Home Rashtriya Swayamsevak Sangh డాక్టర్ జీ ఒక యుగద్రష్ట

డాక్టర్ జీ ఒక యుగద్రష్ట

0
SHARE

పరమ పూజనీయ డాక్టర్ జీ ఒక గొప్ప దేశభక్తుడు, భారతమాత సంతానంలో అగ్రగణ్యుడు. భావితరాలకు ఒక ఆదర్శమూర్తి గా వెలుగొందిన నాయకుడు. కళ్ళకు కనిపించే దృశ్యంను చూడడాన్ని దృష్టీ అంటారు. భవిష్యత్తులో జరగబొయ్యే దాన్ని ఊహించి పని ప్రారంభించే వారిని ద్రష్ట అంటారు. అలా డాక్టర్జీ భవిష్యత్తులో జరుగబొయే దానిని ఊహించిన గొప్పవారు అందుకే డాక్టర్ జీని యుగద్రష్ట అంటారు .

ఒక  వ్యక్తి గొప్పదనాన్ని ఎలా గుర్తించగలము అంటే ఆ వ్యక్తి జీవితం భావితరాల మీద ఎంత మంచి ప్రభావం చూపిస్తుందో దానిని బట్టి ఆవ్యక్తి గొప్పతనాన్ని మనం గుర్తిస్ధాము.

పండిట్ జవహరలాల్ నెహ్రు, డాక్టర్ జీ ఒకే సంవత్సరం అంటే 1889 లో జన్మించారు. స్వతంత్రం వచ్చేనాటికి డాక్టర్జీ  జీవించి లేరు. కానీ ఆ  సమయానికి పండిట్ జవహర్ లాల్  ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపు వున్న నేత 1989 సంవత్సరంలో నెహ్రు, డాక్టర్ జి  జన్మశతాబ్ది ఉత్సవాలు జరిగాయి, నెహ్రు గారివి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహించింది, డాక్టర్ జి జన్మశతాబ్ది ఉత్సవాల సందర్భంగా సేవానిధి గా 1౦౦ కోట్ల నిధిని సేకరించడం జరిగింది, అదే విధంగా ఆ సమయానికి నెహ్రు సిద్ధతాలను కాని వారి అడుగు జాడలలో నడిచే వారి సంఖ్య బహుతక్కువ కాని డాక్టర్ జి ని ఆదర్శముగా తీసుకుని జీవించే వారి సంఖ్య కొన్ని వేల మంది వున్నారు, అందులో కొద్ది మందికి అసలు డాక్టర్ జి రూపం కూడా సరిగా తెలువదు కాని వారు స్థాపించిన సంఘ సిద్ధాంతం కోసం తమ జీవితాలను త్యాగం చేసేవారు కొన్ని వేలమంది వున్నారు. ఇది డాక్టర్ జి గొప్పతనం.  డాక్టర్జీ తన వ్యక్తిత్వపు బలంతో సకారాత్మకంగా సమాజము మీద ప్రభావాన్ని చూపించిన వ్యక్తి అందుకే డాక్టర్జీ ప్రేరణతో తరువాత అనేక మంది డాక్టర్ జీ లు అయినారు. డాక్టర్జి ఒక వ్యక్తిగా కాకుండా ఒక తత్వచింతనకు ప్రతిరూపంగా, ఆదర్శమూర్తిగా నిలిచారు.

డాక్టర్ జి సామ్రాజ్యవాదంతో రాజీపడడం కాని, ఒప్పందం కుదూర్చోకొవడం కాని వాళ్ళ తో  మెత్తగా వ్యవహిరించడం గాని సహించేవారు కాదు వారు దానిని జాతీయవాదం పట్ల అన్యాయంగా భావించేవారు .

ప పూ డాక్టర్ జి చిన్న వయస్సు లోనే దేశం స్థితి గురుంచి ఆనాడు మన దేశ బానిసత్వం గూర్చి ఆలోచించేవారు స్కూల్ చదువుకునే వయస్సు లోనే డాక్టర్ జి బ్రిటిష్  వాళ్ళకు వ్యతిరేఖంగా పాఠశాలలో వందేమాతర  ఉద్యమాన్ని నిర్మాణం చేసారు. విక్టోరియా రాణి పట్టాభిషేక వజ్రోత్సవాల సందర్భంగా మిఠాయి తీసుకోకుకుండా విసిరి వేసాడు, ఆ వేడుకులను బహిరంగంగా వ్యతిరేఖించాడు.

