Home News ఆగ్నేయ ఆసియా దేశాలతో మన దేశ సాంస్కృతిక మైత్రి- ‘గంగ’ నుంచి ‘మాతృగంగ’ వరకు..

ఆగ్నేయ ఆసియా దేశాలతో మన దేశ సాంస్కృతిక మైత్రి- ‘గంగ’ నుంచి ‘మాతృగంగ’ వరకు..

0
SHARE

ఆగ్నేయ ఆసియా దేశాలతో మన దేశం జనవరి ఇరవై ఐదవ తేదీన జరిపిన శిఖరాగ్ర మహాసభ చరిత్ర పునరావృత్తికి సరికొత్త సాక్ష్యం! ఆగ్నేయ ఆసియా దేశాలలో భారతీయ సంస్కృతి ప్రభావం విస్తరించడం సహస్రాబ్దుల చరిత్ర.. ఈ చరిత్ర శతాబ్దులపాటు గ్రహణగ్రస్తం కావడానికి కారణం మన సరిహద్దులకు పడమటి నుంచి దాడి చేసిన బీభత్స బర్బర మూకలతో మనం సంఘర్షణ జరుపవలసి రావడం! క్రీస్తునకు పూర్వం పదునాలుగవ శతాబ్ది- కలియుగం పద్దెనిమిదవ శతాబ్ది- యవన, శక, గ్రీసు, హూణ జాతులు, కలియుగం 3813- క్రీస్తుశకం 712 -వ సంవత్సరం నుంచి అరబ్బీ, తురుష్క, మొఘలాయి, ఐరోపా జాతులవారు జరిపిన భయంకర హత్యాకాండను దమనకాండను ప్రతిఘటించడంలో మన దేశం నిమగ్నమైంది! భారత సమ్రాట్ పుష్యమిత్రుడు యవన దురాక్రమణను నిరోధించడంతో ఈ ప్రతిఘటన మొదలైంది, మహాత్మాగాంధీ వరకు నేతాజీ సుభాష్ చంద్రవసు- బోసు – వరకు కొనసాగింది. ఇలా మన దృష్టి మొత్తం ‘పడమటి’ దురాక్రమణ వైపు కేంద్రీకృతమై ఉండిన సమయంలో ఆగ్నేయ ఆసియా దేశాలు రాజకీయంగా మన దేశానికి దూరంగా జరిగాయి. కానీ సాంస్కృతికంగా ఆగ్నేయ ఆసియా దేశాల ప్రజలు మన దేశ ప్రజలతో సమాన భూమికపై విలసిల్లగలగడం 1947 వరకు కొనసాగిన చరిత్ర! గౌతమబుద్ధుడు కలియుగం 1215- క్రీస్తునకు పూర్వం 1887వ సంవత్సరంలో జన్మించాడు! ఈ దివ్యాంశ సంభూతుడు క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్ది – కలియుగం ఇరవై ఆరవ శతాబ్ది -లో జన్మించాడని బ్రిటన్, ఐరోపా చరిత్రకారులు అబద్ధాలను ప్రచారం చేయడం వేరే వైపరీత్యం… బుద్ధునికి పూర్వం, బుద్ధుని తరువాత దాదాపు రెండు వేల ఏళ్ల వరకు ఆగ్నేయ ఆసియా దేశాలలో వేదమతాలు విలసిల్లాయి. ఆ తరువాత మన దేశం నుంచి బౌద్ధమతం విస్తరించింది. తరువాతి కాలంలో ‘ఇండోనేసియా’- యవ, బాలి, సుమిత్ర వంటి ద్వీపాల సమూహం వంటి దేశాలలో ఇస్లాం, ఫిలిప్పీన్స్ వంటి చోట్ల క్రైస్తవం ప్రధాన మతాలయ్యాయి! హైందవ సంస్కృతి మాత్రం అధికాధిక ఆగ్నేయ ఆసియా దేశాలలో చెక్కుచెదరలేదు! మతం బౌద్ధం.. సంస్కృతి హైందవం! మతం ఇస్లాం, సంస్కృతి హైందవం! మతం క్రైస్తవం, సంస్కృతి హిందుత్వం- ఇదీ ఆగ్నేయ ఆసియా దేశాల జన జీవనం.. మన దేశానికీ ఆగ్నేయ ఆసియా దేశాలకూ మధ్య గల సాంస్కృతిక సమానత్వం ఇదీ!

