Home Telugu Articles సెక్యులర్ ముసుగులో భారతీయ విద్యావ్యవస్థ కు చెదలు

సెక్యులర్ ముసుగులో భారతీయ విద్యావ్యవస్థ కు చెదలు

0
SHARE

కమలాక్షునర్చించు కరములు కరములు..
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు..
శ్రీ రఘురామ చారు తులసీదళ దామ..
సారపు ధర్మమున్‌ విమల సత్యము..

పాతతరం వాళ్లు చిన్నప్పుడు హైస్కూలు తెలుగు వాచకాల్లో చదివి, ఇప్పటికీ నెమరు వేసుకుంటున్న పద్యాలివి.

ఆ కాలాన సోషల్‌ స్టడీస్‌లో ఇండియాను ‘హిందూదేశం’ అనేవారు. గుప్తుల కాలపు స్వర్గయుగం గురించి, బహమనీ సుల్తాన్ల మీద కృష్ణదేవరాయలు, అక్బర్‌ మీద రాణాప్రతాప్‌, ఔరంగజేబు మీద ఛత్రపతి శివాజీ చేసిన యుద్ధాల గురించి పాఠాలు చెప్పేవారు. రాముడి నుంచి కృష్ణుడి నుంచి నేర్చుకోవలసినవేమిటో మోరల్‌ క్లాస్‌ మాస్టారు బోధించేవాడు.

ఇందిరాగాంధి రాకాసి పాలనలో దేశానికి ‘సెక్యులర్‌’ దయ్యం పట్టాక ఆ పాఠాలన్నీ పాపాలు అయిపోయాయి. తన పాపిష్టి అధికారాన్ని గట్టి చేసుకోవడం కోసం కమ్యూనిస్టులతో ఇందిరమ్మ కుదుర్చుకున్న బేరంలో భాగంగా విద్యారంగాన్ని, యూనివర్సిటీలను, అకడమిక్‌ సంస్థలను వామపక్షులకు ధారాదత్తం చేశాక జాతీయ విద్యావ్యవస్థ సర్వభ్రష్టమైంది. నూరుల్‌హసన్‌ అనే కరకు ముస్లిం మతవాదిని ఏరికోరి కేంద్ర విద్యామంత్రిగా నియమించింది మొదలుకుని చదువులకు సెక్యులర్‌ చెదలు పట్టాయి. విద్యావిధానానికి ఎర్రకామెర్లు కమ్మాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి జాతీయవీరులు మతఛాందస ‘మైథాలజీ’లో కల్పిత పాత్రులయ్యారు. శత సహస్రాబ్దాలుగా భారతజాతికి ప్రాణం, ప్రణవం, గమ్యం, మార్గం అన్నీ అయిన రామాయణ, భాగవత, భారతాలు పనికిమాలిన పుక్కిటి పురాణాలైపోయాయి. భారతావనికి దారిదీపమైన భగవద్గీత ఛాందస మతగ్రంధమై, సెక్యులర్‌ విద్యకు నిషిద్ధమైంది.

అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా లాంటి అనేక పాశ్చాత్య దేశాల్లో వేదాలమీద, వేదాంగాలమీద, వేదవిజ్ఞానం మీద, వైదిక శాస్త్రాల మీద, భారత రామాయణాల మీద, భారతీయ ఆధ్యాత్మిక తత్వం మీద ఎన్నో యూనివర్సిటీల్లో విస్తృత అధ్యయనాలు, లోతైన పరిశోధనలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ప్రత్యేక డిపార్టుమెంట్లు, ఫౌండేషన్లు వాటిమీద పనిచేస్తున్నాయి.

కాని యావత్ప్రపంచం నెత్తిన పెట్టుకుని గౌరవిస్తున్న వేదవిజ్ఞానానికి, హిందూ మతతత్వ బోధలకు అవి పుట్టిన భారతదేశంలో మాత్రం నిలువనీడ లేదు. విద్యా విధానంలో వాటికి సూది మోపినంత చోటు లేదు. సెక్యులర్‌ విశ్వవిద్యాలయాల్లో హిందూమత అధ్యయనం నేరం.

