Home Telugu Articles హైందవ ధర్మ పరిరక్షకులు ముసునూరి నాయకులు – 1

హైందవ ధర్మ పరిరక్షకులు ముసునూరి నాయకులు – 1

0
SHARE

ఒక కీలకమైన దశలో దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మాన్ని ఇస్లాం దాడి నుంచి కాపాడిన మహాపురుషులు ముసునూరి ప్రోలయ, కాపయ నాయకులు. సామాన్యశకం 1323 నుంచి 1366 వరకు ముస్లిముల దాడులను తిప్పికొట్టడానికై దక్షిణాది రాజులను కూడగట్టి, ముస్లిం దాడుల్లో ధ్వంసమైన దేవాలయాలను, విద్యావ్యవస్థను, శాస్త్రసంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ భవిష్యత్తులో హిందూధర్మ రక్షణకు రెడ్డిరాజ్యం, విజయనగర సామ్రాజ్యాల స్థాపనకు, ఆ తరువాత శివాజీ హిందూపదపాదశాహీకి స్ఫూర్తిగా నిలచిన ప్రోలయ, కాపయ సోదరులు హిందువులకు, ముఖ్యంగా తెలుగువారికి ప్రాతస్మరణీయులు.

కాకతీయ చక్రవర్తుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుడు సా.1289 నుంచి 1323 వరకు పాలించాడు. అదే సమయంలో ఉత్తరభారతదేశంలో ఖిల్జీవంశాన్ని తుదముట్టించి రాజ్యానికి వచ్చిన ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ (సా.1320-1325) తన కుమారుడైన ఉలుగ్‌ఖాన్‌ను ఓరుగల్లు (వరంగల్‌) మీదికి దండయాత్రకు పంపాడు. ఈ ఉలుగ్‌ఖాన్‌ ఆ తరువాత కాలంలో మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌గా పేరుపొందాడు.

ఢిల్లీ లేక ఇంద్రప్రస్తం భారతదేశపు రాజకీయ కేంద్రమని, దానిని ఆధీనంలో ఉంచుకున్నవాడు భారతదేశపు చక్రవర్తి అని ఒక భావన ఉంది. కానీ అది అన్ని సందర్భాలకు వర్తించదు. ప్రాచీన భారతీయ రాజనీతి సిద్ధాంతం ప్రకారం పాలన సాగిన సందర్భాల్లో మాత్రమే ఆ భావన పర్తిస్తుంది. ఆ సిద్ధాంతం ప్రకారం చక్రవర్తి క్షేత్రం, చక్రవర్తి రాజధాని, అతడికి లోబడిన సామంతరాజులు ఉంటారు. వాళ్ళు భారతరాజనీతి సూత్రాలు, నియమాల ప్రకారం వ్యవహరించేవారు. వీటి వివరాలు కౌటిల్యుని అర్థశాస్త్రంవంటి గ్రంధాల్లో చూడవచ్చు. కానీ ముస్లిముల ఆక్రమణ తరువాత భారతీయ రాజనీతి సిద్ధాంతాలను అమలు చెయ్యడంలో అవరోధం ఏర్పడింది. అలాంటి తరుణంలో ఆ సిద్ధాంతంలో ఒక భాగమైన చక్రవర్తిక్షేత్ర సిద్ధాంతాన్ని అమలు చేయడం సాధ్యమూకాదు, దాని అవసరమూ లేదు. చక్రవర్తి, సామంతులు ఒకే మతసంస్కృతులను, లేదా కనీసం ఒక జీవితదృస్పథాన్ని కలిగివున్నప్పుడు ప్రాచీన సిద్ధాంతాన్ని అమలు చేయడంవల్ల ప్రయోజనం ఉంది. ఆ వ్యవస్థలో చక్రవర్తికి సామంతులు నామమాత్రపు విధేయత కలిగి ఉండేవారు. అలాంటి విధేయతకు దేశసమగ్రత లక్ష్యంగా ఉండేది. ముస్లిములు పాలకులైన తరువాత పరిస్థితి మారిపోయింది. కేవలం అధికార విస్తరణ, ధనవ్యామోహంతో సామంతులను, ప్రజలను దోచుకోవడం, యుద్ధపిపాస, మతదురహంకారం వారి పాలనను ప్రభావితం చేశాయి. వారి లక్ష్యం ఇస్లాం మతవ్యాప్తి లేదా తమ భోగవిలాసాలు మాత్రమే. దేశసమగ్రతకు అందులో స్థానం లేదు. ఢిల్లీని ఆక్రమించిన ముస్లిం సుల్తానులు ఇతర రాజులపై చేసిన దాడులు, యుద్ధాలు దేశాన్ని రాజకీయంగా ఏకం చేయడానికి, తద్వారా ప్రజలకు సుస్థిరపాలన అందించడానికి కావు. అవి కేవలం దోపిడి, దురాక్రమణ, మతవైరంతో చేసిన దాడులు.

