Home Telugu Articles సెక్యులర్ దేశాల్లో మత ప్రాధాన్యత

సెక్యులర్ దేశాల్లో మత ప్రాధాన్యత

0
SHARE

సెక్యులర్‌ వ్యవస్థలో అన్ని మతాలనూ సమానంగా చూసే తీరాలా? ఒక మతానికి ప్రత్యేక గౌరవస్థానం ఇచ్చి మిగతా మతాలను కొంచెం తక్కువగా చూస్తే తప్పా?

తప్పేమీ లేదు. సెక్యులర్‌ రాజ్యం ఇలాగే ఉండాలి, అందులో మతాల ప్రమేయం లేక ప్రాముఖ్యం ఈ రకంగానే ఉండి తీరాలన్న నిబంధన ఎక్కడా లేదు. సెక్యులర్‌ దేశాల్లో మతాల హెచ్చుతగ్గులు ఉన్న దృష్టాంతాలు కావలసినన్ని.

‘ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌’ ఇంగ్లాండులో ఆధికార మతం. దానికి సంబంధించిన ఇద్దరు ఆర్చిబిషప్పులకు 24 గురు సీనియర్‌ బిషప్పులకు బ్రిటిషు పార్లమెంటు ఎగువ సభ అయిన House of Lords లో ప్రత్యేక స్థానాలు కేటాయించబడ్డాయి. Lords Spiritual అని పిలవబడే వీరు చట్టసభ డిబేట్లలో పాల్గొంటారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యు.కె.) లో ఇంగ్లాండుతో బాటు ఉత్తర ఐర్లండ్‌, వేల్స్‌, స్కాట్లండ్‌లు కూడా చేరి ఉన్నాయి. అక్కడ వేరే చర్చిలది ప్రాబల్యం. అయినా సరే – ‘ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌’కు చెందిన ఈ 26 మంది Lords Spiritual లు మొత్తం యునైటెడ్‌ కింగ్‌డమ్‌కి సంబంధించిన తీర్మానాల మీద ఓటు చేయగలరు. సభ కొలువుదీరగానే ఈ 26 మందిలో ఒకరు ప్రార్థనను నిర్వహిస్తారు.

బ్రిటన్‌ రాజు లేక రాణి పట్టాభిషేకాన్ని ఆర్చిబిషప్‌ (Archbishop of Canterbury) వెస్‌మినిస్టర్‌ అబ్బీ (abbey) లో జరిపిస్తారు. దేవుడి శాసనాల ప్రకారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ప్రాటెస్టంట్‌ మతాన్ని నిలబెడతానని, చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌నూ, దాని సిద్ధాంతాన్నీ, పూజా విధానాన్నీ, క్రమశిక్షణను, చర్చ్‌ పరిపాలనను పరిరక్షిస్తానని ఆ సందర్భంలో ప్రమాణం చేయిస్తారు.

అర్జంటీనా సెక్యులర్‌ దేశమే. అక్కడ అధికారిక మతమంటూ ఏదీ లేదు. కాని ఆ దేశ రాజ్యాంగం సెక్షన్‌ 2 ప్రకారం ‘ఫెడరల్‌ గవర్నమెంటు రోమన్‌ కాథలిక్‌ అపోస్తలిక్‌ మతాన్ని సపోర్టు చేస్తుంది’.

‘మలేసియా అధికారిక మతం ఇస్లాం. కాని ఇతర మతాలను కూడా పౌరులు అనుసరించవచ్చు’ అంటుంది మలేసియా రాజ్యాంగం.

The Republic of Srilanka shall give to Buddhism the foremost place, and accordingly it shall be the duty of the State to Protect and foster the “Budda Shasana” (శ్రీలంక రిపబ్లిక్‌ బౌద్ధ మతానికి ప్రప్రథమస్థానం ఇస్తుంది. ‘బుద్ధ శాసనా’న్ని రక్షించటం, పోషించటం రాజ్య బాధ్యత) అని చాటుతుంది శ్రీలంక రాజ్యాంగం.

అలాగే ‘థాయ్‌ ప్రజల్లో అత్యధికులు అనుసరించే బౌద్ధ మతాన్ని సంరక్షించి, ప్రోత్సహించటం ప్రభుత్వ కర్తవ్యం’ అని థాయ్‌లాండ్‌ రాజ్యాంగం స్పష్టం చేస్తుంది.

రుమేనియాలో మత స్వాతంత్య్రం ఉంది. కాని ‘ఆర్థోడాక్స్‌ చర్చి’కి ప్రభుత్వ బడ్జెటు నుంచి నిధులు కేటాయిస్తారు. జార్జియా రాజ్యాంగం మత స్వాతంత్య్రానికి గ్యారంటీ ఇస్తుంది. కాని ‘జార్జియన్‌ ఆర్థోడాక్స్‌ చర్చి’కి ప్రత్యేక ప్రతిపత్తినిస్తుంది.

