Home News గ్రామస్థుల మధ్య ‘కుల చిచ్చు’ పెట్టేందుకు చర్చి యత్నం.. బహిర్గతం చేసిన ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్

గ్రామస్థుల మధ్య ‘కుల చిచ్చు’ పెట్టేందుకు చర్చి యత్నం.. బహిర్గతం చేసిన ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్

0
SHARE

కుల విబేధాలు మరచి, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్న ఆ గ్రామంపై ఓ చర్చి కన్ను పడింది. మతం మారకుండా హిందువులుగా ఉంటున్న అక్కడి ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారిని ఎలాగైనా మతం మార్చాలని కుట్ర చేసింది. ఈ కుట్రకు స్థానిక కమ్యూనిస్ట్ నాయకులు వంతపాడారు. కొన్ని పత్రికలు తప్పుడు వార్తల ప్రచురణ ద్వారా అసత్య ప్రచారం చేశాయి. చివరికి జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి చేసిన కృషితో ఆ చర్చి ప్రయత్నం బెడిసికొట్టింది.. కుట్ర బహిర్గతం అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బ్రాహ్మణపల్లి  గ్రామం. అక్కడ అన్ని వర్గాల వారు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఆ గ్రామంలోని ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఇంకా ధ్వజస్తంభ ప్రతిష్ట జరగనందున 41 రోజుల దాకా గ్రామంలోని మహిళలెవరూ ఆలయంలోకి ప్రవేశించకూడదని ఆలయ పూజారి చెప్పడంతో ఇదే విషయాన్ని ఊరంతా దండోరా వేసి తెలియజేశారు.

ఇదిలా ఉండగా స్థానికంగా నివసించే పెద్దన్న కొడుక్కి వివాహం జరిగింది. జూన్ 27వ తేదీన పెద్దన్న భార్య, కొడుకు-కోడలు (నూతన దంపతులు), మరొక మహిళ కలిసి దైవ దర్శనం కోసం ఆలయానికి వచ్చారు. 41 రోజుల పాటు మహిళలెవరికీ ఆలయం లోపలికి ప్రవేశం లేదు కాబట్టి బయటి నుండే దర్శనం చేసుకుని అక్కడి పూజారికి కొబ్బరికాయ నైవేద్యంగా ఇచ్చారు. ఐతే ఆ ముగ్గురు మహిళల్లో ఆలయ ప్రవేశం విషయంమై ఉన్న నిబంధన  తెలుసుకోలేకపోయిన ఒక మహిళ పూజారితో పాటు అతని వెనుకనే ఆలయంలోనికి ప్రవేశించింది. ఈలోగా మరికొందరు వచ్చి అసలు విషయం ఆ మహిళకు వివరించారు. ఈ విషయం తనకు తెలియదని ఆ మహిళ వివరణ ఇచ్చింది.

ఈ ఘటన అనంతరం శుద్ధి కార్యక్రమం నిర్వహించాలని ఆలయ ప్రధాన పూజారి నిర్ణయించగా.. ఆ నిర్వహణ ఖర్చుగా రూ. ఐదు వేలు తానే చెల్లించేందుకు ఆ మహిళ అంగీకరించింది.

ఇక్కడే స్థానిక చర్చి కుట్ర మొదలైంది. పెద్దన్న కులాన్ని ఇందుకు ఉపయోగించుకోవాలని చూసింది. “మీరు దళితులైనందునే మిమ్మల్ని పూజారి, ఇతర గ్రామస్థులు ఆలయంలోకి రానివ్వలేదు” అని పెద్దన్న కుటుంబీకులకు చర్చి పాస్టర్ నూరిపోశాడు. దీనికి స్థానిక కమ్యూనిస్ట్ సంఘాల నాయకులూ జతకలిశారు. పోలీసులకు ఫిర్యాదు చేయమంటూ వారిని రెచ్చగొట్టారు. ఇంతమంది ఒకేసారి తమపై ఒత్తిడి తీసుకువచ్చేసరికి నిజంగానే తమపై వివక్ష చూపారని భ్రమపడిన పెద్దన్న కుటుంబీకులు చర్చి ప్రోద్బలంతో పోలీస్ ఫిర్యాదు చేసింది. 

పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రధాన పత్రికల్లో “దళితులపై వివక్ష” అసత్య వార్తలు ప్రచురితమయ్యాయి. ఇదే అదనుగా స్థానిక చర్చి పాస్టర్ తన అసలు స్వరూపం బయటపెట్టాడు. “మీపై వివక్ష చూపించే మతంలో మీరెందుకు ఉంటారు.. మా క్రైస్తవంలోకి వచ్చేయండి” అంటూ మాయమాటలు చెప్పడం మొదలుపెట్టడంతో పెద్దన్న కుటుంబ సభ్యులకు అసలు విషయం అర్ధమైంది. ఇదంతా తమను హిందూ మతం నుండి వేరు చేసేందుకు చేస్తున్న కుట్ర అని వారు గ్రహించారు.   

సరిగ్గా అదే సమయంలో కర్నె శ్రీశైలం ఆధ్వర్యంలోని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి బృందం, ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్, హిందూ ధర్మ రక్షా సమితి జూలై 4వ తేదీన నిజ నిర్ధారణ కోసం తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు బ్రాహ్మణపల్లి గ్రామం చేరుకున్నాయి.

గ్రామస్తులను సమావేశపరిచారు. జరిగిన విషయం కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులే అధికారులు, సాధుసంతుల ఎదుట వివరించారు. తాము ఎన్నడూ వివక్షకు గురికాలేదని, స్థానిక నాయకుల చెప్పుడు మాటల కారణంగా ఫిర్యాదు చేశామని, అనంతరం జరుగుతున్న కుట్రను గ్రహించి వెంటనే ఫిర్యాదు వాపసు తీసుకున్నామని అధికారులకు  వివరించారు. చర్చి పాస్టర్ తమను క్రైస్తవంలోకి రమ్మని ఒత్తిడి చేసినట్టు వారు వివరించారు.


ఊర్లో అనుమతి లేని చర్చి: 

ఇదిలా ఉండగా బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మించిన చర్చికి అధికారుల నుండి అనుమతులు లేవని తెలిసింది . పైగా అక్కడ పాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి స్థానికుడు కాదని, గుత్తి నుండి ఇక్కడికి వచ్చి చర్చి కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడని నిజనిర్ధారణ కమిటీ తెలియజేసింది.