Home Telugu Articles సాహస వీరుడు చింతపూడి రామిరెడ్డి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-18)

సాహస వీరుడు చింతపూడి రామిరెడ్డి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-18)

0
SHARE

తెలంగాణలో రజాకార్ల దురంతాలను సాహసంతో ప్రతిఘటించిన అమరవీరులలో శ్రీ చింతపూడి రామిరెడ్డి ఒకరు. ఆయనవల్ల నల్లగొండ జిల్లాలోని గ్రామం రేణుకుంట హైదరాబాదు చరిత్రలో చిరకాలం నిలిచిపోయింది. భువనగిరి తాలుకాలో ఉన్న ఈ గ్రామానికి యాదగిరిగుట్ట మార్గంగా వెళ్ళవలసి ఉంటుంది. ఈనాటికీ సరియైన మార్గం లేనందువల్ల భువనగిరి నుండి 20 మైళ్ళు ప్రయాణం చేసి సర్వీసు బస్సు ద్వారా ఈ గ్రామం చేరడానికి దాదాపు రెండు గంటలు పట్టింది.

ఒకనాడు హైద్రాబాద్ రేడియో, ఆనాటి వార్తా పత్రికలు రేణుకుంట గురించి ఆ గ్రామ నివాసి రామిరెడ్డి గురించి ప్రత్యేక వార్త ప్రకటించవలసి వచ్చింది. కొంతకాలం నిజాం సాయుధబలగాన్ని, రజాకార్ల దుండగాలను విజయవంతంగా అరికట్టిన రామిరెడ్డి గురించి ఈనాటికీ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో బాలసంతులు అనే భిక్షకులు రామిరెడ్డిగారి వీరగాథను గానం చేస్తూ తిరుగుతుంటారు. ప్రత్యక్షంగా ఆ గ్రామాన్ని, అక్కడి ప్రజలను చూడాలనే ఉద్దేశ్యంతో ఈ మధ్య అక్కడికి చిత్రకారుడు శ్రీ నరేంద్రరాయ్‌తో వెళ్ళాను. ఆనాడు రామిరెడ్డితో పాటు పోరాడిన గ్రామవాసులను కనుగొన్నాము. ఆనాటి గ్రామరక్షణ దళంలో ప్రముఖపాత్ర వహించిన మహ్మద్ యాకూబ్ ఆలీని నల్లూరులో కలుసుకొని రామిరెడ్డి గురించి వాస్తవ వృత్తాంతాన్ని తెలుసుకొన్నాము.

రేణుకుంటలో ఈనాడు మొత్తం 340 ఇళ్ళు ఉన్నాయి. ఆ రోజుల్లో కేవలం 260 గడపలు మాత్రమే ఉండేవి. ఆ గ్రామానికి మైలుదూరంలో రాజాపేట సంస్థానము, ఎనిమిది మైళ్ళ దూరంలో ప్రసిద్ధ జైన దేవాలయం ఉన్న కొలనుపాక గ్రామం, ఆరుమైళ్ళ దూరంలో జగదేవపురం గ్రామం ఉన్నాయి. రేణుకుంటలో సుఖ జీవితం గడుపుతున్న పటేలు చింతపూడి రామిరెడ్డి నిజాం బలగం దృష్టిలోకి రావడం ఈ క్రింది సంఘటనకు దారితీసింది. ఆ గ్రామానికి దాదాపు మూడుమైళ్ళ దూరంలో ఉన్న బేగంపేట గ్రామం ఆనాడు ఒక ముక్తా (చిన్న జాగీరు)గా ఉండేది. మహమ్మదీయుడైన ముక్తేదార్ చనిపోగానే ఆ జాగీరుకోసం తగాదా ప్రారంభమైంది.