డాక్టర్ జి ఎంబిబిఎస్ చదవడం కోసం కలకత్తా కు వెళ్ళాడు, ఆ రోజుల్లో కలకత్తా దేశానికి రాజధానిగా వుండేది. అదేవిధంగా అనేకమంది సామజిక సంస్కర్తలకు మరియు విప్లవకారులకు కలకత్తా ప్రముఖ యాత్రాస్థలంగా వుండేది అందుకే దేశభక్తి హృదయం కల డాక్టర్ జి సహజంగానే  చదువుకోసం అనే నెపం మీద
కలకత్తా మెడికల్ కాలేజి లో సీటు పొంది, తన భావిజీవితానికి కావాల్సిన పునాదిని ఏర్పరచుకున్నాడు. దీనిని బట్టి డాక్టర్ జి దూరదృష్టి ఎలా ఉండేదో మనం అర్ధం చేసుకోవచ్చు. స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న విప్లవసంస్థ అయిన అనుశీలనా సమితిలో సభ్యుడు అయ్యాడు, వాళ్ళతో పాటు విప్లవ కార్యకలాపాలలో పాలుపంచుకునే వాడు .

వైద్య విద్య అయిన తరువాత ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యకుండా తన జీవితాన్ని దేశం కోసం అకింతం చెయ్యాలనే సంకల్పం తీసుకున్నాడు. డాక్టర్ జి నాగపూర్ కు వచ్చిన తరువాత కాంగ్రెస్ లో చేరి స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. ఆ రోజుల్లోనే డాక్టర్ జీ మధ్యపరగణాల ప్రాంతంలో కాంగ్రెస్ లో ఒక ముఖ్యమైన నాయకుడిగా పని చేశారు. గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు ఉప్పు సత్యా గ్రహం చేసి  9 నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు. బిపిన్ చంద్ర అనే ప్రముఖ మార్కిస్టు చరిత్రకారుడు ‘కమ్యూనిజం ఇన్ ఇండియా’ అనే పుస్తకం పేజీ నం 332 లో రాయడం జరిగింది.

డాక్టర్ జీ ఒక వైపు స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొంటూనే అసలు ఈ దేశం ఎందుకు పరాధీనం అయినది, అసలు ఈ దేశ వారసులు ఎవరు? యజమానులు ఎవరు? అనే ఆలోచన వీరి మదిలో ప్రారంభం అయినది, బ్రిటిష్ వారు ఈ దేశం ఒక సత్రం లాంటిది ఇంతకుముందు అనేకమంది వచ్చారు ఇప్పుడు మేము వున్నాము రేపు వేరొకరు వస్తారు ,ఈ దేశం ఒక జాతి కాదు, బిన్న జాతు ల సముదాయం అనే వాదనను తెరపైకి తీసుకచ్చారు. ఒక రోజు  పుణె నగరం లో జరిగిన పెద్దల సమావేశం లో డాక్టర్ జీ ఇది హిందు దేశం అని గట్టిగా  చెప్పారు, ఈ దేశము లో ఒక్క హిందువు మిగిలి వున్నా సరే ఇది హిందు దేశం అని చెప్పారు. అసలు ఈ దేశ సమస్యలన్నిటికి కారణం హిందువులలో  సంఘటన లేకపోవడమే అని గ్రహించారు.

డాక్టర్ జీ 1915 – 1924 వరకు దేశం లో ప్రారంబించబడిన అనేక రకాలైన సాంఘీక సంస్కరణ సాంస్కృతిక పరివర్తనల ద్వార  హిందు సమాజాన్ని ధర్మాన్ని సంఘటితం చేసే ప్రయత్నాలు, వివిధ ఉద్యమాలను డాక్టర్ జీ నిశితంగా  పరిశీలించారు