”పూర్వం యుగొస్లావియాలో నా చిన్నప్పుడు స్కూలు పుస్తకాల్లో రామాయణ, మహాభారతాల గురించి చదివినట్టు గుర్తు. ఇండియాలోని స్కూళ్లలో ఇప్పుడు వాటి గురించి చాలా చెబుతారనుకుంటా?” అని ఒక విదేశీ కంప్యూటర్‌ సైంటిస్టు హిందూమత అభిమాని అయిన పాశ్చాత్య మేధావి మైకేల్‌ డానినోను అడిగాడట.

”అలాంటి సాహసం ఎవరూ చెయ్యలేరు. భారత రామాయణాలను స్కూలు పాఠాల్లో ఎవరన్నా పెట్టబోతే వాళ్లని యాంటీ సెక్యులర్‌, కమ్యూనలిస్టు అని కుళ్లబొడుస్తారు” అని తాను జవాబిచ్చినట్టు మైకేల్‌ ఈ మధ్య ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వ్యాసంలో రాశాడు.

భారతీయతకు ఆత్మ అయిన హైందవాన్ని భారతీయ విద్యనుంచి గెంటివేసి, చదువుల మొదలును చేతులారా నరికివేసే ఖర్మ మనకెందుకు పట్టింది? యోగ, ఆయుర్వేదం, వేదగణితం, వేద విజ్ఞానం వంటి సాంప్రదాయక శాస్త్రాలు, వాటిలోని వైజ్ఞానిక దృక్పథాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని విజ్ఞులు సూచించడమే మహాపరాధం; విద్యను కాషాయం చేసే దుర్మార్గం అని కుహనా మేధావుల మంద కందిరీగల్లా మీదపడే దౌర్భాగ్యానికి మూలహేతువేమిటి?

కుహనా సెక్యులర్‌ పైత్యం ముదిరాక సమస్య మరీ విషమించినప్పటికీ, అసలు దెబ్బ రాజ్యాంగాన్ని రాసేటప్పుడే పడింది. విదేశీ దాస్యం తొలిగి, సర్వస్వతంత్రమైన జాతికి దాని సాంస్కృతిక మూలాలను, వైజ్ఞానిక వారసత్వాన్ని పటిష్ట పరిచే విద్యావిధానం ఉండాలన్న పట్టుదల దురదృష్టవశాత్తూ మన రాజ్యాంగ కర్తలకు లేకపోయింది. మతాలకు అతీతంగా యావద్భారత జాతికి గర్వించదగ్గ వారసత్వమైన వైదిక విజ్ఞానాన్ని, దానిలోని శాఖోపశాఖలను, వాటన్నిటికీ మూలకందమైన హిందూమతంలోని సార్వకాలీన, విశ్వజనీన సూత్రాలను విద్యా సంస్థల్లో అధ్యయనం చేయించేందుకు వారు ప్రత్యేక శ్రద్ధ కనపరచలేదు. ఇస్లామిక్‌, క్రైస్తవ దురాక్రమణలకు పూర్వం వలె సాంప్రదాయిక విద్యల బోధన, పరిశోధనలకు ప్రభుత్వ పరంగా భూరి సహాయం అందించి, ప్రాచీన కాలంలో వలె భారతదేశాన్ని ప్రపంచ విద్యా కేంద్రంగా అభివృద్ధి కానివ్వాలన్న బాధ్యతా వారు మరచారు. అంతటితో ఊరుకోలేదు. పరిపరి విధాల వ్యాఖ్యానాలకూ, వక్రభాష్యాలకూ ఆస్కారం ఇచ్చే రీతిలో రాజ్యాంగంలో 28వ అధికరణాన్ని చేర్చారు.

