Home News కశ్మీరీ యువకుడు నబీల్‌ వానీ గురించి మీకు తెలుసా?

కశ్మీరీ యువకుడు నబీల్‌ వానీ గురించి మీకు తెలుసా?

0
SHARE

మీకు బుర్హన్‌ వానీ గురించి తెలుసు. కానీ నబీల్‌ అహ్మద్‌ వానీ గురించి తెలుసా?

బుర్హన్‌ వానీ గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే పత్రికలు, ఛానెళ్లు ఆ కరడుగట్టిన ఉగ్రవాదిని ఒక పాలుగారే పసివాడిలా చిత్రీకరించి, హీరోగా చేసేశాయి. ఆ ఉగ్రవాది చనిపోతే వాస్తవాన్ని చెప్పడానికి బదులు ఒక స్కూలు టీచర్‌ కొడుకు, యువకుడు, కశ్మీరీ యువ ఆకాంక్షలకు ప్రతీక లాంటివాడు చనిపోయాడని బర్ఖాదత్‌ అంతటి వారు బుర్హన్‌ వానీ ని షహీదు చేసేశారు. సలాములు కొట్టేశారు.

నబీల్‌ అహ్మద్‌ వానీ గురించి పత్రికలు రాయవు. ఛానెళ్లు చెప్పవు. పాలుగారే పసివాడు, స్కూలు టీచరు కొడుకు, యువకుడు, కశ్మీరీ యువత ఆకాంక్షలకు ప్రతీక అని ఏ బర్ఖాదత్‌ లూ పంచముఖాలతో ప్రశం సించరు. శెభాష్‌లు లేవు. సాహోలూ ఉండవు.

నబీల్‌ ఇంటిపేరు బుర్హన్‌ ఇంటి పేరు ఒక్కటే. ఇద్దరూ ముస్లిములే. ఇద్దరు జమ్మూ కశ్మీర్‌ వాసులే. ఇద్దరూ మంచుకొండల మధ్య, కుంకుమ పూవుల తోటల మధ్య పెరిగిన వారే. బుర్హన్‌ ది దక్షిణ కశ్మీర్‌ లోని ట్రాల్‌. నబీల్‌ ది ట్రాల్‌ ని ఆనుకుని ఉన్న ఉధమ్‌పూర్‌ జిల్లా. బుర్హన్‌ కుటుంబంలో తండ్రి కాలేజీ ప్రిన్సిపాల్‌. తల్లి పోస్టు గ్రాడ్యుయేట్‌, మహిళలకు ఖురాన్‌ నేర్పిస్తుంది. అన్న ముజఫర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌. నబీల్‌ తండ్రి రఫీక్‌ అహ్మద్‌ వానీ స్కూలు టీచర్‌.

నబీల్‌ కీ, బుర్హన్‌ కీ చిన్నప్పుడు ఒకటే కోరిక. భారత సైన్యంలో చేరాలి. యూనిఫారం ధరించాలి. దేశం కోసం పోరాడాలి. నబీల్‌ కోరిక నానాటికీ పెరిగింది. సైన్యం తప్ప అతనికి మరొక ఆలోచన లేదు. అయితే బుర్హన్‌ కి పదిహేనేళ్లు వచ్చే సరికి ఏదో ఒక యూనిఫారం ధరించి, ఏదో ఒక తుపాకీ చేత పట్టుకోవడమే ధ్యేయమైపోయింది. ఉగ్రవాదులు ఇచ్చిన తుపాకీని పట్టుకున్నాడు. సోషల్‌ మీడియాపై సాధికారిత సాధిస్తే చాలనుకున్నాడు. పదో తరగతిలోనే, పదిహేనేళ్ల వయసులోనే హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరిపోయాడు.

నబీల్‌ పదోతరగతి ఫస్టుక్లాసులో పాసయ్యాడు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేశాడు. కాలేజీలో టాపర్‌గా నిలిచాడు. జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. కానీ భద్రతాదళాల్లో చేరాలన్న కోరిక మాత్రం అంతరించిపోలేదు. 2016 లో బిఎస్‌ఎఫ్‌ వారు నిర్వహించే పరీక్షలు వ్రాశాడు. మొత్తం జమ్మూ కశ్మీర్‌లోనే టాపర్‌ గా నిలిచాడు. బిఎస్‌ఎఫ్‌ యూనిఫారం ధరించి ఉగ్రవాదులపై పోరాడేందుకు ముందుకు వచ్చాడు. ‘నా కొడుకు చిన్నప్పట్నుంచీ సైనికుడు కావాలనుకున్నాడు. అనుకున్నది సాధించాడు’ అని అతని తల్లి హనీఫా బేగమ్‌ ఆనందాన్ని వ్యక్తం చేసింది. నబీల్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ గా బిఎస్‌ఎఫ్‌ లో చేరాడు. ఉగ్రవాదుల నుంచి అతని కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి. చంపేస్తామంటూ ఫోన్లు వస్తున్నాయి. కానీ నబీల్‌ బిఎస్‌ఎఫ్‌ ని వదిలేది లేదంటున్నాడు. ‘తప్పుడు మార్గం ఎంచుకోవడం చాలా సులభం. మంచి మార్గాన్ని ఎంచుకోవడం చాలా కష్టం. కానీ అంతిమ విజయం మాత్రం ఎప్పుడూ మంచివారిదే’ అంటాడు నబీల్‌. బిఎస్‌ఎఫ్‌ పరీక్షల్లో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచిన తరువాత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నబీల్‌ను ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించుకుని అభినందించారు.

నబీల్‌ లక్ష్యం ఉగ్రవాదాన్ని అణచివేయడం. జమ్మూ కశ్మీర్‌ యువత దేశద్రోహుల వైపు, ఉగ్రవాదం వైపు వెళ్లకుండా నిలువరించాలన్నదే అతని ధ్యేయం. ‘మనం చదువుకోవాలి. పెన్ను పట్టుకోవాలి. చేతిలో రాళ్లు తీసుకుంటే మనం ముందుకెళ్లలేము. మనం చదువుకున్నప్పుడే ముందుకు వెళ్లగలం’ అంటాడు నబీల్‌. 2017 మే నెలలో ఉగ్రవాదులు అతడిని, అతని చెల్లెలిని చంపేస్తామని బెదిరించారు. కానీ నబీల్‌ తన పనిని మానలేదు.

‘కశ్మీర్‌ లోయలోని 95 శాతం మంది యువకులు దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు. ఉగ్రవాదం వైపు వెళ్తున్న వారి సంఖ్య అయిదు శాతానికి మించదు. యువకులు సైన్యంలో చేరవలసిన అవసరం ఉంది. సైన్యం గురించిన అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉంది’ అంటాడు నబీల్‌. ప్రస్తుతం నబీల్‌ బిఎస్‌ఎఫ్‌ శిక్షణ పొందు తున్నాడు. త్వరలో నబీల్‌ వానీ బుర్హన్‌ వానీ వంటి వారిపై తుపాకులను సంధించబోతున్నాడు.

నిజానికి జమ్మూ కశ్మీర్‌లో, ముఖ్యంగా కశ్మీర్‌ లోయలో బుర్హన్‌ వానీ వంటివారికి, నబీల్‌ వానీకి మధ్య పోరాటం జరుగుతోంది. ఈ రోజు కాకున్నా రేపు నబీల్‌ గెలుపు ఖాయం. నబీల్‌ వానీవంటి వారు ఉన్నంత వరకూ జమ్మూ కశ్మీర్‌ భద్రతకు ఢోకా లేదు. పాక్‌ పన్నాగాలకు విజయం రాదు.

– ప్రభాత్‌

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here