ఆగ్నేయ ఆసియా దేశాలతో మన దేశం జరిపిన శిఖర సమావేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ప్రధాన అంశం ఇదీ.. భాషా మత వాణిజ్య రాజ్యాంగ వ్యవస్థలకు, సార్వభౌమ దేశాల సరిహద్దులకు అతీతంగా ఈ మన దేశానికీ ఆగ్నేయ ఆసియా దేశాలకూ మధ్య ఈ సమాన సాంస్కృతిక తత్త్వం విస్తరించి ఉందన్నది నరేంద్ర మోదీ ధ్వనింపజేసిన చారిత్రక వాస్తవం! బౌద్ధం, రామాయణం, మహాభారతం, పంచభూతాలను పవిత్ర తత్త్వాలుగా భావించడం మన దేశంలోను ఆగ్నేయ ఆసియా దేశాలలోను సమానం! మన విదేశ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఈ సత్యాన్ని ‘శిఖర సభల’ సందర్భంగా పునరుద్ఘాటించింది, ధ్వనింపజేసింది! ప్రపంచంలోని అతి పెద్ద హైందవ సాంస్కృతిక మందిరం అంగ్‌కార్‌వట్ – అంకురవటం- కంబోడియాలో ఉంది! సహస్రాబ్దులకు పూర్వం ‘కౌండిన్యుడు’ అన్న వేదపండిత యువకుడు ‘కాంభోజ’కు సాంస్కృతిక యాత్ర చేయడం చరిత్ర. ‘కాంభోజ’, ‘కంపూచియా’, ‘కంబోడియా’ అన్నవి పరిణామక్రమంలోని పేర్లు! కలియుగం ముప్పయి మూడవ శతాబ్ది- క్రీ.శ. పన్నెండవ శతాబ్ది- నాటి క్షీర -క్షిమేర్- కుమెర్- వంశం రాజు రెండవ సూర్యవర్మ, ఏడవ జయవర్మ దశాబ్దుల తరబడి శ్రమించారు, ‘అంగ్‌కార్‌వట్’ను నిర్మించారు. పదిహేను వందల యాభయి మీటర్లు పొడవు, పదునాలుగు వందల మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఆలయ వాటికలో ప్రధానమైనది విష్ణుదేవుని మందిరం! కలియుగం ముప్పయవ శతాబ్ది నుంచి ముప్ఫయి ఆరవ శతాబ్ది వరకు ‘అంగ్‌కార్’ నగరం కంబోడియా రాజధాని కూడా! క్రీస్తుశకం 1863వ సంవత్సరం నుంచి ‘ఫ్రాన్స్’ దురాక్రమణకు గురి అయిన కంబోడియా 1954లో మళ్లీ విముక్తమైంది. 1975 నుంచి 1991 వరకు వివిధ వర్గాల కమ్యూనిస్టుల పాలనలో మగ్గిన కంబోడియా కనీవినీ ఎరుగని భయంకర బీభత్సకాండకు బలైంది. కమ్యూనిస్టుల నిరంకుశ దమనకాండ 1975వ 1979వ సంవత్సరాల మధ్య పదిహేను లక్షలమంది కంబోడియా ప్రజలను హత్య చేయడం చెరగని భయంకర స్మృతి! ఈ హత్యాకాండకు ఆధ్వర్యం వహించిన ‘పోల్‌పాట్’ అన్న కమ్యూనిస్టు నియంత నరరూప పిశాచంగా చరిత్రకెక్కాడు! ఆగ్నేయ ఆసియా దేశాలు యాబయి ఏళ్ల క్రితం సమాఖ్యగా ఏర్పడడానికి ప్రధాన కారణం ‘కమ్యూనిస్టు’ నియంతృత్వ వ్యవస్థలు ఏర్పడకుండా నిరోధించడం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం..

