Home News దేశప్రగతి కోసం అంతా కృషి చేయాలి – డా. మోహన్ భాగవత్

దేశప్రగతి కోసం అంతా కృషి చేయాలి – డా. మోహన్ భాగవత్

0
SHARE

పూజ్య సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ 71వ గణతంత్రదినోత్సవ సందర్భంగా సూర్యకుండ్ లోని సరస్వతీ శిశుమందిర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు.

జాతీయపతాకంలోని మూడు రంగుల విశేషత్వాన్ని ఆయన వివరించారు. ఈ మూడు రంగులు జ్ఞానం, కర్మ, భక్తిలను తెలియజేస్తాయని ఆయన అన్నారు. పైన ఉండే కాషాయ రంగు త్యాగానికి, మధ్యలోని తెలుపు పవిత్రతకు, క్రింద ఉండే ఆకుపచ్చ లక్ష్మీదేవి లేదా సంపదను సూచిస్తాయి. కాషాయ రంగు చూసినప్పుడు మనసులో ఒక గౌరవభావం కలుగుతుంది. మానవ జీవనం స్వార్ధం కోసం కాకుండా పరోపకారం కోసమని ఆ రంగు తెలియజేస్తుంది. దీనులు, దుఃఖితులకు సహాయం చేయడం కోసం మనం సంపాదించాలని చెపుతుంది. ఎంతగా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలంటే సర్వం ఇచ్చివేసిన తరువాత కూడా ఇంకా సమర్పించాలనే ఆలోచన మిగలాలి. జ్ఞానం, ధనం, బలం అనేవాటిని సదుపయోగం చేయడానికి జీవితంలో పవిత్రత, శుద్ధత అవసరం. జ్ఞానం రావణాసురిడికి కూడా ఉంది. కానీ మనస్సు శుద్ధంగా లేదు. మానసిక శుద్ధత ఉంటే జ్ఞానం విద్యాదానానికి, ధనం సేవాకార్యానికి, బలం దుర్బలులను రక్షించడానికి ఉపయోగిస్తాము. ఆకుపచ్చ సంపదకు, సమృద్ధికి ప్రతీక. మన దేశం త్యాగానికి ప్రాధాన్యతనిచ్చింది. కానీ దాని అర్ధం ఇక్కడ సంపద ఉండదని, దారిద్ర్యం తాండవిస్తుందని కాదు. సంపద అవసరమే. కానీ అది మనలో అహంకారాన్ని పెంచిపోషించడానికి కాదు. ప్రపంచంలో దుఃఖాన్ని, దీనత్వాన్ని తొలగించడం కోసం ఉపయోగపడాలి. అలాంటి సంపద, సమృద్ధి కోసం కృషి చేయాలి. రైతు కష్టపడితేనే పంటలు పండుతాయి. అలాగే అందరూ కృషి చేస్తేనే దేశం ముందుకు వెళుతుంది. భారతదేశం పురోగామిస్తే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది. దేశ రాజ్యాంగం పౌరులందరి హక్కులు, బాధ్యతలను స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ హక్కులు, బాధ్యతలు ఒక నియమం, కట్టుబాటుకు లోబడి ఉన్నప్పుడే దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన స్వాతంత్ర్య వీరుల కలలు సాకారమవుతాయి, వారు కోరుకున్న భావ్యభారతం నిజమవుతుందని డా. మోహన్ భాగవత్ అన్నారు.