ఫిన్లాండ్‌ తాను సెక్యులర్‌ అంటుంది. కాని అక్కడి ఎవాంజలికల్‌ లూథరన్‌ చర్చ్‌, ఫిన్నిష్‌ అర్థోడాక్స్‌ చర్చిలకు చర్చ్‌ టాక్స్‌ను రాబట్టే అధికారం ఉంది. ఆ దేశంలో వ్యాపార సంస్థలు కూడా చర్చ్‌కి పన్ను చెల్లిస్తాయి. ఆయా చర్చ్‌లలో సభ్యులైన పౌరులనుంచి వ్యక్తిగతంగా వసూలు చేసే పన్నుగాక, ప్రైవేటు కంపెనీల నుంచి రాబట్టే సొమ్మును ప్రభుత్వం రెండు ఆధికారిక చర్చ్‌లకూ పంచుతుంది.

అదేవిధంగా ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, ఐస్‌లాండ్‌, ఇటలీ, స్వీడన్‌, స్విట్జర్లండ్‌ వంటి దేశాల్లోనూ చర్చ్‌టాక్స్‌ వసూలు చేస్తున్నారు.

ఈ ఉదాహరణలను బట్టి అర్థమయ్యేదేమిటంటే – అఫీషియల్‌ మతం అంటూ దేన్నీ పేర్కొనకపోయినా, కొన్ని మతాలకు ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక హక్కులు ఇచ్చి పెద్దపీట వేయటం ప్రపంచంలో చాలా దేశాల్లో రివాజు.

మరి వాటికీ, మన సంకర సెక్యులరిజానికీ తేడా ఎక్కడ?

ఇంగ్లాండ్‌లో చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అయినా, అర్జంటీనాలో రోమన్‌ కాథలిక్‌ అయినా, రుమేనియా జార్జియాల్లో ఆర్థోడాక్స్‌ చర్చ్‌ అయినా, డెన్మార్క్‌, జర్మనీ, ఇటలీ, స్వీడన్‌, తదితర ఐరోపా దేశాల్లో వేరువేరు చర్చిలు అయినా, శ్రీలంక, థాయ్‌లాండ్‌లో బౌద్ధం అయినా ఆయా దేశాల్లో మెజారిటీ ప్రజలకు విశ్వాసం ఉన్న మతాలు! దేశ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించే మతాలకు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ప్రాధాన్యం ఇవ్వటం సమంజసమే, ప్రజాస్వామ్యబద్ధమే.

ఆచరణలో లోకమంతటా అనుసరిస్తున్న ఈ సాధారణ సూత్రాన్ని ఇండియాలోనూ మన్నించదలిస్తే ఈ దేశంలో నూటికి 80 మంది అనుసరించే హిందూ మతానికి గౌరవస్థానం ఇవ్వాలి. దాని ప్రయోజనాల రక్షణకు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మనం చేసిందేమిటి?

‘ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది ఇంకోదారి’ అన్నట్టు ప్రపంచంలో మన రూటే వేరు. 20 శాతానికి ప్రాతినిధ్యం వహించే మైనారిటీ మతాలను నెత్తిన పెట్టుకుంటాం. ప్రత్యేక హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు ఉదారంగా సమకూరుస్తాం! ప్రజల్లో నూటికి 80 మందికి విశ్వాసం ఉన్న అతిప్రధాన, అతి పెద్ద మతాన్ని మాత్రం కాళ్లకింద తొక్కేస్తాం. మిగతా ప్రపంచ దేశాలు ప్రధాన మతానికి ప్రత్యేక గౌరవం ఇస్తూ అనుకూల వివక్ష చూపుతూంటే మనం మాత్రం ప్రధాన మతాన్ని ప్రత్యేక అగౌరవం చేస్తూ, శాయశక్తులా సతాయిస్తూ ప్రతికూల వివక్షను కనపరుస్తున్నాం.

ఈ విచిత్ర మనస్తత్వం మనకు ఎవరి నుంచి సంక్రమించింది? ఈ వికృత వంకర అవ్యవస్థ ఎలా వచ్చి పడింది? పైకి సెక్యులరిజం కొంగజపం చేస్తూనే కరకు మతతత్వాన్ని పెంచిపోషించి, జాతి మూలాలను వేటువేసే నికృష్ఠ రాజకీయ సంస్కృతి ప్రాచీన భరత భూమికి ఎలా దాపురించింది?