మెకాంగ్ నది

ఈ లక్ష్యంతో ‘ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య’- అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ – ఆసియాన్ – ఏర్పడినపుడు కంబోడియా ఈ సమాఖ్యలో చేరలేదు. ‘ఇండోనేసియా, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్’ దేశాలు 1967 ఆగస్టు ఎనిమిదవ తేదీన ఈ సమాఖ్యను ఏర్పాటుచేశాయి. 1975లో కమ్యూనిస్టు కబంధ బంధంలో చిక్కిన కంబోడియాలో 1991లో ప్రజాస్వామ్య వ్యవస్థ పునఃప్రారంభమైంది. 1999లో ‘కంబోడియా’ ఆసియాన్‌లో చేరింది! థాయ్‌లాండ్- సయామ్ రాజధాని బ్యాంగ్‌కాక్‌లో జరిగిన సమావేశంలో ‘ఆసియాన్’ ఏర్పడడంవల్ల ఈ సమాఖ్యకు ‘బ్యాంగ్‌కాక్ సంఘటన’ అన్నది పర్యాయపదం! బ్రూనీ, బర్మా- మ్యాన్‌మార్- లావోస్, వియత్నాంల చేరికతో ‘ఆసియాన్’ పది దేశాల వాణిజ్య ఆర్థిక సంఘటనగా మారింది! ఈ ఆర్థిక సంఘటన సమగ్రరూపం ధరించేనాటికి చైనాలో కమ్యూనిస్టు నియంతృత్వం అంతరించి ‘కాపిటలిస్ట్’ – పెట్టుబడిదారీ నియంతృత్వ వ్యవస్థగా ఏర్పడింది! ‘ప్రపంచీకరణ’ నడికొన్న తరువాత చైనా అతి పెద్ద పెట్టుబడిదారుడుగా ఏర్పడడం, స్వేచ్ఛావాణిజ్య మార్కెట్ ఎకానమీ పరిణామక్రమం! ‘ఆసియాన్’ దేశాలపై చైనా తన ఉక్కుపిడికిలి బిగించి ఉంచడానికి ప్రపంచీకరణ మరో ప్రధాన కారణం! ఆసియాన్ దేశాలతో మన వాణిజ్య రాజకీయ దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరుగకుండా పదిహేను ఏళ్ల క్రితం వరకు చైనా నిరోధించగలిగింది. 1947 తరువాత దశాబ్దుల తరబడి మన ప్రభుత్వం తూర్పు వైపు తొంగి చూడకపోవడం సమాంతర విపరిణామం! అందువల్లనే చైనా ఆగ్నేయ ఆసియాలోకి చొరబడి చొచ్చుకొని రాగలిగింది. బ్రిటన్ వ్యతిరేక సాయుధ స్వాతంత్య్ర సమరం జరిపిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బర్మా నుంచి జపాన్ వరకు ప్రాంతాలను వ్యూహాత్మకంగా అనుసంధానం చేయగలిగాడు! మన దేశానికి ఈ ప్రాంతాలలోను అతి ప్రాచీన రాజకీయ సంబంధాలకు అది మొదటి పునరుద్ధరణ. 1992లో ‘భారత – ఆసియాన్ భాగస్వామి కూటమి’ ఏర్పడడం రెండవ పునరుద్ధరణ! ‘ఆసియాన్’ భారత్ భాగస్వామ్యానికి పాతికేళ్లు నిండిన సందర్భంగా ఇప్పుడు ఢిల్లీలో ఈ శిఖర సభ జరిగింది. ఈ పది దేశాల ప్రభుత్వ అధినేతలు మన గణతంత్ర దినోత్సవానికి అతిథులుగా హాజరుకావడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన అపూర్వ పరిణామం.. ఒక దేశపు రాజ్యాంగ దినోత్సవానికి, వార్షికోత్సవానికి పది విదేశాల ప్రభుత్వాధినేతలు హాజరు కావడం ప్రపంచంలో బహుశా ఇది మొదటిసారి. అందువల్ల అంతర్జాతీయ సమాజం అత్యంత కుతూహలంతో తిలకించింది. చైనా నియంతలు మరింత ఆదుర్దాతో గుడ్లు మిటకరించారు.

