Home Telugu Articles ధనార్జనలో ధార్మికత.. భారతీయ ఆర్ధిక వ్యవస్థ

ధనార్జనలో ధార్మికత.. భారతీయ ఆర్ధిక వ్యవస్థ

0
SHARE

ప్రతిరోజూ ఉదయం ఆరుగంటల సమయం.. పూల వ్యాపారం నిర్వహించే మహిళలంతా తమ పూల గంపలు తీసుకుని ఒకచోటకి చేరతారు. సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తి అక్కడికి చేరుకుంటాడు. అడిగినవారందరికీ తలా వెయ్యి రూపాయల వంతున ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న వారంతా వెళ్లి పెద్ద పూల మార్కెట్‌లో పువ్వులు కొని తీసుకువచ్చి అక్కడి దేవాలయాల దగ్గర, కూడళ్లలోను అమ్మకాలు ప్రారంభిస్తారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకి అమ్మకాలు పూర్తవుతాయి. ఉదయం డబ్బు ఇచ్చిన వ్యక్తి మళ్ళీ వస్తాడు. అతడివద్ద డబ్బు తీసుకున్నవారంతా అతడిచ్చిన వేయి రూపాయలకు మరో వంద రూపాయలు కలిపి అప్పటికప్పుడే తిరిగి ఇచ్ఛేస్తారు. రోజును బట్టీ, గిరాకీని బట్టి అక్కడి మహిళలకు వ్యాపారంలో రెండు నుంచి మూడు వందల రూపాయలు మిగులుతాయి. వడ్డీ వ్యాపారి వెళ్లిపోగానే వీరు వెంటనే ఇళ్లకి వెళ్లరు. ఆ వెంటనే చిట్టీల వ్యాపారి వస్తాడు. అతడికి చెల్లించవలసింది చెల్లిస్తారు. చివరికి మిగిలిన వంద లేదా నూట యాభయ్‌ రూపాయలు మాత్రం ఇంటికి తీసుకువెళతారు.

తమిళనాడు కోయంబత్తూరులోని ఒక ప్రాంతంలో పూల వ్యాపార సముదాయం వద్ద నిత్యం కనిపించే దృశ్యం ఇది. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే మనకు కనిపించే పొదుపు విధానం. దీని వెనుక భారతీయ సంస్కృతి ప్రభావం ఎంతో ఉంది.

దాదాపు పదిహేనేళ్ల క్రితం.. కోయంబత్తూరులోని శాస్త్ర విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్‌ పాఠ్యంశాలు బోధించిన ఆచార్య కనకసభాపతి ఆధ్వర్యంలో ఒక బృందం దేశంలో 300 ప్రాంతాలలో పర్యటించి అన్ని వర్గాలకీ చెందిన వారితో మాట్లాడి కొన్ని వివరాలు సేకరించింది. పొదుపు చేయాలంటే చదువుకుని ఉండాలని , అది మధ్య తరగతికి చెందిన అలవాటనే భ్రమలు దీనితో పోయాయి. కొన్నేళ్ల క్రితం కోయంబత్తూరులోనే పూలదుకాణదారుల పొదుపు విధానం గురించి ఈ బృందం ఒక అధ్యయనం నిర్వహించింది. అక్కడ ఈ విధమైన వ్యాపార బృందం సంవత్సరానికి చేసే పొదుపు 7.3 లక్షలుగా తేలింది. ఇలా ఎన్నో బృందాలు పొదుపు చేసేవి. ఆ నగరంలో 25 నుంచి 30 పెద్ద పూల మార్కెట్లు ఉన్నాయి. పొదుపు అనేది మనకు తెలియకుండానే మన జీవితంలో భాగం కావడం వెనుక మన సంస్కృతి ఉంది.

