Home Telugu Articles హక్కులు సరే, దేశం ఏమయ్యేట్టు?

హక్కులు సరే, దేశం ఏమయ్యేట్టు?

0
SHARE

‘ముస్లింల అభివృద్ధే నా ప్రధాన ధ్యేయంగా కొనసాగుతుంది’ – ఉత్తరప్రదేశ్‌ పాలక పక్షం సమా జ్‌వాదీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించబడిన ములాయం సింగ్‌ యాదవ్ ఉద్ఘాటన అది. ‘మౌలానా’ ములాయం అనేగాక ‘నేతాజీ’గా కూడా సుప్రసిద్ధుడైన యాదవ్‌ మహాశయుడు అధికారాంతంబున ఇటువంటి ఉద్ఘాటన చేయడంలో ఆశ్చర్యమేముంది?

మతతత్వాన్ని ప్రతిబింబిస్తున్న ఈ ఉద్ఘాటన వల్లే, పాలక ఎస్‌పీలో నాయకత్వానికి జరిగిన పోటీలో మౌలానా ఓడిపోయారనే భావం పార్టీ శ్రేణులు, ప్రజల్లో కలగకుండా వుంటుందా? అందుకే, అటువంటి అభిప్రాయం నిరాధారమైనదని నచ్చచెప్పడానికి పార్టీ కొత్త అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ పూనుకున్నారు. ‘నేతాజీ ఇప్పటికీ తనకు సన్నిహితుడేనని’ పుత్రాజీ పేర్కొన్నారు. ‘నాన్నగారు తన పార్టీకి తిరిగి రాగలరనే’ ఆశాభావాన్ని కూడా అఖిలేశ్ వ్యక్తం చేశారు.

సరే, కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు ఎస్‌పీని పురిగొల్పిన కీలక అంశం ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడమే సుమా! అఖిలేశ్‌–రాహుల్‌ మైత్రీ మెరుపుల్లో కాంగ్రెస్‌ పాలనా వాస్తవాలు మరింత స్పష్టంగా కనపడతాయి. ఏమిటా వాస్తవాలు? అభివృద్ధి వ్యయాల విషయంలో ముస్లింలకు అసాధారణ ప్రాధాన్యం ఇవ్వడంలో కాంగ్రెస్సే అన్ని పార్టీలకు మార్గదర్శి కదా. ‘వనరులపై తొలి హక్కును ముస్లింలకే ఇచ్చామని’ యూపీఏ ప్రభుత్వాల ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్ సింగ్‌ అన్నారు. అవును, కాంగ్రెస్‌ అనుసరించిన ఇటువంటి వైఖరికి నిరసనగా ఓటర్లూ ప్రతిక్రియకు పూనుకున్నారు. ఆ ఆగ్రహ చర్య వల్లే లోక్‌సభలో పార్టీ బలం 200కి పైగా నుంచి 50 కంటే తక్కువ సీట్లకు పడిపోయిందని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి నివేదించిన ఒక ‘రహస్య’ నివేదికలో పార్టీ సీనియర్ నాయకుడు ఎ.కె.ఆంటోనీ స్పష్టంగా పేర్కొన్నారు.

ముస్లిం ఓట్లు చీలిపోతే బీజేపీ లబ్ధిపొందగలదనే భయమే తమ మధ్య పొత్తుకు మూలమని ఎస్‌పీ, కాంగ్రెస్ పార్టీలు పదే పదే చెబుతున్నాయి. ఈ కొత్త కూటమిలో అఖిలేశ్‌ అనంతరం శక్తిమంతమైన నాయకుడు అయిన అజమ్ ఖాన్‌ నిఖార్సయిన మతతత్వవాది. ఖాన్‌ మహాశయుడు తన మతతత్వ వైఖరిని ఏనాడూ దాచుకోలేదు. దాచుకోవడానికి ప్రయత్నించడు కూడా. కనుకనే అజమ్‌ తరచూ తన నాయకుడికి ఇబ్బందులు కల్పిస్తుంటాడు.

