Home Hyderabad Mukti Sangram వరంగల్ కోటలో పతాక వందనం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-38)

వరంగల్ కోటలో పతాక వందనం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-38)

0
SHARE

భండారు చంద్రమౌళీశ్వరరావు, హయగ్రీవాచారి లాంటి ఇతర యువకులంతా కూడా వాళ్ళతో చేరిపోయారు. హయగ్రీవాచారి ప్రతివారం పతాక వందనం జరపడం ముఖ్యకార్యక్రమం. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ భావాన్ని పెంచడంతోబాటు యువకుల శారీరక  మానసిక శక్తియుక్తులను అభివృద్ధి చేయాలని వారి నిర్ణయం. ఆ నిర్ణయం మేరకు వరంగల్ కోటలో ఆ యువకుల కార్యక్రమం జరుగుతూ ఉండేది.

ఈ కోటను ఎన్నుకోవడంలో ఉద్దేశ్యం ఈ కాకతీయ మహానగరం కేంద్రంగా గతంలో విలసిల్లిన తమ జాతి సాంస్కృతిక రాజకీయ వైభవంతో మానసిక సంబంధం ఏర్పరచుకోవాలనుకోవడమే. వరంగల్ కోట ప్రేరణా స్రోతస్వినిగా ఉపయోగపడింది. యువకుల దళం వృద్ధిచెందుతూ ఉత్సాహవంతంగా తమ ఆశయాన్ని నెరవేర్చడానికి సంసిద్ధమవుతోంది. మరోవైపు ప్రజాస్వామ్యం దాని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని స్వార్థ పూరితమైన శక్తులు తలెత్తడం ప్రారంభించాయి. సంకుచిత స్వార్థశక్తులు తమ మనుగడకోసం కొత్త ఆలోచనా విధానాన్ని ప్రతిపాదించాయి. మునిగే వాడికి పూచికపుల్ల సహాయమన్నట్లు ముస్లింలు “తామే సంస్థాన పాలకుల” మని ప్రకటించారు.

నిజాం తమకు ప్రతీకమాత్రుడని, ఈ రియాసత్ సంస్థానంలో తమ ఆమోదం లేకుండా ఎలాంటి రాజకీయ సంస్కరణ లేదా మార్పు జరగడానికి వీలులేదని స్పష్టం చేశారు. ఈ ముస్లిం రాజకీయపక్షంగానే నవాబ్ బహదూర్ యార్‌జంగ్ నాయకత్వాన “మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్‌” సంస్థ ఏర్పడింది. నిజాం దృష్టిలో ఇది రాజకీయ సంస్థ కాదు. అందువల్ల నిషేధం లేదు. కొద్దికాలంలోనే, నవాబ్ బహదూర్ యార్‌జంగ్ ప్రాబల్యం పెరిగింది. అతని పలుకుబడికి భయపడి నిజాం అతనిని విషప్రయోగం చేసి చంపించాడనే వదంతి ఉంది. నిజమేదైనా సంపూర్ణ ఆరోగ్యవంతుడైన ఆ నవాబ్ 1944 జూన్ ఇరవైఐదున అకస్మాత్తుగా మరణించాడు.

ఆ మరణం ఎలా జరిగిందో ఈనాటికీ ప్రశ్నగా నిలిచిపోయింది. నిజాం ఆ తర్వాత తన నిరంకుశాధికారాన్ని కాపాడుకోవటానికి ఈ మజ్లిస్‌నే ఉపయోగించుకున్నాడు. ఈ మత సంస్థ అంతర్గతమైన ఎన్నికలు, తదితర విషయాలపై నిజాం ఫర్మానాలు జారీ చేయడం మొదలుపెట్టాడు. సంస్థానంలో అల్పసంఖ్యాకులైన ముస్లింలు హిందువులపై అన్నివిధాల అధికారం చలాయించాలని ప్రయత్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ధనం అన్నీ తమ సొంత ఆస్తి వ్యవహరంలా ఉండేది. తాము పాలకులమని, హిందువులు పాలితులనే భావంతో వ్యవహరించేవారు. అధిక సంఖ్యాకులైన హిందువులను బానిసలుగా చూస్తూ వారి కార్యకలపాలను కనిపెట్టి ఉండేవాళ్ళు. అందువల్ల వరంగల్ కోటలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సహించలేకపోయాడు. ముఖ్యంగా సుబేదార్ హాబీబుల్లాఖాన్ మతోన్మాది. బహుక్రూరుడు. అందువల్ల తీవ్ర పరిణామాలు సంభవించాయి.

వరంగల్ కోటలో హత్య
ఆశావహంగా ప్రారంభమయ్యే ప్రతి ఉదయం లాగా ఆ రోజు కూడా పక్షుల కిలకిలారావాలతో మొదలైంది. సూర్యకిరణాలు ప్రసరించి నూతన జీవితాన్ని వెదజల్లుతున్నాయి. వరంగల్ కోటలోని ఉత్తరభాగాన ఆ రోజు కూడా పతాక వందనం కార్యక్రమం జరిగింది. యువకులలో చాలామంది తిరిగి ఇండ్లకు వెళ్ళిపోయారు. కొందరు దగ్గరలోనే ఉన్న రామస్వామి ఇంట్లో తేనీరు సేవించే నిమిత్తం కూర్చున్నారు. మొగలయ్య జెండా తాడును సరిచేస్తూ నిలుచున్నాడు. అకస్మాత్తుగా వెనుక నుంచి కొందరు రజాకార్లు వచ్చి బల్లెంతో మెడపై పొడిచేశారు. ఆ పతాకం తాడును పట్టుకొని మొగలయ్య కూలిపోయాడు.