ధనం మూలం ఇదం జగత్‌…’ ఈ జగతి జీవనాధారానికి మూలం ధనమే అంటుంది మన ఈ ప్రాచీన శ్లోకపాదం. భారతీయత లేదా హిందూ జీవన విధానంలో పారమార్థిక చింతనే ప్రధానం అనుకోవడం ఒక అపోహ. భౌతిక ప్రపంచంలోని అన్ని కోణాలను అది ప్రభావితం చేసింది. వైద్యం, విజ్ఞానశాస్త్రం, రాజనీతి, సైనిక వ్యవహారాలు, సాహిత్య సిద్ధాంతాలు, విమర్శ, రంగస్థలం, ఖనిజశాస్త్రం, సముద్ర రవాణా వంటి వాటి మీద భారతీయత ముద్ర సుస్పష్టం. గణితం, దానితో పాటు ఆర్థిక విషయాలు కూడా ఉన్నాయి. కానీ విదేశీయులు సాగించిన వందలాది దండయాత్రలు, కొన్ని శతాబ్దాల విదేశీపాలన మనవైన శాస్త్రాలను మరుగుపరిచాయి. దానికి తోడు స్వతంత్ర భారతదేశంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు దిగుమతి చేసుకున్న రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల పట్ల చూపించిన శ్రద్ధ మనవైన శాస్త్రాల మీద చూపలేదు. వాటి మీద అనేక అపోహలు. ఇంకా గట్టిగా చెప్పాలంటే బానిస మనస్తత్వం. ఆ అపోహలను తొలగించడానికి ఇటీవల ఒక గవేషణ మొదలయింది. మన మూలాలను వెతుక్కుంటూ, భారతీయ ఆత్మ కోసం అన్వేషణ ఆరంభమైంది. దాని ఫలితంగా విస్తుపోయే ఫలితాలు వెలుగు చూస్తున్నాయి. ఆ క్రమంలో బయటపడినవే భారతీయ అర్థశాస్త్ర స్వరూపస్వభావాలు. ఇవి సిద్ధాంతాల రూపంలో పుస్తకాలలో నిక్షిప్తమై లేవు. కొన్ని అక్షరబద్ధమై ఉన్నా లుప్తమైపోయాయన్న మాట చారిత్రక సత్యం. కానీ జీవన విధానంలో అవి ఈరోజుకీ ప్రతిబింబిస్తున్నాయి.

సామాజిక జీవనంలో, సంస్కృతిలో, ఒక్కటే మిటి ప్రతి కోణంలోను అర్థశాస్త్రం ఇమిడి ఉంది అంటారు ఏకాత్మతా మానవతావాద శిల్పి పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ. అసలు అర్థశాస్త్రం అంటే జీవన విధానంలో అంతర్భాగమని నిర్వచించారాయన. నిజానికి అర్థశాస్త్రమనే కాదు, భారతదేశంలో ఆవిర్భవిచంచిన ఏ ఇతర శాస్త్రమైనా కూడా సాధారణ ప్రజల ఆలోచనలకు అతీతమైనట్టు కనిపించే పడికట్టు పదాలతో, సూత్రీకరణలతో ఉండదు. వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, చివరికి దేశానికి కూడా అర్థశాస్త్రం కీలకం. ఎందుకంటే మానవాళి మౌలిక లక్షణం అభివృద్ధి వైపు అడుగులు వేయడం. ఈ పురోగతి సంపూర్ణ సమాజం వైపు తీసుకుపోయేది కూడా. అంతేకానీ యాంత్రికమైనదీ, భౌతికదృష్టికే పరిమితమైనదీ కాదు. సిద్ధాంతాల భేషజం కూడా కాదు. ఎలాంటి రంగుటద్దాలు లేకుండా ఇవాళ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే ఇవన్నీ అర్థమవుతాయి. వీటితో పాటు సాధారణ ప్రజల ఆర్థిక వ్యవహారాల మీద భారతీయత, హిందుత్వ ప్రభావం విశేషంగా కనిపిస్తుంది.