2014 సార్వత్రక ఎన్నికలలో, కులమతాల ప్రాతిపదికన ఓటర్లలో సంప్రదాయ చీలికలను నివారించడంలోనూ, అవినీతిని అంతమొందించి, స్వచ్ఛ పాలనను అందించగలడని సకల ప్రజలు విశ్వసించగల ఒక శక్తిమంతుడైన నాయకుడు ఆలంబనగా బీజేపీ సాధించిన చరిత్రాత్మక విజయం బీజేపీయేతర పార్టీలను ఇప్పటికీ కలవరపరుస్తోంది. ఈ వాస్తవం దృష్ట్యా కాంగ్రెస్‌తో ఎస్‌పీ పొత్తు లక్ష్యం ప్రజలను శాశ్వతంగా కులమతాల ప్రాతిపదికన విడదీసి, తద్వారా ములాయం, ఆయన కుటుంబం ఎల్లప్పటికీ అధికారంలో సుస్థిరంగా ఉండే పరిస్థితులు సృష్టించుకోవడమేనని చెప్పక తప్పదు. కుటుంబ లేదా కుల ప్రాతిపదిక రాజకీయాల ఏకైక లక్ష్యం అధికారంలో శాశ్వతంగా కొనసాగడమే; అదీ, జాతీయ ప్రయోజనాలను విస్మరించి ఒక కుటుంబం/ కులం/మతం మాత్రమే అధికార యంత్రాంగంపై పూర్తి పెత్తనాన్ని సాధించుకోవడమే. మన దేశంలో అనేక సామాజిక వర్గాలు వున్నాయి. అవి, తమ విభిన్న ప్రయోజనాలను సాధించుకొనే క్రమంలో తరచూ ఘర్షణలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయవేత్తలు తమ విధ్యుక్తధర్మాన్ని విస్మరించి జాతి ప్రయోజనాల కంటే సొంత సామాజిక వర్గ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తే తాత్కాలికంగా మాత్రమే లబ్ధి పొందగలమనే సత్యాన్ని గ్రహించాలి.

ఉదాహరణకు తమిళనాడులో ఒక రాజకీయ పార్టీకి, దాని నాయకుడికి వన్నియార్‌ కులం ఆలంబనగా ఉన్నది. ద్రావిడోద్యమ లక్ష్యాలను సాధించే కృషిలో ఈ సామాజిక వర్గానికి చెప్పుకోదగ్గ పాత్ర వున్నది. ప్రముఖ నాయకులు ఎస్‌. రామదాస్, ఆయన కుమారుడు అంబుమణి రాజకీయ మనుగడకు కులప్రాతిపదిక పీఎంకే తోడ్పడుతోందనడంలో సందేహం లేదు. ప్రతి ఎన్నికలోనూ పీఎంకే ఏదో ఒక ప్రధాన ద్రావిడ పార్టీ – డీఎంకే లేదా అన్నడీఎంకే – తో పొత్తు పెట్టుకోవడం ఆనవాయితీ అయింది. దీనివల్ల పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయ్యారు. ఇటువంటి పొత్తుల ద్వారానే అంబుమణి కేంద్రంలో మంత్రి పదవులు కూడా నిర్వహించారు. 1980వ దశకంలో పీఎంకే తమ సామాజిక వర్గ ప్రయోజనాల పరిరక్షణ పేరుతో హింసాత్మక రాజకీయాలకు పాల్పడింది. అప్పుడు అధికారంలో వున్న డీఎంకే ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించారు. దీంతో రిజర్వేషన్ల కోసం ఇతర కులాల నుంచి కూడా డిమాండ్లు పెరిగిపోయాయి.

తమిళనాడులో ఇప్పుడు చిన్న, చిన్న రాజకీయ పార్టీలు చాలా పెద్ద సంఖ్యలో వున్నాయి. ఇవన్నీ కులం లేదా ఉప కులం ప్రాతిపదికన ఏర్పడినవే. అన్ని ప్రభుత్వాలూ తమ శ్రేయస్సును విస్మరిస్తున్నాయన్నది వాటి ఫిర్యాదు. రెండు ప్రధాన ద్రావిడ పార్టీల, రెండు ప్రధాన జాతీయ పార్టీల– కాంగ్రెస్‌, బీజేపీ– ఘర్షణలూ, శత్రుత్వాల మధ్య తమకొక స్థానాన్ని సాధించుకోవడానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దాదాపు డజన్‌ వరకు వున్న ఈ పార్టీలకు లభించే ఓట్ల శాతం, రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ఒకటి లేదా రెండు శాతం మాత్రమే! అయితే అరడజన్‌ నియోజక వర్గాలలో అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తి ఈ చిన్న చిన్న పార్టీలకు వున్నది.

