Home News ఆర్ధిక మందగమనం ఎంత తీవ్రమైనది?

ఆర్ధిక మందగమనం ఎంత తీవ్రమైనది?

0
SHARE

డాక్టర్ ఎస్ .లింగమూర్తి

ఆర్ధిక మందగమనంపై పలు రాజకీయ పార్టీల నాయకులు, ఆర్ధిక నిపుణులు, విధాన కర్తలు పలు రకాల బిన్నాభిప్రాయలు వెలిబుచ్చుతున్న సమయంలో ప్రముఖ ఆర్ధికవేత్తగా పేరుగాంచిన పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రస్తుతం భారత దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక మందగమనం కేవలం కొద్ది మంది వ్యక్తుల తప్పిదాల కారణంగా సంభవించిందని, నగదు బదిలీ, GST వంటి నిర్ణయాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థలో సమూలంగా ఏర్పడినటువంటిదని కేంద్ర ప్రభుత్వంపై రాజకీయపరమైన అవాకులుచెవాకులు పేలడం జరిగింది. అర్దశాస్త్ర విద్యార్థిగా నా అభిప్రాయం ఏమిటంటే, మన పూర్వ ప్రధాని ఒక రాజకీయ నాయకునిగా కాకుండా దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక క్లిష్టపరిస్థితులలో ఒక ఆర్ధికవేత్తగా తన అభిప్రాయం వాస్తవరూపంలో వెలిబుచ్చివుంటే అతను ఆర్ధికవేత్తగా తన గౌరవాన్ని కాపాడుకొని ఉండేవాడని అనిపిస్తుంది. రాజకీయనాయకులు తమ రాజకీయ అక్కసుతో, మిడిమిడి జ్ఞానంతో సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నారు. ప్రపంచీకరణ యుగంలో ఏ దేశ ఆర్ధికవ్యవస్థ కూడా ప్రపంచ ఆర్థికవ్యవస్థలో సంభవిస్తున్న  మార్పులకు, దాని ప్రభావాలకు అతీతం కాదు. కాబట్టి ఒక దేశ ఆర్థికవ్యవస్థను స్తూలంగా గమనించేప్పుడు ప్రపంచ ఆర్థికవ్యవస్థలో సంభవించిన మార్పులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది.

భారత ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్ధిక మందగమనం కేవలం భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య కాదని, యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య అని 23ఆగస్టు 2019 న పేర్కొనడం జరిగింది. అదే విధంగా భారత ఆర్థికవృద్ధి అంచనాలకు తగ్గట్లుగా కాకుండా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీనికనుగుణంగానే అమెరికా ఆర్ధికవృద్ది ఈ సంవత్సరంలో (జనవరి నుండి మార్చ్) 3.1 నుండి 2.1 (ఏప్రిల్ నుండి జూన్) శాతంగా నమోదు అయ్యింది; చైనా ఆర్ధికవృద్ది మొదటి భాగంలో 6.4 గా ఉండగా రెండవ భాగంలో 6.2 శాతం గా నమోదు అయ్యింది; యురోపియన్ యూనియన్ 0.4 శాతం నుండి 0.2 శాతంగా నమోదయింది. ఇదేక్రమంలో భారత ఆర్ధికవృద్ది తక్కువగా నమోదు అయ్యింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలు, డాలర్ తో రూపాయి మరకపు విలువ కారణాలుగా పేర్కొనవచ్చు.

