Home Telugu Articles విదేశీ పాస్టర్ల వీసా ఉల్లంఘనపై ఉదాసీన వైఖరి 

విదేశీ పాస్టర్ల వీసా ఉల్లంఘనపై ఉదాసీన వైఖరి 

0
SHARE

–A.S.SANTHOSH

విదేశీ మతప్రచారకుల వీసా నిబంధనల ఉల్లంఘనలపై తాజాగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ అది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న విషయం మనం గ్రాహం స్టెయిన్స్ ఉదంతం ద్వారా గత భాగంలో తెలుసుకున్నాం.

ఒక విదేశీయుడు భారతదేశంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన వీసా భారత ప్రభుత్వంలోని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని కాన్సులేట్ల ఆధ్వర్యంలో పనిచేసే మిషన్స్ అండ్ పోస్ట్స్ వారు జారీ చేస్తారు. అయితే టూరిస్ట్ ముసుగులో వచ్చే విదేశీ మతప్రచారకులు అనేకమంది వీసా అప్లికేషన్ సమయంలో మాత్రం తెలివిగా ‘భారతదేశ యాత్ర’ అనే కారణం చెప్పి టూరిస్ట్ వీసా సంపాదిస్తారు. భారతదేశం టూరిస్ట్ వీసాల జారీని సులభతరం చేయడం, వీసా జారీ సమయంలో పెద్దగా దృష్టిపెట్టకపోవడం వంటి విషయాలను వీరు ఆసరాగా చేసుకుని దేశంలోకి ప్రవేశిస్తారు.

ఒకసారి విదేశీయుడు వీసా పొంది దేశంలోకి ప్రవేశించగానే అతడు హోంశాఖ పరిధిలోకి వస్తాడు. విదేశీయులు వాయుమార్గం ద్వారా భారతదేశంలోకి రావడానికి ఏడు (7) అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటాయి. వీటినే  ఎంట్రీ పాయింట్లు  అంటారు. ఇవన్నీ కూడా దేశంలోని 7 ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కొలకత్తా, ముంబైలలో ఉంటాయి. ఆయా నగరాల్లో స్థానికంగా ఇమ్మిగ్రేషన్ శాఖకు సంబంధించి ‘ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ అధికారి’ కార్యాలయం ఉంటుంది. విదేశీయుడు దేశంలోకి అడుగు పెట్టగానే స్థానిక ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయంలో పేరు, వివరాలు నమోదు చేసుకుని, తాను ఏ పనిమీద వచ్చాడో, ఎక్కడ పర్యటిస్తాడో, ఎక్కడ బస చేస్తాడో, ఎన్ని రోజులు ఉంటాడో, ఎప్పుడు తిరుగుప్రయాణం అవుతాడో తెలియజేయాలి.

అక్కడి నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిన విదేశీయులు.. తమ పర్యటన/కార్యక్రమం/ప్రాజెక్ట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడి స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మాములు పట్టణాలు అయితే సంబంధిత ఎస్పీ కార్యాలయంలో ఉండే ఫారినర్స్ బ్రాంచిలో వివారాలు సమర్పించాలి. అంతేకాకుండా ఆ గ్రామం/పట్టణంలో తమ పని పూర్తయ్యే వరకు తమ పాస్ పోర్ట్, వీసా మొదలైన ట్రావెల్ డాక్యుమెంట్లను స్థానిక ఇన్స్పెక్టర్ సమక్షంలో భద్రపరచాలి. వారు ఏదైనా హోటల్లో దిగినట్లైతే ఆ హోటల్ యాజమాన్యం వివరాలతో కూడిన రికార్డ్ 24 గంటలలోపు పోలీస్ శాఖకు సమర్పించాలి.

వీటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఇమ్మిగ్రేషన్, పోలీస్ అధికారుల మీద ఉంటుంది. కానీ అవగాహనా రాహిత్యమో లేక ఉదాసీనతో లేక రాజకీయ ఒత్తిడి ప్రభావమో. వాస్తవానికి వీటిలో ఏవీ కూడా సక్రమంగా అమలు కావడం లేదన్న విషయం స్పష్టం.