ఉత్తరప్రదేశ్‌లోని పరిస్థితుల దృష్ట్యా పాలకపక్షం ఎస్‌పీ, తనకు తాను దళితుల పరిరక్షకురాలిగా చెప్పుకొనే బహుజన్‌ సమాజ్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగబద్ధంగా ఆమోదయోగ్యం కాని డిమాండ్లకు మద్దతునిస్తున్నాయి! ఒకరు కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి వుండడం, ఎటువంటి భరణం ఇవ్వకుండా అనుకున్న క్షణమే భార్యకు విడాకుల్వివడం మొదలైన అంశాలలో ఆయా సామాజిక వర్గాలకు ఈ పెద్ద పార్టీలన్నీ మద్దతునిస్తున్నాయి. రాజకీయ పార్టీల ఈ వైఖరివల్ల న్యాయంగానే ఒక ప్రశ్న తలెత్తుతున్నది: మైనారిటీ హక్కుల మిషతో పెద్ద సామాజిక వర్గాలు సంస్కరణలకు అవరోధాలు కల్పిస్తే మన దేశంలో జాతీయస్థాయిలో ఎటువంటి పరివర్తన అయినా వస్తుందా?

ఉదాహరణకు బాలికల వివాహ వయస్సు విషయాన్నే చూద్దాం. 18 సంవత్సరాల యుక్తవయస్సుకు ముందే యువతులకు వివాహం చేయడం వల్ల వారి ఆరోగ్యానికి, శ్రేయస్సుకు హాని జరుగుతుందని వైద్య పరిశోధనలు, సామాజిక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి మన మత గ్రంథాలు, 14 ఏళ్ళకే బాలికలకు వివాహం చేయడానికి అనుమతినిస్తున్నాయని, 14 ఏళ్ళకే తమ కుమార్తెలకు పెళ్ళిచేయడానికి అనుమతినివ్వాలని ఏ సామాజిక వర్గం వారైనా డిమాండ్‌ చేస్తారా? అధిక సంఖ్యాకులు లేదా అల్ప సంఖ్యాకుల (ఇటువంటి విభజనే అసంబద్ధమైనది) భాగంగా వున్న వర్గాలు తమకు న్యాయాధికారాలను కోరడం సమంజసమేనా? సొంత పంచాయితీల ద్వారా తమ ప్రజల వ్యవహారాలపై విచారణ జరిపి, శిక్ష విధించి, అమలుపరచడానికి నేర విచారణా చట్టాల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరడం ఎంతవరకు సబబు? దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలోని వివిధ ఆధిపత్య వర్గాలు ఇతర వర్గాల వారిని తమకు వెట్టి చేయడానికి, బానిసలుగా వుండడానికే పుట్టారనే విధంగా పరిగణించడం జరుగుతోంది. వేలాది సంవత్సరాలుగా అమానుష ఆచారాలతో అణచివేతకు గురవుతున్న మహా దళిత్‌ వర్గాలు కొన్నిటిని, మరెవరివో ‘హక్కులు’, ‘ప్రయోజనాలు’పేరిట ఆ అమానవీయ పరిస్థితులలో కొనసాగేలా చేయడం న్యాయమేనా?

వివిధ సామాజిక వర్గాలలోను, జాతి యావత్తులోను ఇటువంటి ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. ఆయా వర్గాలు డిమాండ్‌ చేస్తున్న ‘హక్కులు’ వారికి లభించేందుకు అనుమతిస్తే దేశంలో ఆసేతు హిమాచలం వందలాది సామాజిక, మత వర్గాలు వుంటాయే గానీ జాతి అనేది వుండదు. సమాజంలోని మత, సామాజికపరమైన విభజనలను మరింత విశాలం చేసే రాజకీయ నిర్ణయాలు, చర్యలు జాతి ఆత్మ వినాశనానికి దారితీస్తాయి. అటువంటి విభజనలను ఆమోదించాలని రాజకీయపక్షాలు తమ అనుయాయులను కోరడం మరింత హానికరమైన విషయం. ఇటువంటి అంశాలపై దేశ ప్రజలు తమ రాజకీయ అనుబంధాలు ఏవైనప్పటికీ పునరాలోచన చేయవలసిన అవసరమున్నది. ఇది జాతి శ్రేయస్సుకు తోడ్పడుతుంది. జాతి హితాన్ని కోరుకొంటున్న వారికి తమ పాలకులుగా ఎవరిని ఎన్నుకోవాలో స్పష్టంగా తెలుసు.

-బల్బీర్ పుంజ్

(వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు)

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)