Home Telugu Articles దేశభక్తి గల గురువులు అవసరం

దేశభక్తి గల గురువులు అవసరం

0
SHARE

— బూర్ల దక్షిణామూర్తి

ప్రస్తుత భారతీయ సమాజంలో గురువు పాత్రను నేటి విద్యా సంస్థలు, వాటిలో బోధన చేస్తున్న అధ్యాపక బృందాలు పోషించాలి. గురువులో జాతీయత పట్ల ప్రేమ, శ్రద్ధ ఉంటే, భావి పౌరులు కూడా దేశభక్తులుగా తయారవుతారు. నేటి సమాజంలో దేశం పట్ల అనంతమైన భక్తి గల గురువులు అవసరం.

గురువుకు ప్రాముఖ్యం

‘గురు గోవిందుడు, భగవంతుడు-వీరిద్దరూ ఒకేసారి దర్శనమిస్తే ముందుగా ఎవరి పాదాలకు నమస్కరిస్తారు ? అంటే కబీరుదాసు అంటారు ‘ముందుగా గురువుకు ప్రణమిల్లుతాను. ఎందుకంటే గురువు భగవంతుని చేరుకునే మార్గాన్ని చూపించారు కాబట్టి’.

‘స్వాతంత్య్రం నా జన్మహక్కు దీనిని సాధించి తీరుతాను’ అని గర్జించిన దేశభక్తుడు బాలగంగాధర్‌ తిలక్‌ను స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో పత్రికా విలేఖరులు ఇలా ప్రశ్నించారు ‘మీ నాయకత్వంలో దేశానికి స్వాతంత్య్రం లభించి, మన ప్రభుత్వం ఏర్పడినపుడు మంత్రివర్గంలో మీరు ఏ శాఖను తీసుకుంటారు?’. తిలక్‌ ఇలా జవాబిచ్చారు ‘స్వాతంత్య్రం రాగానే నేను తిరిగి పూనాలోని ఫర్గ్యూసన్‌ కళాశాలలో అధ్యాపకునిగా చేరుతాను. ఎందుకంటే నేను మంత్రివర్గంలో చేరితే ఒక్క మంత్రిత్వశాఖనే సమర్ధవంతంగా నిర్వహించగలను, కానీ కళాశాలలో చేరితే నాలాంటి అసంఖ్యాక ప్రతిభావంతులైన మంత్రులను తీర్చిదిద్దగలను’.

ఇదీ మన భారతీయ సంస్కృతిలో గురువు పాత్రకు ఉన్న ప్రాముఖ్యం. గురువు సమర్థుడైతే భావి పౌరులు కూడా సమర్థులుగా తయారవుతారు.

వ్యాసుడు

భారతదేశం కొన్ని వేల సంవత్సరాల పాటు విశ్వగురువుగా నిలిచింది. అందుకు మనకు నేటికీ అనేక ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తాయి. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి వేదవ్యాస మహర్షిని గురువుగా ఆరాధిస్తున్నారు. ఆయన ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించినట్టు పౌరాణిక కథ ఉంది. వ్యాసుని కాలం నేటికి సుమారు ఐదువేల సంవత్సరాలు పైనే.

వేదవ్యాసుడు అప్పటికే దుర్గమంగా ఉన్న వేదాలను శాస్త్రీయంగా విడగొట్టి తన శిష్యులకు అందించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయించాడు. వేదాలు భారతదేశం లోనే పుట్టినా అవి కేవలం భారతీయులకు మాత్రమే కాక విశ్వ మానవాళికి చెందిన అపూర్వ సంపద. అందుకే మన భారతీయులు వేద వ్యాసుడిని గురువుగా స్వీకరించారు. ఆయన జన్మించిన ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా భావించి, ఆ రోజున వ్యాస భగవానుని, ఆయన పేరుతో మన గురువులను శక్తి మేరకు పూజిస్తాము.

కాషాయ ధ్వజమే గురువు

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ స్థాపకులు పూజనీయ డాక్టర్జీ నిత్యశాఖలో మన సనాతన ధర్మ సంకేతమైన కాషాయ ధ్వజాన్ని (లేదా భగవాధ్వజం) గురువుగా స్వీకరించారు. అందువల్లనే సంఘంలో వ్యక్తి నిష్ఠ లేదు. కేవలం ధ్యేయ నిష్ఠ మాత్రమే ఉన్నది. వేలాది సంవత్సరాల మన పరంపరకు, సంస్కృతికి, చరిత్రకు, ధైర్య సాహసాలకు, దేశభక్తికి ప్రతీక కాషాయ ధ్వజం. సంఘ శాఖలలో నేడు లక్షలాది స్వయం సేవకులు తమ సాధనను ఈ ధ్వజఛాయలోనే కొనసాగిస్తున్నారు.