ఇమ్మిగ్రేషన్, పోలీస్ వ్యవస్థల ఉదాసీనత, నిఘా లోపం కేవలం గ్రాహం స్టేయిన్స్ ఒక్కడి విషయంలోనే పరిమితం కాలేదు.

Daniel Stephen Courney
Daniel Stephen Courney

డేనియల్ స్టీఫెన్ కౌర్నీ.. అమెరికాకు చెందిన ఈ క్రైస్తవ మతప్రచారకుడు గత 10 సంవత్సరాలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో మతమార్పిళ్లకు పాల్పడుతూ ఉండేవాడు. అతడి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా గుంటూరుకు చెందిన స్థానిక తెలుగు మహిళను పెళ్లి చేసుకున్నాడు. టూరిస్ట్ వీసా మీద 10 ఏళ్లకు పైగా తెలుగు రాష్ట్రాల్లో నివసించిన యితడు ప్రతీ 6 నెలలకొకసారి తన వీసా గడువు పెంచుకుంటూ (రెన్యూవల్ చేసుకుంటూ) ఉండేవాడు. ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్’ సభ్యులు రెండు నెలల పాటు కృషి చేసి హోంశాఖకు నిరంతరం ఫిర్యాదులు చేయడంతో చివరికి 2017లో భారత్ అతడిని దేశం నుండి బహిష్కరించింది. అంతేకాకుండా మరోసారి దేశంలోకి అడుగుపెట్టనీయకుండా అతడి పేరుని ఇమ్మిగ్రేషన్ బ్లాక్ లిస్టులో ఉంచింది.

మన ప్రభుత్వ సంస్థల నిఘా వ్యవస్థ పనితీరుకు ఇది నిదర్శనం. ఒక విదేశీయుడు 10 ఏళ్లకు పైగా మతమార్పిళ్లకు పాల్పడుతున్నా పసిగట్టలేకపాయింది. అంతేకాకుండా ప్రతి 6 నెలలకు తన వీసా రెన్యూవల్ చేసుకుంటున్నా గమనించలేకపోయింది.

బెనితా ఫ్రాన్సిస్ అనే జర్మన్ మహిళ.. చెన్నైలోని కొల్లాతూర్ కేంద్రంగా ఏర్పాటు చేసిన క్రైస్తవ మిషనరీ సంస్థ “బెరాకా ప్రాఫెటిక్ మినిస్ట్రీస్’ తరపున భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో బాహాటంగా మతప్రచారం చేస్తోంది. ఆమె ఏర్పాటు చేసే కార్యక్రమాలన్నీ కూడా బహిరంగ కార్యక్రమాలే అవడం గమనించాల్సిన విషయం. ఇందుకోసం ఆమె ఏకంగా భారతదేశానికి చెందిన పాస్టరుని పెళ్లి చేసుకుని చెన్నైలో స్థిరపడిపోయింది. అంతే కాకుండా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థకు విదేశీ విరాళాలు పొందేందుకు వీలుగా ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ కింద లైసెన్స్ ( 075900700) కూడా ఉండటం దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువస్తూ ఇటీవలే ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్’ చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది.

ఇంత బాహాటంగా వీసా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా సంబంధిత సంస్థల దృష్టికి రాకపోవడాన్ని ఈ కేసులో గమనించవచ్చు.

సౌత్ ఆఫ్రికాకు చెందిన మారిస్ సెర్రులోది మరో గొప్ప ఉదాహరణ. ఇతడు క్రైస్తవ ప్రార్ధనల పేరిట రోగాలు నయం చేస్తానంటూ 1992లో కోల్ కత్తా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం కారణంగా వీసా నిబంధనల ఉల్లంఘన కింద పోలీసులు అతడిని దేశం నుండి బహిష్కరించారు. ఇమ్మిగ్రేషన్ బ్లాక్ లిస్టులో అతని పేరు చేర్చడంతో పాటు అతడిని ‘భారత ప్రభుత్వానికి ఆమోదయోగ్యము కాని,  వివాదాస్పద వ్యక్తి’గా అతడి వివరాలు రికార్డు చేసింది. అదే వ్యక్తి తిరిగి 2018లో దేశ రాజధాని ఢిల్లీలోని తల్కతోరా జాతీయ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ క్రైస్తవ బహిరంగ సభలో మతపరమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ఎలాంటి నిద్రావస్థలో ఉందో దీని బట్టి చెప్పవచ్చు.