  1. Freedom as to attendance at religious instruction or religious worship in certain educational institutions.

1) No Religion instruction shall be provided in any educational institution wholly maintained out of state funds.

2) Nothing in clause (1) shall apply to an educational institution which is administered by the state but has been established under any endowment or trust which requires that religious instruction shall be imparted in such an institution.

3) No person attending any educational institution recognised by the state or receiving aid out of state funds shall be required to take part in any religious instruction or to attend religious worship… unless to such person or his guardian has given consent thereto.

”కొన్ని రకాల విద్యాసంస్థలలో మతపరమైన బోధన లేక మతారాధనలలో పాల్గొనే విషయంలో స్వాతంత్య్రం” అని వర్ణించిన 28వ అధికరణంలో చెప్పిందేమిటంటే-

1) పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో మత బోధన మొత్తానికే నిషిద్ధం.

2) ఏదైనా ధర్మనిధి లేక ట్రస్టు మతబోధన నిమిత్తం ఏర్పరచిన విద్యా సంస్థను ప్రభుత్వమే నడుపుతున్న పక్షంలో అలాంటి విద్యా సంస్థకు పై క్లాజులో చెప్పింది వర్తించదు.

3) ప్రభుత్వ గుర్తింపు పొందిన లేక గవర్నమెంటు ఎయిడ్‌ పొందుతున్న ఏ విద్యా సంస్థలోనూ ఏ ఒక్కరికీ వారికి ఇష్టం లేకుండా మతబోధనలో, లేక మతారాధనలో పాల్గొనమని బలవంత పెట్టకూడదు.

ఈ అధికరణాన్ని దానివరకూ చూస్తే అభ్యంతరకరమైనది ఏదీ కనిపించదు. ఇందులో నిషేధించింది విద్యాసంస్థల్లో మత బోధనను, అంటే మతపరమైన సూత్రాలనూ, సిద్ధాంతాలనూ, కర్మకాండలనూ బళ్లో విద్యార్థులకు నూరిపోయడాన్ని! మత సంబంధమైన గ్రంథాలనూ, వాటిలో ఈ కాలానికి పనికొచ్చే విషయాలనూ, వైజ్ఞానిక అంశాలనూ తాత్విక లేక శాస్త్రీయ జిజ్ఞాసతో అధ్యయనం చేయడానికి ఏ అభ్యంతరమూ ఉండనవసరం లేదు. మత బోధనను లేక మతశిక్షణను కూడదని చెప్పినంత మాత్రాన మతాల అధ్యయనాన్ని వద్దన్నట్టు కాదు. అటువంటి ఉద్దేశం రాజ్యాంగ కర్తలకు లేదు. 28వ (ముసాయిదా దశలో దాని నెంబరు 22) అధికరణాన్ని ఆమోదించే ముందు రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగిన ఈ కింది చర్చే దానికి రుజువు :

పండిట్‌ లక్ష్మీకాంత మైత్ర : గౌరవ సభ్యుడిని నేనొక ప్రశ్న వేయవచ్చా? ఉదాహరణకు కోల్‌కతాలో సంస్కృత కళాశాలలాగా మొత్తం ప్రభుత్వ యాజమాన్యంలోని ఓ కాలేజి ఉంది. అందులో వేదాలు బోధిస్తారు. స్మృతులు బోధిస్తారు. గీత బోధిస్తారు. ఉపనిషత్తులు బోధిస్తారు. అలాంటి సంస్కృత విద్యా సంస్థలు బెంగాల్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలో మతబోధన చేయకూడదని మీరు 22(1) అధికరణంలో నిర్దేశించారు. మరి నేను చెప్పిన సంస్థలు పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి. మరి వాటిలో వేదాలను, స్మృతులను, శాస్త్రాలను, ఉపనిషత్తులను బోధించటం కూడా మతబోధన కిందికే వస్తుందా? అలా అయితే ఆ సంస్థలన్నిటినీ మూసివేయాల్సి వస్తుంది.

