Home Hyderabad Mukti Sangram గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-30)

గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-30)

0
SHARE

వెనకాల తరుముకొస్తున్న సాయుధులైన రజాకార్లు గ్రామంలో మొదట స్టేషన్ మాస్టర్ ఆంజనేయులు ఇంట్లోని 30 తులాల బంగారం ఎత్తుకుపోయారు. ఆ తర్వాత గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు అంటించారు. క్రమక్రమంగా చాలా ఇండ్లు తగలబడిపోయినాయి. గ్రామస్థులను చెదరగొట్టాలనే ఉద్దేశ్యంతో గాలిలో కాల్పులు సాగించారు. భయపడిపోయిన గ్రామప్రజలు తలుపులు మూసికొని ఇళ్ళలో తలదాచుకున్నారు. స్వయంగా ఖాసిం రజ్వీ జీప్‌తో బాటు గ్రామంలోకి ప్రవేశించి తన పర్యవేక్షణ క్రింద ధనవంతుల ఇళ్ళను దోపిడీ చేయించాడు. పట్టండి! కొట్టండి! నరకండి! అనే కేకలతో వాతావరణం నిండిపోయింది.

ఉపాధ్యాయిని రత్తమ్మ ఇంట్లోకి చొరబడి తుపాకీ చూపి ఆమె బంగారు కడియాలు, ఉంగరాలు లాక్కున్నారు. అయ్యవారు పురుషోత్తమాచారి ఇంట్లోకి వెళ్ళి 1200 తులాల వెండి, బంగారం, డబ్బు దోచుకుని ఆచారిని తాళ్ళతో బంధించి తీసుకువచ్చారు. వ్యాపారస్తుడైన వైశ్య మల్లయ్యగారి శివయ్యను కూడా విపరీతంగా కొట్టి ఆస్తినంతా దోచివేశారు. ఆ తర్వాత బంగారు రాజయ్య ఇంటిని దోచారు. కాని రాజయ్య భయకంపితుడై పారిపోతూ బావిలోపడి తీవ్రంగా గాయపడ్డాడు. బంజరి బాలయ్య ఇంటిపైబడి అతన్ని తీవ్రంగా కొట్టారు. దొరికిన వెండి, బంగారు నగలు దొంగిలించారు. చాలామందిని తాళ్ళతో కట్టి రజ్వీ ముందు వరుసగా నిలుచోబెట్టారు.

ఫీల్డ్ మార్షల్ ఖాసిం రజ్వీ కళ్ళ ఎదుట బీబీనగర్ పట్టపగలే దోచుకోబడింది. దాదాపు అన్ని ఇళ్ళలోని డబ్బు, వెండి, నగలు లాక్కోబడ్డాయి. ఇళ్ళు తగులబెట్టి వీలున్న చోటల్లా మానభంగాలు చేయబడ్డాయి. రెండుగంటల పాటు ఆ గ్రామాన్ని పిశాచాలు రాజ్యమేలి విజయోన్మాదంతో ఊగిపోయాయి. నిజాం తన స్వతంత్య్ర ప్రతిపత్తి కోసం రజాకార్ల చేతుల్లోకి తన ప్రజలను ఎంత అమానుషంగా నెట్టి వేశాడో బీబీనగర్ ఒక చారిత్రాత్మకమైన ఉదాహరణ.

ఖాసిం రజ్వీ తన సిగ్గుమాలిన విజయోల్లాసంతో ఇరవైమంది గ్రామస్తులను బందీలుగా తీసుకొని ఊరి బయటికి వచ్చాడు. కస్టమ్స్ కార్యాలయం ఎదుట ఆ బందీలను ఉద్దేశించి ఖాసిం రజ్వీ ఉపన్యసించాడు. ప్రభుత్వంతో సహకరించిన రజాకార్లకు సహాయపడని పక్షంలో జీవించడం కష్టమని ఊరివాళ్ళను బెదిరించాడు. ఆ బందీలైన గ్రామస్థులందరినీ తర్వాత వదిలివేసి నినాదాలు చేసుకుంటూ రజ్వీ తన మందీమార్బలంతో తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత బీబీనగర్‌లో శ్మశనంలాంటి స్థబ్దత వ్యాపించింది. ఇళ్ళు కాలుతున్నాయి. దోచబడిన వ్యక్తులు విలపిస్తున్నారు. ఎటుచూసినా నీరస వాతావరణం వ్యాపించింది. ఈలోగా రాత్రి పదిగంటలకు లారీల చప్పుడు వినిపించింది. హెడ్‌లైట్ల వెలుగు చీకటిని చీల్చుకుంటూ వచ్చింది. కుక్కలు మాత్రం మొరుగుతున్నాయి. గ్రామస్థులందరు మళ్ళీ ఏమిటీ కొత్త ఉపద్రవం అని భయకంపితులైనారు.

నిజాం రెండు కళ్ళు
స్టేషన్ మాస్టర్ ఆంజనేయులు పంపిన టెలిగ్రాఫిక్ వర్తమానం అందుకొని రైల్వే అధికారులు బందోబస్తు కోసం అంబర్‌పేట రిజర్వ్ పోలీసులను వెళ్ళమని కోరారు. ఆ రిజర్వ్ పోలీసుల లారీలే రాత్రి పదిగంటలకు ప్రవేశించాయి.

Source: Vijaya Kranti