Home Hyderabad Mukti Sangram దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న హిందువులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-40)

దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న హిందువులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-40)

0
SHARE

400 మంది ముస్లింలు బాజాలతో, నినాదాలతో బయలుదేరి బస్తీలోకి వచ్చారు. ఎదురుగా హిందువులు దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సుబేదార్ హిందువులనే చెదిరి పొమ్మని ఆర్డర్ ఇచ్చాడు. ఆత్మరక్షణకు సిద్ధమైన ప్రజలను చెదిరి పొమ్మనగానే వాళ్ళు నిరాకరించారు. అదే అదనుగా సుబేదార్ కాల్పులు జరపమని హుకుం జారీ చేశాడు. ఫలితంగా వెంటనే ముగ్గురు హిందువులు మరణించారు.

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తులు పడమటి క్రిష్ణయ్య, కొడిమల కనకయ్య, మల్లయ్య. ఇక తీవ్రంగా గాయపడిన వాళ్ళు వాడి లింగయ్య, ఆడెపు కొమరయ్య. ఈ విధంగా సుబేదార్ శాంతిభద్రతల పేర ప్రజలను బాహాటంగా ఖూనీ చేయించాడు. మొగలయ్య, రామస్వామి గౌడ్‌ల కుటుంబం వరంగల్ కోటలో తాతల కాలం నుంచి నివసిస్తూ ఉండేది. మొగలయ్యకు తెలుగు చదవడం, రాయడం వచ్చు. వృత్తిరీత్యా కల్లు గీయడం పని. అతనిపై జాతీయ ఆందోళన ప్రభావం బాగా పడింది.

వరంగల్‌లో పతాక వందనం, ఇతర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆనాటి ముస్లిం మత అహంకారానికి బలైపోయిన అమరవీరుడు. ఈనాడు వరంగల్ మెయిన్‌రోడ్డుపై అమరవీరుడు మొగలయ్య జ్ఞాపకార్థం ఒక హాలు నిర్మించారు. అంతే తప్ప ఆనాటి అనేక సంఘటనలను ప్రజలు మరచిపోయారు. మొగలయ్య హత్య జరిగిన ఆరు నెలల అనంతరం రామచంద్ర అనే ఒక హిందూ పహిల్వాన్‌ను దొంగచాటుగా ఒక రాత్రి హత్య చేశారు.

నారాయణ రెడ్డి బలిదానం

1947 జూన్ 30 నాటిరోజు వేసవికాలం ముగిసి, వర్షం కురుస్తున్న రోజులు. అయినా రాజకీయ వాతావరణం మహా ఉద్రేకంగా ఉంది. హైద్రాబాద్‌లో జూన్ 16 నాడు స్టేట్ కాంగ్రెస్ మహాసభలు మహోత్సాహంతో జరిగాయి. సంస్థానంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడాలని తీర్మానం చేయడం జరిగింది. దీనికి ప్రతికూలంగా ఇక్కడ వరంగల్‌లో ఈనాడు ముస్లిం సమావేశం జరుపుతున్నారు. ఆ రోజు మధ్యాహ్నం హన్మకొండ నుంచి డాక్టర్ నారాయణరెడ్డి కారులో వరంగల్ వెళుతున్నారు.

చౌరస్తా దగ్గర జాఫర్ అనే పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్‌కు నమస్కారం పెట్టి ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో వరంగల్ వెళ్ళడం మంచిది కాదని సలహా ఇచ్చాడు. నాకేం భయంలేదని డాక్టర్ వరంగల్‌లోని తన ఆసుపత్రికి బయలు దేరాడు. రోగులలో అనేకమంది ముస్లింలు కూడా ఉండడం ఆయన ధైర్యానికి ఒక కారణం. డాక్టర్ నారాయణరెడ్డి తన ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. జంకుతున్న నౌకరును ఇంటిదగ్గర కారులోనే వదిలి తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్నాడు. ఈ లోగా కారుపై రాళ్ళు పడడం మొదలైంది. ఎనభైమంది ముస్లింలు కారును చుట్టుముట్టివేశారు. డాక్టర్ ఇంటికి చేరుకునేలోగా అతన్ని కారులోంచి బయటికి లాగి బల్లెంతో కడుపులో పొడిచారు. కారుతున్న రక్తాన్ని ఆపుకొంటూ ఇంటిలోకి వచ్చి మంచంపై వాలిపోయాడు.

Source: Vijaya Kranthi