Home Rashtriya Swayamsevak Sangh గ్రామీణ భారతాన్ని నిర్మించాలి: డా. మన్మోహన్ వైద్య, సహ సర్ కార్యవాహ, ఆర్.ఎస్.ఎస్

గ్రామీణ భారతాన్ని నిర్మించాలి: డా. మన్మోహన్ వైద్య, సహ సర్ కార్యవాహ, ఆర్.ఎస్.ఎస్

0
SHARE

భారతదేశం ఎప్పుడూ కేవలం తన మంచిని మాత్రమే చూసుకోలేదు. తనతోపాటు విశ్వకళ్యాణం గురించి కూడా ఆలోచించింది. “ఆత్మనో మోక్షార్ధ జగత్ హితాయ చ” అనేదే భారత్ ధోరణి, వ్యవహారం కూడా.

`స్వదేశీ సమాజ్’ అనే తన పుస్తకంలో గురుదేవులు రవీంద్రనాధ్ టాగూర్ ఇలా వ్రాసారు -“మనం ఏమిటో ముందు మనం అది కావాలి’’. ఈ `మనం’ అంటే ఆధ్యాత్మిక చింతన. దీనిలో ఏకాత్మ దృష్టి, సర్వజీవకోటి పట్ల ఆదరం ఉన్నాయి. హిమాలయాల నుండి అండమాన్ వరకు ఉన్న ఈ విశాలమైన భూభాగంలో అనేక భాషలు మాట్లాడేవారు, అనేక జాతులు, అనేక దేవతలను పూజించేవారు కొన్ని వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు. వీరంతా కలిసి `మనం’ అవుతాము. ఈ గుర్తింపు, ఎరుక చాలమందికి ఉంటుంది. ఇదే మన ప్రత్యేకత. `ఏకం సద్విప్రాః బహుధా వదంతి’, `వివిధతామె ఏకతా’, ప్రతి వ్యక్తిలో ఈశ్వరాంశ ఉంది’, ఆ ఈశ్వర అంశను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరికీ వారివారి అభిరుచి, ప్రవృత్తి, ప్రకృతిని అనుసరించి వేరువేరు మార్గాలు ఉన్నాయి. ఈశ్వరాంశను గుర్తించడం, అనుభవంలోకి తెచ్చుకోవడమే జీవన లక్ష్యం. ఈ నాలుగు విషయాలపై మన `గుర్తింపు’ ఆధారపడి ఉంది. అది మన అన్ని రంగాలలో కనిపిస్తుంది. ఇదే `మనం ఏమిటో ముందు అది మనం కావాలి’ అనడంలో అర్ధం.

నేటికీ 70శాతం ప్రజానీకం గ్రామాల్లోనే నివసిస్తారు. కానీ ఒకప్పుడు గ్రామాలు ఎలా ఉండేవి? రహదారులు ఉండేవికావు. విద్యా, వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే. ఇక ఉపాధిఅవకాశాల గురించి చెప్పేఅవసరం లేదు. గ్రామం అంటే వెనుకబాటుతనం అనే అభిప్రాయం ఏర్పడిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంకా మారుతోంది. మరింత మారాలి కూడా. ఇప్పుడు రహదారులు వచ్చాయి, విద్యుత్తు, ఇంటర్ నెట్, మొబైల్ ఫోన్లు, రవాణా సౌకర్యం మొదలైనవన్నీ వచ్చాయి. అక్కడే విద్యా, వైద్య సదుపాయాలు కూడా కలిగిస్తే ఇక గ్రామాలు వదిలిపెట్టి జనం రావాలనుకోరు. నగర కేంద్రిత వ్యవస్థ స్థానంలో వికేంద్రీకృత ఆర్ధిక వ్యవస్థ ఏర్పడుతుంది.

కరోనా మూలంగా నగరాలకు వెళ్ళినవాళ్ళంతా తమతమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. కొందరు ఇంకా వస్తున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా తమ గ్రామాలకు వెళిపోతున్నారు. వీరికి అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే, తమ గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో వారిని జోడించగలిగితే 40శాతం మంది ఆ గ్రామాల్లోనే ఉండిపోతారు.