ధర్మం, ధనార్జన రెండు కళ్లుగా భారతీయ ఆర్థిక వ్యవస్థ నడిచిన దృష్టాంతాలు చరిత్రలో కనిపిస్తాయి. గడచిన రెండు వేల ఏళ్లలో ప్రపంచ దేశాలలో వాణిజ్యం అభివృద్ది చెందిన తీరుతెన్నుల గురించి 1985 నుంచి చాలా సంస్థలు అధ్యయనాలు ఆరంభించాయి. వీటిలో అంగస్‌ మ్యాడిసన్‌ అధ్యయనం చాలా అంశాలను వెల్లడించింది. ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్థానం కూడా ఉంది. ఆయన అధ్యయనం ప్రకారం ఈ రెండు వేల ఏళ్లలో దాదాపు 75 శాతం కాలంలో భారత్‌ బలీయమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగింది. భారత్‌తో పాటు చైనాను కూడా కలిపి చూస్తే ఆ కాలం 85 శాతానికి పెరుగుతుంది. ఆ కాలంలో ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటా 32.9 శాతం. అయితే భారత్‌లో వాణిజ్యానికి ధనార్జనే ధ్యేయంగా లేదు. దానికి కొన్ని విలువలు ఉన్నాయి.అప్పుడు వాణిజ్య సమూహాలు ఉండేవి. వీటినే గిల్డ్‌లు అనేవారు. అంటే శ్రేణులు. ఈ గిల్డ్‌లకు కూడా ధార్మికమైన బాధ్యతలు ఉండేవి.దానినే శ్రేణి ధర్మం అనేవారు. కానీ తరువాత పరిస్థితులు మారాయి.

కొద్దికాలం క్రితం గడచిన 10-11 సంవత్సరా లలో ప్రపంచంలో పెట్టుబడుల ధోరణి ఎలా ఉందో ఒక నివేదిక వెలువడింది. స్వంత దేశానికి డబ్బులు పంపించడంలో ప్రవాస భారతీయులే అగ్రస్థానంలో ఉన్నట్టు ఆ నివేదిక వెల్లడించింది. చైనీయులు, మెక్సికన్లు ఇలా చాలా జాతుల వారే చాలా దేశాలలో పనిచేస్తున్నారు. కానీ స్వదేశానికి పెద్ద మొత్తంలో డబ్బు పంపించేది మాత్రం భారతీయులేనని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇక్కడ పూలు అమ్ముతూ వందలు మాత్రమే సంపాదించగలిగేవారూ, సంపన్న దేశాలకు వెళ్లి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ లక్షలలో, కోట్లలో ప్యాకేజీలు తీసుకునే విద్యావంతులు కూడా పొదుపు విషయంలో ఒకే తీరులో ఆలోచిస్తున్నా రంటే దానికి కారణం సంస్కృతి ఇచ్చిన సంస్కారం తప్ప మరొకటి ఏదీ కాదు.