గత సంవత్సరంతో పోల్చిచూస్తే ఈ దేశంలో మోటారు వాహనాల గిరాకి, అమ్మకాలు గణనీయంగా తగ్గిన విషయం వాస్తవమే. కాని దీనికి పలురకాల కారణాలు లేకపోలేదు. మోటారు వాహనాల వినియోగదారులలో వచ్చిన మార్పులు, క్యాబ్ ల వాడకం పెరగడం, పెట్రోలు, డీజిల్ ధరలు, పట్టణాలలో పార్కింగ్ సమస్యలు మొదలైనవాటిని పేర్కొనవచ్చు. కానీ, వినియోగదారుల నిత్యావసరాల గిరాకిలో (ఏప్రిల్ నుండి జూన్)ఎటువంటి తగ్గుదల లేకపోగా కొన్ని ప్రముఖ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరగడం గమనించవచ్చు. హిందూస్థాన్ లీవర్ కంపెనీ ఉత్పత్తులలో 7 శాతం వృద్ధిని, మారికో కంపెనీ 5 శాతం వృద్ధిని, డాబర్ ఇండియా 11 శాతం వృద్ధిని, కొల్గాట్ పామోలివ్ 4 శాతం, నెస్లే 11 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదే సమయంలో బిగ్ బజార్ అమ్మకాలలో 8 శాతం వృద్ధిని కొనసాగించింది. AC (ఎయిర్ కండిషనర్ల) అమ్మకాలలో 5 శాతం, రిఫ్రిజిరేటర్ గిరాకిలో 11 శాతం వృద్ధిని కొనసాగించాయి. అదేవిధంగా బ్యాంకులు ఇచ్చే అప్పులలో 16.6 శాతం వృద్ధిని గమనించడం జరిగింది. కాబట్టి. ప్రస్తుతం భారత దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక మందగమన సమస్య అంతగా తీవ్రమైనది కాకపోగా ఇది కేవలం “చక్రీయ స్వభావం”(cyclic) కలిగినటువంటినదని ప్రముఖ ఆర్థికవేత్త, పూర్వ RBI గవర్నర్ బిమల్ జలాన్ పేర్కొన్నారు. అదే విధంగా ప్రపంచదేశాలు అనుకరిస్తున్న వాణిజ్య పోకడలు, వాణిజ్య యుద్దాలు కూడా ఈ రకమైన సమస్యకు కారణమవుతున్నాయి.

నిజానికి భారతదేశం తీవ్రమైన ఆర్ధిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనే సమస్యతక్కువే. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు అనుసరిస్తున్న పండుగల సంస్కృతి సగటు వినియోగదారుల వస్తు కొనుగోళ్లను  పెంపొందిస్తుంది. అలాగే మొత్తం కుటుంబవ్యవస్థ సగటు ఖర్చు తగ్గించుకొనే వెసులుబాటు కల్పిస్తుంది. దీనితో అంతర్గతంగా ఈ దేశ స్థూల ఆర్థికవ్యవస్థ చురుకుగా, సమతుల్యంగా ఉంటుంది. కేవలం ప్రపంచీకరణలో భాగంగా బాహ్యంగా ఏర్పడిన పరిణామాల కారణంగా లేదా విధానపరమైన తప్పిదాల కారణంగానే ఈ దేశం ఆర్ధిక క్షీణత లేదా మందగమనాన్ని ఎదుర్కొంటుంది. GST ద్వారా ఈ దేశ నికర రాబడి పెరిగింది. పన్నులు చెల్లిస్తున్న వారి సంఖ్య, పన్ను రాబడి పెరిగాయి, రాష్ట్రాలలో నికర పన్ను రాబడి పెరిగింది. దీనితో దేశం, రాష్ట్రాలలో సంక్షేమ కార్యక్రమాలు పెరిగాయి. కాబట్టి ఈ విషయంలో మన పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్  అభిప్రాయం కేవలం రాజకీయపరమైనదిగానే పరిగణించాలి.

ఈ దేశంలో ఆర్ధికవృద్దికి సమస్యలు లేకపోలేదు. పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలు, బ్యాంకుల నుండి లభించే అప్పు, ఈ దేశ యువతలో పరిశ్రమలకు సరైన నైపుణ్యకొరత, గ్రామీణ ఆర్ధికరంగానికి తగు ప్రాధాన్యత, రైతుల ఆర్ధిక స్వావలంబన, `ముద్ర’ ఋణ వితరణ, ప్రాంతాలకనుగుణంగా, ప్రాంతీయ-ఉత్పత్తులకు అనుగుణంగా పరిశ్రమల స్థాపన, ఉద్యమకారులకు తోడ్పాటు మొదలగు సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(రచయిత కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలోని ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here