Home Telugu Articles జగమంతా యోగ మయం – నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం

జగమంతా యోగ మయం – నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం

0
SHARE

యోగమంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, మానసిక శక్తుల్ని ఏకం చేయడం, ఏకాగ్రతను సాధించడం, ఆత్మశక్తిని మేల్కొలపడం, సాధన చేయడం, అదృష్టాన్ని అందిపుచ్చుకోవడం! తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాల్లో యోగ దర్శనం ఒకటి. భగవద్గీతలో ప్రతి అధ్యాయాన్నీ యోగమనే అంటారు. అభ్యాసం, వైరాగ్యం ద్వారానే చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుందని పెద్దలు చెబుతారు. అభ్యాసం అంటే అవసరమైనది నేర్చుకోవడం, వైరాగ్యం అంటే అనవసరమైనదాన్ని విడిచిపెట్టడం. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. ఇప్పుడు ఎందరో మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ విషయాలను మన రుషులు ఏనాడో లోకానికి అందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రూపంలో అదే పరంపరను భారతీయులు మరోసారి ప్రపంచానికి అందిస్తున్నారు.

ఆరోగ్యప్రదాయిని

ప్రస్తుతం ఎన్నో సమస్యలు యువతను పట్టి పీడిస్తున్నాయి. బరువు పెరగడం నుంచి, ఆత్మ న్యూనత వరకు ప్రతిదీ సమస్యే. తమపై తమకు అదుపు లేకపోవడం, నమ్మకం కొరవడటం, మనోనిగ్రహం లేకపోవడం వల్లే ఈ సమస్యలు ముప్పిరిగొంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడి, గతి తప్పిన జీవన విధానం, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా శారీరక, మానసిక సమస్యలతో యువత సతమతమవుతోంది. దీర్ఘకాలంలో ఇవన్నీ క్యాన్సర్‌ లాంటి ప్రమాదకర వ్యాధులకు కారణం అవుతాయి. మూడు పదుల వయసుకే అనేక వ్యాధులు యువతను పలకరించడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి సమస్యలన్నింటికీ మన ముందు తరాలవారు పరిష్కారాన్ని చూపించారు. అదే యోగశాస్త్రం. ఇందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. 64 పురాతన కళల్లోనూ ఇది ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. యోగశాస్త్రంలో ప్రవీణులైన ఎందరో మహనీయులు తమ రంగాల్లో అద్భుతాలు సాధించడం చూస్తున్నాం. అలాంటి శాస్త్రం కనుమరుగు అవుతుందా అనుకుంటున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ… యోగమార్గం దిశగా ప్రపంచాన్ని ఉత్తేజితం చేశారు. ఐక్యరాజ్య సమితిలో ఆయన చేసిన ప్రసంగం-  అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరంభానికి నాంది పలికింది. ఇది శుభ పరిణామం. ఇదే సంకల్పంతో యావత్‌ ప్రపంచం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ మార్గాన్ని అనుసరిస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటన తరవాత ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం తెలియనివారు సైతం దీన్ని సాధన చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. భారత యువత ఇదే మార్గంలో జాగృతం కావలసిన అవసరం ఉంది.

‘యోగస్‌ చిత్తవృత్తి నిరోధః’- పతంజలి యోగ సూత్రాల్లో, యోగ స్వరూప లక్షణాలు చెప్పుకొందాం అంటూ ప్రారంభించగానే మొదటగా చెప్పే మాట ఇది. చిత్తవృత్తులను నిగ్రహించడమే యోగమని దీని అర్థం. నిజానికి యోగశాస్త్రం సర్వస్వం మనసును, శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుని మనిషి ఎలా ఎదగాలో తెలియజేస్తుంది. అంతఃకరణ చతుష్టయం అనే మాట బహుశా చాలామందికి తెలియకపోవచ్చుగాని, అవి అందరిలోనూ ఉంటాయి. ఇంద్రియం, మనసు, బుద్ధి, అహంభావం అనే ఈ నాలుగూ- మనసు చేసే వేరు వేరు పనులు. చిత్తంలో ఏర్పడే సంకల్పాలనే వృత్తులు అంటారు. మనసు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ మన ఇంద్రియాలు మనసును బయటకు లాగుతూ ఉంటాయి. మనసుపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మనిషిని పక్కదోవ పట్టిస్తూ ఉంటాయి. ఇంద్రియాల ద్వారా మనసును నిగ్రహించడమే మనో నిగ్రహం. మనలో చాలామందికి ఈ తతంగమంతా తెలియకపోయినా, ప్రతివారూ దీనికి లోనవుతూనే ఉంటారు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు. ఆహారం, పలుకు, పనులు, మనసు, శరీరం విషయంలో నిగ్రహం… ఇలా ప్రతి విషయంలో ఒక్క క్షణం ఆలోచన కలిగేలా శరీరాన్ని, మనసును అదుపు చేయడమే యోగా. యోగా అంటే ముందు మనలోకి మనం ప్రవేశించడంతో ప్రారంభమై అనంతమైన ప్రకృతిలోకి ప్రవేశించగలిగే మార్గాన్ని కల్పిస్తుంది.