ఆసియాన్‌తో మన బంధం 1992లో మళ్లీ దృఢపడినప్పటికీ ఆసియాన్ దేశాలలో చైనా వాణిజ్య ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. వ్యూహాత్మక ఆధిపత్యం కూడా కొనసాగిన రోజులలో చైనా ఆసియాన్ దేశాలకూ మనకు మధ్య వైరుధ్యాలను సృష్టించింది. 1998లో మనం అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరిపిన తరువాత ఆగ్నేయ ఆసియా దేశాలలో చైనా మన దేశాన్ని దుమ్మెత్తిపోసింది. భారతదేశం తయారుచేస్తున్న అణ్వస్త్రాలవల్ల ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి ప్రమాదం ఏర్పడనున్నట్టు కొన్ని దేశాలను చైనా నమ్మించగలిగింది. ‘ భారత్ – ఆసియాన్’ వాణిజ్య భాగస్వామ్యం కొన్నేళ్లు కొడిగట్టడానికి ఇది కూడా కారణం! ఇప్పటికీ వాణిజ్య రంగంలో చైనాదే ఆధిపత్యం- ఆసియాన్‌తో మన వాణిజ్యం విలువ దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు. 2020 నాటికి ఈ వాణిజ్యం ఆరు లక్షల యాబయి వేల కోట్లకు చేరగలదట! కానీ ఇప్పటికే ఆసియాన్‌లో చైనా వాణిజ్యం విలువ యాబయి మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉంది. మన వాణిజ్యం కంటే చైనా వాణిజ్యం విలువ ఎనిమిది రెట్లు ఎక్కువ! అయితే చైనాకు దాదాపు అన్ని ఆసియాన్ దేశాలతోను భూమి వివాదాలు, జల వివాదాలు కొనసాగుతున్నాయి. అందువల్ల మన దేశంతో జట్టు కట్టి చైనాను ప్రతిఘటించాలన్నది ఆసియాన్ దేశాల అంతరంగం. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాల సమష్టి వ్యూహం.. ఇండోనేసియాకు ఉత్తరంగాను వియత్నాంకు తూర్పుగాను, చైనాకు దక్షిణంగాను, ఫిలిప్పీన్స్‌కు పడమరగాను వ్యాపించిన సముద్రంలోను అనేక ద్వీపాల విషయంలో ఆసియాన్ దేశాలకూ చైనాకు మధ్య వివాదాలు ఉద్ధృతవౌతున్నాయి! టిబెట్‌లో మన బ్రహ్మపుత్రపై ఆనకట్టలను కట్టి ఈ నదీ జలాలను చైనా మళ్లించుకొంటోంది. ‘మెకాంగ్’ నదీ జలాలు ఆగ్నేయ ఆసియాకు దక్కకుండా చేయడానికి కూడా చైనా యత్నిస్తోంది..