దీన్ని అర్థం చేసుకోవాలంటే మొదట సెక్యులరిజం అనేది ఏ పరిస్థితుల్లో ఎలా పుట్టిందన్నది గమనించాలి. అసలు భావన ఏమిటో తెలిస్తేగానీ దానిని మన మహానుభావులు ఎలా భ్రష్ఠు పట్టించారన్నది తేటపడదు.

క్రీస్తుశకం 4వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకూ ఐరోపా దేశాలలో క్రిస్టియన్‌ చర్చికీ, రాజ్య వ్యవస్థకూ నడుమ గట్టి బంధం ఉండేది. ప్రతి దేశంలోనూ క్రైస్తవానికి శాఖ అయిన ఏదో ఒక చర్చితో అక్కడి ప్రభుత్వానికి లంకె ఉండేది. ప్రభుత్వం అనేది చర్చి యొక్క సెక్యులర్‌ అంగంగా వర్ణించబడేది. పవిత్ర రోమన్‌ సామ్రాజ్యం అనేది ఆవిర్భవించింది మొదలుకొని చర్చి ఆధిపత్యం కొత్తకొత్త రాజ్యాలకు విస్తరించడానికి ప్రభుత్వాలు తోడ్పడేవి. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ప్రభువులు చేసే దుర్మార్గపు దండయాత్రలకూ, జయించిన కొత్త ప్రాంతాల్లో విచ్చలవిడి దోపిడీలకూ, రాక్షస కృత్యాలకూ చర్చి వత్తాసునిచ్చేది. దానికి ప్రతిఫలంగా సమాజంలో చర్చిని ధిక్కరించే పౌరులను పరమకిరాతంగా పీడించి, చిత్రవధ చేసే పుణ్యకార్యాన్ని ప్రభుత్వాలు చేసిపెట్టేవి. వందేళ్ల యుద్ధాలు, రెండొందలు ఏళ్ల యుద్ధాలు అంటూ ‘ఏకైక సత్యమతాన్ని’ వ్యాప్తి చేసే నెపంతో మతం, రాజ్యం కుమ్మక్కయి యూరప్‌లో ఎన్ని ఘాతుకాలు చేశాయో, సామూహిక జన సంహారాలకు ఎలా పాల్పడ్డాయో, అవిశ్వాసులు, మంత్రగత్తెలు విగ్రహారాధకులు, అన్న అభియోగాలతో ఎన్ని లక్షలమందిని సజీవంగా తగలబెట్టి, దారుణంగా పొట్టన పెట్టుకున్నాయో నెత్తురు ఏరులుగా పారిన ఐరోపా అంధయుగ అంధకార చరిత్ర చెబుతుంది.

పౌరుల ప్రాపంచిక జీవితాన్ని పర్యవేక్షించి, కంట్రోలు చేయడం మాత్రమే కాదు! పైలోకంలో వారికి ముక్తిని కలిగించటమూ ప్రభుత్వ బాధ్యతేనట! ఆ ముక్తికి కీలకమేమో చర్చి చేతుల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు చర్చి ప్రకటించే ప్రవర్తన నియమాలను ఎవరైనా ఉల్లంఘించినా, ఎదురు తిరిగినా వారిని వెలివేసి, స్వర్గలోకపు గేట్లను వారికి చర్చ్‌ మూసేస్తుంది. ఆ తరువాత వారిని సజీవదహనం చెయ్యటమా, చిత్రహింసలు పెట్టి ఖైదు చేయటమా, చిత్రవధ చేయటమూ అనేది రాజ్యవ్యవస్థ బాధ్యత. అదేవిధంగా క్రీస్తును చంపిన పాపాత్ములు అని చర్చి ముద్రపడిన యూదులను, చర్చి జులుంను అంగీకరించని ఇతర వర్గాలను వేటాడటం, భయానక అఘాయిత్యాలకు గురిచేయటం ఏలినవారి డ్యూటీ. ఆ ప్రకారం చర్చి సేవ చేసి, అన్యమతాలను నిర్మూలించడంలో సహాయపడినంత వరకూ రాజులు ఎన్ని మహాపాపాలకు ఒడిగట్టినా చర్చి సమర్థించేది.

క్రైస్తవంలోకి బలవంతంగా మార్చబడని ప్రాంతాలు, సమూహాలు ఐరోపాలో మిగిలినంతవరకూ చర్చికీ, రాజ్యానికీ మధ్య అపవిత్ర అనుబంధం, ఉభయ తారకంగా కొనసాగింది. క్రైస్తవేతరులను ఊచకోత కోయడానికి, దారుణంగా హింసించి బలవంతంగా క్రైస్తవంలోకి మార్పించడానికి రాజులు కత్తులు దూశారు. నరకలోకపు అగ్నికుండాల నుంచి ‘పాగన్ల’ను రక్షించడానికీ, వారి ఆత్మలను ఉద్ధరించడానికే అదంతా చేస్తున్నట్టు వారు బుకాయించేవారు. ‘గొప్ప పని చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు’ అని క్రైస్తవ మత గురువులు శ్లాఘించేవారు. ఇలా రాజరికమూ, క్రైస్తవమూ చేతులు కలిపి తమ ప్రాబల్యాన్ని, సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోయే క్రమంలో ఘర్షణలు తలెత్తేవి. విరోధం కన్నా సహకారం శ్రేయస్కరం. కాబట్టి తాత్కాలిక సంక్షోభాలను ఏదో ఒకటి చేసి గట్టెక్కేవారు.

