Home Telugu Articles ప్రపంచంపై మార్క్స్, వివేకానందల ప్రభావం

ప్రపంచంపై మార్క్స్, వివేకానందల ప్రభావం

0
SHARE

— పి. పరమేశ్వరన్‌

‌మార్క్స్ ‌చనిపోయిన తరువాత అతి తక్కువ కాలంలోనే 25కు పైగా మార్క్సిస్టు దేశాలు ప్రపంచపటంపై ఆవిర్భవించాయి. ఆసియా, యూరప్‌, ‌లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఇలా అన్ని ఖండాల్లో కమ్యూనిస్టు దేశాలు పట్టుకొచ్చాయి. ఇలా దేశాలను గెలిచిన ఘనత స్వామీ వివేకానందకు లేదు. ఆయన అనుచరులు ఏ దేశంలోనూ, ఏ రాజకీయపార్టీ పెట్టలేదు. అలాగే అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేయలేదు. కానీ అతి తక్కువ కాలంలోనే ఆయన సందేశం ప్రపంచపు మూల మూలలకు చేరింది. రష్యా, చైనా వంటి కమ్యూనిస్టు దేశాల్లో కూడా మేధావులు భారతీయ తత్వాన్ని తెలుసుకునేందుకు వివేకానంద సాహిత్యం చదువుతున్నారు, అధ్యయనం చేస్తున్నారు.

మార్క్స్ ప్రభావం అద్భుతంగా బయటకి కనిపించడానికి, వివేకానంద ప్రభావం అలా కనిపించకపోవడానికి కారణం ఉంది. వివిధ దేశాల్లో మార్క్సిజం వ్యాపించినా ఈ దేశాల ప్రజానీకం స్వచ్ఛందంగా దానిని అంగీకరించారు, స్వీకరించారని కాదు. కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయడానికి అనుసరించిన విధానాలు, పద్ధతులు ఎలా చూసినా ప్రజాస్వామికమైనవి కావు. స్వేచ్ఛాపూరిత, న్యాయబద్ధమైన ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు పాలన ఏర్పడిన సందర్భాలు చాలా తక్కువ. కేరళ, పశ్చిమబెంగాల్‌ ‌వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో గెలిచినా, ప్రజాభిప్రాయం మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. పైగా పార్టీలకు కూడా ఇంతకు ముందున్న ఉత్సాహం, ప్రజాదరణ ఇప్పుడు లేవు.

కమ్యూనిస్టులు వివిధ దేశాల్లో అధికారం చేజిక్కించుకునేందుకు అనుసరించిన పద్ధతుల్ని రాజకీయ నిపుణులు వివిధ రకాలుగా విశ్లేషించారు. అయితే అన్నింటిలోనూ విదేశీ సైన్యపు జోక్యం తప్పనిసరిగా కనిపిస్తుంది. కనీసం కమ్యూనిస్టు పార్టీ కూడా లేకుండానే ఒక దేశం కమ్యూనిస్టు రాజ్యమైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా అనుసరించే వ్యూహం ఏమిటంటే ఒక కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా విప్లవానికి అనువైన స్థితిని ఏర్పరచడం, ఆ తరువాత కమ్యూనిస్టు దేశానికి చెందిన సైన్యపు సహకారంతో ప్రస్తుత పాలనను కూలదోసి అధికారం చేజిక్కించుకోవడం. అధికారాన్ని కమ్యూనిస్టు పార్టీ హస్తగతం చేసుకోవడంలో కూడా దశలు ఉన్నాయి. మొదట కమ్యూనిస్టు పార్టీ మిగతా పార్టీలతో కలిసి మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. క్రమంగా ఆ పార్టీల బలాన్ని దెబ్బతీసి పూర్తిగా అధికారం చేజిక్కించుకుంటుంది. ఆ తరువాత ఎన్నికల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వదు. ఈ కమ్యూనిస్టు ఆక్రమణ వ్యూహాన్ని గమనిస్తే అందులో ఎక్కడా ప్రజాభిప్రాయానికి గానీ, ప్రజామోదానికిగానీ స్థానం లేదని తెలిసిపోతుంది. అందుకనే కమ్యూనిస్టు దేశాల్లో ఎక్కడా ప్రజాస్వామ్య విలువలు కనిపించవు.

