Home Telugu Articles ఎనిమిది మంది యువకుల అరెస్టు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-47)

ఎనిమిది మంది యువకుల అరెస్టు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-47)

0
SHARE

ఇక ఏమీ జరగదని భావించి ఆ యువకులంతా గ్రామంలోకి తిరిగి వచ్చారు. నిర్లక్ష్యంగా తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు పోలీసులు గ్రామంపై దాడి జరిపి మానిక్‌రావు, చన్‌వీర్‌లతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఉద్‌గీర్‌లో తిలక్‌చంద్ అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన ఇచ్చిన సలహాననుసరించి ఆ ఎనిమిది మంది యువకులు బీదర్ జిల్లా జడ్జికి లంచం ఇచ్చి బయటికి వచ్చారు.

వాళ్ళు బయటికి రాగానే మరో వార్త తెలిసింది. కౌల్‌ఖేడ్ గ్రామంలో అప్పారావు పటేల్ ఇంటిపై రజాకార్లు దాడిచేసి ఇంటిని తగులపెట్టారు. తమ స్నేహితుడు అన్నివేళలా అండగా ఉండేవాడు అన్యాయానికి గురైనాడు. సర్వత్రా ముస్లిం దాడులు, దోపిడీలు జరుగుతున్నాయి. ఆ హింసాకాండను ఎదుర్కోవడానికి ఈ యువకులంతా అన్నివిధాలా సంసిద్ధులైనారు. నిజాం రాజ్యాన్ని ఆనుకొని బార్షీ ప్రాంతం ఉంది. అది ఆనాటి స్వతంత్ర భారత్‌లో ఒక భాగం. నిజాం రాజ్యంలోని ఆర్య యువకులు అన్యాయాల్ని ఎదుర్కొనే నిమిత్తం బార్షీలో ఉన్న శ్యామార్య గురుకులంలో శిక్షణ పొంది వచ్చేవాళ్ళు.

ఈ గురుకులాన్ని అమరవీరుడు శ్యాంలాల్ అన్న బన్సీలాల్ నిర్వహించేవాడు. ఆర్యవీరుల దళాన్ని నిర్మించి ఆయుధాలను ప్రయోగించే శిక్షణ ఇచ్చేవారు. అలాంటి శిక్షణా శిబిరంలో పాల్గొని యశ్వంతరావు సాయ్‌గావ్ చేరుకున్నాడు. అతన్ని పట్టించి ఇవ్వాలని రజాకార్లు పోలీసులకు కబురు చేశారు. యశ్వంతరావు 1948 జనవరి 30 నాటి నుంచి తన గ్రామంలో యువకులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఒకరోజు పోలీసులు వచ్చి సాయ్‌గావ్‌లో యశ్వంతరావు ఇంటిని చుట్టుముట్టారు. యశ్వంతరావును పోలీసులు గుర్తించలేదు. ఫలితంగా అతను పోలీసులకు ఎదురుపడి యశ్వంతరావు అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడని చెప్పి తప్పించుకొని పారిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత పోలీసులకు అసలు వాస్తవం తెలిసింది. ఈ లోగా యశ్వంతరావు పోలీసుల చేతికి చిక్కకుండా వెళ్ళిపోయాడు.

