Home RSS హిందుత్వమంటే బంధుభావం

హిందుత్వమంటే బంధుభావం

0
SHARE

`భారత భవిష్యత్తు – ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణం’ అనే అంశంపై జరిగిన మూడురోజుల ఉపన్యాస కార్యక్రమంలో డా. మోహన్ జీ భాగవత్ `’సోదరభావం లేదా బంధుభావం సంఘ కార్యానికి మూలం. ఇదే భావన మన దేశంలోని `భిన్నత్వం వెనుక ఏకత్వానికి’ కూడా ఆధారం’’ అని అన్నారు.

‘’ఈ సోదరభావం, బంధుభావాన్నే హిందూత్వం అన్నారు. అందుకనే మేము భారత్ ను హిందూ రాష్ట్ర (రాష్ట్రం అంటే మా దృష్టిలో ప్రజలు)అంటాం. దాని అర్ధం అందులో ముస్లిములకు స్థానం లేదని కాదు. అందులో ముస్లింలకు స్థానం లేదని అంటే అప్పుడు అది హిందూత్వం కాకుండాపోతుంది. ఎందుకంటే హిందూత్వం మొత్తం ప్రపంచాన్నే ఒక కుటుంబంగా – విశ్వకుటుంబం భావిస్తుంది’’అని డా. మోహన్ భాగవత్ అన్నప్పుడు అనేకమందిలో అనేక ప్రశ్నలు తలెత్తాయి.

వర్తమాన పరిస్థితులలో చెప్పిన కొన్ని విషయాలను అలాగే అర్ధం చేసుకోవాలి. అలా కాకుండా వాటిని మౌలిక కార్యానికి ముడిపెట్టి చూడటంవల్ల అనేక అపోహలు, భ్రమలు కలుగుతాయి. భారతీయ ఆత్మ, భారతదేశపు అస్తిత్వంగా పేర్కొనే హిందూత్వం విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. హిందూత్వం అంటే ఆధ్యాత్మికత ఆధారంగా కలిగిన సమైక్య దృష్టి. కాబట్టి సహజంగానే అందులో అన్నింటికీ స్థానం ఉంటుంది. ఇది వైశ్వికమైనదేకాదు, అందరి సంక్షేమాన్ని, అంటే కేవలం మానవజాతి మాత్రమేకాక సమస్త ప్రపంచపు సంక్షేమాన్ని కాంక్షిస్తుంది.

ఈ వైశ్విక దృష్టి మూలంగానే హిందువులు ఎప్పుడు కేవలం `హిందూ’గా మాత్రమే గుర్తింపు పొందాలని భావించలేదు. ఇక్కడ నుంచి ప్రజలు వ్యాపారవాణిజ్యాల కోసం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలే వీరిని `హిందువులు’గా పిలిచేవారు. కాబట్టి ఇక్కడి వారు సింధు నది అవతల నుంచి వచ్చినవారని ఇతరులు గుర్తించేవారు. బయటనుంచి ఈ దేశంపైకి దండెత్తి వచ్చినవారు కూడా ఇక్కడివారిని సింధు నది అవతల ఉన్న హిందువులు అనే పిలిచేవారు. అలా సింధు నది అవతల ఉన్న ప్రదేశంలో ఉన్నవారందరిని హిందువులుగానే పరిగణించారు. ఇక్కడ ఉన్నవారంతా `ఏకం సద్విప్రా బహుధా వదంతి’అనే భావం ఆధారంగా ఏర్పడిన జీవన దృష్టిని కలిగిఉన్నారు. సత్యం ఒక్కటే, విప్రులు దానిని అనేక విధాలుగా వర్ణిస్తారు అని నమ్మారు. ఈ విశ్వాసమే భిన్నత్వంలో ఏకత్వానికి, ఆధ్యాత్మిక జీవనానికి ఆధారమైంది.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలోకానీ, ఆ తరువాత 1905 బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ సమయంలోకానీ హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు. విజయం సాధించారు. కానీ ఆ తరువాత పాలకులు నాటిన విభజన బీజాల మూలంగా హిందూ, ముస్లింల మధ్య అంతరం పెరిగి చివరికి దేశ విభజనకు దారితీసింది. హిందూ, భారత్ అంటే ముస్లింలలో వ్యతిరేక భావం నిండిపోయింది. దానితో దేశ విభజనను కాదన్న హిందువుల ధోరణి ముస్లింలకు కూడా వ్యతిరేకమనే భావం కలిగింది. ఆనాటి హిందూ నాయకులు ముస్లిములకు వ్యతిరేకంగా మాట్లాడారు అంటే దానికి అణచివేత, అరాచకం చెలరేగి చివరికి దేశ విభజన జరుగుతుందనే ఆందోళనే కారణం. అంతేకాని అది భారతదేశపు విశాల, శాశ్వత జీవన దృష్టికి విరుద్ధమైన దృక్పధం వల్ల కలిగినది కాదు.