ఆనాడు కాంగ్రెస్ అనుసరిస్తున్న ముస్లిం సంతుస్టీకరణ కారణంగా ఆ రోజులలో వున్న హిందు సంస్థల దృష్టిలో హిందుత్వం అనేది అధిక జనాభా సంఖ్య కల వాళ్ళ రాజకీయ అంశంగా మారిపోయింది .బెంగాల్ కి చెందిన యు ఎన్ ముఖర్జీ అనే నాయకుడు హిందు సమాజం మృత్యు ముఖంలో వున్నా జాతి అని చెప్పారు. పంజాబ్ లో ఆర్య సమాజ నాయకుడు లాల్ చంద్ రాజకీయాలకు విముఖంగా ఉండడమే హిందువుల పతనానికి ముఖ్య కారణం అని అన్నారు. హిందువులలో చైతన్యాన్ని రగిల్చే ప్రయత్నాలలో  ఉన్నటువంటి ఆ నాటి నాయకులు మాలవ్య, భాయి పరమానంద, డాక్టర్ ముంజే , సావర్కర్ లాంటి వారు ముస్లింల నుండి ఎదురయ్యే ప్రతిఘటన ఆధారంగా హిందువులో అభద్రత భావం వలన హిందువులు  ఒక రాజకీయ శక్తి గా తయారు కావాలనే ఆలోచన చేసారు. కానీ డాక్టర్జీ దృష్టి చాలా విశాలంగా వుండేది హిందు సమాజంలో వున్నమౌలిక లోపాలయిన అస్ప్రుశ్యత, కులాల మధ్య ఉచ్చ నీచ  బేధాలు, సంఘటన లేకపోవడం, వ్యక్తివాదంల వంటి మౌలిక అంశాల మీద దృష్టి పెట్టలేదు. అప్పుడు భారతదేశ జనాభా 35 కోట్ల మంది జనాభాలో 25 కోట్ల మంది హిందువులు మిగిలిన 10 కోట్ల మంది ఒకప్పుడు హిందువులే కదా, ఎందుకు వీరు మన నుండి విడిపొయ్యారు అని డాక్టర్ జీ ఆలోచించారు. 

హిందు సమాజ బలం ఈ బలహీనత ల మీదనే ఆధారపడి వున్నది, అందుకే డాక్టర్ జీ ఈ లోపాలని సరిచేస్తే గాని ఈ దేశం శక్తి వంతం కాదు అని గ్రహించారు. ఒక జాతి బలం మీదనే ఆధారపడి ఆ జాతి నాగరికత కాల ప్రవాహం లో సుదీర్గంగా నిలబడుతుంది. డాక్టర్జి ఈ లోపాలను సరిచేసి ఒక సంఘటితమైన సమాజాన్నినిర్మించాలని ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు

డాక్టర్ జీ హిందు రాష్టం అనే కల్పనను ఏదో కొత్త గా తీసుక రాలేదు మన ప్రాచీన కాల చారిత్రక చైతన్యాన్ని సంస్కృతి రూపంలో ప్రసరింప చేసేదే  హిందూరాష్ట్రం అని అన్నారు. జాతి పునర్జీవనానికి ఆధారం హిందు సంఘటన అందుకే హిందువులను సంఘటితం చెయ్యడం రాష్ట్ర కార్యం, దీనిని డాక్టర్ జీ కొత్తగా  తయారు చేసాను అని చెప్పలేదు. డాక్టర్ జీ హిందూ సంఘటన కు ఆధారంగా వ్యక్తిని ఆధారంగా గ్రహించారు ప్రతి హిందువు లో వ్యక్తి గత, జాతీయశీలాలను, అనుశాసనాన్నినిర్మాణం చెయ్యడం ద్వారం వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి పునర్నిర్మాణ కార్యంను  ప్రారంభం చేశారు.

డాక్టర్ జీ సంఘ నిర్మాణం లో చాలా సూక్ష్మ దృష్టి తో చేసారు, ఆనాడు డాక్టర్ జీ మధ్య పరగణాల ప్రాంతంలో ఒక గొప్ప నాయకుడు. తాను పిలిస్తే అనేకమంది ప్రతిష్టిత వ్యక్తు లు ఆర్ఎస్ఎస్ శాఖ లో చేరుతారు కాని వాళ్ళు అందరు ఎదో ఒక సిద్ధాంతంతో ప్రభావితం అయిన వారు అందుకే డాక్టర్ జీ కిషోర వయుస్కులు అయిన వారితో  శాఖను ప్రారంబించారు. అనేక మంది ప్రతిష్టిత వ్యక్తులు అందరికి శాఖను దగ్గరిగా చూపించేవారు. గాంధీజి ని 1934 లో వార్ధలో జరిగిన సంఘ శిబిరానికి వారిని తీసుకవచ్చారు, శిబిరంలో ఉన్న క్రమశిక్షణను, నిరాడంభారతను, సమానత్వంను చూసి ముగ్ధుడు అయ్యారు. ఈ విషయాన్ని 13 సంవత్సరాల తరువాత 16 సెప్టెంబర్ 1947 లో ఢిల్లీలో ని ఒక భంగి కాలనీలో జరిగిన సమావేశంలో సంఘ శిబిరంలో ఉన్న క్రమశిక్షణను, నిరాడంబరతను, సమానత్వంను ప్రశసింస్తూ మాట్లాడారు.