భారతీయ ఆర్థిక వ్యవస్థ – పొదుపు

పొదుపు భారతీయ జీవనంలో అంతర్భాగమన్న సంగతికానీ, పొదుపుగా ఖర్చు చేయాలన్న చింతన మన ఆలోచనలో సహజంగా ఉంటుందన్న వాస్తవంగానీ చాలామంది పట్టించుకోరు. ఎందుకంటే దీనిని సూత్రీకరించి, బరువైన పదాలతో విశ్లేషించే గుణం వారికి ఉండదు. ప్రపంచంలోనే పొదుపు చేసే లక్షణం ఉన్న వ్యవస్థగా భారతీయ సమాజం గుర్తింపు పొందింది. నేటికి కూడా మన స్థూల జాతీయ ఉత్పత్తిలో 30 శాతం పొదుపు ద్వారానే సమకూరుతున్నది. ఈ లక్షణం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఈ సంగతిని అధ్యయనం చేస్తే చక్కని విషయాలు తెలుస్తున్నాయి. సాధ్యమైనంత పొదుపు చేద్దామన్న ఆలోచన ప్రతి కుటుంబంలోని తల్లికి, తండ్రికి ఉంటుంది. పొదుపు చేసి సంతానానికి ఇచ్చి ‘వెళ్లడం’ అనేది వారికి సహజంగా ఏర్పడే ఆలోచన. నాలుగు డబ్బులు వెనకేయడం అనే చింతన వెనుక దీర్ఘమైన ప్రణాళిక అంటూ ఏదీ కనిపించదు. అంటే ఆ సంగతి వారికి కూడా తెలియదు. పిల్లలకు మెరుగైన జీవితం అందించాలి. అందుకు మెరుగైన విద్య అందాలి. మెరుగైన సంబంధాలు తేవాలి వంటి ఆలోచనలే తల్లిదండ్రులను, ఇతర పెద్దలను పొదుపుకు ప్రేరేపిస్తున్నాయి. చిన్న మొత్తాలే పొదుపు రూపం దాల్చి భవ్యమైన జీవితాలకు బాటలు వేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1950-51 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పొదుపు నమోదయింది. ప్రస్తుతం అగ్రరాజ్యాల హోదా అనుభవిస్తున్న కొన్ని దేశాలలో ఆ కాలంలో ఈ స్థాయి పొదుపు మొత్తాల శాతం నమోదు కాలేదు.