యువతలో సృజనాత్మకత పెంచడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. గ్రామీణ జీవనానికి సంబంధించిన, వ్యవసాయంతో ముడిపడిన అనేక పనులు చేపట్టడానికి వారిని ప్రోత్సహించాలి. గ్రామ సముదాయాల ద్వారా అనేక పరస్పర ఆధారిత పనులను ప్రారంభించవచ్చును. గ్రామంలో తయారుచేసిన వస్తువులు నేరుగా వినియోగదారులు లేదా మార్కెట్ కు చేర్చవచ్చును. ఈ పనిలో కూడా అనేకమందికి ఉపాధి లభిస్తుంది. నేడు ఊబర్, ఓలా ద్వారా ఒక ఫోన్ కాల్ కు మీ ఇంటి ముందుకు వాహనం వచ్చే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు ఎంత సమయంలో వాహనం వస్తుంది, గమ్యం చేరడానికి ఎంత సమయం పడుతుందనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. అలాగే డబ్బు నేరుగా ఆన్ లైన్ లో చెల్లించే వీలుకూడా ఉంది. అనేకమంది ఈ వాహన సదుపాయాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల అనేకమంది యువకులకు ఉపాధి లభించింది.

రసాయన ఎరువుల వల్ల, పురుగు మందుల వల్ల భూసారం బాగా దెబ్బతింటోంది. సేంద్రీయ వ్యవసాయపు అవసరం, ప్రాధాన్యతను అందరూ గుర్తిస్తున్నారు. ధర కొద్దిగా ఎక్కువ ఉన్నా స్వచ్చమైన బియ్యన్నే కొనాలని భావిస్తున్నారు. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందజేసే ఏర్పాటు చేసుకుంటే దానివల్ల అనేకమందికి ఉపాధి లభిస్తుంది. అప్పుడు స్వదేశీ గోఉత్పత్తులకు (పాలు మొదలైనవి) కూడా గిరాకీ బాగా పెరుగుతుంది. ఇలాంటి పనులన్నీ గ్రామం కేంద్రంగా జరగాలి. అప్పుడు గ్రామం అభివృద్ధి చెందుతుంది.

నేడు చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. గ్రామాల్లో విద్యుత్ సదుపాయం సరిగా అందుబాటులోకి తెస్తే అక్కడే చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించవచ్చును. వాటికి ప్రత్యేక రాయితీలు కూడా ఇవ్వవచ్చును. అలాంటి పరిశ్రమలను ప్రారంభించడానికి అనువైన పరిస్థితులు ప్రభుత్వం ఏర్పరచాలి. గ్రామాలలో పరిశ్రమలు ప్రారంభించేవారికి తక్కువ వడ్డీకి ఋణాలు, ప్రత్యేక రాయితీలు ఇవ్వవచ్చును.

ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడాలంటే ఆ ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉండాలి. ఆ ఉత్పత్తుల నమూనా సరిగా ఉండాలి. అందుకనే కొరియా, జపాన్ వంటి దేశాల్లో వివిధ ఉత్పత్తుల నమూనాల విషయంలో ముందునుంచే చాలా శ్రద్ధ వహిస్తారు. అందువల్లనే అక్కడ తయారయ్యే వస్తువులకు ప్రపంచం మొత్తంలో మంచి గిరాకీ ఉంటుంది. మన దేశంలో కూడా సరైన డిజైన్ లు రూపొందించడంలో యువతకు శిక్షణ ఇవ్వడానికి ఆన్ లైన్ కోర్స్ లు ప్రారంభించాలి.

ఒకప్పుడు భారత ఆర్ధిక వ్యవస్థపై చైనా ప్రభావం బాగా ఉండేది. కరోనా వైరస్ మూలంగా చైనాకు ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో చైనా ఉత్పత్తుల బహిష్కరణ జరిగితే, అప్పుడు స్థానిక ఉత్పత్తులు, పరిశ్రమలకు మంచి అవకాశం లభిస్తుంది. అయితే చవకైన చైనా వస్తువుల బదులు ఇక్కడ అటువంటి వస్తువులు తయారుచేసుకునే సామర్ధ్యం సంపాదించాలి. ఇది ఒకరకంగా ఆర్ధిక యుద్ధం. కాబట్టి యుద్ధప్రాతిపదికన ఇందుకు సన్నద్ధమైతే అప్పుడు అనేకమంది యువతకు ఉపాధి లభిస్తుంది.

అనేక దేశాలు చైనాతో వ్యాపార సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలనుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైనా వస్తువులకు బదులు అంతకంటే నాణ్యమైన, చవకైన వస్తువులు తయారుచేయగలిగితే అప్పుడు ఈ దేశాలు మనతోనే వ్యాపారం చేయడానికి ముందుకువస్తాయి. ఇక్కడ ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. పెట్టుబడులు కూడా పెరుగుతాయి.  ఆర్ధిక వ్యవస్థ బలపడుతుంది. ప్రభుత్వం కూడా పెట్టుబడులకోసం అప్పులు, ప్రత్యేక రాయితీలు ఇస్తే అప్పుడు మిగిలిన పని ప్రజానీకం చేయగలుగుతారు.

