Home News హిందూ సంస్థల సంఘటిత శక్తి ఫలితం.. శ్రీశైలం అవినీతి ఈవో బదిలీ

హిందూ సంస్థల సంఘటిత శక్తి ఫలితం.. శ్రీశైలం అవినీతి ఈవో బదిలీ

0
SHARE

శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం పరిపాలనా విభాగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, అన్యమతస్తుల ఆధిపత్యం, ఆలయ ఈవో వివాదాస్పద వైఖరి మొదలైన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీంతో ఆలయ ఈవో ఎ. శ్రీరామచంద్ర మూర్తిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్.వీ. సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం డెప్యూటీ కలెక్టర్ కె.ఎస్. రామారావు ఏడాది కాలపరిమితిపై దేవస్థానం నూతన ఈవోగా నియమితులయ్యారు. దీంతో వారం రోజులుగా రాజుకుంటున్న వివాదానికి తెరపడింది. 

అసలు వివాదం ఏమిటి?
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రధానమైనది అయినటువంటిది శ్రీశైల క్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎండోమెంట్ దేవాలయాల్లో ఇది ఒకటి. అయితే గత కొంతకాలంగా శ్రీశైల దేవస్థాన పరిపాలనా విభాగంలో అన్యమత ఉద్యోగుల నియామకం, దేవస్థానానికి చెందిన టెండర్లను, లైసెన్సులను ముస్లిములకు కట్టబెట్టడం వంటివి జరుగుతున్నాయి. దీనికి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎ. శ్రీరామచంద్ర మూర్తి మద్దతు ఉండటంతో హిందువుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. 2011 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎండోమెంట్స్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దేవస్థానానికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ల్లో కానీ, మరే ఇతర కాంట్రాక్టులను కానీ హైందవేతరులకు ఇవ్వరాదని నిబంధన విధించారు. ఈ నిబంధనను అతిక్రమిస్తూ గతంలో శ్రీశైలం దేవస్థానానికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ టెండర్ లైసెన్సులతో పాటు ఇతర లైసెన్సులను ముస్లిం మతానికి చెందిన వ్యక్తులకు కట్టబెట్టారు. ఇక అప్పటి నుండి ఆలయ పరిపాలనా విభాగంలో కూడా వారిదే పెత్తనం. ఇందులో రఫీ, రజాక్ అనే ఇద్దరు ముస్లిములు తమకున్న రాజకీయ పలుకుబడితో అక్కడి హిందూ ఉద్యోగులపైనా, భక్తులపైనా తమ పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి కూడా వీరికి మద్దతు పలుకుతుండటంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. 

ఆగస్టు 16, 2019 నాడు దేవస్థానం షాపింగ్ కాంప్లెక్సుల లైసెన్సులకు దాఖలు చేయాల్సిన టెండర్ల సమర్పణకు ముస్లిములు కూడా రావడంతో స్థానిక హిందువులు ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ దశలో స్థానిక శ్రీశైలం బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ ఈవోను ప్రశ్నించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనతో శ్రీశైల క్షేత్రాన్ని ముస్లిముల అనధికార పాలన నుండి విముక్తం చేయాలని హిందూ సంస్థలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆగస్టు 20, 2019 నాడు హిందూ సంస్థలన్నీ “ఛలో శ్రీశైలం” కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. శ్రీశైల క్షేత్రంలో జరిగే అవినీతి అక్రమాలు, అన్యమతస్తుల ఆధిపత్యంపై శాంతియుత నిరసన నిర్వహించాలని ప్రణాళిక రూపొందించాయి. 

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివశక్తి మొదలైన హిందూ సంస్థల కార్యకర్తలందరూ శ్రీశైలం చేరుకొని అక్కడ నిరసన చేపట్టాలని పిలుపునివ్వడంతో తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది హిందువులు అక్కడకు వచ్చారు. ఈలోగా ఆగస్టు 19 సాయంత్రం శ్రీశైల ఆలయ ఈవోను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు. 

