Home Rashtriya Swayamsevak Sangh సేవకు చిరునామా – డా. మాధవరావు పరాల్కర్

సేవకు చిరునామా – డా. మాధవరావు పరాల్కర్

0
SHARE

“పక్షవాతానికి గురైన పిల్లవాడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసిన తర్వాత కూడా ఎటువంటి నమ్మకం కలగనప్పుడు ఆ నిస్సహాయ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. అటువంటప్పుడు ఒక మహానుభావుడు వచ్చి, పైసా కూడా తీసుకోకుండా వేళ్ళతో మసాజ్ చేయడం ద్వారా పిల్లవాడికి చికిత్స అందించినపుడు  ఫలితం కనిపించింది. చికిత్స తర్వాత 6 గంటలకే  పిల్లవాడికి స్పృహ వచ్చి  తన అవయవాలను కదిలించడం ప్రారంభించడంతో  ఆ పిల్లవాడి తల్లి దేవుడే ఈ  మనిషిని పంపాడేమో అన్నసంతోషంలో ఆనందభాష్పాలు రాల్చింది. ఇది కల్పిత కథ కాదు, కంచన్ నారంగ్ మనస్సును హత్తుకునే  కథ. ఆ వైద్యుడు ముంబైలోని ప్రఖ్యాత చార్టెడ్ అకౌంటెంట్, మానవతావాది  డాక్టర్ మాధవరావు పరాల్కర్.

మానవతావాది డాక్టర్ మాధవరావు పరాల్కర్ సంఘ ప్రచారక్ గా పని చేశారు. ఆయన చాలా మంది రోగులకు వైద్యం చేయడమే కాకుండా  వారి బంధువులకు, సహాయకులకు రవాణా ఖర్చులు కూడా భరించేవాడు. పరాల్కర్ స్థాపించిన  రుగ్న సేవా సమితి (నానా పాల్కర్ స్మృతి సమితి) ముంబై లాంటి నగరంలో పేద వారికి ఒక వరంలా మారింది.  

పరాల్కర్ చిన్నపటినుంచే చురుకైన విద్యార్థి, బాలస్వయంసేవక్. 1947 లో ఆయన డాక్టర్ ఆఫ్ ఆయుర్వేద డిగ్రీ పూర్తి చేసిన తరవాత కొంతకాలం ప్రాక్టీస్ చేసి, పూర్తి స్థాయి సంఘ ప్రచారక్ గా పని చేశారు.

ఆయన రోజూ సైకిల్ పై  బాంద్రా నుండి విరార్, చెంబుర్ కు తిరిగి వైద్యం చేసేవాడు. వారు మాట్లాడే పద్దతి, మంచి వ్యక్తిత్వం యువకులలో వారి పట్ల ప్రజాదరణను పెంచింది. విద్యార్థి పరిషద్ కు చాలాకాలం జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శిగా పని చేసారు. రోగుల పట్ల ఆయన నిబద్దతను పరిశీలించిన అప్పటి సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ వారికి  రోగులకు వారి బందువులకు భోజనం, వసతి కల్పించడానికి రుగ్న సేవా సమితి ప్రారంభించే భాద్యతను అప్పగించారు.

ముంబై వంటి నగరాలలో కాన్సర్, క్షయ (టి.బి) వంటి ధీర్ఘకాలికమైన రోగాలకు చికిత్స కోసం వచ్చే రోగులకు భోజనం లభిస్తుంది కానీ వారి సహాయకులకు భోజనం, వసతి కల్పించడం చాలా కష్టం. టాటా కాన్సర్ ఆసుపత్రికి అర కిలోమీటర్ దూరంలో రుగ్న సేవా సమితి (నానా పాల్కర్ స్మృతి సమితి) పది అంతస్తుల భవనం రోగులకు వారి సొంతింటిలా సేవలు అందిస్తున్నది. కేవలం 10 రూపాయలకే రోగుల సహాయకులకు, వారి బందువులకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నది. ఈ సేవాసదనం నిర్మించడం కోసం డాక్టర్ మాధవరావు సమాజంలోని అనేక మందిని కలిసి సహాయం అర్థించాడు. ఈ ప్రయత్నంలో ఆయన స్వయంసేవకుల కుటుంబాల నుంచి 500 రూపాయల చిన్న మొత్తం నుండి, అలాగే  కిడ్నీచికిత్స కోసం ఉపయోగించే లితోత్రిప్సీ యంత్రం కోసం 75 లక్షల  రూపాయల వరకు  బిర్లా ఫౌండేషన్ నుంచి  సేకరించాడు.ముంబై వైద్య ప్రపంచంలో ప్రముఖుడైన డా. అజిత్ ఫడ్కే  గారిని వారి ఆసుపత్రిలో వీరికి లేజర్ చికిత్స చేయడమే కాక వారి వసతి కోసం ఒప్పించాడు. గోఖలే డయాలసిస్ కేంద్రంలో పేద ప్రజల కోసం వంతులవారీగా పనిచేసే 14 డయాలసిస్ యంత్రాల ఏర్పాటు వారి మనసులోంచి పుట్టిన ఆలోచన.

అవిశ్రాంతంగా మానవ సేవలో గడుపుతున్న డా. పరాల్కర్ ను చూసి, ముంబైలోని  ప్రముఖ వైద్యుడు, ముంబై హాస్పిటల్  డీన్ డా. గోయల్ గారు వారి సేవలో పాలు పంచుకోవడానికి ముందుకు వచ్చారు.పరాల్కర్ అత్యంత సన్నిహితుడు, సేవా సదన్ ట్రస్టీ వివేక్ ఛత్రే మాటల్లో డా.పరాల్కర్ గారిని  ముంబై వైద్య ప్రపంచంలోని  వైద్యులందరూ గొప్పవాడిగా పరిగణించేవారు.

డా. పరాల్కర్ ప్రతి రోజూ రుగ్న సేవా సదన్, గోఖలే డయాలిసిస్ కేంద్రం ఏర్పాటులోనే గడిపారు. ఎమర్జెన్సీ కాలంలో జైల్లో తనతో పాటు ఉన్న తోటి ఖైదీలకు యోగ, వివిధ మసాజ్ పద్దతులను నేర్పించారు.. ఆయన చాలా మందికి ఎటువంటి డబ్బు తీసుకోకుండానే చికిత్స చేశారు. ఎంతో మంది హృదయాలను కదిలించిన డా.పరాల్కర్, నానా పాల్కర్ స్మృతి సమితి భవనం  ఏడు  అంతస్తులు  పూర్తి చేసిన తర్వాత 81 ఏళ్ల వయస్సులో 22 ఫిబ్రవరి 2008న పరమపదించారు.