డాక్టర్ జీ శాఖకి రావడం, కార్యక్రమాలలో పాల్గొనడం స్వేచ్చతో జరగాలి అని ఒక సంస్థ నిర్మాణంలో వుండే సభ్యత్వం, రుసుం తీసుకోవడంలాంటి వాటిని ఆర్ఎస్ఎస్ లో ప్రవేశ పెట్టలేదు. సంఘంలో ఒక కుటుంబాన్ని పోలిన వాతావరణాన్ని నెలకొల్పారు. వ్యక్తి వాదంకు తావు లేకుండా సంఘంలో గురువుగా భగవధ్వజాన్ని పెట్టడం జరిగింది, అందుకే డాక్టర్ జి పరమపదించిన  తరువాత కూడా సంఘం  అవిచ్చిన్నం గా కొనసాగుతూ వస్తుంది. డాక్టర్ జి పరమపదించన తరువాత కూడా సంఘం ఇంకా ధృడంగా  ఎదుగుతుందని ఆనాటి మరాఠా ఆంగ్ల దినపత్రిక లో ప్రముఖ శీర్షికగా ప్రచురించారు.

సంఘంలో నేడు రూపు దిద్దుకున్న కార్యపద్దతి ,సంస్థాగతంగా నిర్మాణం అంతా డాక్టర్జీ కల్పన ఆధారంగా జరిగిందే. నేడు  సంఘ ప్రేరణతో నడుస్తున్న అనేక సంస్థల పనిని డాక్టర్ జి బీజరూపం లో తన జీవితంలో ఎదో ఒక సందర్బంగా చేసినవే. డాక్టర్ జి ఎంబిబిఎస్ చదువుతున్నప్పుడు దామోదర్ నదికి  వరదలు  వచ్చి అక్కడి ప్రజా జీవితం అతలాకుతలం ఐతే డాక్టర్ జీ తన మిత్ర బృందం తో కలిసి వాళ్లందరికీ మందులు, ఆహారం అందించారు. నేడు దేశం లో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే స్వయంసేవకులు అక్కడికి వెళ్లి సేవలు అందిస్తుంటారు.

డాక్టర్ జీ 1922 లో నాగపూర్ లో ఒక ఆనాద విద్యా గృహాన్ని స్థాపించినారు అందులో అన్ని కులాలనుండి విద్యార్థులు ఉండేవారు. నేడు స్వయంసేవకులు డాక్టర్జీ ప్రేరణతో దేశంలో అనేక అనాధ విద్యాలయ గృహాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ జీ 1932 అక్టోబర్ 23న పూణా లో ఉన్న న్యూ ఇంగ్లీష్ స్కూల్ లో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఆ రోజు విద్యార్థులకు అస్ప్రుశ్యత తొలగించాలి అని పిలుపునిచ్చారు.డాక్టర్ జీ అస్ప్రుశ్యత కులబేదాల సమస్యలపై డాక్టర్జీ ఏనాడు రాజీపడలేదు వారు ఒక గొప్ప సమగ్రతావాది.

డాక్టర్ జీ మన సంస్కృతిలో ఉన్న ఉదాత్తమైన భావనలను తీసుకుని హిందూత్వ ఆలోచనలను ముందుపెడుతు సమాజంలో ఉన్న మూఢాచారాలను తొలగించడం కోసం కృషి చేసారు.

సంఘం ఈ రోజు దేశంలోనే కాదు, అనేక దేశాలలో ఉన్న హిందువులను సంఘటితం చెయ్యడం కొరకు పని చేస్తోంది. అక్కడ ఉన్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతుంది. నేడు దేశంలో సంఘం ఒక నిర్ణయాత్మక శక్తి గా ఉంది. డాక్టర్ జీ ఆ రోజుల్లో ఏ ఆలోచనతో పనిని ప్రారంభంచేశారో ఆ ఆలోచనతో, అదేప్రేరణతో నేడు లక్షలాది మంది డాక్టర్జీలు దేశం అంతటా పని చేస్తున్నారు, నేడు దేశంలో ఒక లక్షా యాబై వేలకు పైగా సేవా కార్యక్రమాలు స్వయంసేవకుల ద్వారా జరుగుతున్నాయి. సేవాఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ప్రంపంచవ్యాప్తంగా సేవల కార్యక్రమాలు జరుగుతున్నాయి .సంపూర్ణ సమాజ పరివర్తన ఏదైతే ఉందొ ఆ దిశ లో సంఘం చేస్తున్న ప్రయత్నం ముందుకు వెళ్తుంది. ఇంకా కొద్ది సంవత్సరాలలో డాక్టర్ జీ కన్నకలల సాకారాన్ని చూడబోతున్నాము.

Reference Books
1. Doctorji -The Epoch Maker by Rakesh Sinha.
2 .Communism In India by Bipin Chandra.
3. Gandhiji Collected works.
4. 17th September 1947 Hindu paper

-కట్టా రాజగోపాల్