వివాదాలకు కేంద్ర బిందువు ఆలయ ఈవో:
శ్రీశైల దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేసిన ఎ. రామచంద్రమూర్తి వైఖరి మొదటినుండీ వివాదాస్పదం, అవినీతిమయం. అంతేకాకుండా అతడు రెండు వివాహాలు చేసుకున్నట్టు, ఇందుకోసం ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించినట్టు అతడిపై 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ సమయంలో శ్రీకాళహస్తి దేవస్థాన ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తున్న రామచంద్రమూర్తిపై, అదే ఆలయయ పాలకమండలి సభ్యుడు ఎం. సుబ్రహ్మణ్యం రెడ్డి కోర్టులో కేసు వేశారు. రామచంద్ర మూర్తి ఇస్లాం మతం స్వీకరించినట్టు, ఒక భార్య ఉండగానే మరొకరిని కూడా వివాహం చేసుకున్నట్టు తన పిటిషన్ లో సుబ్రహ్మణ్యం రెడ్డి పేర్కొన్నారు. దీనిపై అనేకసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టును అశ్రయించినట్టు అయన తెలియజేసారు. ఈ వ్యవహారంలో ఎన్ని నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో హైకోర్టు రామచంద్రమూర్తిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. 

ఇటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తిని ఈవోగా శ్రీశైలానికి పంపడంపైనా, ఈసారి కూడా కేవలం బదిలీతో సరిపెట్టడంపైనా హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి. ఏదేమైనప్పటికీ ముందస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం శ్రీశైలానికి చేరుకోవాల్సిందేనని నిర్ణయించుకున్నాయి. ఈక్రమంలో శ్రీశైలం ప్రాంతం మొత్తం పోలీసు దళాలు భద్రత పేరిట శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదికకు చెందిన కార్యకర్తలను, భక్తులను  అరెస్ట్ చేశాయి. అయినప్పటికీ కార్యకర్తలు ఆందోళన విరమించకపోయేసరికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆలయ నూతన ఈవో కె.ఎస్. రామారావు హిందూ సంస్థల ప్రతినిధులతో చర్చలు చేపట్టారు.

శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదికకు చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు 

ఆలయ వ్యవహారాల్లో అన్యమతస్థులు జోక్యం పూర్తిగా నిర్మూలించి, ఆలయ పవిత్రతను కాపాడాలని, అలాగే చుట్టుపక్కల తిష్ఠ వేసుకుని ఉన్న అన్యమతస్తులను, వేలంపాటలో షాపులు అక్రమంగా పొందిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థల ప్రతినిధులు నూతన ఈవోకు మెమోరాండం సమర్పించారు. ఈవోగా శ్రీశైలానికి రావడం తమ అదృష్టంగా భావిస్తున్నానని, ఈశ్వరుని కృప లేనిదే ఇది సాధ్యం కాదని, ఆలయ పవిత్రత తప్పకుండ కాపాడుతానని, ఇందుకు కాస్త సమయం ఇవ్వాల్సిందిగా కొత్త ఈవో ప్రతినిధులకు తెలియజేసారు. 

శ్రీశైలంలో 17 మంది అన్యమత ఉద్యోగులు:
ఇదిలా ఉండగా ఇప్పటి దాకా శ్రీశైల దేవస్థానం పరిపాలనా విభాగంలో 17 మంది అన్యమతస్థులు నియామక వివరాలు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా బయటపెట్టింది.. వారిలో ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా మిగిలిన వారు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా స్పష్టమైంది. ఉద్యోగుల పేర్లతో సహా వారి ఎంప్లొయ్ ఐడీలు, నియామక తేదీలు, నియామక ఉత్తర్వుల వివరాలు కూడా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వెల్లడించింది. ఈ వివరాలు ఎండోమెంట్స్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినట్టు ఆ సంస్థ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here