మార్క్స్ ‌ప్రభావపు నిజ స్వరూపం కూడా మనం పరిశీలించాల్సిన ముఖ్యవిషయం. మార్క్సిజాన్ని గురించి వ్రాస్తూ ఆర్‌.ఎం. ‌మెకైవర్‌ ఇలా అన్నాడు- ‘‘పెట్టుబడిదారీ నాగరకతలో కనీసం తిండి దొరకక బాధలు పడుతున్న ప్రజానీకానికి ఆశాజ్యోతిగా కనిపించడానికి, వ్యవస్థను సమూలంగా పెకిలించివేసే తీవ్ర విప్లవాన్ని తీసుకురాగలగడానికి, రష్యాలో రాచరికాన్ని కూలదోసి కమ్యూనిస్టు పాలన ఏర్పరచడానికి మార్క్సిజంలో ఉన్న బలం ఏదైనా ఉందంటే అది మూకబలమే తప్ప శాస్త్రీయమైన దృక్పథం కానేకాదు.’’ (ఆర్‌.ఎం.‌మెకైవర్‌, ‌ఛార్లెస్‌, ‌సొసైటీ). నిజానికి మార్క్సిజం ఒక శాస్త్రం కాదు. అలాగే ఒక తత్వం కాదు. అది ప్రస్తుత వ్యవస్థ పట్ల అసంతృప్తి, ఆగ్రహం కలిగి, దానిని హింసాత్మక విప్లవం ద్వారా మార్చేయాలనుకునేవారికి ఆయుధంగా ఉపయోగపడే మూఢమైన సిద్ధాంతం, ఆలోచన.

మార్క్సిజం శాస్త్రీయమైనదనే వాదన గురించి పిటిరిమ్‌ ‌సోరోకిన్‌ అలా అంటాడు – ‘‘మార్క్స్, ఏం‌గెల్స్ ‌ప్రతిపాదించిన సామాజిక సిద్ధాంతాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పవచ్చును. మొదటిది, ఇందులో ఎలాంటి శాస్త్రీయతగానీ, అంతకు ముందు ఎవరూ చెప్పని నూత్న, ప్రత్యేక విషయంగానీ లేవు; రెండు, నిజానికి ఇది శాస్త్రీయతకు చాలా దూరం; మూడు, మార్క్స్ ‌కంటే ముందు అనేకమంది చెప్పిన విషయాలను మరింత స్పష్టంగా, సూటిగా, గట్టిగా చెప్పారు. అలాగే అవన్నీ అద్భుతమైన అధ్యయనం నుంచి వచ్చినవి కాదు. ఊహ, అతి ప్రాధమిక స్థాయికి చెందిన ఆలోచన నుండి పుట్టినవి మాత్రమే. కనుక మార్క్స్, ఏం‌గెల్స్‌ను సామాజిక శాస్త్రపు ‘గెలీలియోలు’, ‘డార్విన్‌లు’గా పరిగణించాల్సిన అవసరం లేదు. అంతేకాదు వాళ్ళు గొప్ప శాస్త్రీయ విషయాలు చెప్పారని అనుకోరాదు. వాళ్ళు అంత పేరు ప్రతిష్టలు సంపాదించడానికి కారణాలు వేరే ఉన్నాయి. వాళ్ళు శాస్త్రీయ అధ్యయనానికి దారిచూపారని అనుకున్నా,  దానికంటే మించి అనేక అసంబద్ధమైన కల్పనలు, సిద్ధాంతాలకు ప్రాణం పోశారు. కమ్యూనిస్టు సాహిత్యమంతా మార్క్స్, ఏం‌గెల్స్ ‌వ్రాసిన ‘గ్రంధపు’ సిద్ధాంతపరమైన వ్యాఖ్యానమే తప్ప మరొకటి కాదు. ఇది ముస్లిం పండితులు ఖురాన్‌కు చేసే పలు విధాలైన వ్యాఖ్యానం వంటిది. ఈ సాహిత్యంలో ఎక్కడా శాస్త్రీయత కనిపించదు. నిజానికి మార్క్స్, ఏం‌గెల్స్ ‌సామాజిక శాస్త్రాల ప్రగతిని అడ్డుకున్నారు. వాళ్ళ సిద్ధాంతం చాలా పాతది. ఆ తరువాత అనేక శాస్త్రీయ అధ్యయనాలు దీని డొల్లతనాన్ని బయటపెట్టాయి. కేవలం కొద్దిమంది తాత్వికులు మాత్రమే మార్క్స్, ఏం‌గెల్స్ ‌సిద్ధాంతాన్ని పట్టుకువేళ్ళాడుతున్నారు. నిజమైన శాస్త్రవేత్త దీన్ని పక్కకు పెట్టి ఆర్ధిక అంశాలు, సామాజిక జీవనానికి సంబంధించిన మిగతా విషయాల మధ్య సంబంధాన్ని పరిశీలించడానికి ప్రయత్నిస్తాడు.’’ (పిటిరిమ్‌ ‌సోరోకిన్‌, ‌సోషియలాజికల్‌ ‌థియరీస్‌, ‌పే.545-46)

