Home News గ్రామంలో స్థిరపడ్డ ఆదర్శ ప్రభుత్వ ఉపాధ్యాయుడు

గ్రామంలో స్థిరపడ్డ ఆదర్శ ప్రభుత్వ ఉపాధ్యాయుడు

0
SHARE
మరదగడ్డి – ఇది ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని ఒక చిన్న పల్లెటూరు. హుబ్లీ నుండి సిర్సి వెళ్ళే దారిలో కాతూరు గ్రామం నుండి 2కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దీని పక్కనే ఒక అడవి. ఈ ఊరిలో 21 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. జనాభా కూడా 100 మాత్రమే. వారికి పశుపోషణే  జీవనాధారం. పాలు మరియు పాల ఉత్పత్తులు, అంతేకాకుండా పేడను ఎరువు గా చేసి వక్క తోటలకు అమ్ముతారు. వర్షాకాలంలో విపరీతమైన వర్షాలకు ఊరంతా ఇబ్బంది పడుతుంటారు. ఊరిలో పిల్లలు బడికి అన్ని రోజులు వెళ్లలేరు.
ఈ ఊరిలో ఒక ప్రభుత్వ పాఠశాల. అందులో 16 మంది విద్యార్థులు. ఈ పాఠశాలలో హనుమంత చోటణ్ణ అని ఒక ఉపాధ్యాయుడు. చాలా మంది ఉపాధ్యాయులు పక్కనే ఉన్న ఒక పెద్ద ఊరిలో ఇల్లు తీసుకుని భార్య పిల్లలను అక్కడే ఉంచి వారు మాత్రం రోజు బడికి వెళ్లి వస్తుంటారు. ఎవరైనా అడిగితే పిల్లల చదువులు పల్లెటూరి లో కుదరదు అంటారు. అయితే హనుమంత అనే ఈ ఉపాధ్యాయుడు అక్కడే ఒక చిన్నమట్టి ఇల్లు కట్టుకుని 10 సంవత్సరాలుగా తన భార్య పిల్లల తో పాటు నివాసం ఉంటున్నారు. ఇల్లు, పాఠశాల పక్క పక్కనే ఉంటాయి. తన భర్త  బయటకు వెళితే భార్య మీనాక్షి పాఠశాలకు సెలవు ప్రకటించకుండా తానే పాఠాలు చెబుతారు. పాఠశాల వంటమనిషి రాకపోతే తనే పిల్లలకు వండిపెడతారు. వారి పిల్లలు ధృతన్, ధృతి అదే పాఠశాల లో చదువుతున్నారు. ఉపాధ్యాయుడు అతని భార్య కలిసి  పాఠశాల గోడలంతా మంచి చిత్రాలతో నింపేసారు.
పల్లెలో ఏం చేస్తారు అని ఎవరైనా అడిగితే పాఠశాల పని తోనే సమయం గడిచిపోతుంది అని నవ్వేసారు. ఇక్కడ ఉన్నందుకు నా పనికి నేను న్యాయం చేసాననే భావన ఆనందాన్నిస్తుంది అంటారు. మిగిలిన ఉపాధ్యాయులు పక్క‌‌‌ టౌను కు వెళ్లి టివి చూస్తు లేదా వేరే పనుల్లో కాలం గడిపితే మన ఈ మాష్టారు మాత్రం బడి-బడి అంటూ పని చేస్తారు. ఇతని భార్య కూడా ఇలాగే నడుచుకుంటూ ఉంటుంది కదా! ఏంచేయాలి? పిల్లలు కూడా పల్లెలోని పిల్లలతో కలిసి పోయారు. మిగిలిన మాష్టార్లు ప్రభుత్వోద్యోగులు ఈ చోటణ్ణ లాగా ఎప్పుడు మారతారో?