కాషాయమే ఎందుకు..

కాషాయానికి ప్రతీక సూర్యుడు. ఉదయించే సూర్యుడి కిరణాలు కాషాయరంగులోనే ఉంటాయి. లోకానికి నిజమైన బంధువు ఎవరంటే ‘సూర్యుడు’ అని చెప్పాలి. ఆయనకు లోకబాంధవుడని పేరు. బంధువు ఎలా ఉండాలో లోకానికి తేలియజేసే ఉజ్జ్వల గుణధాముడు సూర్యుడు. ఆయన అనుగ్రహం లేనిదే ఈ భూమండలం పై మానవుడే గాక ఏ ప్రాణి బతికి బట్ట కట్టలేదు. సూర్యరథానికి పురోగమనమే తప్ప తిరోగమనం లేదు. పొద్దంతా ప్రయాణించినా అలుపులేని పురోగామి సూర్యుడు. ఈ రథానికి ఒకటే చక్రం. సారథి అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు. అయినా సూర్యుడు ధృఢ సంకల్పుడు. సూర్యుడు లేనిదే భూమి లేదు. నీరు రాదు, గాలి ఉండదు, పంటలు పండవు, ధాన్యాలుండవు, పచ్చదనాలు నిలువవు, వెచ్చదనాలు కలగవు. లోకానికి సూర్యుడు చేస్తున్న మేలును లెక్కించలేం.

నేటి విభిన్న ప్రపంచ సంస్కృతులకు మూలం మన వేద సంస్కృతి. ఈ సంస్కృతికి యజ్ఞం ఆధారం. యజ్ఞశిఖలు కాషాయ రంగులోనే ఉంటాయి. అగ్నిని జ్వలింపజేసి అందులో ఆవు నెయ్యి, ఔషధులు మొదలగు సుగంధ ద్రవ్యాలతో, వేదమంత్రాలతో ఆహూతులిస్తూ హోమం చేయడం మన యజ్ఞ సంస్కృతి. దీనివల్ల ఆకాశంలో ఉన్న నీటి ఆవిరి వర్షంగా మారి భూమిపై కురుస్తుంది.

ఈ యజ్ఞ కార్యాన్ని మన వ్యక్తిగత జీవితంతో అన్వయించుకోవచ్చు. అదేమంటే వ్యక్తిగత జీవితమనే సమిధను సమష్టి జీవనం అనే యజ్ఞంలో సమర్పించు కోవటం. సద్గుణాలనే అగ్నిలో ‘అయోగ్యం, అనిష్ట, అహితమైన మాటలు’ వంటి వాటిని వేసి భస్మం చేయడం. తద్వారా త్యాగమయ, సేవామయ, తపోమయ జీవనం గడపటం.

మన సంస్కృతిలో సువ్యవస్థిత మానవ జీవనం కొరకు నాలుగు ఆశ్రమ వ్యవస్థలు రూపొందించారు మన ఋషులు. మొదటి బ్రహ్మచర్యాశ్రమం. ఇందులో విద్యార్జన చేస్తాం. రెండవ ఆశ్రమం గృహస్తు జీవనం. ఇందులో సామాజిక బాధ్యతను నిర్వహిస్తాం. మూడవది వానప్రస్థం. ఈ ఆశ్రమంలో సమాజసేవ చేస్తాం. చివరిదైన సన్యాసాశ్రమం చాలా శ్రేష్టమైనది. ఇందులో సర్వసంగ పరిత్యాగం చేసి, పవిత్ర జీవనం గడపాలి. సన్యాసి తాను అనునిత్యం త్యాగానికి రూపమైన యజ్ఞశిఖలలో నిలబడ్డానని గుర్తుంచు కోవాలి. అందుకు గుర్తింపుగా కాషాయ వస్త్రాలను ధరిస్తారు.

ఈ విధంగా సన్యాసాశ్రమానికి, ఉదయించే సూర్యుడి కిరణాలకు, యజ్ఞశిఖలకు ప్రతిరూపం కాషాయ ధ్వజం. ఈ ధ్వజం ద్వారా త్యాగగుణమూ, స్పూర్తిని పొంది ‘నేను నాకోసం కాదు, సమాజం కోసం, దాని ఉన్నతి కోసం’ అని స్వయంసేవక్‌ భావిస్తాడు. సాధారణంగా సమాజంలో వ్యక్తులు తమ స్వంతం కోసమే పాటుపడుతుంటటారు. నేను మాత్రమే సుఖంగా ఉండాలని ఆలోచిస్తారు. కాని భగవంతుడు అన్ని జీవుల కన్న ఉన్నతమైన వాడిగా మనిషిని సృష్టించాడు. ఇలాంటి మనిషి పశువులా జీవిస్తే రెంటికీ తేడా ఏముంటుంది?

