Home Telugu Articles గిరిజనులను సన్మార్గంలో నడిపించిన పూలాజీ బాబా

గిరిజనులను సన్మార్గంలో నడిపించిన పూలాజీ బాబా

0
SHARE

మహారాష్ట్రలోని పర్బనీ జిల్లా నాగ్‌నాథ్‌ దగ్గర సావళి గ్రామంలో 1925వ ఆగష్టు30న శ్రీ పూలాజీ నిరుపేద కుటుంబంలో జన్మించారు. తండ్రికి చిన్నతనం నుండి వ్యవసాయంలో సాయం చేస్తుండేవారు. వారి కుటుంబం పేదరికంలో ఉండటం వలన చదువుకునే అదృష్టం లభించలేదు.

బాల్య దశలోనే తల్లితండ్రులు చనిపోవడం వలన పూలాజీతో పాటు అతని అన్నా, చెల్లి, అక్క, తమ్ముళ్లను పినతండ్రి అక్కున చేర్చుకున్నాడు. పూలాజీ బాబా చిన్ననాటి నుండి సత్యవాది, వినమ్ర స్వభావుడు, ధర్మాచరణ కలిగినవారు. వివాహానంతరం వారు తనకాళ్ళపై నిలబడగలిగే శక్తిని, ఆత్మస్థైర్యాన్ని అలవర్చుకొని, అడవిని సాగుచేసుకొని కొంతవరకు భూమిని అభివృద్ధిపర్చుకొని పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి, దారిద్యాన్ని దాటుకుంటూ ఉన్నత జీవనం వైపు అడుగు వేయసాగారు.

బాల్యంనుండి ధర్మపరాయణుడై, మహాత్ముడయ్యే లక్షణాలు కనిపించేవి. అప్పటి రోజులలో అధికారులు, సర్పంచ్‌, పోలీస్‌, పటేల్‌ ఇత్యాదులు పేదవాళ్ళను గిరిజనులను దోచుకోవడం, వెట్టిచాకిరీలు చేయించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని హింసించేవారు. అది పూలాజీ బాబాకు నచ్చేది కాదు. అన్యాయానికి ఎదురు తిరిగి న్యాయం కోసం పాటుపడేవారు. ఈ తరువాత సుశిక్షితులతో సంపర్కం పెరగసాగింది. విశేషంగా ”శ్రీ గణపతి వాద్గురే” గురూజీ సన్నిధిలో కొంతవరకు అక్షరజ్ఞానం లభించింది. దాని ఆధారంగా ఏదో విధంగా చారిత్రాత్మక గ్రంథాలు చదువుతూ నెమ్మదిగా ధార్మిక ప్రవృత్తి పెంచుకుంటూ ధర్మాచరణ, సదాచారంతో మాంసాహారాలు మానివేశారు. మద్యానికి దూరంగా, హింసను వదిలివేయడంతో ఆచార వ్యవహారాలలో మార్పులు రాసాగాయి.

అనంతర కాలంలో పూలాజీ బాబా కష్టాలను ఎదుర్కొన్నారు. వాటన్నిటికీ ఎదురీదుతూ అంతరంగంలో యోగిగా జాగృతం కాసాగారు. అప్పుడే అద్వితీయమైన లక్షణాలు కనపడసాగాయి. అజ్ఞానులు, అంధ విశ్వాసంలో మునిగి ఉన్న లోకులకు ఇది అర్థంకాక బాణామతి చేతబడి, దయ్యంపట్టిందని నానారకాలుగా అంటుండేవారు.

అయితే గురూజీ వంటి వారికి ఇది మహాత్ముల లక్షణమని అర్థమైంది. చివరకు అదే నిజమైంది. శ్రీ పూలాజీ బాబా బోధనలకు ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరు, జైనూరు మండలాలో చాలా గ్రామాలలో గిరిజనులు ప్రభావితం చెంది, మద్యం, మాంసం మానివేశారు. వారిని అక్కడి గోండులు భగవత్‌ స్వరూపులుగా కొలుస్తారు.

ఈశ్వర అంశగా సాక్షాత్తు భవగత్‌ స్వరూపులుగా సత్యాన్వేషణ చేస్తూ ఎంతోమందికి సత్యోపదేశం చేసి మహాత్ములుగా నిలిచిన పరమహంస సద్గురు పూలాజీ బాబా 25 డిసెంబర్ 2018న పరమపదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here