‘మెకాంగ్’ నది టిబెట్‌లో పుట్టి, బర్మా, లావోస్, థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాం వంటి ఆగ్నేయ దేశాలలో ప్రవహించి సముద్ర సంగమం చేస్తోంది. ఈ దేశాలన్నీ ‘మెకాంగ్’ నదీ జలాలను వ్యవసాయానికి, తాగడానికి ఉపయోగిస్తున్నాయి. ఆగ్నేయ ఆసియాకు గంగానది వంటిది ‘మెకాంగ్’, అతి పెద్ద నది! థాయ్ భాషలో ‘మెకాంగ్’ అని అంటే ‘మాతృగంగ’ అని అర్థం. ‘మాతృగంగ’ థాయ్‌లాండ్‌కు మాత్రమే కాదు, పై దేశాలన్నింటికీ జీవనధార! టిబెట్ స్వతంత్రంగా ఉండినట్టయితే మెకాంగ్‌ను కాని బ్రహ్మపుత్రను కాని కొల్లగొట్టడానికి చైనాకు వీలుండేది కాదు. బ్రహ్మపుత్ర చైనాలో లేదు, టిబెట్‌లో జన్మించి మన దేశంలోకి వస్తోంది. ‘మెకాంగ్’ కూడా టిబెట్‌లోనే జన్మిస్తోంది, టిబెట్‌లో సుదీర్ఘ ప్రయాణం చేసిన తరువాత బర్మాలోకి లావోస్‌లోకి చేరడానికి ముందు యాబయి కిలోమీటర్లు మాత్రమే చైనాలో ప్రవహిస్తోంది. ఈ నదిని ‘ఆగ్నేయ’ ఆసియా ప్రజలు ‘మాతృగంగ’గా పిలవడం మన దేశంలో ఆ దేశాలకున్న సనాతన – శాశ్వత – సాంస్కృతిక బంధానికి ప్రతీక! చైనాతో ఉభయులకూ నీటి తగాదా ఏర్పడి ఉండడం మనకూ ఆగ్నేయ ఆసియా ప్రజలకూ మధ్యగల సరికొత్త సమానత్వం! ఇలా ఈ ‘మాతృగంగ’ నది ‘మెకాంగ్’ కావడానికి కారణం సంస్కృత భాష! ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని అనేక భాషలు సంస్కృత భాషకు రూపాంతరాలు. అందువల్లనే మాతృగంగ థాయ్ భాషలో ‘మెకాంగ్’గా మారింది! బౌద్ధం వ్యాపించక పూర్వం వందల ఏళ్లపాటు ఈ దేశాలలో సంస్కృత భాష పాలనా భాష, అనుసంధాన భాష, ఉన్నత విద్యా బోధనకు మాధ్యమ భాష. ఆ తరువాత సంస్కృతం, పాళీ భాష రెండూ ఆగ్నేయ ఆసియాలో విలసిల్లాయి. సాంస్కృతిక సమానత్వానికి వారధి సంస్కృత భాష!

మన దేశం అనాదిగా ఒక జాతిగా ఏర్పడి ఉంది. కలియుగం ఆరంభం నాటికి భరత వర్షమంతటా హైందవ సంస్కృతి విస్తరించి ఉంది. భరతఖండం ఈ ‘భారతవర్షం’లో ఒక భాగం! హైందవ – సనాతన- సంస్కృతితోపాటు సమీకృత రాజ్యాంగ వ్యవస్థ కూడా ఏర్పడి ఉండిన ప్రాంతం భరతఖండం! ఈ భరతఖండంలో యాబయి ఆరు రాజ్యాలు ఉండేవి. భారత – మగధ – సామ్రాజ్యపు పరమోన్నత అధికారానికి లోబడిన రాజ్యాలివి. ఇది భరత ఖండం లేదా ‘అఖండ భారత్’… ‘భరత ఖండం’ వెలుపల ఉండిన ‘భరత వర్ష’ దేశాలలో కూడా హైందవ సంస్కృతి విస్తరించి ఉండేది. కానీ ఆ దేశాలు ‘భరతఖండపు’ సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో లేవు! ‘ఆసియాన్’ దేశాలు అలాంటి ‘భరత వర్షం’లోని ప్రాచీన స్వత్రంత దేశాలు!

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352

(ఆంధ్రభూమి సౌజన్యం తో)