భారతీయ లేదా హిందూ దృష్టి అందరినీ కలుపుకుపోయేదేగానీ ఎవరినీ వేరుపరచేది, వేరుగా చూసేదీ కాదని అర్ధం చేసుకోవాలి. ఇదే విషయాన్ని స్వామి వివేకానంద తన విశ్వవిఖ్యాత చికాగో ఉపన్యాసంలో ప్రస్తావించారు. వేర్పాటుతనానికి తావేలేని ఒక గొప్ప మతానికి చెందినవాడిగా తాను గర్వపడుతున్నానని ఆయన ఆ ఉపన్యాసంలో స్పష్టం చేశారు. అందుకనే ఆంగ్ల భాషలో ఉన్న `వేరుచేయడం’ అనే మాట తమ సంస్కృత భాషలో లేనేలేదని ఆయన సగర్వంగా ప్రకటించారు.

సెమెటిక్ మతాలు మానవాళిని విశ్వాసులు, అవిశ్వాసులు అని రెండు సమూహాలుగా విభజించాయి. వాటి ప్రకారం సెమెటిక్ విశ్వాసాల బయట ఉన్న వారు దయ్యాలు. ఆ కాఫిర్ లకు కనీసం జీవించే అర్హత కూడా ఉండదు. ఈ ధోరణే కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో కనిపిస్తుంది. తమ ఆలోచనలతో విభేదించేవారిని `ఇతరులు’గా వర్గీకరిస్తారు. అలాంటివారిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇలాంటి భావాలు కలిగినవారే హిందూత్వాన్ని కూడా పిడివాద, వివక్షాపూర్వక ధోరణి కలిగిన ఇజమ్ గా చూస్తారు. కానీ నిజానికి హిందూత్వం విశాలమైనది. కానీ హిందువుగా ఉండదమంటే ఏమిటో మనం(హిందువులు) కూడా మరచిపోయాం. ఈ అపోహలు, భ్రమలకు లోనయ్యాం.

దేశ విభజనతో పాటు భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది. అయితే జనాభా మార్పిడి ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి ప్రజలు ఇదంతా ఒకే భూభాగంగా భావించారు. కానీ విభజన తరువాత భారత్ లో ముస్లింలు అల్పసంఖ్యాకులైతే, పాకిస్తాన్ లో హిందువులు మైనారిటీలయ్యారు. రెండు ప్రభుత్వాలు మైనారిటీలకు సమాన హక్కులు, గౌరవప్రదమైన జీవనాన్ని కలిగిస్తామని హామీ ఇచ్చాయి. రెండు దేశాల రాజ్యాంగాలు ఒకేసారి తయారయ్యాయి. సెమెటిక్ ధోరణికి అనుగుణంగా పాకిస్తాన్ రాజ్యాంగం రూపొందింది. ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య తేడాను రాజ్యాంగమే ప్రస్తావించింది. మైనారిటీలకు సమాన హక్కులు లేకుండాపోయాయి. కానీ భారత్ లో మాత్రం హిందూ జీవన విధానం ప్రకారం రాజ్యాంగంలో అన్ని మతాలకు సమాన హక్కులు, హోదా లభించాయి. ఇదే భారతీయ రాజ్యాంగపు హిందూతనం. పాకిస్తాన్ సెమెటిక్ ధోరణిని అనుసరించి మైనారిటీలకు సమాన హక్కులు నిరాకరిస్తే, భారత్ హిందూ ఆధిక్య దేశమైనా మతం ఆధారంగా ఎలాంటి వివక్షకు తావులేదనే పరంపరాగత సంప్రదాయాన్ని అనుసరించింది. హిందూ సమాజంలో ఇష్టమైన మతాన్ని అనుసరించే వ్యక్తి స్వేచ్ఛ ఎప్పుడూ ఉంది. ఇదే భారత్ చరిత్ర. కనుక భారత్ లో అసలు `మైనారిటీ’ అనే భావనే అసహజమైనది, వర్తించనిది.