ఈ ప్రధాన అంశాన్ని, అంటే దేశీయపాలనకు, విదేశీపాలనకు ఉన్న తేడాను లెక్కలోకి తీసుకోకుండా ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుకు సామంతుడనే మాట తామే చెప్పి, ‘ప్రతాపరుద్రుడు సుల్తానుకు కప్పం కట్టనందుకు అతడు సైన్యాన్ని పంపి శిక్షించాడుఅని వ్యాఖ్యానించడం దురదృష్టకరం. ఢిల్లీ సుల్తానులు హిందూరాజుల నుంచి ధనం వసూలు చేసిన మాట నిజమేకానీ అది చక్రవర్తి సామంతుడి నుంచి ఆశించే కప్పంవంటిది కాదు. ముస్లిములు ఇస్లాం సూత్రాల ప్రకారం ముస్లిమేతరుల నుంచి దోపిడి ద్వారాకానీ, ఇతర మార్గాల్లోకానీ వసూలు చేసేది కొల్లసొమ్ము. కొల్లసొమ్ము, బానిసవ్యాపారంలో వచ్చే ఆదాయం ముస్లిం వ్యవస్థ ప్రధాన రాబడి మార్గాలు.

సామాన్యశకం 1323లో ఓరుగల్లును ఆక్రమించిన ఉలుగ్‌ఖాన్‌(మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌) సైన్యాలు క్రమేణ మిగిలిన తెలుగుదేశాన్ని ఆక్రమించాయి. అనంతమైన బంగారం, ముత్యాలు, దంతం మొదలైనవి ఢిల్లీకి తరలించారు. కాకతీయరాజ్యసంపదను తరలించడానికి 20,000 గుర్రాలు, 100 ఏనుగులు, ఒంటెలు ఉపయోగించారు. అలా తరలించిన అమూల్యమైన వస్తువుల్లో కోహినూర్‌ వజ్రం ఉంది. ఆరునెలల ముట్టడి తరువాత కొండపల్లి ఢిల్లీ సేనల వశమైంది. తూర్పుతీరంలోని కొలనివీడు, నివద్యపురం(నిడదవోలు), రాజమహేంద్రి, కొండవీడు, నెల్లూరు కోటలను మహమ్మదీయసేనలు వశం చేసుకున్నాయి. నెల్లూరు(నిలావర్‌) నుంచి క్విలన్‌(కులాన్‌) వరకుగల మాబారు(మధురరాజ్యం) వారి వశమైంది. ఒరిస్సాలోని జాజ్‌నగర్‌ మినహా తక్కిన వింధ్యదక్షిణ ప్రాంతాలన్నీ ఢిల్లీ సేనలకు లోబడ్డాయి. ఓరుగల్లు సుల్తాన్‌పూర్‌గా మారింది. కీలకకేంద్రాల్లో మహమ్మదీయ సైన్యాలు మోహరించాయి. తెలుగుదేశమంతా దౌలతాబాద్‌(దేవగిరి) వజీరు మలిక్‌ బుర్హనుద్దీన్‌కు అప్పగించారు. వజీర్‌కు సాయంగా సుల్తాన్‌పూర్‌లో మరో అధికారిని (మలిక్‌ మక్బూల్‌ లేదా గన్నయ్‌) నియమించారు. ఆ విధంగా తెలుగుదేశంలో ముస్లిం సైనికపాలన ఏర్పడింది.

తురుష్కుల ముష్కరపాలనలో తెలుగుదేశప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు అనేక బాధలు అనుభవించారు. ఈ దుస్థితిని నాటి విలసతామ్ర శాసనం వర్ణించింది” (ఆంధ్రుల చరిత్ర, తెలుగుఅకాడమి)

అలాగే గంగాదేవి మధురా విజయంఅనే సంస్కృత కావ్యంలో తురుష్కుల పాలనలో తెలుగుదేశపు స్థితిని వర్ణించింది. హిందువ పాలనలోకంటే 5రెట్లు, 10రెట్లు పన్నులను సుల్తాను పెంచడంతో అనేక రైతు కుటుంబాలు నాశనమయ్యాయని, పేదరైతులు ఇంకా దరిద్రులై బిచ్చగాళ్ళుగా మారారని, ధనికులు ఆగ్రహంతో గ్రామాలు విడిచి అడవులు పట్టి తిరుగుబాటు సేనలో చేరారని, దానితో పంటభూములు బీడుపడి వ్యవసాయం పూర్తిగా సన్నగిల్లిందని, ఇస్లాం మతాభిమానం, జాత్యాభిమానం ఎక్కువగా తన రచనలో కనపరచిన మహమ్మదీయ చరిత్రకారుడు జియాఉద్దీన్‌ బరనీ గంగాయమునా అంతర్వేది (దోఆబ్‌)లోని ప్రజల కష్టాలను వర్ణించాడు. దక్షిణదేశం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. చాళుక్యులు, కాకతీయుల కాలంనాటి అనేక దేవాలయాలను, దేవతావిగ్రహాలను, వృత్తులను, వృత్తికారులను, వ్యవస్థలను ధ్వంసం చేశారనడానికి తీరాంధ్రలో ఆధారాలు కనబడతాయి. రాజమండ్రిలోని పెద్దమసీదు, ఏలూరు, కొండపల్లి, బిక్కవోలు మసీదులు దేవాలయాలను పడగొట్టి వాటి శిథిలాల మీద నిర్మించినవే.