స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే దృష్టితోనే ప్రణాళికలు సిద్ధంచేయాలి. ప్రతి దేశానికి స్వదేశీ విధానం చాలా ముఖ్యమైనది. వైశ్వీకరణ అందరికీ సరిపోయే విధానం (one size fits all) అనే ధోరణి సరైనది కాదు. పరస్పర అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెండు దేశాలు తమ వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవాలి.

ఈ పరిశ్రమలు ప్రధానంగా గ్రామాల్లో ఏర్పాటుచేసినట్లైతే ఉత్పత్తుల ధర కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రామాల్లో జీవన వ్యయం(cost of living) తక్కువగా ఉంటుంది. మరోవైపు జీవన స్థాయి(quality of life) ఎక్కువగా ఉంటుంది. తమ గ్రామాల్లోనే ఉండి పనిచేసుకోవడం వల్ల సామాజిక సంబంధాలు కూడా పటిష్టపడతాయి.

అయితే ఇదంతా ప్రభుత్వం మాత్రమే చేయలేదు. ప్రభుత్వ సహకారానికి సమాజపు చొరవ తోడైతేనే ఇది సాధ్యపడుతుంది. దీనికి సర్వతోముఖమైన (total), సమీకృత(integrated) ప్రణాళిక అవసరం. క్రమంగా ప్రభుత్వంపై ఆధారపడటం తగ్గించి సమాజమే స్వాలంబనతో ఈ ప్రణాళికను అమలు చేయగలగాలి. రవీంద్రనాధ్ టాగూర్ చెప్పిన స్వదేశీ సమాజ్ అంటే ఇదే. రాజ్యంపై అతి తక్కువగా ఆధారపడే సమాజమే స్వదేశీ సమాజమని ఆయన చెప్పారు.

మన దేశంలో నూతన విద్యావిధానం రూపొందుతున్నది. అది త్వరలోనే అమలులోకి వస్తుంది. అలాంటి విద్యావ్యవస్థ అమలులోకి వస్తే అప్పుడు భారతీయ మౌలిక విలువల ఆధారంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. భౌతిక సంపదను సృష్టించడంతోపాటు మనలోని `ఈశ్వర’ అంశను గుర్తించి, గ్రహించి ఆ వైపుగా ప్రయాణం సాగించే అలవాటు భారతీయులకు ప్రాచీన కాలం నుంచి ఉంది. `యతోభ్యుదయం నిఃశ్రేయస్ సిద్ధిః స ధర్మః’ అనే ప్రాచీన భారతీయ భావన అర్ధం ఇదే. ఆధ్యాత్మిక చింతన ఆధారంగా సమాజ కార్యకలాపాలు సాగితే అప్పుడు సమృద్ధితోపాటు ఆ సంపదను తిరిగి స్వచ్ఛందంగా సమాజానికి ఇచ్చే ప్రవృత్తి కూడా ప్రజలలో కలుగుతుంది. అప్పుడు సమాజంలో పోగుపడే సంపద ప్రతిఒక్కరికి అందుబాటులోకి వస్తుంది. అందరూ సంపన్నులు అవుతారు.

సోదరి నివేదిత ఇలా అంటారు – “ఏ సమాజంలో వ్యక్తులు తమ శ్రమ ఫలితాన్ని తమ కోసమే ఉపయోగించుకోకుండా సమాజానికి అందజేస్తారో ఆ సమాజంలో సమిష్టి సంపద ఏర్పడుతుంది. ఆ సంపద వల్ల ప్రతి ఒక్కరూ సంపన్నులు అవుతారు. కానీ ఏ సమాజంలో వ్యక్తులు తమ శ్రమ ఫలితాన్ని తామే దాచుకుందామనుకుంటారో అలాంటి సమాజంలో కొందరు ధనికులు ఉంటారుకానీ మొత్తం సమాజం మాత్రం దారిద్ర్యంలోనే ఉంటుంది.’’ సమాజాన్ని తనదిగా భావించి తనకు ఉన్నది ఇవ్వడమే `ధర్మం’అని చెప్పారు. రాజ్యశక్తిపైన కాకుండా ఈ ధర్మశక్తి ఆధారంగా నిలిచే సమాజమే సంపన్నమవుతుంది, సమృద్ధి సాధిస్తుంది. శ్రేష్టులైనవారిని ఇతరులు అనుసరిస్తారు.

`యద్యదాచరతి   శ్రేష్టః తత్తదేవే తరోజనః |

సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ||

ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని భవిష్య భారత నిర్మాణం కోసం సరైన వ్యవస్థలను ఏర్పాటుచేసుకోవాలి. అదే ఈ `కరోనా కాలపు’ పాఠం అవుతుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here