Home News ప్రతి విద్యార్ధి జాతీయ జీవన మహాయజ్ఞం లో భాగస్వామ్యం కావాలి: శ్రీ...

ప్రతి విద్యార్ధి జాతీయ జీవన మహాయజ్ఞం లో భాగస్వామ్యం కావాలి: శ్రీ శ్రీ శ్రీ విద్యా శంకర భారతి స్వామి

0
SHARE

`జ్ఞానం సముపార్జించడమే విద్య పరమార్ధం. బుద్దిని సక్రమంగా వినియోగించుకొని, వసతులను ఎంత వరకు ఉపయోగించాలో అంతే ఉపయోగిస్తూ సృష్టిలోని జీవులన్నంటిని గౌరవిస్తూ,  ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతూ, వన సంపద ద్వారా స్వచ్చమైన గాలిని పీలుస్తూ, శుభ్రతతో నిష్కల్మష మైన జీవనానికి ప్రతీకలుగా నిలవాలి’ అని శ్రీ శ్రీ శ్రీ విద్యా శంకర భారతి స్వామి ఉద్బోధించారు. సికింద్రాబాద్ మల్కాజి గిరి లోని శ్రీ రామ విద్యార్ధి నిలయంలో ఆగస్ట్ 5 న జరిగిన సరస్వతి పూజలో పాల్గొన్న స్వామీజీ ఆశీ  ప్రసంగం చేశారు.

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అక్షర రూపంలోని విద్య,  జిహ్వ రూపంలోని సరస్వతిని ఆరాధిస్తూ, వాక్కు ద్వారా  పవిత్రతను కాపాడుతూ ‘భారతి’  ని కొలవాలని సూచించారు.    సూర్యతేజస్సు , అగ్ని, చంద్ర కాంతి యందు ప్రీతీ కలిగిన వారు నిజమైన ‘భారతి’ (సరస్వతి భక్తులు) అని పేర్కొన్నారు.  దీపంలో సూర్యుని తేజస్సు నిక్షిప్తమై ఉంటుంది. అదే విధంగా మానవ శరీరంలో ఉన్న అవయవాలను  ఉత్తేజ పరచాలి (అగ్ని ద్వారా). అందుకే నుదుట (బొట్టు) కుంకుమ ధరించాలి. కుడి (సూర్య) నేత్రం , ఎడమ (చంద్ర) నేత్రం, మధ్యలో దివ్య నేత్రం ఉండడం వలన త్రికరణ శుద్దితో చేసే పనే  విజయానికి నాంది అన్నారు. భగవంతుడు అందరికి ఆయుష్షు, ఐశ్వర్యం, బుద్ధి, శక్తి, ప్రసాదించాలి అని  కోరారు.  ప్రతి ఒక్కరు జాతీయ జీవన మహా యజ్ఞం లో భాగస్వాములు కావాలని స్వామీజీ ఉద్బోధించారు.

కార్యక్రమంలో పాల్గొన్న అర్ ఎస్ ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్  మాట్లాడుతూ మనిషి జీవనంలో సద్గుణ విద్యతో పాటు శీలం, సంస్కారం ప్రధానమైనవని అన్నారు.  శీలం లేని కారణంగానే రావణుడు సర్వ నాశనం అయ్యాడు అని గుర్తు చేశారు.

హిందూ జీవన విధానం ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. 16 షోడశ  సంస్కారాల ఆధారంగా మానవుడు జీవిస్తాడు. మనం  ప్రకృతిలోని పంచ భూతాలైన గాలి , నీరు, ఆకాశం, భూమి, అగ్నితో ముడిపడి ఉంటాము. కాబట్టి వాటిని మన అవసరాలకు తగ్గట్టే స్వీకరించాలి అని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ నేటి కాలంలో సైతం విలువలతో కూడిన విద్యను నేర్చుకోవడం చాల సంతోషించదగిన పరిణామని, అలాంటి విద్యను అందిస్తున్న వనవాసి కళ్యాణ పరిషత్ కృషి అభినందనీయమని  కొనియాడారు.

వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ హెచ్ కె నాగు, వనవాసి కార్యకర్తలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.