ఆ ముక్తేదారు కూతురు, కొడుకుల మధ్య సాగిన వివాదంలో రామిరెడ్డి కూతురు పక్షం వహించారు. ఆమెకు సహాయంగా ఉంటూ అక్కడ భూములను సాగుచేయించి రక్షణగా నిలుచున్నాడు. ముక్తేదారు కొడుకు తన చెల్లెలు భూములను స్వాధీనం చేసుకోవాలని తన ప్రయత్నాలు కొనసాగించాడు. రామిరెడ్డిని భయపెట్టి తరిమివేయాలని అతడు హైద్రాబాద్ నుండి అరబ్బుల ముఠాను రప్పించాడు. ఆ రోజుల్లో నిజాం పరిపాలనలో అరబ్బులకు ప్రత్యేక స్థానం ఉండేది. వాళ్ళు నిజాం ఖజానాలకు కాపలాదార్లుగా ఉండేవాళ్ళు. అందువల్ల వారికి కొన్ని ప్రత్యేక అధికారాలు, సౌకర్యాలు ఉండేవి. ఎవరైనా ఎదురు మాట్లాడితే చాలు, ఆనాటి అరబ్బులు బొడ్లోనుండి బాకు దూసి చంపడానికి సిద్ధమయ్యేవాళ్ళు. నిజాం పోలీసులు కూడా వాళ్ళకు భయపడుతుండేవారు.

ఈ అరబ్బుల ముఠా బేగంపేట వచ్చి రామిరెడ్డికి సవాలు విసిరింది. రామిరెడ్డి నిర్భయంగా ఇతర గ్రామవాసుల సహాయంతో వాళ్ళను ముఖాముఖిన ఎదుర్కొన్నాడు. రామిరెడ్డి దళం ముందు అరబ్బులు నిలుచోలేకపోయారు. అరబ్బుల నాయకుల్ని పట్టుకొని ముక్కు, చెవులు కోసి పంపించాడు రామిరెడ్డి. “వీరులైన” అరబ్బులు పిక్కబలం చూపి హైద్రాబాద్ త్రోవపట్టారు. రామిరెడ్డి ధైర్యాన్ని చూసి గ్రామస్థులంతా మెచ్చుకున్నారు. ముక్తేదార్ కూతురుకు భూములపై న్యాయంగా యాజమాన్యం దక్కింది. చుట్టుప్రక్కల గ్రామాలలో రామిరెడ్డిపట్ల ఆదరాభిమానాలు పెరిగాయి.

సబ్ ఇన్‌స్పెక్టర్ హత్య

ఆ తర్వాత మూటకొండూరు గ్రామంలో మరో భూమి తగాదా వచ్చింది. ఒక పక్షం వహించిన రామిరెడ్డి ఈసారి పోలీసులను ఎదుర్కోవలసి వచ్చింది. ఘర్షణ తీవ్రస్థాయికి వెళ్ళేసరికి పోలీసు కానిస్టేబులు తుపాకి పేల్చాడు. రామిరెడ్డి వెంట్రుక వాసిలో తన ప్రాణం రక్షించుకొని ఎదురుకాల్పులు జరిపాడు. ఫలితంగా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ నేలకు ఒరిగాడు. హత్యానేరంపై రామిరెడ్డిని అరెస్టు చేశారు. చివరికి ఈ విధంగానైనా పులి బోనులో చిక్కిందని రజాకార్లు సంతోషపడ్డారు. కానీ రామిరెడ్డి ధైర్యం కోల్పోకుండా తాను హత్యచేయలేదనే అంశాన్ని నిరూపించాడు. పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో అసలు హతుని శరీరంలో నుండి తూటా బయటపడలేదని, కానిస్టేబుల్ మాత్రమే కాల్పులు జరిపాడని సాక్ష్యాధారాలు దొరికాయి.

కోర్టులో కేసునెగ్గి రామిరెడ్డి తన గౌరవాన్ని నిలుపుకున్నాడు. తాలూకా అంతటా అతని పేరు మారుమ్రోగిపోయింది. రామిరెడ్డి ఈ కేసు వ్యవహారాలలో ఇతర పనుల్లో తలమునకలై ఉంటూ కూడా రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు. 1947 ఆగస్టు 15 నాడు దేశం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చగానే రామిరెడ్డి మార్గదర్శకత్వంలో రేణుకుంట స్వాతంత్య్రోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. కొంతకాలం గడచిన తర్వాత గాంధీజీ హత్య జరిగింది. ఈలోగా నిజాం తన స్వాతంత్య్ర ప్రతిపత్తికోసం మొండిగా వ్యవహరిస్తూనే ఉన్నాడు. రజాకార్లు మతోన్మాదంతో హిందువుల్ని పీడిస్తూ నిజాంకు అండగా నిలుచున్నారు. గ్రామాలను దోచుకుంటున్నారు. రామిరెడ్డి నాయకత్వాన ఉన్న రేణుకుంట తదితర గ్రామాలను మాత్రం దోచుకోలేకపోయారు.