మార్క్స్ ‌చెప్పిన భవిష్యవాణిలో చాలా వరకు తప్పు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో శ్రామికవర్గం తిరుగుబాటు, విప్లవబాటపడుతుందన్న మార్క్స్ ‌జోస్యం నిజం కాలేదు. వారి స్థితి రోజురోజుకూ దిగజారిపోతుందని మార్క్స్ ఊహిస్తే నిజానికి మెరుగుపడింది. కమ్యూనిస్టు దేశాల్లో రాజ్యం రోజురోజుకూ బలపడి నిరంకుశంగా మారింది. ఇక్కడ కూడా మార్క్స్ అం‌చనా తప్పింది. కమ్యూనిస్టు వ్యవస్థలో రాజ్యం ఉండనే ఉండదని, అది క్రమంగా అంతరించిపోతుందని అన్నాడు. అనేక దేశాల్లో తిరుగుబాట్లు, విప్లవాలు మాత్రం వచ్చాయి. మార్క్స్ ‌సిద్ధాంతం పేరుచెప్పుకుని కొందరు పాలకులయ్యారు. వీళ్ళు కూడా తమ ప్రయోజనాల దృష్ట్యా తరువాత మార్క్స్ ను పక్కకు పెట్టి లెనిన్‌ అనుయాయులయ్యారు.

మరోవైపు స్వామీ వివేకానంద కొత్త మతాన్ని దేన్నీ ప్రతిపాదించలేదు. తాను చెప్పే విషయాలు ఇంతకుముందు ఎవరూ, ఎప్పుడూ చెప్పలేదని ఆయన ప్రకటించలేదు. ‘‘జాగ్రత్తగా పరిశీలిస్తే నేను ఉపనిషత్తులనే ఎప్పుడూ ఉటంకించానని తెలుస్తుంది.’’ అని సోదరి నివేదితతో అన్నారు. (ది మాస్టర్‌ ‌యాజ్‌ ఐ ‌సా హిమ్‌, ‌పుట.202) అయితే పాతవైన మూఢనమ్మకాలు మాత్రం మళ్ళీ ప్రజలను పట్టుకోకుండా జాగ్రత్త వహించారు. స్వామీజీ అనుసరించిన ఈ ధోరణి గురించి శ్రీ అరవింద మహర్షి ఇలా అన్నారు – ‘‘గతం, వర్తమానానికి చెందిన వివిధ శక్తులను సమన్వయపరచడం, పునర్నిర్మాణ పక్రియ ద్వారా పరిరక్షించడంలో స్వామీ వివేకానంద అనుసరించిన దృక్పధం అనితరసాధ్యం, చాలా శక్తివంతం.’’(శ్రీ అరవింద, ఫౌండేషన్స్ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌కల్చర్‌, ‌పే.415.)

మార్క్స్ ‌సిద్ధాంతం మాదిరిగానే స్వామీ వివేకానంద చెప్పిన విషయాల్ని ఆయన అనుచరులు వక్రీకరించారా? అంటే లేదనే చెప్పాలి. దీనికి ఒక కారణం ఉంది. మార్క్స్ ‌చెప్పిన విషయాలు ప్రధానంగా ప్రజల సమిష్టి జీవనానికి సంబంధించినవి. వాటిని వివిధ దేశాల్లో, వేరువేరు పరిస్థితుల మధ్య అమలుపరచాలని ప్రయత్నించారు. కానీ స్వామీ వివేకానంద బోధించిన అంశాలు ఆధ్యాత్మిక, నైతికతకు చెందినవి. వీటిని సమిష్టిగా, పెద్ద ఎత్తున అమలుచేయడం వెంటనే సాధ్యపడదు. అలాగే వాటిని వక్రీకరించి ఇష్టవచ్చినట్లుగా అమలు చేసే వీలూ లేదు.