భారతీయ రుషి పరంపర అనేక యోగా మార్గాలను నిర్వచించింది. ఇందులో ఆసనాల రూపంలో ఆరోగ్య సాధనను ఎవరైనా చేయవచ్చు. బరువు తగ్గడం, కొవ్వు తగ్గించడం, కోపాన్ని నియంత్రించడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుదల, ఏకాగ్రత, నిద్రలేమి నివారణ … ఇలా ఎన్నో అనారోగ్య సమస్యల కోసం యోగ మార్గాన్ని దివ్య ఔషధంగా ఎంచుకోవచ్చు. ప్రాచీన కాలంలో ప్రాథమిక స్థాయిలోనే యోగాను అభ్యసించేవారు. పరాయి పాలనలో మగ్గి, స్వతంత్రాన్ని సాధించుకోగలిగాం. కానీ స్వాధీనతను, స్వాభిమానాన్ని విస్మరించి యోగమార్గాన్ని మరుగున పడేసుకున్నాం. ఇప్పుడిప్పుడే దేశ ప్రజలు యోగ ప్రక్రియను అభ్యసిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకునే బాటలో పయనించడం ఆహ్వానించదగ్గ పరిణామం. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ దీనికి పెరిగిన ప్రాధాన్యం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. విదేశాలకు చెందిన ఎంతోమంది యోగా గురువులుగా వారివారి దేశాల్లో భారతీయ యోగాను సాధన చేయిస్తుండటం చూస్తే- ఓ భారతీయుడిగా గర్వంగా ఉంది. లాటిన్‌ అమెరికా పర్యటనలో భాగంగా, పెరూ దేశంలోని లీమా నగరాన్ని సందర్శించినప్పుడు అక్కడ యోగా నిర్వహణ కేంద్రాల బోర్డులు నన్ను ఆనందపరచాయి. ఎంతోమంది దేశాధినేతలు, వారి దేశాల్లో యోగాభ్యాసానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషపరచింది. హరిద్వార్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా సదస్సుకు సత్‌ చిదానంద ఆహ్వానం మేరకు వెళ్లాను. అక్కడ వివిధ దేశాలవారు యోగా చేసే తీరును వివరించారు. వారి వివరణ నన్ను అబ్బురపరచింది. మూలాల్లోకి వెళ్ళి, సాధన చేస్తున్న వారి సంకల్పం అద్భుతం. మన దేశ ఔన్నత్యానికి ఈ రోజు ప్రపంచమంతా హారతి పట్టడం చూసి, నా మనసు ఆనందంతో నిండిపోతోంది.

విదేశీయులంతా యోగా మార్గంలో ముందుకు సాగుతుంటే, ఈ నేల మీద పుట్టినవారు కొందరు, దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం విచారకరం. మనది ప్రజాస్వామ్య దేశం. భిన్న సంస్కృతులకు నెలవు. అలాంటివాటిలో మంచిని చేకూర్చే ఏ విషయాన్నయినా స్వీకరించడం తప్పు కాదు. ఆరోగ్యాన్ని అందించే యోగాను ఓ వ్యాయామంగా భావించడంలో తప్పు లేదు. యోగాలో ఎక్కడా మత ప్రస్తావన లేదు. అలాంటప్పుడు దానికి రకరకాల రంగులు పులిమి, విమర్శించడంలో అర్థం లేదు. యోగా అనేది ఒక ఆరోగ్య శాస్త్రం. వైద్యుడి విషయంలో మతం చూడటం ఎంత పొరపాటో, దీని విషయంలోనూ అలాంటి ప్రయత్నం చేయడం అంతే పొరపాటు. యోగశాస్త్రం సర్వధర్మాలకూ సంబంధించింది. సర్వ మతాలకూ సమ్మతమైనది, యోగా అభ్యాసం సర్వకాలాలకూ వర్తించేది. యోగా సాధన సర్వులకూ ఉపయోగపడేది. అలాంటి యోగా- ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అత్యంత సులభమైన మార్గం. దీనికి ఎలాంటి వ్యయ ప్రయాసలు ఉండవు. సంకల్పం, సాధన, సద్వివేచన ఉంటే చాలు.

మహానుభావుల కృషి ఫలం

యోగాను సరదాగానే నేర్చుకోవచ్చు. ఇష్టపడి, కాస్తంత కష్టపడి సాధన చేస్తే దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలి. ఎన్‌సీసీ లాంటి వాటిలోనూ ఓ భాగంగా, పాఠ్యాంశంగా చేర్చాలి. పాఠశాల, కళాశాల స్థాయిలోనూ ఓ పీరియడ్‌గా చేర్చాల్సిన అవసరం ఉంది. ఎంతో ప్రాచీనమైన ఈ కళను శ్రీశ్రీ రవిశంకర్‌, బాబా రామ్‌దేవ్‌ లాంటివారు పునరుద్ధరించి, ప్రపంచానికి అందిస్తుండటం సంతోషకరం. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, పతంజలి పీఠం లాంటి ఆధ్యాత్మిక సంస్థలు ఈ విషయంలో చేస్తున్న కృషి అభినందనీయం. ఇదే మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. దేశం కోసం కాదు…. దేహం కోసం… దేహం ఆరోగ్యంగా ఉండటం కోసం. నిత్యం యోగా సాధన ద్వారా క్యాన్సర్‌, గుండె వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాలుష్యం కారణంగా వస్తున్న వ్యాధుల ముప్పును ఎదుర్కోవచ్చు. ముందు యోగా సాధన చేయండి. ఆపై అధ్యయనం చేయండి. తరవాత దేశ సౌభాగ్యం కోసం సమాయత్తం కండి. వివేకానందుడు చెప్పినట్లు- ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి కావాలి. యోగా సాధన వల్ల శరీరం చురుగ్గా ఉండటమే కాదు, మనసూ అదుపులో ఉంటుంది. ఫలితంగా మనం చేసే ప్రతి పనీ ఫలితాలను ఇస్తుంది. యోగా ద్వారా ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యానికి మించిన భాగ్యం మరొకటి లేదు. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- యోగా ద్వారా యోగ్యత సిద్ధిస్తుంది!

-ముప్పవరపు వెంకయ్య నాయుడు
భారత ఉపరాష్ట్రపతి

(-ఈనాడు సౌజన్యం తో)