Home News విదేశీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేయనున్న భారత ప్రభుత్వం

విదేశీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేయనున్న భారత ప్రభుత్వం

0
SHARE

విదేశీయులకు ఇచ్చే వీసాలకు చెందిన నిబంధనలను భారత ప్రభుత్వం కఠినతరం చేయనుంది. ఇకపై భారత్ సందర్శించాలనుకునే విదేశీయులు తమ నేర చరిత్రకు చెందిన వివరాలు కూడా వీసా అప్లికేషన్ లో  పేర్కొనే విధంగా నూతన నిబంధనలు రూపొందించింది.

ఈమేరకు భారత మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి మేనకా గాంధీ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కి గత జూన్ నెలలోనే సూచనలు చేశారు. గతంలో విదేశీయులు దేశంలోని బాలికల అక్రమ రవాణాకు, అత్యాచారాలకు పాల్పడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ సూచనలు చేసినట్టు తెలిసింది. దీనికి విదేశీ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది.

అనాథాశ్రమంలో నివసించే బాలికలపై అత్యాచారాలకు పాల్పడినందుకు  2001 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన పాల్ డీన్ అనే క్రైస్తవ మిషనరీని విశాఖపట్నం పోలీసులు అతడి ఫ్లాటులో అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ మీద విడుదలైన అతడు ఓడిశాకు మకాం మార్చాడు. తన నేర ప్రవృత్తిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఒడిశా రాష్ట్రం మునిగుడ గ్రామంలో ఇదే తరహా నేరాలకు పాల్పడటంతో మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. మార్చి 14, 2018లో విశాఖపట్నం రైల్వే కోర్టు మూడు సంవత్సరాల కారాగార శిక్షతో పాటు 32 వేల రూపాయల జరిమానా విధించింది. కానీ అదేరోజు అతడు బెయిల్ మీద విడుదలవడం గమనార్హం.

మరొక ఘటనలో అమెరికాకు చెందిన 42ఏళ్ల జేమ్స్ జోన్స్ ఇంటర్నెట్లో బాలబాలికల నీలిచిత్రాలు పోస్ట్ చేసి, అందరికీ పంపిస్తుండడంతో హైదరాబాద్ పోలీసులు అతడ్ని 2017 జనవరిలో అరెస్ట్ చేశారు. అతడు హైదరాబాద్ నగరంలోని ఒక లీగల్ ఫర్మ్ లో పనిచేస్తున్నట్టు తేలింది.

వేరొక ఘటనలో బ్రిటన్ దేశస్తుడు రేమండ్ వార్లే బాలికల లైంగిక వేధింపుల కేసులో దోషిగా ప్రకటిస్తూ బ్రిటిష్ కోర్టు అతనికి శిక్ష విధించింది. జైలు నుండి విడుదలైన రేమండ్ ఆ తరువాత అనేక దేశాలు తిరిగి చివరికి 1970లో భారత్ చేరాడు. ఇక్కడ గోవాలో 20 ఏళ్ల పాటు బాలబాలిక వసతి గృహం పేరిట వ్యభిచార గృహాన్ని నిర్వహించాడు. ఇక్కడ కూడా పట్టుబడే పరిస్థితి రావడంతో భారత్ నుండి తప్పించుకుని పారిపోయాడు.

ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం వీసా కోసం దరఖాస్తు చేయాలనుకునే విదేశీయులకు నూతన నిబంధనలు విధించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే వీసా అప్లికేషన్లో మరిన్ని కొత్త ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

అవి ఈ క్రింద పేర్కొనబడ్డాయి:
 – మీరు ఎప్పుడైనా ఏదైనా దేశంలో ఆయా దేశపు కోర్టు ద్వారా శిక్ష అనుభవించారా?
 – మీరు గతంలో ఎప్పుడైనా మానవ/బాలబాలికల అక్రమ రవాణా, డ్రగ్స్ సరఫరా, మహిళలు, బాలికలపై నేరాలు మరియు ఆర్థికపరమైన నేరాలకు పాల్పడ్డారా?
 – మీరు గతంలో సైబర్ నేరాలు, తీవ్రవాద కార్యకలాపాలు, రాజకీయ హత్యలు, సామూహిక హత్యాకాండ, విద్రోహం, గూఢచర్యం వంటివాటికి పాల్పడ్డారా?
 – మీరు గతంలో ఏదైనా మాధ్యమంగా ద్వారా కానీ మరే ఇతర రూపంలో కానీ తీవ్రవాదాన్ని సమర్ధించడం, తీవ్రవాదాన్ని శ్లాఘించడం లేదా ఇతరులు తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితులు అయ్యే విధంగా మీ భావాలను వ్యక్తపరిచారా? 
 – మీరు గతంలో రాజకీయపరమైన మరి ఏ ఇతర కారణాల చేతనైనా ఇతర దేశంలో తలదాచుకునేందుకు ఆశ్రయం కోరారా? 

ఇక నుండి విదేశీయులు భారత వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో పై ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ది ట్రైబ్యూన్ సౌజన్యంతో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here