Home News నేరస్తులను కాపాడారన్న ఆరోపణలపై నోరువిప్పని పోప్

నేరస్తులను కాపాడారన్న ఆరోపణలపై నోరువిప్పని పోప్

0
SHARE

లైంగిక నేరాలకు పాల్పడిన పాస్టర్లు, చర్చి అధికారులను కాపాడారంటూ వాటికన్ మాజీ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందించేందుకు పోప్ ఫ్రాన్సిస్ నిరాకరించారు. ఇర్లాండ్ లో పర్యటించిన పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ మాజీ అధికారి తయారుచేసిన 11 పేజీల పత్రం పై మాట్లాడబోనని స్పష్టం చేశారు. చర్చి అధికారులు పాల్పడిన నేరాలను పోప్ ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుతూ వచ్చారని, ఇప్పుడు ఆ నేరాలన్నీ బయటపడిన సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ రాజీనామా చేయాలని మాజీ అధికారి ఆ పత్రంలో డిమాండ్ చేశారు.  అమెరికా కార్డినల్ థియోడోర్ మెక్ కారిక్ చిన్నపిల్లలపై పాల్పడిన లైంగిక నేరాల గురించి పోప్ ఫ్రాన్సిస్ కు తెలుసని, తెలిసినా ఆ విషయాల్ని పట్టించుకోకుండా కార్డినల్ ను ఏకంగా తన `విశ్వసనీయ సలహాదారు’గా నియమించుకున్నారని ఆరోపించారు. తాను కార్డినల్ నేరాలను పోప్ దృష్టికి తీసుకువెళ్లిన వాటిని పట్టించుకోలేదని వాటికన్ మాజీ అధికారి వెల్లడించారు.

చర్చి అధికారులు చిన్న పిల్లలపై సాగించిన లైంగిక నేరాలను అరికట్టడంలో కాథలిక్ చర్చి పూర్తిగా విఫలమైందని ఐర్లాండ్ పర్యటనలో ఉన్న పోప్ విచారం వ్యక్తం చేశారు. ఇందుకు తాను ఎంతో `బాధ పదడమేకాక, సిగ్గు పడుతున్నానని’ పోప్ అన్నారు. మతాధికారుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులను ఆయన కలిశారు. కానీ నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయనున్నారనే విషయం గురించి మాత్రం పోప్ ఫ్రాన్సిస్ నోరువిప్పలేదు.