Home News నాగరికత ముసుగులో ఆఫ్రికా ప్రజల అస్తిత్వాన్ని ద్వంసం చేసిన పాశ్చాత్య దేశాలు

నాగరికత ముసుగులో ఆఫ్రికా ప్రజల అస్తిత్వాన్ని ద్వంసం చేసిన పాశ్చాత్య దేశాలు

0
SHARE
Image Courtesy: theguardian.com

చరిత్రలో అత్యంత విషాదమేమంటే యురోపియన్ల వలస పాలనతో ఆయా దేశాలు తమదైన చరిత్ర, సంస్కృతిని కోల్పోవటం. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలన్నీ యూరప్ దేశాల వలసలుగా మారిపో యి తమదైన సాంస్కృతిక జీవనాన్ని, చరిత్రకు దూరమయ్యాయి. మరో మాటలో చెప్పాలంటే ఆయాదేశాల ప్రజల జీవనవిధానం, సాంస్కృతిక జీవనం ధ్వంసమైంది.ఈ నేపథ్యంలో చూసినప్పుడు నైజీరియాలోని ఇగ్బోస్‌లది ఓ విషాద గాథ.

వలసవాద పాశ్చాత్య దేశాలు తమ దోపిడీని కొనసాగించటం కోసం భూ మండలాన్ని ఖండఖండాలుగా విభజించాయి. మనుషుల మధ్య వైరుధ్యాలు పెంచి తమ మనుగడకు ముప్పు లేకుండా చూసుకున్నాయి. ఈ నేపథ్యంలో వలసపీడిత దేశాలన్నీ పరస్పర సహకారంతో కలిసినడువాలి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలన్నీ తమ దేశీ య సంస్కృతుల పునాది మీద ప్రజల ఐక్యతను సాధించాలి.

ఈ ఆఫ్రికా దేశాల్లోకి పశ్చిమ దేశాల వారు వలస వెళ్లినప్పు డు ఆఫ్రికన్లు వీరిని నాగరిక మనుషులుగా చూడలేదు. పోగా వారిని వింతైన పిచ్చిమనుషులుగా, మర మనుషులుగా భావించారు. వారికి దూరంగా ఉన్నారు. లేదా దూరంగా ఉంచారు. యూరోపియన్లను ఆఫ్రికన్లు ఎంత దూరంగా పెట్టి నా 19వ శతాబ్దం చివరినాటికి ఆఫ్రికా దేశాలన్నీ యూరప్‌వాసులకు వలసగా మారిపోయాయి. ఆఫ్రికా దేశాల్లోని ప్రజలు పాశ్చాత్య సంస్కృతిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది.

అత్యంత విషాదకరమైన పరిస్థితి ఏమంటే ఆఫ్రికా దేశాల ప్రజల జీవ న పరిస్థితులు కాలగమనంతో పాటు అభివృద్ధి చెందటం, నాగరికంగా ముందుకుపోవటం జరుగకపోగా అన్నివిధాలా విధ్వంసానికి గురయ్యా యి. వలసవాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చినా నిర్వలసీకరణ నిజమైన అర్థంలో ఎక్కడా విజయం సాధించలేదు. బ్రూస్ గిల్లే అనే అమెరికా ప్రొఫెసర్ అధ్యయనం ప్రకారం.. ఆఫ్రికా దేశాలు నిర్వలసీకరణతో నిజమైన స్వాతంత్య్రాన్ని, వలసాధిపత్యాన్ని దూరం చేసుకోలేక పోయాయి. అభివృద్ధి పథంలో తీర్చిదిద్దుకోలేక పోయాయి.ఈ నేపథ్యం లో అభివృద్ధి గురించీ, నాగరికత గురించి రాసిన వారూ, చెప్పిన వారం తా పాశ్చాత్య దృష్టికోణం నుంచి చూసిన వారే. దీంతో వలసదేశాల ప్రజ ల జీవన విధానం, సమస్యలు, అభివృద్ధి గురించి ఆలోచించినప్పుడు ఈ పాశ్చాత్య దృష్టికోణం, ఆలోచనా సరళిలోనే అసలు సమస్య ఉన్నది.