15వ శతాబ్దం చివరికల్లా మొత్తం ఐరోపా క్రైస్తవమయం అయిపోయింది. తమ అధికారాన్ని, ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చర్చితో అవసరం రాజులకు తీరింది. చర్చి కబంధ హస్తాల నుంచి బయటపడాలన్న ఆరాటం రాజ్యానికి మొదలైంది. 16వ శతాబ్దంలో చర్చిపై తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి. క్రిస్టియానిటీ అనేక తెగలు (sects) గా చీలిపోయింది. సంస్కరణ పేర చీలిపోయిన తెగలు మరీ దుర్మార్గంగా చెలరేగాయి. ఒకదేశంలో ప్రభుత్వం ఒక క్రైస్తవ తెగ కొమ్ముగాసి వేరొక తెగను క్రూరంగా అణచివేస్తే.. ఆ వేరొక తెగను ఇంకో రాజ్యం ఆదరించి, దానికి గిట్టని తెగను వేటాడేది. దాంతో యూరోప్‌ ఖండం అంతటా మతం పేరిట భయానక రక్తపాతం జరిగింది. దేశాల నడుమ మత యుద్ధాలు ముమ్మరమయ్యాయి.

అదృష్టవశాత్తూ ఆ కాలపు యూరోపియన్‌ మేధావులకు, తత్వవేత్తలకు గ్రీస్‌, ఇండియా, చైనా దేశాల ప్రాచీన సంస్కృతులతో పరిచయం కలిగింది. ఆ విశిష్ట నాగరికతలలోని మానవతావాదం, హేతువాదం, విశ్వజనీన దృక్పథం వారిని గాఢంగా ప్రభావితం చేశాయి. క్రిస్టియానిటీలో జడలు కట్టిన మూఢత్వం మీద, దాని అభివృద్ధి నిరోధక, అశాస్త్రీయ, అనాగరిక పోకడల మీద బుద్ధిజీవులు తిరగబడ్డారు. తర్క పరీక్షకు నిలబడే దమ్ములేక, మూఢత్వపు చీకట్లను చీల్చిన జ్ఞాన, విజ్ఞాన వెలుగు పుంజాలకు తాళలేక మహామూర్ఖ, మహాక్రూర క్రైస్తవం కుప్పకూలింది. 18 వ శతాబ్దం ఆఖరులో ఫ్రెంచి విప్లవంతో క్రైస్తవ మతాధిపత్య పతనం వేగం పుంజుకుంది.

ఇదీ యూరప్‌ ఖండంలో సెక్యులరిజం ఆవిర్భావానికి నేపథ్యం. 19వ శతాబ్దంలో ఐరోపాలోని ప్రతిదేశం చర్చి భల్లూకపు పట్టునుంచి బయటపడింది. పరలోకంలో పౌరుల ఆత్మలకు ముక్తికోసం ప్రభుత్వం పాటుపడాల్సిన పనిలేదు. ఎవరి ముక్తి సంగతి వారు ఆలోచించుకోగలరు. ప్రాపంచిక వ్యవహారాలు సజావుగా నడిచేటట్టు, సమాజపు కట్టుబాట్లు సరిగా ఉండేటట్టు, ప్రజల అవసరాలు తీరేటట్టు, శాంతిని, భద్రతను రాజ్యం కాపాడితే చాలు. రాజ్యవ్యవస్థ మీద మత జోక్యానికి వీలులేదు. ఈ నూతన ఆలోచనాధార ఆసరాతో చర్చి బంధనాలను తెంచుకొని కొత్తరూపు, కొత్త చూపు సంతరించుకున్న రాజ్యవ్యవస్థకు ‘సెక్యులర్‌ స్టేట్‌’ అని పేరు. మతం, రాజ్యం వేరువేరు; దేని దారి దానిది, దేని కార్యక్షేత్రం దానిది అన్న నవీన పాశ్చాత్య చింతనకు ‘సెక్యులరిజం’ అని వాడుక.

– ఎం.వి.ఆర్‌.శాస్త్రి

(జాగృతి సౌజన్యంతో)

(ఈ వ్యాసం మొదట 20 జూలై 2018నాడు ప్రచురితమైంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here