Home Telugu Articles ఎన్నెన్నో సంబురాల సంక్రాంతి

ఎన్నెన్నో సంబురాల సంక్రాంతి

0
SHARE

ఎన్నెన్నో సంబురాలను తెచ్చే సంక్రాంతి పండుగ మళ్లీ వస్తోంది. మంచిని తెచ్చేది, కలిగించేది మళ్లీ మళ్లీ వస్తుండాలి. కోట్లాది భారతీయులు సూర్య గమానాన్ని అనుసరించి జరుపుకునే పండుగ సంక్రాంతి. సూర్యుడు ఈ సమయంలో మకరరాశిలో ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశంతోనే కాల చక్రంలో ఒక క్రాంతి అంటే మార్పు వస్తుంది. దక్షిణాయనం వెళ్లి ఉత్తరాయణం వస్తుంది. రాత్రి సమయం క్రమంగాతగ్గి పగటి సమయం పెరుగుతోంది. అంటే ప్రాణకోటి జీవితం చీకటి నుంచి ఎక్కువ సమయం వెలుగులో ఉంటుంది. మనిషి ఎక్కువ సమయం జాగురుకుడై ఉండటానికి, క్రియాశీలుడు కావాడానికి మంచి పనులను చేసుకోవాటానికి అవకాశముండే కాలం. కాబట్టి ఇది పుణ్యకాలం.

వాస్తవానికి ఈ సంక్రాంతి జన జీవనంతోను, ప్రకృతితోను, వ్యవసాయ కార్యకలపాలతో ముడిపడి ఉంది. రైతుల కృషి ఫలించి ధాన్యం ఇళ్లకు చేరే సంతోష సమయం. అందుకే సంబురాలు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, అని మూడు రోజుల పండుగ. భోగి నాడు భోగి మంటలు వేయడం, చిన్న పిల్లలకు పేరంటం చేసి బోగిపండ్లు పోయడం వంటివి అనావాయితీగా వస్తున్న సంప్రదాయం. పూర్వం భోగినాడు ఇంద్రుడిని పూజించే ఆచారం ఉండేది. కాని ఇంద్రుడు గర్వితుడై అధికారమదంతో అహంకారిగా ప్రవర్తిస్తుండేవాడు. సమాజం దానిని భరిస్తుండేది. ఈ సామాజిక స్థితిలో మార్పురావాలని శ్రీకృష్ణుడు ప్రయాత్నించి ఆ భోగినాడే గోవర్ధనగిరిని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. గిరిపూజ ప్రకృతి ఆరాధన అవుతుంది. సమాజం వన దేవతను, కుల పర్వతాలను పూజించి సత్పలితాలను పొందే మార్పు క్రమంగా సమాజంలో వచ్చింది. కుటుంబ సభ్యులందరు ఇంటికి వస్తున్న ధాన్యాన్ని పదిలపరుచుకోవాడానికి పాతధాన్యపు గాదెలను తీసివేసి పనికిరాని వస్తువులను మంటల్లో వేసి స్వచ్ఛగృహలుగా తీర్చిదిద్ధి ధాన్య లక్ష్మికి స్వాగతం పలుకుతారు. ఆ మంటలే భోగి మంటలు. గుండ్రని రేగిపండ్లు విశ్వానికి సంకేతం. విష్ణువు బదీర ఫల ప్రియుడు. తమ సంతానాన్ని శ్రీకృష్ణుడిగా బావించుకుంటూ పేరంటాడ్ర చేత పిల్లల తలపై పూలు రేగుపండ్లు కలిపి పోయించి ఆశీస్సు ఇప్పించడం గొప్ప శుభ సంకేతం. శుభ ఆకాంక్ష గుడా. ధనుర్మాసంలో గోదాదేవి చేసిన పూజలను మెచ్చి శ్రీరంగనాథుడు ఆమెను తనలో లీనం చేసుకోని భోగాభాగ్యాలను ప్రసాదించిన శుభదినం ఈ భోగినాడే అని ఆధ్యాత్మిక వేత్తలు భావిస్తుంటారు.

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజు సంక్రాంతి, మకరరాశి విష్ణుసంబంధమైన రాశి. ”ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ” అంటే సౌర మండలం మధ్యనున్న విష్ణువు మకర కుండలములను ధరించి ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మకర రాశి ఎంత పుణ్యప్రదమైనదో తెలుస్తొంది. ఆ రోజు ధాన్యం వస్త్రాలు, పండ్లు, కాయగురాలు వగైరా శక్తి మేరకు ధానధర్మాలు చేయాలని ధర్మశాస్త్రం చెప్తోంది. అందుకే హరిదాసులు, గంగిరెద్దులవారు, బుడగజంగాలవారు, వీధి భాగోతులాడేవారు మొదలగు జానపద కళాకారుల వాళ్ల కళలను కన్నుల పండువగా ప్రదర్శిస్తుండేవారు. అందరూ ఇళ్లల్లో నుంచి చాటల కోలది ధాన్నాన్ని తెచ్చి వాళ్లకు పంచిపెట్టే వారు. ఊరువాడ ఏకమై కళాకారులను సన్మానించేవారు. అవి వాళ్లకు సంవత్సరం పాటు జీవనోపాధికి సరిపోయేవి. ఆ సమయంలో ఇచ్చే వాళ్లు గాని పుచ్చుకునే వాళ్లుగాని ఆ మునుషుల కుల గోత్రాలని చూడలేదు, ఆలోచించలేదు. మానవత దృకత్పంతో పరస్పర సహకారం, సహజీవనం, మనమంత ఒకే కుటుంబం అనే మనో భావనే ఉండేది. అది సమసమాజ జీవనము. సమరసత జీవనం అంటే హిందూ జీవన పద్ధతిలో ఈ సంస్కరాలు, సమాజ వ్యవస్థ సహజ సిద్ధంగా ఉండటమే హిందుత్వము యొక్క విశిష్టత.

కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం హిందువుల జన్మజాత లక్షణం. అందుకే పాములకు పాలు, చీమలకు, కోళ్లకు పిండి నూకలు వంటివాటిని చల్లుతూ జీవరాసులను పోషించి జీవవైవిధ్యాన్ని సంరక్షిస్తుంటాము.

వ్యవసాయంలోను నిత్యజీవనంలోను మనకు సహకరించే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కనుమను పశువులు పండుగగా జరుపుకుంటాము. నగర, గ్రామ సంకీర్తనలు ఎంతో గర్వించదగ్గ గొప్ప జీవనశైలి మనది. ఒక వైపు ఆధ్యాత్మికంగా ధనుర్మాస పూజలు, నైవేద్యాలు, మరోవైపు ముత్యాలముగ్గులు, గొబ్బెమ్మలు జానపద కళాకారుల ఆటపాటలు, ధాన్యపు సంచులను చేరవేస్తున్న ఎడ్లబండ్లు, బాలలు, యువకులు హుషారుగా ఎగురవేస్తున్న గాలిపటాల సందడి తమకున్న వాటిలో కొంత భాగాన్ని పదిమందికీ పంచి పెడుతున్న దాతృత్వం వెరసి సంక్రాంతి పండుగ సంస్కృతి సంప్రదాయ సంరక్షణ మానవ జీవన విలువలు సంరక్షణే దీని వెనుకున్న తాత్వికత. అదే నిజమైన సంక్రాంతి.