కార్పొరేట్లలోను భారతీయత

కార్పొరేట్‌ సంస్కృతి భారతదేశానికి ఒక విధంగా కొత్తదే. దీని మీద కూడా భారతీయ ప్రభావం ఉంది. భారతీయ, పాశ్చాత్య కార్పొరేట్లను పోల్చి చూసినప్పుడు ఈ తేడా తెలుస్తుంది. తరగతి గదిలో ఫైనాన్స్‌ను బోధించేటప్పుడు అధ్యాపకుడు షేర్‌ కేపిటల్‌, రిజర్వుల గురించి ప్రస్తావించాలి. రిజర్వు ఎందుకు? సంస్థ అనుకోకుండా ఇబ్బందుల్లో పడితే రక్షించుకోవడానికే రిజర్వ్. షేర్‌ కేపిటల్‌, రిజర్వు ఏ నిష్పత్తిలో ఉండాలి? 1:1 అయితే మంచిది. 1:2 అయితే ఇక ఆదర్శనీయమే. అంటే 50 కోట్ల కేపిటల్‌కి వందకోట్లతో రిజర్వు. ప్రస్తుతం పాశ్చాత్య కార్పొరేట్లు అనుసరిస్తున్న నిష్పత్తి ఈ తీరులోనే ఉంది. అదే ఒక భారతీయ కార్పొరేట్‌ కంపెనీని తీసుకోండి! షేర్‌ కేపిటల్‌ విలువకీ, రిజర్వు నిల్వల శాతం 25, 30, 40, 100.. కొన్ని కొన్ని సంస్థలలో 200, 300 నిష్పత్తిలో కూడా ఉంటాయి. తమిళనాడు మర్కంటయిల్‌ బ్యాంక్‌ (టీఎంబి) ఇందుకు గొప్ప నిదర్శనం. 1921లో కల్లుగీత వర్గం వారు దీనిని స్థాపించుకున్నారు. మొదట దీనిని నాడార్‌ బ్యాంక్‌ అని పిలిచేవారు. 1960 దశకంలో తమిళనాడు మర్కంటయిల్‌ బ్యాంక్‌ అని పేరు మార్చి విస్తరించారు. 2016 వరకు ఈ బ్యాంక్‌ కేపిటల్‌ రూ. 28 లక్షలు. కానీ రిజర్వు రూ. 250 కోట్లు. దీనికి శరవేగంగా పెరిగిన బ్యాంకులలో ఒకటిగా కీర్తి కూడా దక్కింది. అంటే ఈ బ్యాంక్‌ పొరపాటున నష్టాలలో కూరుకుపోవడం మొదలయినా కూడా కొన్ని శతాబ్దాల పాటు కార్యకలాపాలు నిర్వహించగలుగుతుంది. వీరు ప్రకటిస్తున్న డివిడెండ్‌ కూడా 800 శాతం, 900 శాతం, 1000 శాతం, 1100 శాతం. ఇందులో కనిపించేది కేవలం పొదుపు మాత్రమే కాదు, నిధుల సేకరణ నైపుణ్యం కూడా. ఈ నిధులను సామాజిక దృష్టితో సేకరించే అలవాటు బ్రిటిష్‌ వారు దేశం విడిచిపోయిన తరువాతే ఆరంభమయింది. ఒక సమూహమంతా కలసి నిధిని సృష్టించడం, దానితో ఆ వర్గం మొత్తం ఆర్థికంగా పురోగమించడం కూడా మన సమాజంలో ఉంది. ఇందుకు దక్షిణ తమిళనాడును ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ నిధి సేకరణకీ, దానిని ఒక వర్గం అభివృద్ధికి వినియోగించడం అనే విధానం ఒక దేవత సాక్షిగా మాత్రమే జరుగుతోంది. ఆమే అమ్మ దేవత. 70 ఏళ్ల క్రితం ఆ వర్గం ఆర్థికంగా బాగా వెనుకబడి ఉండేది. ఇప్పుడు చాలా పురోగమించింది. చాలాకాలం క్రితం ఆ గ్రామం మొత్తం అమ్మతల్లి విగ్రహం ముందు ప్రమాణం చేశారు. తాము సంపాదించే ప్రతి రూపాయిలోను పావలా వంతున జమ చేయాలి. కొద్దికాలం గడిచిన తరువాత ఎవరు వ్యాపారం చేయదలిచినా ఆ ఉమ్మడి నిధి నుంచి డబ్బులు తీసి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందింది. తరువాత ప్రతి గ్రామం ఇదే ఆరంభించింది. నేటికి దక్షిణ తమిళనాడు చిల్లర వర్తకంలో అగ్రస్థానం సంపాదించడం వెనుక ఉన్న కారణం అమ్మ దేవత. శివకాశిలో బాణసంచా పరిశ్రమ వృద్ధి చెందడానికి కూడా ఇలాంటి సంప్రదాయమే కారణం. అక్కడ దీనిని మఘమాయి అంటారు. పశ్చిమ తమిళ నాడులో ఇంకొక విధంగా ఉమ్మడి నిధిని పెంపొందించుకున్నారు. అది చూడడానికి చిట్‌ఫండ్‌ వ్యాపారంలాగే ఉంటుంది. కానీ అక్కడ ఎవరు ఎక్కువ పాడితే వారికి డబ్బు ఇచ్చే పద్ధతి నడవదు. ఒక నెల ఒక కుటుంబం ముందుగా చెప్పి తీసుకుంటుంది. ప్రతి నెల చిట్‌ఫండ్‌ సభ్యుల సమావేశానికి అంతా వస్తారు. కుటుంబాలు కూడా వస్తాయి. అందరి ముందు ముందుగా చెప్పిన కుటుంబానికి డబ్బు అందిస్తారు. అంతా కొద్దిసేపు మాట్లాడుకుని వెళ్లిపోతారు. తద్వారా సమైక్యత కూడా పెరిగింది.

ఇది మన భారతీయల పొదుపు విధానం. ఇటువంటి విధానాలు, విషయాలు మనకు దేశంలోని ప్రతి ప్రాంతంలో వివిధ రూపాలలో దర్శనమిస్తాయి. భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ, కుటుంబ భాద్యత అనేవి అత్యంత కీలకమైనవి.

Source: Jagriti

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here