ఆఫ్రికా దేశాలు బ్రిటిష్ వలసపాలన నుంచి రూపంలో విముక్తి అయినట్లే గానీ, సారాంశంలో పెద్ద మార్పేమీ లేదు. అవన్నీ వలసపాలనలో పూర్తిగా కొల్లగొట్టబడ్డాయి. అది వనరుల దోపీడీ దగ్గరే ఆగిపోలేదు. రాజకీయంగా, తాత్త్వికంగా, పరంపరాగతంగా వస్తున్న స్థానిక పాలనా వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. అలాగే అక్కడి మతం, సంస్కృ తి, జీవన విధానాలు పూర్తిగా నాశనం అయ్యాయి. పరిస్థితి ఎంతదాకా పోయిందంటే.. ఇవ్వాళ ఆఫ్రికా దేశాలు వాటి సొంత చారిత్రక గుర్తింపును పేరులోనూ కోల్పోయాయి. అవన్నీ నేడు పశ్చిమ ఆఫ్రికా దేశాలు గా పిలువబడుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లోని ప్రజల భాష, రాజకీయ సిద్ధాంతాలు, సాంఘికార్థిక నిర్మాణాలు, విద్య ఇలా ప్రతి ఒక్కటీ ధ్వంసమయ్యాయి. గ్రామీణ జనజీవితంలోని సాంస్కృతిక ఆచార వ్యవహారా లు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలోంచే ఆఫ్రికా దేశాలన్నీ వారి జీవనవిధానాలు, చారిత్రకాంశాల గురించి కూడా పూర్తిగా పాశ్చా త్య దేశాలపై ఆధారపడేట్లుగా మారిపోయాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఆఫ్రికా దేశాలన్నీ సకలరంగాల్లో పాశ్చాత్య దేశాల అడుగుజాడల్లో నడిచే పరాన్నజీవులుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోంచే ఆఫ్రికా దేశాల రాజకీయ సిద్ధాంతాలన్నీ పాశ్చాత్య సిద్ధాంత దృక్పథంతో నిండిపోవట మే కాదు, ఉద్యమాలు కూడా పాశ్చాత్యీకరణ చేయబడ్డాయి.

పాశ్చాత్యీకరణతో ఆఫ్రికా దేశాల ప్రజా జీవనం పూర్తిగా సంక్లిష్టంగా మారిపోయింది. అంతర్గతంగా కృషించి పోయింది. ఇలా ప్రాంతాలు, ప్రజా సమూహాలు, జాతులే కాదు, దేశాలకు దేశాలే పూర్తిగా పరాయీకరణ చెందాయి. దీనికి తార్కాణంగా ఉగాండ, టోగో దేశాలను చెప్పుకోవచ్చు. ఈ దేశాల్లో స్థానిక ప్రజలకు చెందని వారసత్వ సంపద ఏదీ మిగుల లేదు. ఆఫ్రికా దేశాల సంస్కృతిని మ్యూజియంల్లో చూడాల్సిన దుస్థితి దాపురించింది. నిజానికి ఆఫ్రికా ప్రజల జీవన సంస్కృతి విశిష్ట మైనది. వారి సంగీతం, నృత్యం, వేషభాషలు ప్రత్యేకమైనవి. వాటికవి గొప్ప చారిత్రక, వారసత్వ సంపదగా విలువైనవి. కానీ వీటి ఔన్నత్యాన్ని గుర్తించి, గౌరవించే మేధోపరత్వం కొరవడింది. పాశ్చాత్యీకరణతో పుచ్చిపోయింది. దీంతో ఇతరులు ఆఫ్రికన్లను చిన్నచూపు చూడటం కాదు, వారికివారే తమకు తాము ఆత్మన్యూనతతో చూసుకుంటారు. తమకు తాము తక్కువ వారుగా భావించుకుంటారు. ఇంకా ముఖ్యమైన విష య మేమంటే.. ఆఫ్రికా మేధావులంతా పాశ్చాత్య దేశాల్లో చదువుకొని వచ్చినవారే. దీంతో ఆఫ్రికా దేశాల్లోని వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాం గం, మిలిటరీ, పోలీసు యంత్రాంగమంతా పాశ్చాత్య విద్య చదివిన వారితోనే నిండిపోయింది. దీంతో వలస పాలన అక్కడినుంచి నిష్క్రమించినా వారి పాలనాధిపత్యం పరోక్షంగా కొనసాగటానికి కారణమైం ది. పాలనాయంత్రాంగంలో నిండిన వారంతా తమ సొంత ప్రజలనే నీచులుగా, హీనులుగా చూడటం జరుగుతున్నది.

మరోవైపు ఈ దేశాలన్నింటా తీవ్రమైన నిరుద్యోగం ఉన్నది. పాలనా పరమైన వివక్ష, అణచివేత, దోపిడీ పీడనలతో అక్కడ తీవ్రమైన తుపాకీ సంస్కృతి వేళ్లూనుకున్నది. నేడు నైజీరియాలో రాజ్యం చేస్తున్న జాతి వైరా లు, మారణకాండ అంతా ఈ తుపాకీసంస్కృతి నుంచి ఆవిర్భవించేదే. ఒక జాతి మరో జాతిని, ఒక మత విశ్వాసం, మరో మత విశ్వాసా న్ని సహించలేక పోవటమే కాదు, శత్రువైఖరితో చూడటం, మారణకాండకు పాల్పడటం జరుగుతున్నది. రక్తపుటేరులు పారటానికి కారణమవుతున్నది.

