Home Hyderabad Mukti Sangram విమోచనోద్యమానికి నడుంగట్టిన బాలకృష్ణ..( హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-2)

విమోచనోద్యమానికి నడుంగట్టిన బాలకృష్ణ..( హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-2)

0
SHARE

పైకి మాత్రం ఆర్యసమాజ్ కార్యకర్తగా చెప్పుకుంటూ రహస్యంగా విప్లవకారులను సమీకరించాడు. అతని దగ్గరే నారాయణబాబుకు, విప్లవకారులకు సంబంధించిన సాహిత్యం లభించింది. తన నిశ్చయం మరింతగా సుదృఢమై మనస్సులో లక్ష్యంగా వేళ్ళూనింది. చచ్చినా బ్రతికినా నా దేశం కోసమేననే భావం ఉప్పొంగింది. నారాయణబాబు తండ్రి పండరీనాథ్‌రావ్, బీదర్ జిల్లాలో సౌలాదాబ్ గ్రామం వదలి 1900 జీవనభృతి కోసం వరంగల్ వచ్చేశాడు. బాల్కి తాలూకాలో సౌలదాబ్ గ్రామంలో ఆ రోజుల్లో కాటక పరిస్థితులు ఏర్పడినందువల్ల ఆయన వరంగల్ వచ్చి కొత్తగా నిర్మాణంలో ఉన్న రైలుమార్గంలో కూలీగా చేరాడు.

క్రమంగా ‘ముకద్దమ్’గా ఉన్నతి పొందాడు. 1926లో వరంగల్‌లో నారాయణబాబు జన్మించాడు. అక్కడి హై స్కూల్‌లో మెట్రిక్యులేషన్ ప్రథమశ్రేణిలో అందరికన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణుడై, ఇంటర్మీడియట్ కాలేజీలో చేరి ఇంటర్ పరీక్షలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. న్యాయవాద విద్యనభ్యసించాలనే ఉద్దేశ్యంతో హైద్రాబాద్ చేరుకున్నాడు. పండరీనాథ్‌కు తన ఏకైక కుమారునిపై, అతని భవిష్యత్తుపై అపారమైన విశ్వాసం ఉండేది. నారాయణబాబుకు ఎనిమిదవ తరగతి చదువుకున్న కాలంలోనే పాఠ్యపుస్తకాలు కాకుండా ఇతర గ్రంథాలు చదవడమంటే చాలా ఇష్టం. ఆర్యసమాజ్ సంస్కరణ వాద ఉద్యమాలు  అతన్ని ప్రభావితం చేశాయి. హరిజనుల పట్ల జరుగుతున్న అన్యాయాలు చూసి గుండె ద్రవించేది. అందువల్ల హరిజనులకు చదువు చెబుతుండేవాడు.

తండ్రికిది నచ్చేది కాదు. పురాతన భావాలు ఆయన్ను వెనక్కులాగుతుండేవి. అయినా నారాయణబాబు పట్టుదల, ఆదర్శభావాలు తండ్రిని కూడా మార్చి వేశాయి. ఫలితంగా హరిజన పిల్లలకు తమ ఇంటి దగ్గరే చదువు చెబుతుండేవాడు. సహపంక్తి భోజనాలు జరుగుతుండేవి. నారాయణబాబు స్వభావం పండరీనాథ్‌ని ముగ్ధుడిని చేసింది. నారాయణబాబు సహజసిద్ధమైన వినయం, దృఢ సంకల్పం, మితభాషణం ఎవరినైనా సులభంగా ఆకర్షించేవి. ఆనాటి ఘోరపరిస్థితులు నారాయణబాబు సంవేదన శీలత్వాన్ని ప్రజ్వలింప చేశాయి. దేశభక్తి రక్తంలో ప్రవహిస్తోంది. న్యాయవాద విద్యను అభ్యసిస్తూ ఉన్నా దేశం కోసం సర్వం త్యాగం చేయాలనే తపన రగుల్కొన్నది. న్యాయవాది కావాలన్న కోరిక క్షీణించింది. తాను జన్మించిన ప్రాంతం బానిసత్వంలో ఆక్రందిస్తుంటే చూడలేకపోయాడు.

