Home Telugu Articles ‘నగర బహిష్కరణ’తో సరా?

‘నగర బహిష్కరణ’తో సరా?

0
SHARE

రాముడిపైన సీతపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పై ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించి ఆయన స్వంత జిల్లా చిత్తూరు పంపారు. ఎవరైనా ఒక వ్యక్తి జాతీయ పురుషుడిపైన అనుచితమైన వ్యాఖ్యలుచేస్తే వారికి నగర బహిష్కరణ శిక్ష వేస్తే సరిపోతుందా? అదే కనుక న్యాయం అయ్యేటట్లైతే మన న్యాయస్థానాల చట్టాల పరిస్థితి ఏమిటి?

రాముడు ఈ దేశ జాతీయతకు ప్రతీక. అందుకే మన రాజ్యాంగాన్ని తయారుచేసినప్పుడు మూల ప్రతిలో రామాయణంలోని పట్ట్భాషేకం చిత్రాన్ని ఉంచారు. మన రాజ్యాంగాన్ని నిర్మించినవారు అఖండ మేధావులు. ముఖ్యంగా డా.అంబేద్కర్. ఆయన దళితుడు. ఆయన చనిపోయే నాటికి ముందు బౌద్ధ్ధర్మం చేరారు. అంతేకాని హిందూ ధర్మంపైన, మన సంస్కృతిపైన వ్యతిరేకత మాత్రం కాదు. ఆయన పొందుపరచిన రాజ్యాంగంలో రాముడి చిత్రపటం మొదటి పేజీలలో ఉంచటం రాముడ్ని ఆయన ఒక జాతీయ వాదానికి, ధర్మానికి ప్రతీకగా గుర్తించడమే. రాముడు ఈ దేశంలో అవమానింపబడటం ఇదే మొదటిసారికాదు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు, ద్రవిడ పార్టీలు, క్రిస్టియన్ చర్చిలలో ఆయన్ని అవమానపరిచారు. కారణం రాజకీయ కోణం. జాతీయ వాదాన్ని, మన సంస్కృతిని, ధర్మాన్ని నాశనంచేస్తే తప్ప కమ్యూనిస్టుపార్టీ ఈ దేశంలో మనుగడ సాగించలేదు. కమ్యూనిస్టుల సిద్ధాంతం పాత వ్యవస్థలను నాశనంచేసి క్రొత్తవ్యవస్థ సృష్టించడం. మతం అనే మత్తునుండి బయటకు రాకపోవటం. శాస్ర్తియత పేరుతో ప్రతిదాన్ని నాశనం చేయటం. అందుకే కమ్యూనిస్టులు రావణాసురుని పొగడి రాముడ్ని నిందిస్తారు. తమిళనాడులో ద్రవిడ పార్టీల స్థాపన జరిగిన తరువాత డికె నాయకుడు రామస్వామి నాయకర్ రామాయణాన్ని, రాముడ్ని నిరసించాడు. వారు చివరకు రాముడి విగ్రహానికి చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఇటీవల కాలంలోకూడ కరుణానిధి రామసేతు విషయంలో రామాయణాన్ని కాదని, రామసేతు కాదని ఆడం బ్రిడ్జి అని వాదించాడు.

మదరసాలలో మహిళలపట్ల జరుగుతున్న అత్యాచారాలు ఈ మధ్యే ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. హైదరాబాదులో మదరసాలో జరిగిన సంఘటన వార్తాపత్రికలలో వచ్చేవరకు బయట ప్రపంచానికి తెలియలేదు. మైనారిటీ తీరని పిల్లలను డబ్బులుకోసం అరబ్ షేక్‌లకు పెళ్ళిళ్ళుచెయ్యటం అందరికీ తెలిసిందే. కాని ఏ చర్య తీసుకోరు అక్కడి పోలీసులు. ముస్లిం మహిళల తలాక్ బిల్లు విషయంలో సెక్యులర్ పార్టీలు అనుసరిస్తున్న సంతుష్టీకరణ విధానం జాతీయ సమైక్యతను దెబ్బతీస్తున్నది. రాజకీయ స్వార్థంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నంచేస్తున్న బయటి శక్తులకు మద్దతు తెలిపినట్లైతే మన జాతీయ సాంస్కృతిక మూలాలను నాశనం చేసినట్లు అవుతుంది. ఇది మనకు చరిత్ర నేర్పిన గుణపాఠం.

కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోకుండా, అతడ్ని అరెస్టుచేసి న్యాయస్థానంలో అతనికి సరిఅయిన అతడ్ని వదిలివేయడం వెనుక కెసిఆర్ కుటిల రాజకీయనీతి కనపడుతోంది. మరోవైపు కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారనీ అభియోగంపై ఆయన్ని హైదరాబాదులో గృహ నిర్భంధం చేసారు. ఈ రోజున పరిపూర్ణానందస్వామి గత ఆరునెలలుగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు చేస్తున్నారనే అభియోగం మోపి బోడుప్పల్ నుండి యాదాద్రివరకు తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు అనుమతిని రద్దుచేసి ఆరునెలలపాటు హైదరాబాదు నగర బహిష్కరణ శిక్షని విధించారు అక్కడి పోలీసులు. అసలే కత్తిమహేష్ రాముడిపైన చేసిన వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు స్వామీజీపై తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరింత మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయి. స్వామీజీ ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలుగాని. రెచ్చగొట్టే ఉపన్యాసాలుగాని చేయలేదు. ఎక్కడా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు.

మరి ఎటువంటి సమస్యలు లేనప్పుడు తెలంగాణా పోలీసుల చర్యకు అర్థం ఏమిటి? 2019లో జరిగే ఎన్నికలలో దళిత ఓట్లకోసం ప్రభుత్వం ఇటువంటి చర్యకు పాల్పడిందా? కెసిఆర్‌కు హిందువుల ఓట్లు అవసరం లేదా? మన జాతీయ నాయకుల గొప్పతనాన్ని ప్రజలకు వివరించటం స్వామీజీ చేసిన తప్పా? కెసిఆర్ నిజాం పరిపాలనను ఇదివరలో ఒకసారి సమర్ధించారు. ఇప్పుడుకూడా అదే పరిస్థితి. అసలే ముస్లిం తీవ్రవాదులకు అడ్డాఅయిన హైదరాబాదు నగరం కెసిఆర్ ఈ చర్యతో మరింత రెచ్చిపోరా? శాంతిభద్రతలకు అవరోధం ఏర్పడితే సంఘవ్యతిరేక శక్తులవల్ల, వేర్పాటువాదుల వల్ల తప్ప పరిపూర్ణానందస్వామి వంటివారి వల్లకాదు. గత ఆరునెలలుగా స్వామీజీ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారని అభియోగం మోపుతున్నారు. మరి ఇన్నాళ్ళు పోలీసువ్యవస్థ ఆయనను వారించకుండా ఏమి చేస్తోంది? ఈరోజు కత్తి మహేష్ చేస్తున్న వ్యాఖ్యలతోటి ఆగ్రహించిన హిందూ సమాజం తమ నిరసనను తెలియచేయటంకోసం రోడ్లమీదకు వస్తే నోరునొక్కటానికి ప్రయత్నించటం తిరిగి తెలంగాణాలో నిజాం పరిపాలన వచ్చినట్లుగా ఉంది. దళిత, ముస్లిం ఓట్లకోసం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నం హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయి. హిందూ సమాజం ఈరోజున బాగా క్లిష్ట పరిస్థితిలో ఉందనటానికి ఎటువంటి అనుమానం లేదు. 1975లో జాతీయవాదులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ఈ దేశంలో ప్రజాస్వామ్యం తిరిగి నెలకొల్పారో అదే విధంగా ఈ రోజు హిందువుల ఆత్మగౌరవంకోసం, ఉనికి కోసం దేశ విచ్ఛిన్నకర శక్తులతో పోరాడ వలసిన పరిస్థితి ఏర్పడింది.

– పి.వి.శ్రీరామశాయి

(ఆంధ్రభూమి సౌజన్యం తో)