అన్నే గ్రాహం లాట్జ్ ఉదాహరణ చూస్తే భారత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ఏవిధంగా రాజకీయాలతో రాజీ చేసుకుందో గ్రహించవచ్చు. ప్రసిద్ధ అంతర్జాతీయ క్రైస్తవ ప్రచారకుడైన బిల్లీ గ్రాహం కుమార్తె అన్నే గాహం, భారత వీసా నిబంధనలు ధిక్కరిస్తూ 2018 జనవరి 5న సికింద్రాబాదులోని ఆర్మీ పెరేడ్ గ్రౌండ్సులో ఏర్పాటైన క్రైస్తవ భారీ బహిరంగ సభలో ముఖ్య వక్త హోదాలో మతపరమైన ప్రసంగం చేసింది. ఆ సభ జరగడానికి కొన్ని రోజుల ముందు నుండి స్థానిక సామాజిక కార్యకర్తలు ఇమ్మిగ్రేషన్, పోలీస్ శాఖలకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ అధికారి కూడా ఈ విషయంలో మౌనం వహించాల్సి వచ్చింది. మరికొందరు కార్యకర్తలు ఢిల్లీలోని ఇమ్మిగ్రేషన్ కమిషనర్ కార్యాలయానికి, హోంశాఖకు చెందిన విదేశీ విభాగానికి కూడా ఫిర్యాదు చేసినప్పటికి ఈ అమెరికన్ దేశస్తురాలిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

దీన్ని ప్రశ్నిస్తూ హరీష్ శర్మ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. “మాకు అసలు ఫిర్యాదులేవీ రాలేదు” అని బుకాయించడం జరిగింది. ఈ ఉదంతం ద్వారా అసలు జాతీయ భద్రతా వ్యవహారాల్లో హోంశాఖ వర్గాలు ఎంతటి అలసత్వం, ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయో తెలుస్తుంది. ఫారినర్స్ డివిజన్ డైరెక్టర్ కార్యాలయం ఇచ్చిన ఈ  తప్పుడు సమాధానాన్ని సవాల్ చేస్తూ, రెండేళ్ల పాటు పోరాటం చేసిన హరీష్ శర్మకు చివరికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎదుట సదరు అధికారి బేషరతు క్షమాపణ కోరాల్సి వచ్చింది. ఇది కేవలం కంటి తుడుపు చర్యే అయినప్పటికీ వారి చేష్టలు మాత్రం అత్యంత బాధ్యతారాహిత్యంగా చెప్పుకోవచ్చు.

చివరగా మరో విషయం.. అమెరికాలోని `లేటర్ డే సెయింట్స్’ అనే క్రైస్తవ మతమార్పిడి సంస్థ భారత దేశానికి తమ అమెరికన్ ప్రతినిధులను పంపిస్తూ ఉంటుంది. వారు ఇక్కడి ప్రజలను మతం మారుస్తూ ఉంటారు. ఇందుకోసం తమ ప్రతినిధులకు మిషనరీ వీసాలు మంజూరీలో సదరు సంస్థ భారతదేశంలోని అప్పటి అమెరికన్ రాయబారి ద్వారా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు అమెరికన్ సంస్థలు తీవ్రంగా ఆరోపించాయి. అంతేకాకుండా ఇటువంటి అవినీతికి పాల్పడిన లేటర్ డే సెయింట్స్ సంస్థపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికన్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపుని అభ్యర్ధిస్తున్నాయి.

పైన పేర్కొన్నవి కేవలం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పూనుకుని వెలికితీసిన అంశాలు మాత్రమే. బయటపడని ఉదంతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.  ఈ ఘటనలన్నీ చూస్తుంటే.. అత్యంత కీలకమైన భారత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను క్రైస్తవ మతమార్పిడి సంస్థలు హైజాక్ చేస్తున్నాయా అనే అనుమానం రాక మానదు.

Source: Organiser