జిన్నా ఉపన్యాసం

1947 ప్రారంభంలో మహమ్మదాలీ జిన్నా హైద్రాబాద్ వచ్చి ఒక పెద్ద సభలో ప్రసంగించాడు. జనాన్ని రెచ్చగొట్టే విధంగా పరుషంగా మాట్లాడాడు. నారాయణబాబు ముసల్మాను వేషంలో అక్కడికెళ్ళి ఉపన్యాసం విన్నాడు. “కోడి మెడలను విరిచినట్లుగా హిందువులను విరిచేస్తాం. ముల్లంగి కాడల్లా త్రుంచివేస్తాం” అని మహా ఉద్రేకంగా మాట్లాడాడు. నారాయణబాబు రక్తం ఉడుకెత్తింది. హృదయం విక్షుబ్దం (విషణ్ణం) కాగా ఏదో ఒకటి చెయ్యాలనే తపన తీవ్రం అయ్యింది. కాయదే ఆజం జిన్నా ప్రసంగం నారాయణబాబు జీవితాన్ని ఒక మలుపుదగ్గర నిలుచోబెట్టింది. బాలకృష్ణ, నారాయణ తమ విప్లవ సహచరులను సమీకరించి కార్యక్రమాలను నిర్ణయించుకున్నారు. అడుగడుగునా ధనాభావం, ఆయుధాల వెలితి ఉన్నా, సహనంగా స్వతంత్ర హైద్రాబాద్‌ను తుదముట్టించాలనుకున్నారు.

నారాయణబాబు, బాలకృష్ణలతో పాటు నారాయణ స్వామి (మాజీ నిజాం రైల్వేలో కో ఆఫీసర్), విశ్వనాథ్ (గన్‌ఫౌండ్రీ), రెడ్డి పోచ్‌నాథ్, గంగారాం పాలంకోల్, జగదీష్ ప్రధానంగా రహస్య మంతనాలు సాగించారు. మొట్టమొదట ప్రయోగంగా నిజాం సైనికదళానికి చెందిన రిజర్వ్ పోలీసు అశ్వికదళం ఉన్న ప్రాంతాన్ని టైంబాంబుతో ధ్వంసం చేయాలని నిశ్చయించుకున్నారు. ప్రజలలో చైతన్యం కలిగించాలని నిజాం దుష్కృత్యాలను ప్రతిఘటించే జనం ఉన్నారనే అంశం తెలియచేయాలనీ, ప్రయోగాత్మకంగా ఈ పని చేసి చూడాలనే నిర్ణయానికి వచ్చారు. సిటీ కాలేజీకి పశ్చిమంగా ఉన్న రిజర్వ్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ దగ్గరలో (పేటలా బురజ్ దగ్గర) అశ్వికదళం తబేలా, రిజర్వ్ పోలీసు కార్యాలయాలు ఉండేవి. రోడ్డుకు మరోప్రక్కన పోలీస్ బ్యారక్స్ కూడా ఉండేవి.

పథకం ప్రకారం నిర్ణీత స్థలంలో నారాయణబాబు గంగారాంలు వెళ్ళి అతిరహస్యంగా టైంబాంబును నాటి వచ్చారు. రాత్రి సరిగ్గా రెండు గంటలకు ప్రేలుడు జరిగింది. తబేలా పైకప్పు లేచిపోయి అగ్ని వ్యాపించింది. కొన్ని గుర్రాలు తీవ్రంగా కాలి గాయపడ్డాయి. వేలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఆ తర్వాత గూఢచారి శాఖ ఎంతో గాలించింది. కాని ఎవరూ పట్టుబడలేదు. నారాయణబాబు, ఆయన సహచరులు సాధించిన ప్రప్రథమ విజయం అది.

(విజయక్రాంతి సౌజన్యం తో )