ఆహారం, నిద్ర, భయం, మైథునం – ఇవి ఈ లోకంలోని అన్ని జీవులకు సమానమే. కాని ‘మనిషి ధర్మం తప్పి జీవిస్తే పశువే అవుతాడ’ని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

గురువు – దేశభక్తి

వేదవ్యాసుడు ఇలా అన్నారు..

అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనం ధృవం

పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం

పరపీడనం పాపం, పరోపకారం పుణ్యం. ఇదే పదహారు పురాణాల సారాంశం.

అందుకే ఇతరుల కోసం జీవించడం మన సహజ లక్షణం కావాలి. మానవేతర జీవులన్నీ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా జీవిస్తాయి. కాని మనిషికి మాత్రమే మనిషిగా జీవనం గడపమని భగవంతుడు పదేపదే గుర్తు చేస్తాడు. అలా గుర్తు చేస్తున్న భగవంతునికి ప్రతీక ఈ కాషాయ ధ్వజం.

భగవద్గీతలో భగవాన్‌ శ్రీ కృష్ణుడు ఇలా అంటారు ‘శ్రేష్ఠమైన వ్యక్తులు ఎలా ఉంటారో సామాన్యులు వారిని అనుసరిస్తారు’.

నేడు మనం మన బాధ్యతను ఎలా నిర్వహిస్తున్నామో ఒకసారి ప్రశ్నించుకోవాలి. సమాజంలో మనం ఉదాసీనంగా ఉన్నందున అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఆచార్య చాణక్యుడు ఇలా అన్నాడు ‘సమాజానికి ఎక్కువ కీడు నిష్క్రియులైన మంచివారి వల్లనే’.

ప్రస్తుత భారతీయ సమాజంలో గురువు పాత్రను నేటి విద్యా సంస్థలు, వాటిలో బోధన చేస్తున్న అధ్యాపక బృందాలు పోషించాలి. కాని ఢిల్లీలోని జె.ఎన్‌.యు., బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయం, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, మద్రాసు ఐఐటి వంటి ఉన్నత విద్యాసంస్థలలో పనిచేస్తున్న కొందరు గురువులు తమ విద్యార్థులకు జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని, దేశభక్తికి బదులు విదేశ భక్తిని నూరిపోస్తున్నారు. జాతి వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి చాలా విద్యా సంస్థలలో గురువులుగా ఇటువంటి జాతి వ్యతిరేక మేధావులు జొరబడ్డారు. పాకిస్తాన్‌ ఏమి కోరుకుంటుందో ఈ మేధావులు తమ గళం ద్వారా వినిపిస్తున్నారు. పాకిస్తాన్‌ కోరుతున్నది రహస్యమేమీ కాదు, భారత్‌ను ముక్కలు చేయడమే దాని చిరకాల వాంఛ.

గురువులో జాతీయత పట్ల ప్రేమ, శ్రద్ధ ఉంటే, భావి పౌరులు కూడా దేశభక్తులుగా తయారవుతారు. నేటి సమాజంలో దేశం పట్ల అనంతమైన భక్తి గల గురువులు అవసరం. అటువంటి అనంత దేశభక్తిని నూరిపోసేది మన కాషాయ ధ్వజం. అందుకే సంఘం ఈ ధ్వజాన్ని గురువుగా స్వీకరించింది.

పవిత్రమైన ఈ గురు పూర్ణిమ నాడు మన గురువైన కాషాయ ధ్వజాన్ని పూజిద్దాం. ఈ గురువును పూజించడమంటే సంఘ కార్యంపై సంపూర్ణ నిష్ఠను ఉంచటమే. ఈ కార్యంలో నిరంతరం కొత్తవారిని జోడిస్తూ ఈ సాధనను కొనసాగిద్దాం. మన భారత మాత తిరిగి విశ్వగురువు స్థానాన్ని అధిష్టించాలి. అదే మన లక్ష్యం.

(రచయిత   ఆర్‌.ఎస్‌.ఎస్‌. తెలంగాణ ప్రాంత సంఘచాలక్)

This article was first published in 2019