గ్రామీణ రక్షణ దళం

రేణుకుంట చుట్టుప్రక్కల దూరాన ఉన్న గ్రామాలలో రజాకార్లు సాగిస్తున్న అమానుషమైన హింసాకాండ గురించి రోజూ వార్తలు తెలుస్తూనే ఉన్నాయి. రామిరెడ్డి స్వయంగా మరో ప్రాంతానికి వెళ్ళిపోయే అవకాశాలున్నా వెళ్ళిపోలేదు. ఆయన భార్య, పిల్లలు తెనాలి వెళ్ళిపోయారు. తాను మాత్రం పెద్దకొడుకు రంగారెడ్డితో గ్రామంలోనే ఉంటూ గ్రామీణ రక్షణ దళాన్ని ఏర్పాటు చేశాడు. కొన ఊపిరి వరకు పోరాడి తన గ్రామాన్ని కాపాడుకోవాలన్న దృఢదీక్ష రామిరెడ్డిలో నెలకొంది. అరవై తుపాకులను తెప్పించి గ్రామీణ రక్షణ దళానికి తర్ఫీదు ఇప్పించాడు. తాను స్వయంగా ట్వెల్వ్‌బోర్ తుపాకిని తెప్పించుకున్నాడు. కొలిపాక నుండి పగడాల సత్తెయ్య, వేచల్ల పుల్లారెడ్డి ఆయుధాల శిక్షణ ఇవ్వటానికి వచ్చారు.

రామిరెడ్డి తన రెండంతస్తుల మేడ పైభాగంలో తుపాకులు అమర్చి శత్రువుల్ని ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేశారు. రాజాపేట నుండి రజాకార్లు వస్తే ఎదురుగా కాల్పులు జరపడానికి వీలుగా తన మేడకు ముందున్న చెట్లను నరికించి వేయించాడు. గ్రామస్తులు, రైతులు పొలాల్లో పనిచేస్తున్నా అవసరమైనప్పుడు జట్లు జట్లుగా వచ్చేయాలని కట్టుదిట్టం చేశాడు. ఈ ఏర్పాట్ల గురించి ముస్లిం అధికారులకు తెలిసింది. రేణుకుంటను దోపిడీచేసే అవకాశం చిక్కడం లేదని రజాకార్లు గోలపెట్టారు. హైద్రాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైపోవాలనే అభిప్రాయాన్ని రామిరెడ్డి ప్రజల్లో ప్రచారం చేశాడు. జాతీయభావాన్ని ప్రజల్లో మేల్కొల్పాడు. ఈ పరిణామాన్ని చూసి ముస్లిం అధికారులు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. రామిరెడ్డిని ఏ విధంగా నిర్మూలించాలని పన్నాగాలు పన్నసాగారు.

ఈ పన్నాగం కిందనే ఒక చతుష్టయం పథకం వేసింది. కొలిపాకలో ముస్లిం తహసిల్దార్, జగదేవపూర్‌లో అబ్దుల్ రహ్మాన్, రాజాపేటలో రజాకార్ల నాయకుడు హాషిం ఆలీ, ముస్త్యాలలోని రజాకార్ల సైనికాధికారి చోటేమియా కలిసి సాయుధ రజాకార్లు నిజాం సైనికుల సహాయంతో రేణుకుంటపై దాడిచేయాలని కుట్రపన్నారు. నిజాం సైనిక దళానికి చెందిన 50 మంది సిపాయిలు, 200 మంది సాయుధులైన పోలీసులు, రజాకార్లు ముస్లిం అధికార్ల నాయకత్వంలో బయలుదేరారు. 12 ట్రక్కులలో, జీపులలో హైద్రాబాద్ నుండి బయలుదేరిన ఈ దళం ఆలేరు  కొలిపాక మార్గం ద్వారా రాజాపేట్‌వైపు వస్తున్నది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here