స్వాతంత్ర్యానంతర భారతంలో స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూత్వాన్ని వ్యతిరేకించడం, ముస్లింలు, క్రైస్తవుల పట్ల సంతుష్టీకరణ విధానం అవలంబించడం పార్టీ రాజకీయాలలో ప్రధాన అంశమైంది. కొన్నిసార్లు హిందూ సమాజం హింసాత్మకమైన, పిడివాద జిహాది శక్తులను ఎదుర్కునేందుకు తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. దీనివల్ల ముస్లిం వ్యతిరేక ధోరణి తలెత్తింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారత్ లో ఉంటున్న ముస్లింలు, క్రైస్తవులందరూ ఒకప్పుడు హిందువులే. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వాళ్ళు మతం మారవలసి వచ్చింది. అయినా వాళ్ళు కూడా ఈ సమాజంలో భాగమే. ముస్లిములు తమ మూలాలను మరచిపోయినా హిందువులు మాత్రం ఇక్కడి ముస్లిములు ఎక్కడివారో మరచిపోకూడదు. సెమెటిక్ ధోరణిలో వాళ్ళు పడకూడదు. భారతదేశపు మూలమైన విశాల, సమన్వయపూర్వక సంప్రదాయాన్ని మరచిపోకూడదు. ముస్లింలను కలుపుకుని సుసంపన్న భారతాన్ని నిర్మించడమే నిజమైన హిందూ లేదా భారతీయ దృక్పధం.

సంఘ ద్వితీయ సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ ఇదే విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్ సైఫుద్దీన్ జిలానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

డా. జిలానీ: `భారతీకరణ’గురించి చాలా చర్చ జరుగుతోంది. దీనిపై అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీరు ఆ సందేహాలు తీర్చగలరా?

శ్రీ గురూజీ: `భారతీకరణ’ జనసంఘ్ నినాదం. ఈ విషయంలో సందేహాలు, గందరగోళం ఎందుకు? `భారతీకరణ’ అంటే అందరినీ హిందువులుగా మార్చడం కాదు. మనమంతా ఈ నేల సంతానమని, ఈ భూమికి కట్టుబడి ఉండాలని గ్రహించాలి. మన పూర్వజులు ఒకరే. మనమంతా ఒకే సమాజానికి చెందుతాం. మన ఆశయ ఆకాంక్షలు కూడా ఒకటే. ఇది అర్ధం చేసుకోవడమే `భారతీకరణ’. అంతేకాని ఎవరినైనా తమ మతాన్ని వదిలిపెట్టేట్లు చేయడం `భారతీకరణ’ కాదు. మేము ఎప్పుడూ అలా చెప్పలేదు. ఇకముందు చెప్పబోము. నిజానికి మొత్తం సమాజానికి ఒకే మత వ్యవస్థ సరిపోదని మా విశ్వాసం.

తన ఉపన్యాస కార్యక్రమంలో డా. మోహన్ జీ భాగవత్ `ఒక జాతిగా మనమంతా హిందువులుగా గుర్తింపు పొందాం. తాము హిందువులమని చెప్పుకునేందుకు కొందరు గర్విస్తారు. మరికొందరు అలా గర్వపడరు. ఇంకాకొందరికి కొన్ని రాజకీయ, ఇతర ప్రయోజానాల దృష్ట్యా బహిరంగంగా హిందువులుగా గుర్తింపు పొందడానికి ఇష్టపడకపోయినా వ్యక్తిగతంగా అలాంటి అభ్యంతరం ఉండదు. ఇంకాకొందరు తాము హిందువులమని పూర్తిగా మరచిపోయారు. వీళ్ళంతా ఈ దేశానికి చెందినవారే. మన వారే. పరీక్షల్లో సులువైన ప్రశ్నలకు ముందు సమాధానాలు వ్రాసినట్లుగా తాము హిందువులమని భావించేవారి దగ్గరకు ముందు వెళ్లాము. ఈ ప్రపంచంలోకానీ, ఈ దేశంలోకాని ఎవరిని మా శత్రువులుగా చూడటం లేదు. కొందరు మమ్మల్ని శత్రువులుగా పరిగణిస్తుండవచ్చును. అయినా వారిని అంతం చేయాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. అంతేకాదు వారిని కూడా కలుపుకుని ముందుకు పోవాలనే అనుకుంటున్నాము. ఇదే నిజమైన హిందూత్వం’ అన్నారు.

స్వతంత్ర్య వీర సావర్కర్ ఒకసారి ఇలా అన్నారు-`నువ్వు ముస్లిం కాబట్టి నేను హిందువును. లేకపోతే నేను `విశ్వమానవుడిని’’. హిందూత్వం లేదా భారతీయత మూల తత్వాన్ని తెలిపే కొన్ని పంక్తులతో ముగిస్తాను –

“నన్ను బయట ఉంచడానికి అతను తన చుట్టూ గిరి గీసుకున్నాడు-
తిరుగుబాటుదారు, మాయగాడు, దూరంపెట్టవలసినవాడని అన్నాడు.
కానీ ప్రేమించడం, యుక్తిగా జయించడం ఎలాగో నాకు తెలుసు
అందుకే అతనితో కలిపి మా చుట్టూ మరో పెద్ద వలయం గీశాను.”

– డా. మన్మోహన్ వైద్య, ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here