మారుతుందని చైనా చెబుతోంది. ఇప్పటిదాకా భారత్‌కు సన్నిహిత దేశంగా ఉన్న నేపాల్‌ను తనవైపు తిప్పుకోవడం, సరిహద్దులో మౌలిక సదుపాయాల్ని బలోపేతం చేసుకోవడం ద్విముఖ లక్ష్యాలుగా హైవే, రైల్వే ప్రాజెక్టుల్ని చైనా చేపట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బ్రహ్మపుత్రపై పేచీలెందుకు?

టిబెట్‌లో జన్మించే బ్రహ్మపుత్ర నది(దీనిని టిబెట్‌లో యార్లుంగ్‌ జాంబ్బోగా పిలుస్తారు) భారత్‌ గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. అక్కడ గంగానది దీంతో కలుస్తుంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర వరదాయిని. ఈ నదీ జలాల ప్రవాహతీరు, పంపిణీ, నాణ్యత సమాచార మార్పిడిపై భారత్‌-చైనా మధ్య ఒప్పందం ఉంది. వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో అపారనష్టాన్ని కలగజేస్తుంటాయి. ఒప్పందం ప్రకారం మే 15వ తేదీ నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు బ్రహ్మపుత్ర జలసంబంధ(హైడ్రలాజికల్‌) విషయాల్ని ఎగువనున్న చైనా దిగువనున్న భారత్‌తో పంచుకోవాల్సి ఉంది. ముఖ్యంగా వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు నదీ మట్టాల్ని దిగువనున్న దేశాలకు తెలియజేయాలి. కానీ ఈ ఏడాది ఇప్పటిదాకా అలాంటి సమాచారమేదీ భారత్‌కు చైనా ఇవ్వలేదు. గత ఏడాది వచ్చిన వరదల వల్ల తమ హైడ్రలాజికల్‌ స్టేషన్లు దెబ్బతిన్నాయని, సంబంధిత సమాచారాన్ని సేకరించే స్థితిలో అవి లేవని, వాటిని నవీకరిస్తున్నామని, అందువల్ల సమాచారాన్ని భారత్‌కు ఇవ్వలేమని చైనా తెగేసిచెప్పింది. అయితే అత్యంత దిగువనున్న బంగ్లాదేశ్‌తో మాత్రం సమాచారాన్ని పంచుకుంటోంది. తమకు ఇప్పటికీ టిబెట్‌లోని మూడు హైడ్రలాజికల్‌ స్టేషన్ల నుంచి నీటిమట్టాలు, నీటి విడుదల స్థాయిల సమాచారం అందుతోందని బంగ్లాదేశ్‌ సంయుక్త నదీజలాల కమిషన్‌ సభ్యుడు మొఫజల్‌ హుస్సేన్‌ చెప్పారు.

భారత్‌కు ముప్పేంటి?

బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ నదులు చైనా నుంచి నేరుగా భారత్‌లోకి ప్రవహిస్తాయి. వరదల సమయంలో ఈ రెండు నదుల మట్టం, ప్రవాహ సమాచారాన్ని మార్పిడి చేసుకునేలా 2006లో భారత్‌-చైనా నిపుణుల యంత్రాంగం మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 2013, 2015లలో సంతకాలు చేశారు. దీని ప్రకారం జలసంబంధ సమాచారాన్ని చైనా అందజేయాలి. ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయినా- చైనా నుంచి ఉలుకూ పలుకూ లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 3 కోట్ల మంది నష్టపోయారు. ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నది నీటిని మళ్లించడానికి చైనా పెద్ద ఎత్తున ప్రణాళికలు వేస్తోందని భారత్‌ అనుమానిస్తోంది. యార్లుంగ్‌ జాంగ్బోపై చైనా అనేక జలవిద్యుత్కేంద్రాలు నిర్మించింది. 2014లో అతిపెద్దదైన జాంగ్మూ ఆనకట్టను పూర్తిచేసింది. ఈ ఆనకట్టల్లో నీటిని నిల్వచేయడం లేదని, దిగువదేశాల హక్కులను కాలరాయడం లేదని చైనా బుకాయిస్తోంది. కానీ అతి స్వల్పకాలంలోనే బ్రహ్మపుత్ర ప్రవాహం పెరగడం, లేదా తగ్గడం జరుగుతోందని, ఈ నీటిని చైనా నియంత్రిస్తోందని అస్సోంలోని దిబ్రూగఢ్‌ వాసులు చెబుతున్నారు. తాజా పరిణామాలతో తాము ఆందోళన చెందుతున్నామని భారత జలవనరుల అధికారులు అంటున్నారు. భారత ఆందోళనకు కారణాలు లేకపోలేదు. టిబెట్‌లో చైనా నిర్మించిన ఓ కృత్రిమ ఆనకట్ట 2002లో కూలిపోవడంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో దాదాపు రూ.150 కోట్ల ఆస్తినష్టం సంభవించింది. బ్రహ్మపుత్రపై చైనా ఆనకట్టల వల్ల నదీ ప్రవాహం దారి మళ్లడమే కాకుండా, దిగువ ప్రాంతంలో ప్రజల జీవన పరిస్థితి, వ్యవసాయం, జీవావరణం తీవ్రంగా దెబ్బతింటాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. దక్షిణాసియాలో భౌగోళిక రాజకీయాలకు నదీజలాలు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.

(ఈనాడు సౌజన్యం తో)