Home Telugu Articles కరోనా కష్టాన్ని అవకాశంగా మార్చుకున్న భారత్  

కరోనా కష్టాన్ని అవకాశంగా మార్చుకున్న భారత్  

0
SHARE

మాస్కులు, పీపీఈ కిట్ల తయారీలో భారత్ స్వావలంబన

భారత్ స్వావలంబన సాధించాలని, ప్రపంచంతో అన్నింటిలో పోటీ పడాలని ప్రధాని నిన్నటి తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. భారత ప్రజానీకం తలచుకుంటే ఎలాంటి కార్యమైన సాధ్యపడుతుందని చెపుతూ అందుకు ఉదాహరణగా వైద్యులకు అత్యవసరమైన సూట్ లు, మాస్క్ ల తయారీలో భారత్ అతి తక్కువకాలంలో స్వాలంబన ఎలా సాధించిందో ప్రస్తావించారు. ఆ వైద్య సూట్ ల తయారీ విజవంతమైన తీరు చదవండి.

కరోన సంక్షోభం వల్ల అనేక విషయాలు బయటపడ్డాయి. మన అలవాట్లు, ప్రాచీన కాలం నుంచి వస్తున్న పద్దతులు మనల్ని ఎలా కాపాడాయో తెలిసింది. అలాగే దేశంలోని వివిధ వర్గాల వారు ఈ సంకట సమయంలో ఎలా ప్రవర్తించారో, కొందరి బాధ్యతారహితమైన తీరు దేశం మొత్తంలో ఎలా ప్రమాదాన్ని పెంచిందో స్పష్టమయింది. దీనికి తోడు దేశంలో ఉన్న అంతర్గత శక్తి సామర్ధ్యాలు కూడా ప్రపంచానికి వెళ్లడయ్యాయి. కరోనను అడ్డుకోలేక అగ్రరాజ్యమే విలవిలలాడుతుంటే అపారమైన జనాభా కలిగి, వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే ఉన్న భారత్ సమస్యను నిబ్బరంగా ఎదుర్కొంది. అంతేకాదు ముఖ్యమైన మందులు, ఇతర సామగ్రిని ప్రపంచ దేశాలకు సరఫరా చేసింది కూడా. అలా భారత్ సాధించిన అద్భుతాల్లో  ఒకటి కరోనతో పోరుసలిపే వైద్య సిబ్బంది ధరించే ప్రత్యేక సూట్ ల తయారీ. వీటినే వ్యక్తిగత రక్షణ సామగ్రి (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ – పి పి ఇ) అంటారు.

మార్చ్ ప్రారంభంలో మన దేశంలో ఈ పి పి ఈ ల తయారీ దాదాపుగా లేదు. మనకు కావలసిన సూట్ లు చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి. మరోపక్క ప్రపంచ వ్యాప్తంగా పీపీఈ ల వాడకం పెరుగుతుండడం వల్ల విపరీతమైన కొరత ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలపై ఆధారపడటం కంటే సొంతంగా పీపీఈ లు తయారు చేసుకోవడమే ఉత్తమమని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన ప్రమాణాల ప్రకారం సూట్ ల తయారీకి వివిధ సంస్థల నుంచి చేనేత మంత్రిత్వ శాఖ నమూనాలను కోరింది. వెంటనే 12 వస్త్ర పరిశ్రమలు తమ నమూనాలను చేనేత పరిశోధన సంస్థకు సమర్పించాయి.  మరో 25 సంస్థలు ఆ తరువాత వారం రోజులకే తమ నమూనాలను ప్రభుత్వం ముందు ఉంచాయి.

చేనేత పరిశోధన సంస్థ ఈ నమూనాలను పరీక్షించి కొన్నింటిని ఆమోదించడం, ఆయా సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడం కొన్ని వారాల్లోనే జరిగిపోయింది. దీనితో మార్చ్ చివరినాటికి దేశంలో పీపీఈ ల ఉత్పత్తి మొదలైంది. ఏప్రిల్ మొదటి వారానికి రోజుకి 12 వేల సూట్ లు తయారుచేసే సామర్ధ్యం దేశం సంపాదించింది. ఈ ఉత్పత్తి క్రమంగా పెరిగి ఏప్రిల్ చివరికి రోజుకు ఒక లక్ష సూట్ ల తయారీ జరిగింది. ఈ ఉత్పత్తిని మరింత పెంచి మే చివరికి దేశంలో రోజుకు 2 లక్షల పీపీఈ లు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ పీపీఈలు తయారుచేసే కేంద్రాలు సగానికంటే ఎక్కువ బెంగళూరులో ఉన్నాయి. వాటితోపాటు  ప్రధానంగా  అలా తయారుచేసిన సూట్ లను తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, గుజరాత్ లోని అహ్మదాబాద్, వడోద్ర, పంజాబ్ లోని ఫగ్వార, లూధియానా, మహారాష్ట్రలోని భివండి, కుసుమనగర్, రాజస్తాన్ లోని దుంగార్పూర్, పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా , ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ మొదలైన స్థలాల్లో కూడా ఉత్పత్తి జరుగుతోంది.

ఈ సూట్ లు అన్నీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన సాంకేతిక ప్రమాణాలకు కచ్చితంగా సరిపోయే విధంగా తయారుచేస్తున్నారు.  ఇలా తయారైన పీపీఈ సూట్ లను కోయంబత్తూరులోని చేనేత పరిశోధన సంస్థ (సితారా)లోనూ, గ్వాలియర్ లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఈ)లోనూ క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతనే వైద్యసిబ్బందికి అందజేస్తున్నారు.

ఇలా రెండు నెలల కాలంలో దేశం వైద్య సిబ్బందికి అత్యవసరమైన రక్షణ సూట్ ల తయారీలో స్వావలంబన సాధించడమేకాక అనేక దేశాలకు వాటిని ఎగుమతి చేసే స్థితికి రావడం నిజంగా అద్భుతమైన విజయం.

లోకహితం మే మాసపు సంచిక నుండి….