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ : నా మిత్రుడు మైత్రగారు ప్రస్తావించిన సంస్థల స్వభావమేమిటో నాకు కచ్చితంగా తెలియదు. కాబట్టి చెప్పటం కష్టం.

పండిట్‌ లక్ష్మీకాంత మైత్ర : ఉదాహరణకు ప్రభుత్వ సంస్కృత కళాశాలల్లో భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు వగైరాల సంగతి తీసుకోండి.

బి.ఆర్‌.అంబేడ్కర్‌ : మతపరమైన బోధన వేరు. పరిశోధన, అధ్యయనాలు వేరు. ఆ రెండూ పూర్తిగా భిన్నమైనవి. మతబోధన అంటే అర్థం ఇది. ఇస్లాం మతానికి సంబంధించినంతవరకూ మతబోధన అంటే ఒకే ఒక దేవుడిని నమ్మటం. మహమ్మదే చివరి ప్రవక్త అని నమ్మటం. ఇంకా ఇంకా.. దీన్ని మనం పిడివాదపు మత సిద్ధాంతం (dogma) అంటాం. మత సిద్ధాంతానికీ మత అధ్యయనానికీ మధ్య చాలా తేడా ఉంది.

వైస్‌ ప్రెసిడెంట్‌ (హరేంద్ర కుమార్‌ ముఖర్జీ) : ఒక్క నిమిషం. కోల్‌కతా యూనివర్సిటీలో కాలేజీల ఇన్స్‌పెక్టర్‌గా ఉండగా నేను సంస్కృత కళాశాలను తనిఖీ చేసేవాడిని. పండిట్‌ మైత్రగారికి తెలుసు. అక్కడ విద్యార్థులు యూనివర్సిటీ కోర్సు పుస్తకాలతో బాటు సంస్కృత సాహిత్యాన్ని, సంస్కృతంలోని పవిత్ర గ్రంథాలను స్టడీ చేసేవారు. అది మతబోధన అని ఎప్పుడూ అనుకోలేదు. సంస్కృతిని అధ్యయనం చేయడంగానే దాన్ని భావించాం.

పండిట్‌ లక్ష్మీకాంత మైత్ర : అక్కడ జరిగేది రిసెర్చి కాదు. అది మతానికి సంబంధించిన బోధన. మతశాఖల అధ్యయనం. నేనడిగేది ఏమంటే గీతను, ఉపనిషత్తులను బోధించటం మతబోధనగా భావించబడుతుందా? ఉపనిషత్తులను వ్యాఖ్యానించటం రిసెర్చికి సంబంధించిన విషయం కాదు.

వైస్‌ ప్రెసిడెంట్‌ : అది విద్యార్థులకు బోధించటమే అవుతుంది. సంస్కృత కళాశాలలో ఒక ముస్లిం విద్యార్థి ఉన్న వైనం నాకు తెలుసు.

హెచ్‌.వి. కామత్‌ : ఒక మత సముదాయం పూర్తిగా ఆ మత సముదాయానికి చెందిన విద్యార్థులకు మాత్రమే నడిపే స్కూళ్లలో మతబోధన కంపల్సరీ కాకూడదని నా మిత్రుడు డాక్టర్‌ అంబేడ్కర్‌ అభిప్రాయమా?

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ : అది వారి ఇష్టం. కంపల్సరీ చేయాలా వద్దా అనేది వారే నిర్ణయించుకోవాలి. ఇక్కడ మనం చెప్పేదల్లా స్కూలును ఏ మతం వారు నడుపుతున్నారో ఆ మతానికి చెందని పిల్లలకు ఆ చదువును కంపల్సరీ చేసే హక్కు ఉండకూడదన్నదే.

ప్రొఫెసర్‌ శిబ్బన్‌ లాల్‌ సక్సేనా : ‘మత బోధన’ గురించి మీరు ఇప్పుడు ఇచ్చిన వివరణను రాజ్యాంగంలో చేర్చాలి.