ఇదంతా ఇలా ఉంటే మన ఉన్నతవర్గాల మేధావులు మాత్రం పాశ్చా త్య సంస్కృతి, నాగరికతనే గొప్పదిగా చెబుతారు. అదే ఆధునికమైనదని, నాగరికమైనదని చెప్పుకొస్తారు. పూర్వ కాలంలో ఏ నాగరికతనైతే దుర్మార్గమైనదిగా, అమానవీయమైనదిగా ఆఫ్రికాజాతులు అభివర్ణించాయో, దాన్నే నేటి ఆఫ్రికా మేధావులు నెత్తికెత్తుకుంటున్నారు. దాన్నే ఆధునికమైనదిగా, అభివృద్ధికరమైనదిగా చెబుతున్నారు. పాశ్చాత్యులు సహజసిద్ధమైన ఆఫ్రికాజీవన సంస్కృతులను అనాగరికమైనవిగా చెప్పా రు.అవినీతిమయమైనవిగా, అరాచకమైనవిగా ప్రచారం చేశారు. పాశ్చా త్య ఆధిపత్య భావజాలం కారణంగా పాశ్చాత్యులు చెబుతున్నదంతా నిజమే అనుకునేంతగా ప్రచారం చేశారు. ప్రజల చేత నమ్మించారు.

ఇలా ఆఫ్రికా దేశాల విభిన్న జాతి ప్రజల జీవన సంస్కృతులను ధ్వం సం చేస్తూనే అమెరికా భిన్నత్వంలో ఏకత్వం గురించి చెబుతున్నది. విభి న్న జాతుల సంస్కృతులను, జీవనవిధానాలను నాశనం చేస్తూనే భిన్న త్వం గురించి గొప్పలు చెబుతున్నది. నైజీరియాలో మెజారిటీ నల్లజాతీయులే అయినప్పటికీ వారంతా ఒకేజాతి సమూహం కాదు. వివిధ ప్రాంతాల్లో విభిన్న భాషా సంస్కృతులు కలిగి ఉంటారు. వారి జీవన సంస్కృతులను నాశనం చేయటం మూలంగానే 1960వ దశకంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఈ జాతుల కొట్లాటలే అంతర్యుద్ధం స్థాయికి చేరాయి. ఈ విధంగానే అంగోలా, రువాండా, ఉగాండాలో కూడా జరిగింది. ఇక్కడ పేర్లు చెప్పుకోవటం ఉదాహరణకు మాత్రమే.

ఆఫ్రికాలోని ఉన్నత, కులీన వర్గాలకు ఇదేమీ పట్టదు. వారంతా యూరప్, అమెరికా దేశాల సాంస్కృతిక జీవనం, ఆలోచనావిధానంతో నిండి ఉంటారు. వీరు ఎంతగా పాశ్చాత్యీకరింపబడ్డారంటే.., పాశ్చాత్య దేశాలదే వాస్తవం. మిగిలినదంతా బూటకం అనే స్థాయి. దేశభక్తి, జాతీయత అనేవి కూడా వారికి పట్టవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్రికా దేశాల గమ్యమేమంటే.. అక్కడి మెజారిటీ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే మేధావి, రాజకీయనాయకత్వం ఎదిగిరావాలి. అలాగే ఆయా దేశాల్లో ఉన్న జాతుల మధ్య వైరుధ్యాలను రూపుమాపి జాతుల మధ్య సఖ్యతను పాదుకొల్పాలి. జాతుల మధ్య స్నేహసంబంధాలను నిర్మించాలి. 1884లో జరిగిన బెర్లిన్ సమావేశం వెలుగులో పాశ్చాత్య దేశాలు ఆఫ్రికాను జాతి సమూహాలు, వారి చారిత్రక మూలా లు, భౌగోళికంగా ప్రజల జీవన సంబంధాలను పట్టించుకోకుండా ఆఫ్రికాను విభజించాయి. ఆఫ్రికాను రొట్టెముక్కలా విరిచి పంచుకున్నాయి. ఇదే పరిస్థితి ఆసియా ఖండంలోనూ జరిగింది. సింగపూర్, తైవాన్, హాం గ్‌కాంగ్ లాంటి దేశాల అవతరణ, వాటి మధ్య ఉన్న వైరుధ్యాలకు పాశ్చాత్య దేశాల దోపీడీ పంపకమే కారణం. ఇదే విధమైన తీరు పశ్చి మాసియా దేశాల్లోనూ కనిపిస్తుంది. వలసవాద పాశ్చాత్య దేశాలు తమ దోపిడీని కొనసాగించటం కోసం భూ మండలాన్ని ఖండఖండాలుగా విభజించాయి. మనుషుల మధ్య వైరుధ్యాలు పెంచి తమ మనుగడకు ముప్పు లేకుండా చూసుకున్నాయి. ఈ నేపథ్యంలో వలసపీడిత దేశాలన్నీ పరస్పర సహకారంతో కలిసినడువాలి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలన్నీ తమ దేశీ య సంస్కృతుల పునాది మీద ప్రజల ఐక్యతను సాధించాలి.ఆఫ్రికా దేశాలు తమదైన సంస్కృతి, రాజకీయార్థిక విధానాల వెలుగులో కలిసినడువాలి. అప్పుడే ఆఫ్రికా దేశాలు, జాతులు తాము కోల్పోయిన జీవన సంస్కృతులను పునరుజ్జీవింపచేసుకోగలుగుతాయి. నిజమైన అర్థంలో ఆ దేశాలు విముక్తిని సాధిస్తాయి.

-చిగోజి ఒబియోమో

(వ్యాసకర్త: నెబ్రాస్కా యూనివర్సిటీలో బోధకులు)

(నమస్తే తెలంగాణ సౌజన్యం తో )