Home News శ్రీలంకలో ఎమర్జెన్సీ; బౌద్ధులు, ముస్లింల మధ్య ఘర్షణలు

శ్రీలంకలో ఎమర్జెన్సీ; బౌద్ధులు, ముస్లింల మధ్య ఘర్షణలు

0
SHARE
  • క్యాండీ జిల్లాలో కర్ఫ్యూ..
  • భద్రతా దళాల మోహరింపు

శ్రీలంకలో 10 రోజుల ఎమర్జెన్సీ విధించారు. క్యాండీ జిల్లాలో మెజారిటీ బౌద్ధులు, మైనారిటీ ముస్లింల మధ్య మతకలహాలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పాటు పలు మసీదులు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఘర్షణలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా దేశంలో ఎమర్జెన్సీ విధించాలని దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో మంత్రివర్గం అత్యవసర సమావేశంలో నిర్ణయించింది.

పర్యాటక ప్రాంతమైన థెల్దినియలో గత వారం ఓ అల్లరిమూక చేతిలో ఓ బౌద్ధుడు మృతి చెందడంతో మతకలహాలు చెలరేగాయి. ఘర్షణలు చెలరేగిన క్యాండీలో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం భద్రతా దళాలను, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ కమాండోలను పెద్ద ఎత్తున తరలించింది.

బౌద్ధ సింహళుల దాడిలో మైనారిటీలకు చెందిన 10 మసీదులు, 75 దుకాణాలు, 32 ఇళ్లు ధ్వంసమయ్యాయని ముస్లింలు చెప్తున్నారు. ఘర్షణలు తీవ్రమవడంతో భాష్పవాయువు గోళాలు ప్రయోగించిన భద్రతా సిబ్బంది రాత్రికి రాత్రే కర్ఫ్యూ విధించారు. దగ్ధమైన ఇంట్లో మంగళవారం ఓ ముస్లిం మృతదేహం బయట పడటంతో క్యాండీలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.

శ్రీలంకలో 2011 తర్వాత ఎమర్జెన్సీ విధించడం ఇదే తొలిసారి. కాగా, శ్రీలంకలో జరుగుతున్న 3దేశాల ట్వంటీ20 క్రికెట్‌ సిరీ్‌సకు ఇబ్బంది లేదని, అందులో భారత జట్టు పాల్గొంటుందని బీసీసీఐ ప్రకటించింది. కొలంబోలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని తెలిపింది.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)