ముకేర్, కోంగి, అటర్గా, బోలేగావ్, సంగమ్‌నార్‌దా, జిర్‌గాల్, కేసర జబల్‌గా, మిరకల్ మొదలైన గ్రామాలలో యువకులు రైతుదళాలుగా ఏర్పడి శిబిరాలు నిర్వహించారు. ప్రజల మనోధైర్యాన్ని పెంచి ప్రతిఘటనా శక్తిని ఇచ్చారు. మిర్‌కల్‌కు చెందిన వెంకటేశ్వరరావు కూడా సాహవంతుడు. అతను, యశ్వంతరావు కలిసి విజయవంతంగా శిబిరాలను నిర్వహిస్తూ వచ్చారు. మరోసారి యశ్వంతరావును అరెస్టు చేయాలని పోలీసులు సాయ్‌గావ్ వచ్చారు. అప్పుడు యశ్వంతరావు స్వయంగా తుపాకి తీసుకొని ఇంటిపైకి ఎక్కి సవాలు చేశాడు. పోలీసులు ఈ పరిస్థితిని ఊహించలేకపోయారు. అందువల్ల అరెస్టు చేయకుండానే తిరిగి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత రజాకార్లు పోలీసుల వల్ల లాభంలేదని తామే బయలుదేరారు. వెంకటరావుపై దాడి చేయాలని సాయుధంగా వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న యశ్వంతరావు తన సహచరులతో ఎదురు వెళ్ళాడు. వెంకటరావు, యశ్వంతరావులను చూచి రజాకార్లు పారిపోవడం ప్రారంభించారు. ఇప్పుడిక సాయ్‌గావ్ రజాకార్లు వెంకట్రావ్ యశ్వంత్‌రావుల వల్ల తమ ఉనికికే ప్రమాదముందని గమనించారు. అందువల్ల అక్కడ హిందువుల, ముస్లింల శాంతి సభ ఏర్పాటు చేశారు. నిజాం పాలనలో ఈ శాంతి సభ అనే నాటకాన్ని ఆడి ముస్లింలు తరచుగా హిందూ ప్రజలను మభ్యపెడుతూండేవాడు. అన్యాయానికి గురైన హిందువులను జరిగినదంతా మరచి పొమ్మని నచ్చజెప్పి ఏదో సమన్వయ సంఘాన్ని స్థాపించారు. అందులో ముస్లిం పెద్దలను, ఆర్యసమాజ్ కార్యకర్తను సభ్యులుగా నియమించారు. ఈ సంఘాలవల్ల సామాన్య జనం నుంచి కార్యకర్తల కొంత దూరమయ్యే అవకాశం ఉండేది.

అలాంటి శాంతి సభ సాయ్‌గావ్‌లో జరిగింది. వెంకట్రావ్, యశ్వంత్‌రావులతో తప్ప మిగతా అందరితో శాంతియుతంగా జీవించే అవకాశాలున్నాయని రజాకార్లు అన్నారు. ఇది విని వెంకట్రావ్, యశ్వంత్‌రావులు సభ నుంచి వెళ్ళిపోయారు. నిజమే వారిద్దరు గ్రామంలో ఉండకపోతే శాంతి సుస్థిరంగా ఉంటుందని కొందరు హిందువులు కూడా భావించారు. ఆ తర్వాత అదే అవకాశంగా తీసుకొని శాంతి సంధిపేర రజాకార్లు పంచదారను పంచారు. అక్కడున్నవారికి కొంతకాలం తర్వాత సాయ్‌గావ్ హిందువులు నిస్సహాయులు అనే వాస్తవాన్ని గమనించి రజాకార్లు గ్రామాన్ని దోచుకున్నారు. అమానుషంగా ప్రవర్తించారు. అమాయకత్వానికి ఇతరుల దయాదాక్షాణ్యాలపై బతికే పరిస్థితికి ఆ దుస్థితి తప్పలేదు.

రామ్‌ఘాట్‌లో సభ

హైద్రాబాద్ సంస్థానంలో రోజు రోజుకు రజాకార్ల దుండగాలు మితిమీరి పోతున్నాయి. లూటీలు, మానభంగాలు, దహనాలు, అపహరించడం మామూలై పోయింది. గోర్టాలో హిందువులను ఊచకోతకోశారు. ఈ సంఘటనలన్నీ యశ్వంత్‌రావు, వెంకట్రావు తదితర యువకులను తీవ్రంగా కదిలించి వేశాయి. ప్రతీకారవాంఛ రగిలింది. అందరు కలిసి అట్టర్గే ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేశారు. అట్టర్గే గ్రామం రాజమార్గం నుంచి దూరంగా ఉండేది.

Source: Vijaya Kranthi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here