పాశ్చాత్యప్రపంచంపై స్వామీ వివేకానంద ప్రభావాన్ని గురించి చెపుతూ శ్రీ అరవింద మహర్షి ఇలా అన్నారు- ‘‘స్వామీ వివేకానంద అమెరికా పర్యటన, ఆ తరువాత ఆయన అనుచరులు చేపట్టిన కార్యక్రమాలు వంద లండన్‌ ‌కాంగ్రెస్‌ల కంటే ఎక్కువ ప్రభావం చూపాయి. మన ఉజ్వలమైన గతం, నాగరకతను ప్రపంచానికి చూపి గౌరవాన్ని, విలువను తిరిగి పొందడమంటే ఇదే. ఈ నాగరకతను ఇప్పటికీ మనం ప్రపంచానికి ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నాం. కనుక మనం స్వాతంత్య్రానికి అర్హులం.’’(శ్రీఅరవింద, వరల్డ్ ‌థింకర్స్ ఆన్‌ ‌రామకృష్ణ – వివేకానంద, పుట.36)

స్వామీ వివేకానంద నిజమైన ప్రభావాన్ని గుర్తించే రోజు ముందు ఉందని అరవింద మహర్షి అంటారు. ఇప్పటి వరకు మనం చూసినది అందులో చాలా కొద్దిగా మాత్రమే. ‘‘స్వామీ వివేకానంద పురుష సింహం. ఆయన నెరవేర్చిన కార్యం ఎలాంటిదో మనం అంచనావేయలేం. ఆయన సృజనాత్మకత, శక్తి మనం ఊహించినదాని కంటే చాలా ఎక్కువ. ఆయన ప్రభావం బృహత్తరమైనదని మనం అనుకుంటున్నాంగానీ, అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ పని చేస్తోందో మనం చెప్పలేం. అది భారతీయ ఆత్మలో ప్రవేశించింది. అందుకనే మనం ‘వివేకానంద ఇప్పటికీ ఆ తల్లి ఆత్మలో, ఆమె పిల్లల ఆత్మల్లో జీవించే ఉన్నారు’ అని మాత్రం చెప్పగలం.’’(శ్రీఅరవింద, సం.17, పుట.332)

మార్క్స్ ‌ప్రభావం ఎక్కువగా పరిమాణాత్మకమైనది. అందువల్ల దానిని కొలిచి చూడవచ్చును. కానీ వివేకానంద చూపిన ప్రభావం అంతకంటే తక్కువేమీ కాకపోయినా గుణాత్మకమైనది కాబట్టి స్పష్టంగా, కచ్చితంగా వివరించలేం. మార్కస్ ‌ప్రభావం కారుచిచ్చులా ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టుముట్టింది. హింస, రక్తపాతంతో కూడిన పెను మార్పుల్ని తెచ్చింది; వివేకానంద ప్రభావం హిందుత్వం లాంటిది. దాని గురించి స్వయంగా ఆయనే కవితా ధోరణిలో ఇలా చెప్పారు – ‘‘తెలిమంచు కురిసినప్పుడు అది పైకి కనబడదు, శబ్దం అంతకంటే కాదు. కానీ దానివల్ల పువ్వులు వికసిస్తాయి.’’ మార్క్స్ ‌భూభాగం తరువాత భూభాగాన్ని జయించే ఒక సేనానాయకుడైతే, వివేకానంద అపారమైన ప్రేమ, వాత్సల్యంతో నెమ్మదినెమ్మదిగా మార్పును తెచ్చే దివ్యసందేశకుడు. మార్క్స్ ‌ప్రభావం బాహ్యమైనది. మానవ అస్తిత్వపు బాహ్య సరిహద్దులకు పరిమితమైనది. మనిషికి సంబంధించిన ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మార్చివేస్తుంది. స్వామీ వివేకానంద ప్రభావం అంతర్గతమైనది. అది మనిషి లోపలి ప్రపంచాన్ని తాకుతుంది. అతని అంతర్గత స్వభావాన్ని శాశ్వతంగా మార్చి వేస్తుంది. ఈ మార్పు సహజమైనది. ఎందుకంటే మార్క్స్ ‌నిర్వచించిన మానవుడు కేవలం  భౌతికజీవి. ఆ తరువాత అతను భౌతికేతర లక్షణాల్ని పొందవచ్చును. కానీ ప్రధానంగా అతను భౌతికజీవి. కానీ వివేకానంద ప్రకారం మనిషి ప్రధానంగా ఆధ్యాత్మిక శక్తి, ఆత్మ.

(శ్రీ పరమేశ్వరన్‌ ‌వ్రాసిన ‘మార్క్స్, ‌వివేకానంద – ఏ కంపారిటివ్‌ ‌స్టడీ’ (వివేకానంద కేంద్ర ప్రచురణ) నుండి..)

సంక్షిప్తీకరణ, అనువాదం – VSK Telangana

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here