దక్షిణాదిలో, ముఖ్యంగా తెలుగుదేశంలో పరిస్థితులీవిధంగా ఉంటే ఢిల్లీ పాలితమైన మిగతా ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. సా.1325లో తండ్రి ఘియాజుద్దీన్‌ని కుట్ర చేసి చంపి, ఉలుగ్‌ఖాన్‌ మహమ్మద్‌బీన్‌ తుగ్లక్‌ పేరుతో రాజ్యానికి వచ్చాడు. రాజ్యం నలుమూలలా తిరుగుబాట్లు చెలరేగాయి. అనేక ప్రాంతాల్లో అతడి అధికారాన్ని ధిక్కరించారు.

తెలుగుదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా స్వతంత్రం కోసం తిరుగుబాట్లు చెలరేగాయి. అలా తిరుగుబాటు చేసిన వారిలో ముసునూరి నాయకులు ఉన్నారు.

సా..1322లో దండయాత్ర చేసిన ఉలుగ్‌ఖాన్‌(ఇతడికి జూనాఖాన్‌ అనే పేరు కూడా ఉన్నట్లు కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు)ను కాకతీయ ప్రతాపరుద్రుడు ఓడించి, ముస్లిం సైన్యాలకు అపారమైన నష్టాన్ని కలిగించాడు. ఉలుగ్‌ఖాన్‌ దేవగిరికి పారిపోయి సైనిక సహాయం కోసం ఢిల్లీకి కబురుపెట్టాడు.

మతపరమైన దోపిడియే లక్ష్యంగా కల ఉలుగ్‌ఖాన్‌ మరుసటి ఏడాదే తిరిగి ఓరుగల్లు పైకి దండెత్తాడు. గత ఏడాది యుద్ధం కొన్నినెలలపాటు సాగడంవల్ల కాకతీయరాజ్యంలో సాధారణ జీవితం కుంటుపడింది. రైతులు పంటలు పండించలేకపోయారు. సైన్యాన్ని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయలేకపోయారు. దీనితో ప్రతాపరుద్రుడు యుద్ధం విరమించి, శతృవులకు బందీగా చిక్కాడు (1323). అతడిని ఢిల్లీకి తీసుకుని వెళుతుంటే మార్గమధ్యంలో నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సా.1423లో అనితల్లి వేయించిన కలువచేరు శాసనంలో ఉంది. సా.. 1327 నాటి ప్రోలయ నాయకుని విలస తామ్రశాసనంలో కూడా ప్రతాపరుద్రుని ఉదంతం ఉంది.

విలసశాసనం ప్రతాపరుద్రుడి తరువాత తెలుగునాట ఉన్న పరిస్థితిని ఇలా వర్ణించింది

ప్రతాపరుద్ర తిగ్మాంశౌ లోకాంతర తిరోహితే |

తురుష్కాంధ తామిస్రేణ సమాక్రాంతం మహీతలం ||

తా. ప్రతాపరుద్రుడనే సూర్యుడు అస్తమించగా భూమండలాన్ని తురకలనే అంధతామిస్రం అనే చీకటి (నరకం) ఆవహించింది.

ద్విజాతయ| త్యాజిత కర్మబంధా| భగ్నాశ్చ దేవప్రతిమా| సమస్తా|

విద్వద్వరిష్ఠై| చిరకాల భుక్తా| సర్వేవ్యపాహారిషతాగ్రహారా|

తా. ద్విజులకు వైదిక కర్మలు దూరమయ్యాయి. దేవతాప్రతిమలు ముక్కలైనాయి. పండితుల అగ్రహారాలు అపహరణకు గురయ్యాయి.

అత్తేకర్షణ లాభే పాపై| యవనై| బలాత్కారాత్‌

దీనాదీన కుటుంబా| కషీవలా| నాశమాపన్నా|

తా. పాపులైన యవనులు బలాత్కారంగా పొలాల్లోని పంటలను లాక్కొనిపోగా రైతులు, ధనికులు, దరిద్రులు అనే తేడా లేకుండా అంతా నాశనమయ్యారు.

ధనదారేదికే నౄణాం కశ్మింశ్చిదపి వస్తుని

స్వాయత్తతామతిర్నాభూతౌ భువి తస్యాం మహాపది ||

తా. ఆ మహా ఆపద సమయంలో ప్రజలకు ధనం, భార్య అనేదేదీ తమది అని చెప్పుకునే ధైర్యం లేకపోయింది.

పేయా సురా గోపిహితం చ భోజ్యం

లీలా విహారో ద్విజ ఘాతనం చ

అశ్రాంత మాసీత్‌ యవనాధమానాం

కథం సు జీవేత్‌ భువి జీవలోక| ||

తా. అధములైన తురకలకు కల్లే పానీయం, గోమాంసమే ఆహారం, ద్విజులను చంపడమే నిరంతర వినోదం కాగా భూమి మీద జీవకోటి ఎలా బ్రతకగలదు?

(మిగతా తరువాయి సంచికలో..)

-సత్యదేవ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here