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ : అలాంటి సందర్భాలు తమ ముందుకు వచ్చినప్పుడు కోర్టులు నిర్ణయిస్తాయి లెండి.

(https://indiankanoon.org/doc/1745468/)

అరుణారాయ్‌కీ, భారత ప్రభుత్వానికి నడుమ దాఖలైన రిట్‌పై 2002 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.ఎం.ధర్మాధికారి పైన ఇచ్చిన రాజ్యాంగ సభ చర్చపై ఇలా వ్యాఖ్యానించారు.

Constitutional debate and the concluding remark of Dr.B.R. Ambedkar give an indication of the framers of the Constitution. Article 28 (1) therefore does not prohibit introduction of study of religions in the state educational institutions including those wholly or partly aided by the state. As a matter of fact, study of religions has been considered accessary for the unity and integrity by India.

(https://indiankanoon.org/doc/623978/)

రాజ్యాంగ సభలో జరిగిన చర్చ, దాని చివరలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రిమార్కు రాజ్యాంగకర్తల అంతరంగాన్ని సూచిస్తాయి. కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలలో మతాల అధ్యయనాన్ని ప్రవేశపెట్టడాన్ని 28(1) అధికరణం నిషేధించదు. పూర్తిగానో, పాక్షికంగానో ప్రభుత్వ ఎయిడ్‌తో నడిచే విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుంది. వాస్తవానికి మతాలను అధ్యయనం చేయటం భారతదేశ ఐక్యతకు, సమగ్రతకూ అవసరం.

అక్షర లక్షలు విలువచేసే వాక్కులివి. జడ్జిగారన్నట్టు హిందూమతాన్నీ, క్రైస్తవాన్ని, ఇస్లాంను తులనాత్మక అధ్యయనం చేసి, ఆయా మతాల మూల సిద్ధాంతాలు ఏమిటో వాటి మంచి చెడ్డలేమిటో తైపారు వేసే సదవకాశాన్ని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు కల్పిస్తే దేశానికి నిస్సందేహంగా గొప్ప మేలు జరుగుతుంది. దురదృష్టమేమిటంటే రాజ్యాంగ కర్తల ఉద్దేశం ఎంత ఉదాత్తమైనా వారు పెట్టిన రాజ్యాంగ సూత్రం నానా వక్రీకరణలకు లోనైంది. తులనాత్మక పరిశీలనకైతే దిక్కులేదు. కాని క్రైస్తవ విద్యాసంస్థలలో బైబిల్‌ను, ముస్లిం విద్యాసంస్థలలో ఖొరాన్‌ను, ఆయా మతాల సిద్ధాంతాలను ఆయా మతాల విద్యార్థులకు నూరిపోసి విద్యాబోధన పేరిట మతబోధను యథేచ్ఛగా చేయగలుగుతున్నారు.

జ్ఞాన సముద్రం, విజ్ఞాన సర్వస్వం, విశ్వజనీనం అయిన సర్వోత్కృష్ట హైందవ మతానికి, దాని శాఖోపఖశాఖలకూ, వాటికి ప్రాతిపదిక అయిన వేద వేదాంగాలకు, అనేక శాస్త్రాలకు మాత్రం ప్రభుత్వ విద్యా సంస్థలలో నో ఎంట్రీ! పోనీ క్రైస్తవ, ఇస్లాం మతాల వారి లాగా ఎయిడెడ్‌ విద్యాసంస్థలను సొంతంగా నడుపుకుందామా అంటే మెజారిటీ మతం అయిన నేరానికి ఆ భాగ్యమూ లేదు.

ఏతావతా విద్యారంగంలో హిందూమతం రెంటా చెడిన రేవడి. మతమౌఢ్యానికే తప్ప మత విజ్ఞానానికి సోకాల్డ్‌ సెక్యులర్‌ జమానాలో నో చాన్స్‌!!

– ఎం.వి.ఆర్‌.శాస్త్రి

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here