Home News ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నకేసులో కాశ్మీర్ వార్తాపత్రిక సంపాదకుడిని ప్రశ్నించిన జాతీయ దర్యాప్తు సంస్థ

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నకేసులో కాశ్మీర్ వార్తాపత్రిక సంపాదకుడిని ప్రశ్నించిన జాతీయ దర్యాప్తు సంస్థ

0
SHARE

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నకేసులో   కాశ్మీర్ వార్తాపత్రిక సంపాదకుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ప్రశ్నించింది. లోయలోని ‘జిహాదీ విలేఖరులకు’ ఐ.ఎస్.ఐ  మీడియా కేంద్రం  సహాయం ఉందని వారు చెప్పారు.కాశ్మీర్ ఎడిటర్స్ గిల్డ్ ద్వారా రావల్పిండిలోని ఐ.ఎస్.ఐ  సెల్  సృష్టించబడిందని జాతీయ దర్యాప్తు సంస్థఅధికారులు పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

కాశ్మీర్ రీడర్ అనే కాశ్మీరీ వార్తాపత్రిక యాజమాన్య సంపాదకుడిని ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక  పేర్కొంది. మంగళవారం ఢిల్లీలోని  ప్రధాన కార్యాలయానికి వచ్చిన సంపాదకుడు పాంపూర్ మొహమ్మద్ హయత్ భట్ ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించారు.

కాశ్మీర్ రీడర్ ను భట్ 2012 లో ప్రారంభించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, భట్ గతంలో హెల్ప్ లైన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అనే సంస్థను వేరే దేశం సహాయంతో నడిపించాడు.

మునిసిపల్ కార్పొరేషన్ అధికారి తెల్పిన ప్రకారం, 2007 లో భట్ శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ ప్రకటనల ప్రచార ఒప్పందాన్ని దక్కించుకున్నారు. అతను దాదాపు శ్రీనగర్ అంతటా సుమారు 150 ప్రదేశాలలో  తక్కువ మొత్తానికి ఒప్పందాన్నిపొందాడు.

భట్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు పేర్కొన్నారు. పత్రికకు  వ్రాయడానికి “జిహాదీ విలేఖరులను” నియమించానని చెప్పాడని, వారిలో కొందరు ఇప్పుడు కాశ్మీర్ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు.  ‘కాశ్మీర్ ఎడిటర్స్ గిల్డ్’ను రావల్పిండిలోని ఐ.ఎస్.ఐ మీడియా సెల్ సృష్టించిందని  జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించెందుకు ప్రయత్నించారని అనుమానిస్తున్న పలువురు కాశ్మీర్ విలేకరులను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తున్నట్లు సమాచారం.

అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక నిరాధారమైనదని కాశ్మీర్ ఎడిటర్స్ గిల్డ్  సంస్థ అంటోంది. టైమ్స్ పత్రికపై దావా వేస్తామని గిల్డ్ స్పష్టం చేసింది.

కొద్ది రోజుల క్రితం కాశ్మీరీ వేర్పాటువాది  ఆసియా ఆండ్రాబీకి చెందిన శ్రీనగర్ ఆస్తిని ఉగ్రవాద నేరాల ఆదాయంగా గుర్తించి  జాతీయ దర్యాప్తు సంస్థ  జప్తు చేసింది. నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ దుఖ్తరన్-ఇ-మిల్లాట్  కార్యకలాపాల కోసం ఈ ఆస్తిని ఉపయోగించారని తేలింది.  ఆసియా ఆండ్రాబీని గత నెలలో అనేకమంది  కాశ్మీరీ వేర్పాటువాదులతో సహా నిర్బంధంలోకి తీసుకున్నారు.